ఓటర్లే ఆత్మ పరిశీలన చేసుకోవాలి!

by Ravi |   ( Updated:2024-04-19 01:30:41.0  )
ఓటర్లే ఆత్మ పరిశీలన చేసుకోవాలి!
X

ఓటు అనేది హక్కు అని పేర్కొన్నప్పటికీ అది ఒక బాధ్యత. మన బతుకులు ఎలా ఉండాలో నిర్ణయించే ప్రక్రియ. అటువంటి విలువైన ప్రక్రియ నేటికీ డొల్లతనం గానే సాగుతుండటం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనకి గొడ్డలిపెట్టు లాంటిది. ఎన్నికల సమరం సమీపిస్తున్న తరుణంలో ఓటు ప్రగతి వైపు పడేలా చూసుకోవాల్సిన బాధ్యత సగటు ఓటరు పై ఉన్నది.

ఉచితాలు...మితిమీరిన సంక్షేమం

ఎన్నికల సమయంలోనే ఉచితాల మీద ఓటర్ల మధ్య చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది ప్రస్తుతం మన దేశంలో, మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో హద్దు మిరింది. సంపద సృష్టిస్తా, ఉద్యోగాలు పుట్టిస్తా అని మొన్నటి వరకు మాట్లాడిన నాయకులు సైతం ఇప్పుడు సంక్షేమం, ఉచితాల బాట పట్టడం గమనార్హం. ఎన్నికల హామీలు కార్పొరేట్ కంపెనీలు పండగ సీజన్లో అందించే ఆఫర్లు లాగా రూపాంతరం చెందడం గర్హనీయం. ఒక కంపెనీ ఆఫర్ ఇస్తుంది అంటే దాని అంతిమ లక్ష్యం లాభాలను,రాబడులను పెంచుకోవడం కోసమే, కానీ రాజకీయ నాయకులు ఇచ్చే హామీల వలన రాష్ట్రానికి వచ్చే లాభం గురించి ఆలోచిస్తున్నారా లేదు. వారు ఆలోచిస్తున్నది కేవలం అధికారం కోసమే,వారి లాభాల కోసమే గాని రాష్ట్రం కోసమో, రాష్ట్ర ప్రజల కోసమో కాదు.

ఈ సూత్రాన్ని మరిచి..

పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో సామాజిక భద్రత పింఛన్లు దాదాపు రెండు, మూడు రెట్లు ఉంటున్నాయి. 2050 నాటికి మన దేశంలో వృద్ధుల జనాభా రెట్టింపు అవ్వనుంది. తద్వారా వారికి ఇచ్చే ఫించన్ల భారం రాష్ట్రం ఖజానాపై ఇప్పటికంటే ఐదు రెట్లు ఉండే అవకాశం ఉంది. ప్రతీ ఎన్నికకు వేలంపాటను తలపించేలా ప్రధాన రాజకీయ పార్టీలు పింఛన్లు పెంచుకుంటూ పోతున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్య ఫించనుకు అర్థం మారేలా 40 ఏళ్ళు నిండి, పలానా కులంలో పుడితే చాలు మీ ఖాతాలో డబ్బులేస్తాం అనే దాకా ప్రస్తుత పరిస్థితి వచ్చింది. వృద్ధాప్యం వలనో, శారీరక వైకల్యం వలనో సొంత కాళ్ళ మీద నిలబడలేరు కాబట్టి ప్రభుత్వ సహాయం అవసరం. కానీ ఈ సహజ సూత్రాన్ని మరిచి కేవలం ఓటర్లను ఆకర్షించడానికి ఇమ్మడి ముబ్బడిగా రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తుంటే, అవి విని సగటు ఓటరు చప్పట్లు కొట్టి శభాష్ అనడం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది.

తప్పెవరిది..?

చెప్పేటోడు ఎన్నైనా చెప్తడు...ఇనేటోడికి ఉండాలి కదా అని అన్నట్లు రాజకీయ పార్టీలు వాటి మనుగడ కోసం హామీలు ఇవ్వడం సహజం. కానీ అంతిమంగా వాటిపై నిర్ణయం తీసుకునేది రహస్య ఓటింగ్ పద్దతిలో ఓటరు మాత్రమే. ఉదాహరణకు రోడ్డు వేసిన నాయకులకు ఓటు వేయకుండా, మద్యాన్ని పంచి రోడ్డున పడేసిన వారికి ఓటు వేస్తుంటే, తదుపరి ఎన్నికల్లో రోడ్డు వేసిన నాయకులు సైతం ప్రజల్ని రోడ్డున పడేసే విధానాలే అవలంబిస్తారు. వ్యవస్థలని, పార్టీలని నిందించే బదులు ఓటర్లే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. తాత్కాలిక తాయిలాల ప్రభావం నుంచి బయటకు వచ్చి తార్కికంగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. ఉచితాలతో పాటు ఎన్నిక వ్యవస్థని పట్టి పీడిస్తున్న సమస్య చట్ట సభల్లో నేరగాళ్ల ప్రవేశం మొదలగు దీర్ఘకాలిక జాడ్యాలకి పరిష్కారం సగటు ఓటరుకి అవగాహన కల్పించడమే.

ఒక్క రోజు ప్రజాస్వామ్యం

మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ కేవలం ఓటింగ్ రోజు మాత్రమే ఆ ప్రజాస్వామ్య భావనను అనుభవించగలం. ఇతర దేశాల్లోలాగా ఒకసారి ఎన్నికైన ప్రజా ప్రతినిధిని ఓటర్లే తొలగించే రీకాల్, రెఫరెండం లాంటి ప్రజాస్వామ్య సాధనాలు లేవు. కాబట్టి ఐదేళ్లలో ఒక్కసారి వచ్చే అవకాశాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయించుకోవాలి. మాకు నీళ్లు రావట్లేదు, మాకు రోడ్డు వేయట్లేదు, మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు అని మీడియా వారితో గోడు వెళ్లబోసుకోవాల్సిన దుస్థితి సగటు ఓటరు తెచ్చుకోవద్దు.

చివరిగా....కులం, మతం, డబ్బు ఇతరత్రా ప్రభావాల నుంచి బయటకు వచ్చి మీ బిడ్డల భవిష్యత్తు, మీ ఇంటి ఆడవారు బయటకు వెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్నారా ఏదైనా సమస్య వస్తే పోలీసు వారు పక్షపాతం లేకుండా మన ఫిర్యాదు తీసుకుని న్యాయం చేస్తున్నారా, జబ్బు వచ్చి ఆసుపత్రికి వెళ్తే కొద్ది పాటి ఖర్చుతో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్నారా మొదలగు ప్రశ్నలు వేసుకుని ప్రతీ ఓటరు మహాశయుడు నిర్ణయం తీసుకుని మన రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పధంలో దూసుకువెళ్లేలా తమ ఓటు హక్కును వినియోగిస్తారు అని ఆశిస్తూ...

- జి.వి.సాయికుమార్ గుంత

93911 42989

Advertisement

Next Story