- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉన్నది ఉన్నట్టు: టి- కాంగ్రెస్.. సీ'నియర్' వార్
ఇంట గెలిచి రచ్చ గెలవాలనే' నానుడికి తగినట్లుగా స్వంత పార్టీని చక్కదిద్దుకుంటేనే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పవర్‌లోకి రావడం సాధ్యం. ప్రజలలో విశ్వసనీయత కలిగించలేనప్పుడు అధికార పార్టీపై ఎంత వ్యతిరేకత ఉన్నా దాన్ని అనుకూలంగా మల్చుకోవడం అసాధ్యం. స్వప్రయోజనాల కోసం అధికార పార్టీకి దగ్గర కావడం రాజకీయ నాయకుల సహజ లక్షణం. పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు చేజారినట్లుగా ఇకపైనా వలసలు తప్పవు. ఎక్కడ ప్రయోజనం ఉందనుకుంటే ఆ పార్టీలోకి వెళ్లిపోవడం సహజం. ఇలాంటప్పుడు 'ఒరిజినల్ కాంగ్రెస్.. వలసల కాంగ్రెస్' అనే లాజిక్ అసంబద్ధం. పదవులు, పైరవీలు, పనులు, పైసలు మాత్రమే ఏకైక ప్రయోజనంగా ఉన్నప్పుడు ఈ ఫిలాసఫీకి స్థానం లేదు.
కర్ణుడి చావుకి కారణాలనేకం' అన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభానికి కూడా అలాంటి కారణాలే ఉన్నాయి. కేంద్ర నాయకత్వం మొదలు రాష్ట్ర నాయకత్వం వరకు వరుస వైఫల్యాలు ఇందుకు కారణం. 'తిలా పాపం తలా పిడికెడు' తరహాలో వివిధ స్థాయిలలో నిర్లక్ష్యం కనిపిస్తున్నది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్నా తొమ్మిదేళ్లుగా అధికారానికి దూరమైంది. మరో యేడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలోనూ పవర్‌లోకి వస్తుందనే ఆశలే తప్ప ప్రజలలో ఆ మేరకు విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నది. పదవుల కోసం పాకులాడడమే తప్ప బాధ్యత తీసుకుని పార్టీని పటిష్టం చేయాలన్న చిత్తశుద్ధి నేతలలో కరువైంది.
ఒకవైపు అధికార పార్టీ పట్ల ప్రజలలో అసంతృప్తి పెరిగిపోతున్నది. అది వ్యతిరేకత స్థాయికి చేరుకుంటున్నది. దీన్ని అందిపుచ్చుకుని ప్రత్యామ్నాయంగా నిలవాల్సిన కాంగ్రెస్(congress) అంతర్గత సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. స్వంత పార్టీ నేతలను కాపాడుకోలేకపోతున్నది. మరోవైపు బీజేపీ(bjp) నుంచి కూడా సవాలును ఎదుర్కొంటున్నది. లీడర్, కేడర్ తేడా లేకుండా అన్ని స్థాయిలలో పార్టీ నిర్మాణాన్ని పకడ్బందీగా ఉంచుకోవడం తప్పనిసరిగా మారింది. ప్రత్యర్థులపై పోరాటం సంగతేమోగానీ స్వంత పార్టీలోనే పరిస్థితిని చక్కదిద్దుకోవడం 'కత్తిమీద సాములా' మారింది. ఆ దిశగా చేపట్టిన కార్యాచరణ శూన్యం. అంతా ఏఐసీసీ చూసుకుంటుందనే నెపంతో రాష్ట్ర నాయకత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది.
గ్రూపులకు కేరాఫ్ కాంగ్రెస్
మరే రాజకీయ పార్టీకంటే కాంగ్రెస్‌లో గ్రూపులు, కుమ్ములాటలు ఎక్కువే. అన్ని రాష్ట్రాలలోనూ ఇది కనిపిస్తుంది. తెలంగాణ సైతం ఇందుకు మినహాయింపే కాదు. ఢిల్లీ స్థాయిలో 23 మంది సీనియర్ నేతలు జి-23(g23 leaders) పేరుతో అగ్ర నాయకత్వంపైనే విమర్శలు చేశారు. పార్టీలో కొనసాగుతూనే అసమ్మతి రాగం వినిపించారు. కానీ, నాయకత్వం వారిపై చర్యలు తీసుకునే సాహసం చేయలేకపోయింది. ఏం చేసినా చెల్లుబాటవుతుందనేది ఎస్టాబ్లిష్ అయింది. చివరకు అందులో నుంచి కపిల్ సిబల్(kabil sibal), గులాం నబీ ఆజాద్(gulam nabi azad) లాంటి నేతలు దూరమయ్యారు. ఈ పరిస్థితిని పసిగట్టినా లీడర్‌షిప్ 'నిమ్మకు నీరెత్తినట్టుగా' నే ఉంటున్నది. అందరూ పీసీసీ చీఫ్ లాంటి పదవులు కోరుకునేవారే. భవిష్యత్తులో అధికారంలోకి వస్తే అందరూ ముఖ్యమంత్రులు కావాలనుకునేవారే.
గ్రూపుల గురించి ఎవరైనా ప్రస్తావిస్తే 130 యేండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువే అనే సమాధానం వస్తుంది. నాయకత్వం చేతకానితనానికి 'ప్రజాస్వామ్యం' ఒక టాగ్ లైన్‌గా మారింది. ఇది కొనసాగినంత కాలం గ్రూపులు, వర్గాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన బొత్స సత్యనారాయణ(botsa satyanarayana), ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి(kiran kumar reddy) మొదలు తెలంగాణలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు, తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరకు వలసలు యథేచ్ఛగా జరుగుతూనే ఉంటాయి. చూస్తూ ఉండిపోవడమే తప్ప చేయగలిగిందేమీ లేదు. అసమ్మతిని, అసంతృప్తిని ముందుగానే పసిగట్టి దిద్దుబాటు చర్యలు తీసుకోలేకపోవడం ఆ పార్టీ చేతకానితనం.
ఆ సాహసం చేయలేకనే
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఒక రొటీన్ ప్రాక్టీస్. సకాలంలో యాక్షన్ తీసుకునే ధైర్యం నాయకత్వానికి లేదు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(komati reddy venkat reddy) వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు అసమ్మతి రాగం వినిపించి, నాయకత్వం మీదనే తిరుగుబాటు చేస్తున్న సీనియర్‌లపైనా పార్టీ యాక్షన్ ఇందుకు భిన్నంగా ఉంటుందని భావించలేం. రాష్ట్రాలలో పార్టీకి అధ్యక్షులున్నా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోవడం పార్టీ వీక్‌నెస్. అందుకే టీఆర్ఎస్(trs) లాంటి ప్రాంతీయ పార్టీల నుంచి 'ఢిల్లీకి గులాములు' అనే విమర్శలు రావడం. తాజాగా తలెత్తిన వివాదంలో కొద్దిమంది సీనియర్ నేతలుగా చెప్పుకునేవారు 'సేవ్ కాంగ్రెస్'(save congress) నినాదాన్ని తెరపైకి తెచ్చారు.
కాంగ్రెస్‌ను ఎవరి నుంచి సేవ్ చేయాలి? ఎవరు సేవ్ చేయాలి? నిజంగా కాంగ్రెస్ పతనమవుతూ ఉంటే దాన్ని కాపాడుకోవడం సమష్టిగా పార్టీ నేతల కర్తవ్యం. కానీ, ఇప్పుడు ఈ నినాదాన్ని వల్లిస్తున్న నేతలు కొన్ని ప్రశ్నలకూ జవాబు చెప్పుకోవాలి. పన్నెండు మంది స్వంత పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోయినప్పుడు పార్టీని సేవ్ చేయడానికి వారు చేసిన కృషి ఏంటి? ఏఐసీసీయే(AICC) తమకు హైకమాండ్ అని చెప్పుకునే వీరు అదే ఏఐసీసీ నిర్వహించిన మీటింగ్‌కు ఎందుకు డుమ్మా కొట్టారు? ఇది పార్టీ క్రమశిక్షణేనా? ఉల్లంఘించినందుకు వారిపై చర్యలేవి? పార్టీని కాపాడుకోవడం కోసమేనంటూ ఆ పార్టీకే నష్టం చేయడం సహేతుకమేనా?
స్వయంకృతాపరాధం కాదా?
కమిటీలలో వలస నాయకులకు పదవులు ఇప్పించుకున్నారనేది రేవంత్‌రెడ్డిపై(revanth reddy) సీనియర్‌లుగా చెప్పుకునేవారు చేస్తున్న విమర్శలు. కమిటీలను వేసిన ఏఐసీసీ స్థాయిలో రేవంత్ తన ప్రభావాన్ని చూపినప్పుడు పార్టీలో సీనియర్‌లుగా చెప్పుకునే వీరు ఎందుకు ఆ పని చేయలేకపోయారు? పార్టీ కోసమే పనిచేస్తున్నామని చెప్పుకునే వీరు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి చేస్తున్న కృషి ఏంటి? వ్యక్తులకన్నా పార్టీయే సుప్రీమ్ అని చెప్పుకుంటూ కూర్చున్న చెట్టు కొమ్మనే నరికేయడం చిత్తశుద్ధి అనిపించుకుంటుందా? పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకునే వీరు తగిన వేదికను ఎందుకు వాడుకోవడంలేదు? పీసీసీ చీఫ్‌గా నియమితులైన నేతకు సహకరించడం పార్టీ బాగు కోసమేననే భావన లేనప్పుడు వారు పార్టీకి ఎలా ఉపయోగపడతారు? కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభం(congress crisis) ఆ పార్టీ స్వయంకృతాపరాధం. టాప్ టు బాటమ్ పార్టీలో ఒకే ట్రెండ్ కంటిన్యూ అవుతున్నది.
పార్టీకి అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే(mallikarjun kharge) ఉన్నా మళ్లీ ఎలాంటి బాధ్యతలు లేని రాహుల్ గాంధీ(rahul gandhi) తీసుకునే నిర్ణయమే ఫైనల్. అందుకే రేవంత్‌పై(tpcc chief) తిరుగుబాటు చేస్తున్న నేతలపై ఏం చర్యలు తీసుకోవాలో హడావుడిగా రాహుల్‌ను సంప్రదించాల్సి వచ్చింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాలకు ఒక ఇన్‌చార్జి ఉన్నా ఆ పోస్టు ఒక ఉత్సవ విగ్రహంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత ఉన్నా హెల్ప్ లెస్ అయింది. అన్ని వర్గాలనూ పార్టీ ప్రయోజనాల కోసం సమదృష్టితో చూసే విధానం లేకుండా పోయింది. అసమ్మతి, అసంతృప్తి తలెత్తితే సకాలంలో వారితో మాట్లాడి సర్దుబాటు చేసే చొరవ కరువైంది.
నాయకత్వ వైఫల్యం
నాయకత్వంలో ఉన్నవారు వివిధ స్థాయిలలోని లీడర్లను, కేడర్‌ను కలుపుకుపోవడం ఒక బాధ్యత. సోనియాగాంధీ(sonia gandhi), రాహుల్‌గాంధీ ఆ బాధ్యతలలో విఫలమయ్యారనేదానికి నిదర్శనం జి-23 గ్రూపు. ఇప్పుడు తెలంగాణ స్థాయిలో ఒకేసారి పది మంది అసమ్మతి స్వరం వినిపించి తిరుగుబాటు స్థాయికి చేరుకోడానికి పీసీసీ చీఫ్‌గా రేవంత్ బాధ్యత పడాలి. వారి సమస్యలను తెలుసుకుని దానికి తగినట్లుగా వ్యవహరించడం, కన్విన్స్ చేసి విశ్వాసాన్ని చూరగొనడం లీడర్‌గా ఆయనకు అవసరం. 'మా ఇద్దరిదీ తోడికోడళ్ల పంచాయితీ' అంటూ జగ్గారెడ్డిని(jagga reddy) ఉద్దేశించి రేవంత్ కామెంట్ చేశారు. 'ఇది టీకప్పులో తుపాను లాంటిది' అని కూడా లైట్‌గా తీసుకున్నారు. చివరకు అది సంక్షోభానికి దారి తీసింది.
పీసీసీ చీఫ్‌ను, రాష్ట్ర పార్టీ యూనియ్‌ను గైడ్ చేయాల్సిన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్(manikyam tagore) నిర్లక్ష్యం కూడా ఈ సంక్షోభానికి కారణం. అందరినీ సమదృష్టితో చూసి పార్టీ నిర్మాణాన్ని చక్కదిద్దే బాధ్యతల్లో విఫలమయ్యారు. ఒక వర్గానికి మాత్రమే అనుకూలంగా ఉన్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అందుకే పరిష్కారం ఆయన స్థాయిని దాటిపోయింది. ఇప్పుడు తిరుగుబాటు చేసిన 'సీనియర్‌లు' సర్దుకుపోయినా పార్టీ కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తారని భావించలేం. మనుషులు, మనసుల మధ్య గ్యాప్ పెరిగిపోయిన తర్వాత అంతా సర్దుకుపోయిందని భావించలేం. పార్టీలో ఎప్పటికీ సీనియర్‌లే పాతుకుపోవాలని భావించడం పెత్తనానికే దారితీస్తుంది. కొత్త రక్తం కావాలని, యువతకు అవకాశాలు ఇవ్వాలని కోరుకోవడం అవసరం.
కొస మెరుపు
'ఇంట గెలిచి రచ్చ గెలవాలనే' నానుడికి తగినట్లుగా స్వంత పార్టీని చక్కదిద్దుకుంటేనే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పవర్‌లోకి రావడం సాధ్యం. ప్రజలలో విశ్వసనీయత కలిగించలేనప్పుడు అధికార పార్టీపై ఎంత వ్యతిరేకత ఉన్నా దాన్ని అనుకూలంగా మల్చుకోవడం అసాధ్యం. స్వప్రయోజనాల కోసం అధికార పార్టీకి దగ్గర కావడం రాజకీయ నాయకుల సహజ లక్షణం. పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు చేజారినట్లుగా ఇకపైనా వలసలు తప్పవు. ఎక్కడ ప్రయోజనం ఉందనుకుంటే ఆ పార్టీలోకి వెళ్లిపోవడం సహజం. ఇలాంటప్పుడు 'ఒరిజినల్ కాంగ్రెస్.. వలసల కాంగ్రెస్' అనే లాజిక్ అసంబద్ధం. పదవులు, పైరవీలు, పనులు, పైసలు మాత్రమే ఏకైక ప్రయోజనంగా ఉన్నప్పుడు ఈ ఫిలాసఫీకి స్థానం లేదు.
ఎన్. విశ్వనాథ్
99714 82403
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672.
Also Read..