- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామూహిక ఆత్మహత్యలకు దృశ్యరూపం!
ధియేటర్లు, డిస్ట్రిబ్యూటర్ల ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ ఓటీటీల్లో అసంఖ్యాకంగా సినిమాలు విడుదలవుతున్న కాలమిది. థియేటర్లలో వచ్చే హీరోల సినిమాల కంటే ఎక్కువ నాణ్యతతో రూపొందుతున్న ఓటీటీల్లోని సినిమాలు ఇటీవల కుటుంబ సామూహిక హత్యలపై దృష్టి కేంద్రీకరించడం విశేషం. కొన్నేళ్ల క్రితం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిజంగానే జరిగిన సామూహిక ఆత్మహత్యల ఘటనలు ప్రేరణగా మన దర్శకులు కొత్త కంటెంటుతో సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ల కలబోతతో సినిమాలు తీస్తున్నారు. 2018లో ఢిల్లీలో ఒక్క రాత్రిలోనే చుండావత్ కుటుంబానికి చెందిన 11 మంది చనిపోయారు. పదిమంది బాధితులు ఉరితాళ్లపై వేలాడుతూ, బంధించబడి, వృత్తాకార రూపంలో కనిపించారు. అయిదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించి విస్తృత చర్చలకు దారి తీసింది. వీరి ఆత్మహత్యలకు గ్రూప్ సైకోసిస్ కారణమన్నారు. కుటుంబ పెద్ద మరణం వల్ల చుండావత్ కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. చిన్న కొడుకు లలిత్ చుండావత్, చనిపోయిన తన తండ్రి తన ద్వారా మాట్లాడుతున్నాడని నమ్మాడు. లలిత్ తన తండ్రి స్వరంతో రాసిన డైరీల శ్రేణిని నిర్వహిస్తాడు. ఆత్మహత్యలు ఒక కర్మలో చివరి దశ, ఇది సీనియర్ చుండావత్‌ను పునరుత్థానం చేస్తుందని ఆ కుటుంబం నమ్ముతుంది.
దీని ఆధారంగా ఇటీవలే తీసిన 'హౌస్ ఆఫ్ సీక్రెట్స్, ది బురారీ డెత్స్' అనే డాక్యుమెంటరీ సిరీస్ చుండావత్ కుటుంబ సామూహిక ఆత్మహత్యలను వీక్షకులు గగుర్పాటు చెందేలా చూపించింది. బురారీ ఘటనకు సమానంగా సామూహిక ఉరి ఘటనపై దర్యాప్తు ఇతివృత్తంతో ఈ మధ్యే 'ఆఖ్రీ సాచ్' (పోలీస్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో తమన్నా భాటియా) అనే సినిమా డీస్నీ, హాట్ స్టార్‌లో వచ్చింది. మదనపల్లిలో రెండేళ్ల క్రితం కుటుంబంలోని ఇద్దరు విద్యావంత యువతుల ఆత్మహత్య ఘటన ప్రేరణతో తెలుగులో మరో సినిమా 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' పేరుతో గత నెలలోనే వచ్చింది. 1997లో వెయ్యి మందికి పైగా అమెరికన్ కల్ట్ హెవెన్స్ గేట్ సభ్యుల సామూహిక ఆత్మహత్య గురించి ఈ సినిమాలు ప్రస్తావించడం విశేషం. గతంలో ఢిల్లీలోని బురారీ మాస్ సూసైడ్, మదనపల్లిలో జరిగిన ఘటనలను ఆధారంగా చేసుకుని విప్లవ్ కోనేటి ఈ సినిమాను డైరెక్ట్ చేసి స్వయంగా నిర్మించాడు.
మాస్ సూసైడ్ నేపథ్యంతో..
ట్రైలర్, టీజర్‌తో ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా కథ క్లుప్తంగా చూస్తే, అనాధ అయిన హేమంత్, తన స్నేహితుడితో కలిసి ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ ఉంటాడు. తన కాఫీ షాప్‌కి కుకీస్ సప్లై చేసే చైత్రను మొదటి చూపులోనే ప్రేమించిన హేమంత్ తనకి ప్రపోజ్ చేస్తాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఊరు విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో చైత్ర తనకు హేమంత్ అంటే ఇష్టమే కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెబుతుంది. ఎందుకంటే తాను కొన్ని రోజులలో చనిపోవడానికి సిద్ధమవుతున్నానని షాక్ ఇస్తుంది. ముందు షాకింగ్ అనిపించినా తనను ప్రేమిస్తుందని తెలియడంతో ఆమెను దక్కించుకునేందుకు హేమంత్ ప్రయత్నిస్తాడు. అందులో భాగంగా ఆమె తన పెదనాన్న బళ్ళారి నీలకంఠం కోసం ఎందుకు చనిపోవాలని అనుకుంటుంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అసలు బళ్ళారి నీలకంఠం ఎలా చనిపోయాడు? బళ్ళారి నీలకంఠాన్ని మళ్లీ ఎలా బతికించాలని ఆయన కుటుంబ సభ్యులు భావించారు? హేమంత్ చైత్రను వివాహం చేసుకున్నాడా? చైత్ర కుటుంబాన్ని ఈ మాస్ సూసైడ్ నుంచి కాపాడాడా అనేది ఈ సినిమా కథ.
మదనపల్లిలో ఇద్దరు కుమార్తెలను చంపి తాము కూడా చనిపోయేందుకు సిద్ధమైన ఒక మధ్య వయస్కులైన జంట వ్యవహారంను ప్రధాన అంశంగా చేసుకొని విప్లవ్ కోనేటి ఈ కథ రాసుకున్నాడు. మూఢనమ్మకాలను బాగా ఫాలో అయ్యే ఒక కుటుంబాన్ని, ఆ కుటుంబం వల్ల ఇబ్బంది పడిన అదే కుటుంబానికి చెందిన వ్యక్తి ప్రేరేపించి చావు వరకు నడిపించే ప్రయత్నం చేయడం. చివరికి ఆ వ్యక్తి తీసుకువచ్చిన మరో వ్యక్తి ద్వారానే ఈ విషయం అంతా కుటుంబ సభ్యులకు తెలియడం వంటి విషయాలను కథలో చాలా ఆసక్తికరంగా రాసుకున్నాడు దర్శకుడు. ఇది ఆత్మహత్యలకు సంబంధించిన సినిమానే అని ఈజీగా అర్థమవుతుంది.
మూఢనమ్మకాలపై ఎక్కుపెట్టిన బాణం!
ఈ సినిమాలో సెకండ్ హాఫ్ మొదలైన తరువాత అసలు విషయం ఒక్కటొక్కటిగా బయటపడుతున్నంత సేపు వీక్షకులకు షాక్ తెప్పిస్తుంది. ఎవరినైతే మనం బాధితులం అనుకుంటామో వారే ఇదంతా ప్లాన్ చేశారని చివరలో తెలిసేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు డైరెక్టర్. కథనంలో చిన్న చిన్న పొరపాట్లు, సాగదీత ఉన్నా సరే అందరినీ ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు. క్లుప్తంగా చెప్పాలంటే మూఢనమ్మకాల మీద ఈ సినిమా ఎక్కు పెట్టిన ఒక బాణంలా అనిపిస్తుంది. హేతుబద్ధతకు మూఢనమ్మకాలకు మధ్య ఘర్షణ ఎప్పుడు ఉండేదే అదే ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. సినిమా మొత్తం ఒకెత్తు అయితే పసిపిల్లల వేధింపుపై చివరి అరగంటలో సినిమాలో వినిపించే డైలాగ్స్ మరొక ఎత్తు. ఈ సినిమాలో మూఢనమ్మకాల ప్రాక్టీసుపై వచ్చే ఘటనలు సినిమా మొత్తాన్ని మూఢనమ్మకాలపై బలం కలిగించేలా తీశారా అనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా ఈ సినిమా చిత్రించిన చైల్డ్ అబ్యూస్ (చిన్నపిల్లలపై వేధింపు)ని మనసుకు తాకేలా చిత్రించారు. చిన్నతనంలోనే లైంగిక వేధింపునకు గురైన అబ్బాయి లేక అమ్మాయి ఎలాంటి పరిస్థితులకు గురవుతారు, తమపై కుటుంబాల్లోనే జరుగుతున్న దారుణం పట్ల వారి మనస్తత్వం రాన్రానూ ఎంతలా మారిపోతుంది అనే విషయాలను కళ్ళకు కట్టినట్లు చూపడంలో డైరెక్టర్ సఫలమయ్యాడు.
కుటుంబంలోని మగాళ్లను చూసి పసిపాపలు సైతం భయపడాల్సిన పరిస్థితులను శేఖర్ కమ్ముల తీసిన లవ్ స్టోరీ మొదటిసారిగా చూపి భయపెట్టింది. ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా ఆ భయాన్ని ఇంకా పెంచి పోషించింది. పసిపిల్లలను సైతం కామ వస్తువులుగా చూసి మగపశువు ఆటాడుకునే వికృత సంస్కృతి దశాబ్దాలకు ముందు నుండి ఉంది. కుటుంబాల ముసుగులో కొన్ని వృషభాలు మన దేశంలో ఏం చేస్తున్నాయి అనేది అర్థం కావాలంటే ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా చూడాల్సిందే మరి.
ఆత్మహత్యలన్నీ సామాజిక హత్యలే!
ఆత్మహత్యలన్నీ సామాజిక హత్యలే అనే అభిప్రాయంపై చర్చ ఈనాటిది కాదు. 1846లో కమ్యూనిస్టు సిద్ధాంతవేత్త కార్ల్ మార్క్స్ 'ప్యూచెట్ ఆన్ సూసైడ్' అనే శీర్షికతో రాసిన వ్యాసం ఆనాటి పారిస్‌లో జరుగుతున్న స్త్రీల ఆత్మహత్యలపై ప్రధానంగా కేంద్రీకరించింది. ప్రెంచ్ పోలీస్ అడ్మినిస్ట్రేటర్, ఎకనమిస్ట్, గణాంక శాస్త్రజ్ఞుడు జాక్వెస్ ప్యూచెట్ ఆత్మహత్యలపై రాసిన వ్యాసంపై మార్క్స్ ఒక అద్భుతమైన విశ్లేషణను 'Peuchet on Suicide' అనే విమర్శనాత్మక వ్యాసంలో పొందుపర్చారు. ఆనాటికి మార్స్స్, తన మిత్రుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్‌తో కలిసి 'ది కమ్యూనిస్టు మ్యానిఫెస్టో'ను ఇంకా రాయలేదని గుర్తించాలి. ప్రధానంగా వ్యక్తులను ఆత్మహత్యలకు పురికొల్పే వ్యవస్థను మార్చడం గురించి మార్క్స్ ఈ రచనలో పొందుపర్చారు. 170 ఏళ్ల క్రితం పారిస్ నగరంలో జరుగుతున్న ఆత్మహత్యలు ప్రధానంగా స్త్రీల ఆత్మహత్యలు మార్స్‌ని తీవ్రంగా కదిలించాయి. మానవులను ఆస్తిగా మార్చే పరిస్థితులు, సామాజిక సంబంధాలు వారిని తమకు తాము చెందకుండా, పరాయీకరిస్తున్న సందర్భంలోనే, భరించలేని బానిసత్వాన్ని ధిక్కరిస్తున్న క్రమంలోనే స్త్రీలు ఆత్మహత్యల బాట పడుతున్నారంటూ, ఆత్మహత్యల వెనుక ఉన్న వ్యవస్థా పునాదిపై మార్క్స్ నిశిత విమర్శ చేశారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను తొక్కిపెట్టే ప్రతి అంశాన్నీ తాను ద్వేషిస్తానని చెప్పుకున్న మార్క్స్, భర్త భార్యపై చేసే శారీరక వేధింపు సహించరానిదని ఆనాడే చెప్పడం గమనార్హం. బూర్జువా సమాజం తన సభ్యులందరినీ స్వేచ్ఛకు దూరంగా ఉంచుతుందని, పారిశ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి చెందిన మానవాభివృద్ధిని పెట్టుబడిదారీ విధానం పుట్టుకనుంచే విధ్వంసం చేస్తూ వచ్చిందని మార్క్స్ బలంగా విశ్వసించారు. సమాజంలోని ప్రజలందరినీ అమానవీకరిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థను మార్చడమే ఈ మానవ విధ్వంసానికి, పరాయీకరణకు పరిష్కారమని మార్క్స్ పదేపదే చెబుతూ వచ్చారు.
కె. రాజశేఖర రాజు
73964 94557