నిర్దాక్షిణ్య సమాజంలో బలవుతున్న పసితనాలు

by Ravi |   ( Updated:2024-11-06 00:30:54.0  )
నిర్దాక్షిణ్య సమాజంలో బలవుతున్న పసితనాలు
X

అసమాన సమాజంలో అందరి ప్రాణాలకు ఒకే విలువ ఉండదు. కొందరి ప్రాణాలు ఒకరోజు పేపర్‌లో వచ్చే సింగిల్ కాలమ్ వార్త. ఇవాళ్టి పేపర్.. రేపటికి చెల్లని కాగితం అయినప్పుడు ఆ ప్రాణాల విలువ ఎంత? అయితే, మారి సెల్వరాజ్ ఆ పేపర్ ముక్కకు విలువ ఇచ్చాడు. ఎవరికీ పట్టని ఆ ప్రాణాల గురించి చర్చించాడు. నిర్దాక్షిణ్య సమాజంలో బలవుతున్న పసి తనాలను కళ్లకు కట్టినట్టు చూపించాడు. స్కూల్‌కు వెళ్లే పిల్లలు ప్రతి రోజు ఇంటి బెల్ కోసం ఎంతగా ఎదురుచూస్తారో.. సెలవు వచ్చిందంటే అంతకంటే ఎక్కువ సంతోషపడతారు. కానీ, 12ఏళ్ల శివనందన్, శేఖర్‌లు సెలవులు వస్తే అరటి తోటల్లో గెలలు మోసే పని చేయాలి. ఇష్టం లేకున్నా..తీసుకున్న అప్పు కోసం.. తల్లికి ఇచ్చిన మాట కోసం చెరువులో ఈత కొట్టడం, చేను, చెలకల్లో తిరగడం, ఆడుకోవడాన్ని ఫణంగా పెట్టాలి. చివరికి అప్పిచ్చిన వ్యాపారి దురాశతో ప్రాణాలూ ఫణంగా పెట్టాలి.

పేదరికం దుర్మార్గమైనది. నిష్కర్షగా చావును స్లో మోషన్‌లో చూపిస్తుంది. నిస్సహాయత నిండిన మాన సిక చిత్రవధను మెల్లిగా దేహమంతా ఎక్కి‌స్తుంది. అమాయకపు పసితనాన్ని, స్వచ్ఛమైన బా‌ల్యాన్ని క్రూరంగా ముక్కలు చేస్తుంది. ఏం సినిమా ఇది!? ‘వాళై’ చూస్తే ఎవరో బంధించినట్టు మనసు గింజుకుంటుంది. లేదూ? మారి సెల్వరాజ్.. ఈ చేదు ప్రాపంచిక వాస్తవాన్ని కళ్ల ముందు పరిచాడు. అందుకే, కొట్టిపారేయలేని నిజాలను కాదనలేక సినిమా చూస్తూ చలించిపోతాం.

1990ల్లో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. దక్షిణ తమిళనాడులోని ఓ మారు మూల ప్రాంతంలో కథ నడుస్తుంది. పాత్రల‌తో పాటు అరటితోటలు కూడా సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పచ్చిక బయళ్లు, నీటి కాలువలు, బురద, పచ్చని తోటలు, కోళ్లు, మేకలు, ఆవులు, పెంకుటి ళ్లు.. పల్లె సహజ సోయగం సినిమాలో క్యాప్చర్ చేశారు. అంతే సహజమైన పల్లె మనసులు, పిల్లల పసితనం ఈ సినిమాలో కనిపిస్తాయి. పల్లెల్లోని బలీయమైన జీవితాలూ దర్శనమిస్తాయి. ఈ సినిమాలో కొన్ని సీన్ల గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. సినిమా మొదలైన కొన్ని నిమిషాలకే ఊరిలో ఓ ముసలాయన మరణిస్తాడు. అప్పుడు శివనందన్, శేఖర్‌ల పొట్టి సంభాషణ.. సినిమా మొత్తం ఎలా సాగనుందో స్పష్టం చేస్తుంది.

ముసలోడి చావుతో ఈ రోజు గెలలు కోయాల్సిన ప‌ని లేదని అంటాడు శివనందన్. కానీ, రేపు వెళ్లాల్సిందేనని గుర్తు చేస్తాడు శేఖర్. రేపు కూడా ఎవరో ఒక‌రు చస్తే బాగుండేది. నీకోసం రోజూ ఒకరు చస్తారు మరి! సెలవు వచ్చి ఏం లాభం, గెలలు కోయడానికి వెళ్లాలి.. స్కూల్ ఉన్నది కాబట్టే సెలవుల్లో ఇలా వె‌ళ్తున్నాం. సెలవులు లేకుంటే స్కూల్‌కు పంపియ్యకుండా గెలల పనిలోనే ఉండాల్సి వచ్చేది!! అంటూ చెబుతాడు శేఖర్..

గెలలు కోయడానికి వెళ్తూ.. క్లాసులోనూ వాటిని మోస్తున్న ఫీలింగ్‌తో ఉండే శివనందన్‌ టాపర్. పూంగొడి మేడంను ఆరాధిస్తాడు. ఆరాధన సినిమా లో చిరంజీవి టైపు ఇష్టపడుతున్నట్లు ముద్దుగా చెబుతాడు. కొన్ని రోజులు పూంగొడి మేడం కర్చీఫ్‌ ను వెంటపెట్టుకుని తిరుగుతాడు. శివనందన్ బా ల్యంలో కొంత ఊరట పూంగొడి మేడం ఎపిసోడే.

శివనందన్ నిర్లక్ష్యంతో ఆవు పొలంలో పడిందని బ్రోకర్ ఇంటిమీదికి వచ్చి రభస చేయడంతో తల్లి చెవి పోగులు తీసి అతడి చేతిలో పెడుతుంది. బిడ్డ వేంబును కూడదీసుకుని ఏడుస్తుంటే.. తానెప్పుడూ అలా చేయనని, పరీక్షల తర్వాత సెలవుల్లో రోజూ పనికి వెళ్లుతానని, తల్లి మాట కాదనని శివనందన్ వేడుకుంటాడు. శివ నందన్ తన బాల్యాన్ని, అమాయకత్వాన్ని మెల్లిగా కోల్పోతున్న స్థితి. పూంగొడి టీచర్‌ను అక్కలా.. లేదా తల్లిలా గౌరవిస్తానని ఆ తర్వాత శివనందన్ చెబుతాడు. పసితనపు అమాయకత్వాన్ని కోల్పోవడం ఎంతటి విషాదమో.. మనకు ఎదురైన కఠిన పరిస్థితులు ఆ ఇన్నోసెన్స్‌ను మెల్లగా కిల్ చేస్తాయి. శివనందన్‌పై కౌమారదశలోనే పెద్ద బాధ్యతలు పడతాయి. తన పసితనం గాయపడుతుంటే మనం బాధపడతాం.

అట్టడుగు వర్గాలకు చేరువైన ఎర్రజెండా పార్టీ గు‌రించీ సినిమాలో చర్చ ఉంటుంది. శివనందన్ తండ్రి పోరాటాలు అని చెప్పి తిరిగి అర్ధంతరంగా తనువు చాలిస్తే కుటుంబ బాధ్యత తల్లి మీద పడుతుంది. తాను కూడా పోతే ఎలా అనే ఆందోళన నుంచే కొడుకును చిన్నప్పటి నుంచే ‘ప్రయోజకుడి’ని చేయాలని ఆరాటంతో పనికి పంపిస్తూ ఉంటుంది. పేదరికంపై పేదలే పోరాడటం, వాటి విపరిణామాలు చవిచూడాల్సి రావడం మరో విషాదం. తండ్రి పోరాట స్ఫూర్తిని సుత్తె కొడవలి బొమ్మ రూపంలో కనికి అందిస్తాడు శివనందన్.

కూలి పెంచడానికి కూలీలను వేరే వెహికల్‌లో కాకుండా గెలలతో నింపిన లారీ లోడ్ పైనే పంపించాలని వ్యాపారి నిర్ణయిస్తాడు. ఓ రోజు ఓవర్‌లో డ్‌తో వెళ్లుతున్న లారీ బురదలో బోల్తా పడగా.. కార్మికులూ లారీ కింద నలిగిపోతారు. లారీ కింద చిక్కుకున్న వేంబు తన చేతిని బయటికి చాచి సహా యం అర్ధిస్తున్నప్పుడు కని తాను ఇష్టపడ్డ వేంబు చేతిని పట్టుకుని పిచ్చోడిలా బయటకు లాగుతున్న దృశ్యాలు.. సీన్ మారినంత సింపుల్‌గా మన కళ్ల నుంచి చెదిరిపోవు. హృదయాన్ని బలంగా తాకే ఇలాంటి సీన్లు 'వాళై' సినిమాలో చాలా ఉన్నాయి.

మహేష్

76749 63131

Advertisement

Next Story