- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నడుస్తున్న చరిత్ర:వినియోగదారుగా మారుతున్న ఓటరు
విశ్లేషకులు, రాజకీయ పండితులు కలిసి ఆ విజయానికి కారణంగా సంక్షేమ పథకాలు, శాంతి భద్రతల పరిరక్షణ ఇలాంటివేవో చూపుతారు కానీ, నిజానికి గెలిచిన ఆ పార్టీ అభ్యర్థులు ఖర్చుపెట్టిన డబ్బు మహత్యాన్ని, అసలు విజయ రహస్యాన్ని వేలెత్తి చూపరు. ఎందుకంటే దానికి రుజువులు దొరకవు. ఇప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాలలో, కొన్ని సందర్భాలలో ఓటర్లు భిన్నంగా నడిచిన ఉదాహరణలున్నాయి. ఆ దిశగా ఒక్కసారికైనా ప్రయోగాత్మకంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి 'ఈ ఎన్నికలలో ఎవరూ పరిమితిని మించి ఖర్చుపెట్టకుండా ఓట్లడుగుదాం, ఫలితాలు చూద్దాం' అని పరీక్షించుకుంటే మన ప్రజాస్వామ్యం విలువేమిటో తెలుస్తుంది. రాజ్యాంగ ఆకాంక్షలు కూడా నెరవేరుతాయి. అప్పుడు ఓటరు కూడా ఎన్నికల వేళ తనకేం లాభమనేది పక్కనపెట్టి దేశం గురించి పట్టించుకోవచ్చు.
ఏదైనా కొనాలని అనిపించినపుడు డిస్కౌంట్ సేల్ ఎప్పుడా? అని ఎదురుచూసే వాళ్ళు చాలా మందే ఉంటారు. ప్రొడక్ట్ ఒకేలా ఉన్నప్పుడు బ్రాండ్ ఇమేజ్ చూడకుండా తక్కువ ధరకు దొరికితే చాలనేది కంజ్యూమరిజం. తను ఎంతగా లాభపడ్డాడు అనేదే దాని సూత్రం. ఓటు హక్కు మన పౌరులలో ఈ లక్షణాన్ని పెంచుతోంది. 'ఎన్నికలలో ఫలానా అభ్యర్థి మా ప్రతినిధిగా చట్టసభలకు వెళితే దేశానికి, ప్రాంతానికి తప్పక మేలు జరుగుతుంది' అనుకొనే స్థాయిలో ఏ నాయకుడూ కనబడక, ఓట్ల పండుగలో 'మనకెంత గిట్టుబాటవుతుంది' అనే ఆలోచనలోకి పౌరులు వెళ్లిపోతున్నారు. 'నోటికొచ్చిన హామీలు ఇచ్చి పాలనా పగ్గాలు చేపట్టినా, వాటిలో చాలా మట్టుకు నెరవేర్చకుండా దాటవేసే నాయకులకు లేని నీతి మాకెందుకు? ఒక పార్టీకి నమ్మి ఓటేస్తే గెలిచి మరో పార్టీకి చెందిన పాలకుడి చంకలో దూరేవాడికి లేని సిగ్గు మాకేలా?' అనే భావన రోజురోజుకూ బలపడి సగటు ఓటరు సొంత లాభానికి ప్రాధాన్యతనిచ్చే స్థితికి చేరుకున్నాడు.
ధారాళంగా డబ్బు ఖర్చు
ఓటరు సామాన్యుడిలా కనబడే అసామాన్యుడని, సరియైన సమయానికి సరియైన నిర్ణయం తీసుకుంటాడని, తిక్క రేగితే కర్రు కాల్చి వాత పెడతాడని ఫలితాలను చూసి విశ్లేషకులు అభివర్ణిస్తుంటారు. ఈ మాటల్లో డొల్లతనమే ఎక్కువ. మన దేశంలో జనాభాకి, ఓటర్లకు, ఎన్నికల సరళికి పొంతనే లేదు. దేశంలోని 90 కోట్లకు పైగా ఓటర్లలో ముప్పై శాతం మేరకు పోలింగ్ పట్ల ఆసక్తే లేదు.
ఒక్క రోజు జరిగే ఓటింగ్ కోసం కొన్ని రోజుల పాటు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటూ అభ్యర్థులు, వారి పరివారం అంతా కష్టపడుతుంటారు. ఎన్నికల ఖర్చు కోసం చట్టం విధించిన పరిధిని వక్క పొడిగా నమిలేసి ఆ లెక్కను వందల రెట్లు సునాయాసంగా దాటేసే అభ్యర్థులున్న చోట ఊరు ఊరంతా నిత్య కళ్యాణమే. ప్రతి నియోజకవర్గంలో కనీసం ముగ్గురైనా ఎన్నికల్లో డబ్బును నీళ్లలా ఖర్చు పెట్టేవాళ్ళుంటారు. మిగితా చిన్నా చితుకా ఇండిపెండెంట్లు కూడా మొహమాటానికైనా ఉన్నంతలో ధార పోస్తుంటారు.
అలాంటి నాయకులు ఇప్పుడెక్కడ?
అభ్యర్థులు ఎంతటివారో, రాజకీయాలలోకి రాకముందు ఎవరు ఏం చేశారో, ఎలా కోట్లాది రూపాయలు కూడబెట్టారో ఆ బాగోతమంతా ఓటరుకు తెలుసు. రెండు వైపులా అవసరార్థపు ఆత్మవంచనే. ఎన్నికలలో నిలబడేవాడికి దేశాభివృద్ధి పట్ల ఆసక్తి లేశమాత్రం లేకుండా వ్యక్తిగత లాభాపేక్ష, రాజకీయంగా ఎదుగుదలయే ప్రధానమైనపుడు ఓటరు మాత్రం ఈయన వలన జనానికి మేలు తప్పకుండా జరుగుతుందని అని నమ్మే అవకాశం అసలే లేదు. ఆరునూరైనా ఫలానా ఆయనకే ఓటేస్తానని ఏ ఓటరు దృఢంగా ముందస్తు నిర్ణయం తీసుకోవడం లేదు. అంతా చివరి నిమిషం ఉజ్జాయింపులే.
ప్రధాన అభ్యర్థులు పోటీపడి ఖర్చు పెడుతున్నందువల్ల గెలిచేవారి ఓట్ల మెజారిటీ తగ్గిపోతోంది. ఒకప్పుడు 'ఈయనే మా నాయకుడు' అని వరుస కట్టి ఓట్లు గుద్దేవారు. కొందరు సీనియర్లకు భారీ మెజారిటీ వచ్చేది. ఇప్పుడు అలాంటి గెలుపులు క్రమంగా తగ్గిపోతున్న సరళిని మనం గమనించవచ్చు. తెలంగాణ సాధకుడిగా పేరొందిన కేసీఆర్ 2014 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిపై కేవలం 19,391 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అది ఆయన ఎన్నికల చరిత్రలోనే అత్యల్ప మెజారిటీ గెలుపులో మూడవది. అప్పటికి 13 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నాయకుడికి తొలి తెలంగాణ ఎన్నికలలో ఓట్లన్నీ ఊడ్చినట్లు ఆయనకే పడాలి. పత్రికలు ఏమైనా రాయనీ, పార్టీవాళ్ళు ఎంతైనా పొగడనీ ఓటరు శైలిలో మాత్రం చిన్నా పెద్దా తేడా లేదు. ముఖ్యమంత్రి స్థాయి లీడర్ అయినా ఎన్నికల ఖర్చులో చట్ట పరిధి దాటకుండా గెలువలేడు. తనిఖీ సిబ్బందికి డబ్బు మూటలు, లిక్కర్ కార్టన్‌లు దొరకడంలో ఏ నియోజక వర్గం అతీతం కాదు.
వేలం పాటకు ఓటు
గత రెండేళ్లుగా జరుగుతున్న ఎన్నికలలో గెలుపోటములు ఓటర్ల ఆలోచన సరళిని కొంత స్పష్టం చేస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ చేతిలో పాలక పక్ష టీఆర్ఎస్ పోటీదారు చిత్తుగా ఓడిపోవడం ఒక ఉదాహరణ. ఎన్నికల చరిత్రలోనే ఇదే ఓటుకు అత్యధిక రేటు పలికిన ఓటింగ్‌గా విశ్లేషకులు రాశారు. ప్రపంచం అబ్బురపడే పాలన తాము అందిస్తున్నామని టీఆర్ఎస్ చెప్పుకునే మాట ఆ ఉపఎన్నికలో చిల్లిగవ్వే అయింది.
టీఆర్‌ఎస్‌కు గంపగుత్తగా ఓట్లు రాల్చే రైతుబంధుకు అన్నగా దళితబంధు తోడొచ్చినా పాలకపక్షం వైపు ఓటర్లు కన్నెత్తి చూడలేదు. నెలరోజులపాటు హుజురాబాద్ ఓటర్లను ఎక్కువగా అరుసుకున్న పార్టీయే గెలుపునందుకుంది. ఓటు వేలం పాటలో నిలబడిందన్నా తప్పులేదు. నేరం వారిదికాదు నేతలది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలపై ఢిల్లీలో రైతు ఉద్యమం ప్రభావం ఉండి తీరుతుందని బీజేపీ కూడా భావించి కొత్త గిమ్మిక్కులు చేసింది. నిజానికి ఎన్నికల ఫలితాలు చూశాక కొత్త వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోకున్నా గెలిచేవాళ్లమే అనే భావన వారికి కలిగియుండవచ్చు. ఏడాది పాటు చేసిన ఉద్యమం ఎలా ఉన్నా ఎన్నికల విషయానికొస్తే రంగమే మారిపోతుంది. రాజకీయ విశ్లేషకులు కూడా అభ్యర్థిలోని గుణగణాల కన్నా డబ్బు ఎక్కువగా ఖర్చు చేసే సత్తా ఉన్న వారినే గెలిచేవాళ్ల లెక్కలో వేసుకుంటున్నారు.
మత భజనే ముఖ్యం కాదు
బీజేపీకి హిందుత్వ ముద్ర ఓట్లు తెచ్చిపెడుతుందని అనుకుంటాం కానీ, ఆ పార్టీ అభ్యర్థి కేవలం మత భజన చేసి గెలవడం అసాధ్యం. మతమే అధికారాన్ని అందిస్తే 1990లో ఎల్‌కే అద్వానీ జరిపిన రథయాత్రతోనే ఫలితం కనబడేది. నిజానికి అన్ని ప్రధాన పార్టీలు నుండి పోటీకి నిలబడేవారు అగ్రవర్ణ హిందువులే. బీజేపీ తరఫునే కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా హిందూ ధనవంతులే. ఇద్దరు అభ్యర్థులలో జెండా రంగు భేదం కానీ, లోపలంతా సేమ్ టు సేమ్. కుటుంబ పాలనా మోహంతో కాంగ్రెస్ బలహీనపడనంత కాలం కులీన విద్యావంతులంతా ఆ పార్టీ వైపే ఉన్నారు. ఇప్పుడు వారంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, ఇష్టపూర్వకంగా బీజీపీని సమర్థిస్తున్నారు.
నవంబర్ 2016 లోని పెద్ద నోట్ల రద్దు, 2017 లో ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ గెలుపుకు ఎలా సహకరించిందో తెలిసిందే. ఓట్ల పండుగలో నోట్ల పంపిణీకి కేంద్రం ఇలా మిగితా పార్టీలకు దారి మూసేసింది. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని భ్రమపడి చంద్రబాబు రెండుసార్లు బోల్తా పడ్డారు. పార్టీకి ఎంత పలుకుబడి ఉన్నా డబ్బులు లేకుంటే దాని జెండా, గుర్తు గెలిపించదని టీఆర్‌ఎస్ బలహీనవర్గాల అభ్యర్థులు ఓడి నిరూపించారు. కేసీఆర్ కూడా 2014 లో కొందరు ఉద్యమనేతలకు సీట్లిచ్చినా వాళ్లు ఓడిపోవడంతో 'ఏ పార్టీవాడైనా పర్వాలేదు, ఎన్నికలకు డబ్బున్నోడు కావలసిందే' అని ధనబలం గలవాళ్లను కలుపుకున్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించే పార్టీ కాకుండా అభ్యర్థుల బలం పైనే అది నిలబడిందని అనుకోవచ్చు.
దేనికీ రుజువులుండవు
గులాబీ కండువా మెరుపంతా దాన్ని కప్పుకున్న ధన స్వాముల వల్ల వచ్చిందే. డబ్బు, కులమే రాష్ట్రంలో ఇప్పుడు ఎవరినైనా మంత్రి పదవి దాకా తీసుకెళుతుంది. పాత బీజేపీ నాయకత్వం హిందుత్వ అజెండాకి కట్టుబడి నిబద్ధతనే గీటురాయిగా కాలం వెల్లదీస్తే కొత్తతరం ధనవంతులను ఎన్నికలలో దింపి చేతికి ఊతంగా కాషాయ జెండానిస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలవారికి బీజేపీ ద్వారాలు తెరిచి ఉంటున్నాయి. డబ్బున్నోడు నేత, లేనోడు కార్యకర్త. ఇది నేటి ఆ పార్టీ పాలసీ.
ఓ పార్టీ ఎన్నికల్లో గెలవగానే విశ్లేషకులు, రాజకీయ పండితులు కలిసి ఆ విజయానికి కారణంగా సంక్షేమ పథకాలు, శాంతి భద్రతల పరిరక్షణ ఇలాంటివేవో చూపుతారు కానీ, నిజానికి గెలిచిన ఆ పార్టీ అభ్యర్థులు ఖర్చుపెట్టిన డబ్బు మహత్యాన్ని, అసలు విజయ రహస్యాన్ని వేలెత్తి చూపరు. ఎందుకంటే దానికి రుజువులు దొరకవు. ఇప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాలలో, కొన్ని సందర్భాలలో ఓటర్లు భిన్నంగా నడిచిన ఉదాహరణలున్నాయి. ఆ దిశగా ఒక్కసారికైనా ప్రయోగాత్మకంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి 'ఈ ఎన్నికలలో ఎవరూ పరిమితిని మించి ఖర్చుపెట్టకుండా ఓట్లడుగుదాం, ఫలితాలు చూద్దాం' అని పరీక్షించుకుంటే మన ప్రజాస్వామ్యం విలువేమిటో తెలుస్తుంది. రాజ్యాంగ ఆకాంక్షలు కూడా నెరవేరుతాయి. అప్పుడు ఓటరు కూడా ఎన్నికల వేళ తనకేం లాభమనేది పక్కనపెట్టి దేశం గురించి పట్టించుకోవచ్చు.
బి.నర్సన్
94401 28169