సురక్షిత నీరు వినియోగించాలి!

by Ravi |   ( Updated:2024-09-04 00:30:33.0  )
సురక్షిత నీరు వినియోగించాలి!
X

వర్షాకాలంలో వరద నీరు వచ్చి చేరడం వలన చెరువులు, కుంటలు, ఇతర తాగునీటి వ్యవస్థలు కలుషితమవుతాయి. ఈ కలుషితమైన నీటిని తాగడం వలన టైఫాయిడ్, డయేరియా, కామెర్లు, పోలియో, కలరా వంటి వ్యాధులు నీటి ద్వారా వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం అరక్షిత నీటి కారణంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ ప్రజలు మరణిస్తున్నారని అంచనా. అరక్షిత నీరు ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య, పర్యావరణ సమస్యలలో ఒకటి. సురక్షితమైన నీటిని పొందడం అనేది మానవ ప్రాథమిక అవసరాలలో ఒకటి.

సురక్షిత నీటి తయారీ విధానం..

భారీ వర్షాల కారణంగా రోడ్డుపై ఎక్కువ సేపు నీరు నిలుస్తుండటతో భూగర్భంలో ఉండే మంచినీటి పైపుల లీకేజీల ద్వారా వరద నీరు తాగునీరుతో కలిసి వస్తుంది. అలాగే భూగర్భ నీటి నిల్వ ట్యాంకులు కలుషితమవుతాయి కావున వరదల సమయాల్లో నీటిని తాగాలనుకుంటే ఆ నీటిని మరిగించి చల్లారాక తాగాలి. ఇలా మరిగించడం వలన నీటిలో బ్యాక్టీరియా, వైరస్‌లు, ప్రోటోజోవా మొదలైన చాలా సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. ఇది సురక్షితమైన నీటిని తయారు చేసుకోవటానికి ఉపయోగిస్తున్న సరళమైన పద్ధతి. ఇక ఎక్కువ పరిణామంలో నీటిని సరఫరా చేయాలనుకుంటే బ్లీచింగ్ పౌడర్ వినియోగించడం మంచిది. అయితే ఈ పౌడర్‌ను డైరెక్ట్‌గా నీటి వనరుకు కలపరాదు. నీటిలో కలిపే ముందు మొదట బ్లీచింగ్ పౌడర్‌ను ఒక ప్లాస్టిక్ బకెట్లో తీసుకొని దానికి సగం నుండి మూడు వంతుల వరకు నీళ్లను కలిపి ఆ నీళ్లను బాగా కలియపెట్టి కొంత సమయం పక్కన పెడితే, క్రిమి సంహారిణి బ్లీచింగ్ పౌడర్ నుండి నీళ్లలోకి బదిలీ అవుతుంది. అవసరం లేని సున్నం వంటి తెల్లని పదార్థం నీళ్ల కింది భాగంలో అవక్షేపం వలె ఏర్పడుతుంది. బ్లీచింగ్ పౌడర్ కలిపిన ఆ నీటిని నీటి వనరులో కలపాలి. ఇక సురక్షిత నీటి కోసం రివర్స్ ఆస్మాసిన్ పద్ధతి కూడా మంచిదే కానీ ఇది మనిషి ఆరోగ్యానికి అవసరమైన మినరల్స్‌ను నీటి నుండి తొలగిస్తుంది. కావున దీర్ఘకాలం పాటు ఆర్.ఓ.వాటర్‌ను వాడడం శ్రేయస్కరం కాదు. నీరు శుభ్రంగా కనిపిస్తున్నప్పటికీ దానిలోని సూక్ష్మజీవులు మన కంటికి కనిపించవు. కనుక నాణ్యత తెలియని నీటిని తాగకూడదు. అత్యవసర పరిస్థితులలో ప్రఖ్యాత కంపెనీల నుండి ప్యాక్ చేయబడిన వాటర్‌ను తాగటం మంచిది. సురక్షితమైన నీటిని తాగటం సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి మంచి పరిశుభ్రతా నియమాలు పాటించడం వల్ల ప్రతి ఒక్కరూ వర్షాకాలాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఆస్వాదించడానికి సహాయపడుతుంది.

డా. శ్రీధరాల రాము

94411 84667

Advertisement

Next Story

Most Viewed