మేం సోనియా రుణం తీర్చుకున్నాం.. ఇక మీ వంతు..!

by Ravi |   ( Updated:2024-12-10 01:15:50.0  )
మేం సోనియా రుణం తీర్చుకున్నాం.. ఇక మీ వంతు..!
X

సోనియాగాంధీ... ఎన్ని అడ్డంకులు వచ్చినా, తెలంగాణ ఆత్మ బలిదానాలకు చలించి, ఇచ్చిన మాటకు కట్టుబడి, సుష్మా స్వరాజ్, మాయావతి లాంటి ప్రతిపక్ష నాయకులకు నచ్చజెప్పి, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారో మనమందరం చూసాం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, 2014 మొదటి ఎన్నికల్లో గానీ, అంతకు మందు పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పై "ఆంటీ ఇన్కమ్యాన్సీ" వల్లనో, "చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చింది నేనే" అనే కేసీఆర్ ప్రచారం వల్లనో, తెలంగాణ తెచ్చిన వాడి ప్రచారం ఇచ్చిన వాళ్ళ ప్రచారం కంటే మెరుగ్గా ఉండడం వల్లనో.. కారణాలేవైతేనేం... అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సహకారం చేసిన సోనియాగాంధీ రుణం తీర్చుకోలేకపోయాం..

తెలంగాణ ఇచ్చినందుకు అటు ఆంధ్రప్రదేశ్‌లో, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అపజయం పాలయిందని, సోనియాగాంధీ నిర్ణయం వల్లనే ఇలా జరిగిందని, దిగ్భ్రాంతి చెందకూడదని, తెలంగాణ సాకారం వల్ల ఎప్పటికైనా సోనియాగాంధీ కీర్తి ప్రతిష్టాత్మకంగా నిలిచిపోతుందనీ, ఎన్నికల్లో గెలుపోటములు సర్వసాధారణమని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే ఇంకెన్ని బలిదానాలు జరిగేవో పేర్కొంటూ తెలంగాణ ఆత్మలను కాపాడిన తల్లిగా, ఈ వ్యాస రచయిత తన దస్తూరితో రాసి "సేవియర్ ఆఫ్ తెలంగాణ సోల్స్" అనే బిరుదు ప్రధానం చేసి, తెలంగాణ సామాన్య ప్రజల తరఫున, ఉద్యమకారుల తరఫున స్వయంగా కలిసి సత్కరించి గౌరవించడం జరిగింది. నాటి మా స్పందనకు ఆమె ప్రతిస్పందన ఎన్నటికీ మరువలేనిది.

2018లో ఓటమికి ప్రధాన కారణం..

2018 ఎలక్షన్స్‌‌లో కాంగ్రెస్‌ని గెలిపించి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని భావించాం. మహా కూటమిలో సీమాంధ్ర నాయకులు తెలంగాణ వేదికలపై ప్రత్యక్షమైనందువల్ల, మళ్లీ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి నాడు లాభం చేకూరిన విషయం తెలిసిందే. మాలాంటి వాళ్లు హైకమాండ్ కి జరగబోయే నష్టం గురించి ముందుగానే సూచించినా, ఏవో ఓటు బ్యాంకు లెక్కలు చెప్పి ఇట్టి సలహాను పరిగణనలోకి తీసుకోలేదు. ఓటమి వాటిల్లిన తర్వాత మేధావులతో సమీక్ష జరిపారు, కాలం దాటిన తర్వాత జరిపిన సమీక్ష వల్ల ఏమి ప్రయోజనం?

గెలిచి తీరాలనుకున్నం... గెలిపించినం..

2024 ఎలక్షన్స్ వచ్చాయి, ఈ దఫా అయినా ఎలాగైనా విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని ఉద్యమకారులందరం కంకణం కట్టుకుని మరీ ముక్త కంఠంతో ప్రచారం చేసాం. మునుపటి వలె కాకుండా, ఈసారి కాంగ్రెస్ హై కమాండ్ ఉద్యమ కారులకు ప్రాధాన్యత ఇచ్చారు. వారి సూచనలను తూచా తప్పకుండా పాటించారు. ఖర్గే లాంటివారు సైతం ఉద్యమకారులతో భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ సైతం మేధావులతో చర్చించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, ఉద్యోగ అవకాశాలు లేక యువత, ధరణి ఇబ్బందులు అనుభవిస్తున్న రైతులు, నాయకత్వ అహంకారాన్ని తట్టుకోలేక పోయిన సామాజికవేత్తలు, డబుల్ బెడ్ రూమ్ ప్లాట్లు దక్కాల్సిన వారికి దక్కక, చితికిపోయిన ఉద్యమకారులకు ఏ ఆసరా దొరకక, మొట్టమొదటిసారి మేధావులు సైతం ఈసారి కాంగ్రెస్‌కి ఓటేయాలని బల్లలు గుద్ది చెప్పడం, రేవంత్ రెడ్డితో పాటు నాయకులందరూ కలిసికట్టుగా విస్తృత ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగలిగింది. తద్వారా తెలంగాణ సాకారం చేసిన సోనియాగాంధీకి తమ ఓట్ల ద్వారా తెలంగాణ ప్రజానీకం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకోగలిగింది.

సుపరిపాలనే ప్రభుత్వ కర్తవ్యం

ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వం తన సుపరిపాలనతోనే తమ భవిష్యత్తును నిర్మించుకోవలసి ఉంటుంది. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునే అంశం గత ఎన్నికలతోనే సమాప్తం అయింది. గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా తప్పనిసరిగా కనపడాలి. గత ప్రభుత్వ హంగు ఆర్భాటాలు, అహంభావాలు, మితిమీరిన ప్రచారాలు, హద్దు మీరిన ఉచితాలు, వాటికోసం అప్పుల కుప్పలు, కల్పించని ఉద్యోగ అవకాశాలు, ఉద్యమకారుల ఎడల నిర్లక్ష్యాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమ ఆక్రమణల వంటి కారణాలతో, ఎల్లకాలం పరిపాలిస్తాం అనుకున్న బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి పాలయ్యింది. గత ప్రభుత్వం అడ్డగోలు ఖర్చులు చేసి, ఖాళీ ఖజానా అప్పజెప్పిందని కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే చెబుతున్న విషయం నిజమైనప్పటికీ, ఏదో విధంగా, చాక చక్యంగా ఆదాయాన్ని పెంచుకొని, పరిస్థితులను అధిగమించి, సామాన్య ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని సుఖ సంతోషాలను తేగలిగితే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మరోసారి అవకాశం దక్కుతుంది. తద్వారా తమ అధినాయకురాలైన సోనియా గాంధీ గౌరవాన్ని పెంచిన వారవుతారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఉద్యమకారులు, ప్రజలు సోనియా గాంధీ రుణం తీర్చుకున్నారు. ఆమె పేరు మీద పీఠమెక్కిన రాజకీయ శ్రేణులు, సుపరిపాలనతో ఆమె రుణం, ఓటు వేసిన ప్రజల రుణం తీర్చుకుంటారని ఆశిస్తున్నాము. జై తెలంగాణ!

-సయ్యద్ రఫీ

చిత్ర దర్శకుడు

[email protected]

Advertisement

Next Story

Most Viewed