- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముస్లిం డిక్లరేషన్ చాహియే!
ఏళ్లు గడుస్తున్నాయి.. ప్రభుత్వాలూ మారుతున్నాయి.. కానీ ముస్లింల స్థితిగతుల్లో ఎలాంటి మార్పూ ఉండటం లేదు. ఎంత చదువుకున్నా.. వారికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉండటం లేదు. దీంతో పాన్ డబ్బాలు, హరేక్‌మాల్ బండ్లు, పంక్చర్ షాపులు, చికెన్, మటన్ సెంటర్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్రంలో 13 శాతం ఓట్లు ఉన్నా వీరు 40 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలరు. అయినా వీరిని ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నాయి.
కేంద్రానికి పంపి చేతులు దులుపుకొని..
జస్టిస్ సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్, సుధీర్ కమిషన్, తెలంగాణ తొలి బీసీ కమిషన్ .. ముస్లింల వెనుకబాటుతనాన్ని స్పష్టంగా తేల్చి చెప్పాయి. వీరు దళితుల కంటే వెనుకబడి ఉన్నారని, విద్యా, ఉద్యోగ రంగాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్నారని గణాంకాలతో సహా సచార్ కమిటీ స్పష్టం చేసింది. నిజానికి 1924 వరకూ ఎస్సీ జాబితాలో ఉన్న ఎన్నో ముస్లిం కమ్యూనిటీలను స్వాతంత్య్రం తర్వాత 1950 లో వీరిని ఓపెన్ కేటగిరిలో వేశారు. బీసీ-బీ కేటగిరిలోని దూదేకుల, నూర్ భాషా, పింజారి, లద్దాఫ్ ముస్లింలు మిగతా బీసీ కులాలతో పోటీ పడి రిజర్వేషన్ అవకాశాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి 7 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి 4 శాతం రిజర్వేషన్ ప్రకటించింది. దీనిపై సుప్రీంకోర్టులో కేసు కూడా ఉంది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాకనైనా పరిస్థితులు మారుతాయని భావించే సమయంలో కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించి ఓట్లను గంపగుత్తగా వేయించుకున్నారు. కానీ గెలిచాక మొక్కుబడిగా అసెంబ్లీలో బిల్ పాస్ చేయించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు. ఎన్నో బిల్లులకు మద్దతిచ్చిన కేసీఆర్ ఈ బిల్లుపై మాత్రం ఒత్తిడి చేయలేదు. ఫలితంగా ఎందరో ముస్లింలు ఉద్యోగం కోల్పోయారు. ఎస్టీలకు 6 నుంచి 10 శాతానికి రిజర్వేషన్ పెంచిన కేసీఆర్, ముస్లింలకు ఎందుకు పెంచడం లేదో అర్థం కావడం లేదు. అందుకే రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన, దగాపడిన ముస్లింలు రాబోయే ఎన్నికల్లో తమకు జరిగిన అన్యాయాలను అవలోకనం చేసుకుంటూ ప్రధాన పార్టీల ముందు ఒక స్పష్టమైన ‘ముస్లిం డిక్లరేషన్’ ప్రవేశ పెట్టాలని కోరుతున్నారు.
ప్రధానమైన డిమాండ్స్..
ముస్లింల జనాభా ప్రాతిపదికన పాతబస్తీ కాకుండా, 10 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలి. అది కుదరకపోతే లోక్‌సభ, రాజ్యసభ, ఎమ్మెల్సీలుగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి, ముస్లింల రిజర్వేషన్‌ను 10 నుంచి 12 శాతం పెంచాలి. మైనార్టీల జనాభా కనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలి. దళిత బంధు తరహాలో ముస్లింలకు ‘ముస్లిం బంధు’ అమలు చేయాలి. వక్ఫ్ బోర్డుకు జ్యూడిషియల్ పవర్ ఇచ్చి ఓ ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో వక్ఫ్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలి. వక్ఫ్ భూములను కాపాడాలి, ముస్లింలను ప్రతి కమిషన్ నిర్మాణంలో ప్రాతినిధ్యం ఉండేలా చేయడం, మైనార్టీ శాఖలోని నియామకాలను పూరించి.. సంవత్సరాల తరబడి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలి. అసంఘటిత రంగంలో ఉండి అనేక వృత్తులు చేసుకుంటున్న ముస్లింలకు పూర్తి సబ్సిడీతో సుమారు 2 లక్షల వరకూ లోన్ మంజూరు చేయడం వంటి డిమాండ్లతో ‘ముస్లిం డిక్లరేషన్’ ప్రవేశపెట్టాలని, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వీటిపై హామీ ఇస్తేనే వారిని గెలిపించుకోవాలని ముస్లింలు నిర్ణయించుకున్నట్టు సమాచారం.
మొహమ్మద్ నిసార్
సీనియర్ జర్నలిస్టు
95426 52786