వి వాంట్ హైడ్రా..! వెల్లువెత్తుతున్న ప్రశంసలు

by Ravi |   ( Updated:2024-08-21 01:15:43.0  )
వి వాంట్ హైడ్రా..! వెల్లువెత్తుతున్న ప్రశంసలు
X

ఏళ్లుగా హైదరాబాద్‌లో చెరువులు కుంటలు కబ్జాలు చేస్తూనే, మేం పాలమ్మినం పూలమ్మినం అని ప్రజల చెవిలో పువ్వులు పెడుతూ.. తమ రాజకీయ అక్రమ సామ్రాజ్యాలను విస్తరించిన నాయకులు కోకొల్లలు. అలా విస్తరించిన అక్రమ నిర్మాణాలకు ప్రస్తుత ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) రూపంలో ఎసరు వచ్చేసరికి అధికారుల మీదే ఆరోపణలు చేస్తున్నారు.

హైడ్రాను రాజకీయ కక్ష సాధింపుల కోసం హైడ్రా వాడకండి, ఇదిగో గండిపేటలో మీ పార్టీ నాయకుని రిసార్ట్ కూల్చండి అంటూ ప్రతిపక్ష పార్టీ వారు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తు న్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో హైడ్రా కమిషనర్ ఎ. వి రంగనాథ్, ఐపీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు చూసి 'We want Hydra', మాకూ కావాలి హైడ్రా లాంటి వ్యవస్థ అని వరంగల్ నివాసులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తం గా 33 జిల్లాలలో ఈ హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి మైనర్ ఇరిగేషన్ చెరువులు, కుంట లు కాపాడాలి. ఇలాంటి మంచి పనులకు సమాజంలో ప్రజలు కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు.

వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ..

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(g) ప్రకారం, చెరువులు, కుంటలు, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి పౌరుని బాధ్యత. కాకతీయ రాజులు నిర్మించిన గొలుసు కట్టు చెరువులు, కుంటలు, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 46 వేల వరకు ఉన్నాయి. కానీ వాటిని ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోలేదు. అందుకే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ రాష్ట్రంలో వాటిని కాపాడుతామంటూ గత ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్పొరేషన్ పేరుతో వేలకోట్లు ఖర్చు పెట్టింది. కానీ ఏ ఒక్క చెరువునూ, కుంటనూ సర్వే చేసి ఎఫ్‌టి‌ఎల్, బఫర్ జోన్ హద్దులు నిర్ణయించలేదు. ఫలితం... మిషన్ కాకతీయ కమీషన్లు, కబ్జాల కాకతీయ అయిపోయింది. ఇక ఉమ్మడి రాష్ట్రం నుంచి హైదరాబాద్‌ మహనగరంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో చెరువులను కబ్జా చేసి బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సిని నటులు, రాజకీయ నాయకులు ఎన్నో అక్రమ నిర్మాణాలు చేపట్టారు.

అక్రమ కట్టడాలకు అనుమతులు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రభుత్వాలు చెరువులు, కుంటలు కాపాడడానికి పెద్దగా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా కబ్జాలు అక్రమ కట్టడాలు వెలిశాయి. ఇక హైదరాబా‌దులోనైతే చిన్న వానకే వరదలు వచ్చి ప్రజలు ముంపునకు గురవుతున్నారు. ఇలాంటి అక్రమ కట్టడాలు నిర్మించడానికి అన్ని డిపార్ట్‌మెంట్లలోనూ పర్మిషన్స్ ఇస్తున్న అక్రమ అధికారులు కూడా ఎందరో ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ తమ ప్రాథమిక బాధ్యత అని వీరికి తెలియదా? తెలిస్తే ఎందుకు పాటించడం లేదు? అలాంటి వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఉన్న చెరువులు, కుంటలు అన్నీ కబ్జా చేసిన తర్వాత లక్ష కోట్లు ఖర్చుపెడుతూ ఎత్తిపోస్తున్న నీళ్లను మళ్లీ వేల కోట్లు ఖర్చు పెట్టి రిజర్వాయర్లలో స్టోరేజ్ చేస్తున్నారు.

పర్యావరణ స్పృహ ఎక్కడ?

హైదరాబా‌ద్‌లో నివసిస్తున్న కోటి మంది జనాభాలో పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడేవారు మాత్రం రెండంకెల సంఖ్యలో కూడా లేరు. ప్రొ. కె. పురుషోత్తం రెడ్డి, బి.వి సుబ్బారావు, దొంతి నరసింహారెడ్డి, లుబ్నా సారస్వత్ లాంటి వారు మాత్రమే తరచూ సామాజిక మాధ్యమాల్లో పర్యావరణ పరిరక్షణ బాధ్యత గురించి ప్రస్తావిస్తున్నారు. గత ప్రభుత్వం 111 GO ఎత్తివేతతో జంట జలాశయాలు ఉస్మాన్ - హిమాయత్ సాగర్‌ల పరిరక్షణ కోసం తెలంగాణ సోషల్ మీడియా ఫోరం, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కానీ రాజకీయ పార్టీలు స్పందించలేదు. కారణం 111 GO పరిధిలో అన్ని పార్టీల రాజకీయ నాయకులందరికీ ఫార్మ్ హౌస్‌లు రిసార్టులు ఉండడమే. ప్రస్తుతం హైడ్రా పేరుతో ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చడం మాత్రమే కాకుండా, పనిలో పనిగా అవి ఎందుకు కూల్చుతున్నాం? పర్యావరణ పరిరక్షణ అంటే ఏమిటి..? అనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేసి పర్యావరణ పరిరక్షణ ఒక ఉద్యమంగా చేపట్టవలసిన బాధ్యత అని గుర్తువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

తెలంగాణ మొత్తంగా కబ్జాలే!

రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలలో ఈ హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి మైనర్ ఇరిగేషన్ చెరువులు, కుంటలు కాపాడాలి. కబ్జాలు అక్రమ కట్టడాలు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించాలి. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా సరే, ఏ రాజకీయ పార్టీ నాయకుడు అయినా సరే ఎలాంటి తారతమ్యం లేకుండా పర్యావరణ పరి రక్షణ ప్రాథమిక బాధ్యత అని గుర్తించి ప్రభుత్వం ముందుకు వెళ్లాలి. అప్పుడే తమ జీవితం మొత్తం పర్యావరణ పరిరక్షణగా జీవిస్తున్న ఎందరో మేధావులు, పర్యావరణ వేత్తల కృషికి లాభం చేకూరుతుంది. ఇలాంటి మంచి పనులకు సమాజంలో ప్రజలు కూడా We want Hydra అంటూ ఘన స్వాగతం పలుకుతున్నారు.

- బందెల సురేందర్ రెడ్డి,

మాజీ సైనికుడు

83749 72210

Advertisement

Next Story