యోధురాలు దుర్గావతి వోరా..

by Ravi |   ( Updated:2022-09-03 13:46:50.0  )
యోధురాలు దుర్గావతి వోరా..
X

'భగత్‌సింగ్ ఉన్న జైలుపై బాంబు వేసి ఆయనను తప్పించే ప్రణాళికలో భాగంగా భగవతి చరణ్ బాంబును పరీక్షిస్తుండగా ప్రమాదవశాత్తు పేలి ఆయన మరణించారు. భర్త మరణ విషాదాన్ని దిగమింగేందుకు దుర్గావతి విప్లవ కార్యక్రమాలలో మరింతగా తలమునకలయ్యారు. జూలై 1929లో ఆమె భగత్‌సింగ్‌ను విడుదల చేయాలని లాహోర్ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. జైలులో 63 రోజుల నిరాహార దీక్ష అనతరం మరణించిన జతీంద్రనాథ్ దాస్ శవయాత్రను లాహోర్ నుండి కలకత్తా వరకు నిర్వహించారు. ఆమె 8 అక్టోబర్ 1929న దక్షిణ బొంబాయిలోని లామింగ్టన్ రోడ్‌లో ఒక బ్రిటిష్ పోలీసు అధికారి దంపతులను కాల్చి చంపారు.'

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" పేర ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటున్నాం. స్వతంత్ర సంగ్రామంలో కులాలు, మతాలు, లింగ, వయోబేధం లేకుండా తమను తాము సమిధలుగా సమర్పించుకున్న యోధులను ఒకసారి స్మరించుకోవడం భారతీయులుగా మన కనీస ధర్మం. తాజ్‌మహల్ కోసం సుదీర్ఘ కాలం శ్రమించి ఆ అద్భుత కట్టడం పునాదుల కింద పూడుకుపోయిన శ్రామికుల చరిత్రలాగా ఎందరో స్వాతంత్ర్య సమర యోధుల వీరగాథలు చరిత్ర పుటలకెక్కకపోవడం శోచనీయం. చరిత్ర విస్మరించిన అలాంటి మహిళా సమర యోధులలో దుర్గావతి దేవి వోరా (దుర్గా భాబీ) కూడా ఒకరు. నవ్వుతూ ఉరికంబాన్ని ముద్దాడిన సర్దార్ భగత్‌సింగ్‌ను తప్పించడంలో అత్యంత సాహసోపేతంగా సహకరించిన ధీరవనిత.

కుటుంబ నేపథ్యం

అలహాబాద్‌లో స్థిరపడిన గుజరాతీ దంపతుల ఏకైక కుమార్తె దుర్గావతి దేవి. బాల్యంలోనే తల్లి మరణించగా, తండ్రి కుటుంబ జీవితాన్ని త్యజించడంతో పినతల్లి సంరక్షణలో పెరిగింది. దుర్గావతి వివాహం తన 11వ యేట లాహోర్‌లో నివసించే సంపన్న గుజరాతీ కుటుంబానికి చెందిన రైల్వే ఉద్యోగి కుమారుడు భగవతి చరణ్ వోరాతో జరిగింది. బ్రిటిష్ వలసవాదుల అకృత్యాలను బాల్యంలోనే ప్రత్యక్షంగా చూసి చలించిన భగవతి చరణ్ 1920 ప్రాంతంలో సత్యాగ్రహంలో చురుకుగా పాల్గొన్నాడు. లాహోర్ నేషనల్ కాలేజ్ విద్యార్థిగా ఉన్నపుడే ఆయన భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, యష్‌పాల్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విప్లవాలను నిశితంగా పరిశీలించేందుకు ఒక అధ్యయన కేంద్రాన్ని నెలకొల్పారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనేందుకు, అంటరానితనంలాంటి సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో యువతను భాగస్వాములను చేసేందుకు 'నవ జవాన్ భారత్ సభ' ను స్థాపించారు. విప్లవ వీరులందరు భగవతి చరణ్ ఇంటిని తరచూ సందర్శించేవారు. కళాశాల అధ్యాపకురాలిగా పని చేస్తున్న దుర్గాదేవికి వారితో పరిచయం ఏర్పడింది. 'హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్'లో ఆమె క్రియాశీలంగా పాల్గొన్నారు. 1928లో బ్రిటిష్ అధికారులు వేట మొదలు పెట్టగానే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. డిసెంబర్ 1928లో భగవతి చరణ్ కలకత్తా వెళ్లిపోయారు. 19 డిసెంబర్ 1928న భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు పోలీసు అధికారి జాన్ శాండర్స్‌ను హతమార్చారు. అనంతరం అజ్ఞాతంలో ఉన్న దుర్గావతి దేవిని ఆశ్రయించారు. అత్యంత ప్రమాదమని తెలిసి కూడా ఆమె భర్త భగవతి చరణ్ తనకు ఇచ్చిన కొద్దిపాటి సొమ్మును వారికి అందచేసింది. భగత్‌సింగ్‌ను తప్పించేందుకు, తెగించి తన మూడేండ్ల కొడుకుని వెంటబెట్టుకుని భగత్‌సింగ్ భార్యగా నటించి, పనిమనిషి వేషధారణలో రాజ్‌గురు వెంట రాగా పోలీసు తనిఖీ బృందాలను యేమార్చి లక్నోకు చేరుకుంది. అదే సమయంలో ఆశ్చర్యకరంగా చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఒక సాధువు వేషంలో సుఖ్‌దేవ్ తల్లి, సోదరికి తోడుగా తీర్థయాత్రలకు వెళ్తున్నట్లుగా లాహోర్ నుంచి తప్పించుకున్నాడు.

వారిని కాపాడేందుకు

అనంతరం పోలీసులకు చిక్కిన భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురుకు ఉరిశిక్ష విధించారు. భగవతి చరణ్ బాంబుల తయారీ కేంద్రాన్ని పోలీసులు కనుగొనడంతో ఆయనా అజ్ఞాతంలోకి వెళ్లారు. HSRA ముఖ్య సభ్యులను పోలీసులు నిర్బంధంలోకి తీసుకోవడంతో దుర్గావతి దేవి సంస్థ కార్యకలాపాలను స్వయంగా తన భుజాలకెత్తుకున్నారు. భగత్‌సింగ్ ఉన్న జైలుపై బాంబు వేసి ఆయనను తప్పించే ప్రణాళికలో భాగంగా భగవతి చరణ్ బాంబును పరీక్షిస్తుండగా ప్రమాదవశాత్తు పేలి ఆయన మరణించారు. భర్త మరణ విషాదాన్ని దిగమింగేందుకు దుర్గావతి విప్లవ కార్యక్రమాలలో మరింతగా తలమునకలయ్యారు. జూలై 1929లో ఆమె భగత్‌సింగ్‌ను విడుదల చేయాలని లాహోర్ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. జైలులో 63 రోజుల నిరాహార దీక్ష అనతరం మరణించిన జతీంద్రనాథ్ దాస్ శవయాత్రను లాహోర్ నుండి కలకత్తా వరకు నిర్వహించారు. ఆమె 8 అక్టోబర్ 1929న దక్షిణ బొంబాయిలోని లామింగ్టన్ రోడ్‌లో ఒక బ్రిటిష్ పోలీసు అధికారి దంపతులను కాల్చి చంపారు. ఈ నేరానికి పాల్పడినందుకు ఆమె మూడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు.

విద్యావేత్తగానూ..

దుర్గావతి దేవి 1939లో మద్రాసులోని ప్రముఖ ఇటలీ విద్యావేత్త 'మరియా మాంటెస్సోరీ' వద్ద శిక్షణ పొందారు. ఆ తరువాత లక్నోలో అణగారిన వర్గాలకు చెందిన ఐదుగురు విద్యార్థులతో స్వయంగా ఒక పాఠశాలను స్థాపించారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత 15 అక్టోబర్ 1999లో తన 92వ యేట తనువు చాలించే వరకు కూడా ఆమె లక్నోలో అతి నిరాడంబర జీవితాన్ని గడిపారు. అత్యంత ప్రజాదరణ పొందిన హిందీ చిత్రం 'రంగ్ దే బసంతీ ఈమె ఇతివృత్తం ఆధారంగా వెలువడిందని చాలా మందికి తెలియదు. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు పురుషులతో సమానంగా భుజంతో భుజం కలిపి అందించిన తోడ్పాటు, వారు ప్రదర్శించిన ధీరత్వం వెలుగు చూడకపోవడం శోచనీయం. చరిత్రకారులు చేసిన తప్పిదాన్ని సరి చేయడానికి ఇటీవల ప్రవేశ పెట్టిన 'నూతన విద్యా విధానం 2022' ద్వారా ఇలాంటి త్యాగధనుల వీర గాథలను చరిత్ర పాఠాలలో పొందుపరచాలి.

యేచన్ చంద్రశేఖర్

హైదరాబాద్, 88850 50822

Advertisement

Next Story