- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ నిధుల వర్షం.. ఇక్కడ 'గాడిదగుడ్డు'
కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు చేసింది. దశాబ్దం తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం ఈ రెండు రాష్ట్రాలకు కలిసి వచ్చింది. ఇందులోనూ బిహార్ నుంచి 17 సీట్లు (జేడీయూ 12, లోక్ జనశక్తి 5), ఆంధ్రప్రదేశ్ నుంచి 18 (టీడీపీ 16, జనసేన 2) సీట్లు కీలకంగా మారాయి. అయితే ఆ రెండు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసినా.. వాటిని సున్నితంగా తిరస్కరించిన కేంద్రం.. బడ్జెట్‌లో మాత్రం నిధుల వర్షం కురిపించింది.
ఏపీలో అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తామని వెల్లడించింది. బిహార్‌లో రోడ్ల అభివృద్ధికి రూ.26 వేల కోట్ల సాయంతో పాటుగా ఎయిర్ పోర్టులు, మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడతామని పేర్కొన్నది. ఇదే సమయంలో తెలంగాణకు ‘గాడిద గుడ్డు’ మాత్రమే వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు పూర్తిస్థాయిలో మద్దతిచ్చి, ప్రాంతీయ పార్టీని పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిరసనలు తెలిపినా..
ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) అధికారంలోకి రాగా, కేంద్రంలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్నది. అయితే రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ రూపొందించిన విభజన చట్టాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్రం పట్టించుకోలేదు. ఫుల్ మెజార్టీ ఉండడం, ఏ పార్టీ మద్దతు అవసరం లేకపోవడంతో ఎవరి డిమాండ్లను నెరవేర్చలేదు. అయితే విభజన చట్టంలోని అంశాలతోపాటు వివిధ డిమాండ్లను సాధించేందుకు మొదటి ఐదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగానే వ్యవహరించింది. అయినా వివక్ష చూపిస్తుండడంతో మరో ఐదేళ్లు ఓపెన్‌గానే నిరసన తెలిపింది. అనేక సమావేశాలను బహిష్కరించింది.
రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో మూడోసారి కూడా మోడీ నేతృత్వంలోని బీజేపీనే అధికారాన్ని చేజిక్కించుకున్నది. దీంతో నిధులు సాధించుకునేందుకు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి.. మోడీని పెద్దన్న అని పిలిచారు. ఢిల్లీ వెళ్లి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిసి వినతులను అందజేశారు. రాష్ట్ర సమస్యలను వారికి అర్థం చేయించారు. అయినా తెలంగాణకు మొండిచేయే లభించింది. దీంతో నీతి ఆయోగ్ మీటింగ్‌ను బహిష్కరించి తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై నిరసన తెలిపింది.
ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ..
దశాబ్ద కాలంగా తెలంగాణకు చెందిన అనేక డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదు. ప్రస్తుత బడ్జెట్‌లోనూ సరైన కేటాయింపులు లేకపోవడంతో.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచే తెలంగాణపై బీజేపీ వివక్ష చూపిస్తున్నదనే అభిప్రాయం సాధారణ ప్రజల్లో నెలకొంటున్నది. అనేక జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించినప్పటికీ.. తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఈ సారి కూడా పట్టించుకోలేదు. విభజన చట్టంలోని హమీలైన బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల గురించి అతీగతీ లేదు. రైల్ కనెక్టివిటీని పెంచే ప్రతిపాదనలు ఇప్పటివరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఐటీఐఆర్ ప్రాజెక్టు, పారిశ్రామిక కారిడార్‌పై స్పందన లేదు. గిరిజన యూనివర్శిటీకి సరిపడా నిధులు కేటాయించలేదు. మూసీ నది ఆధునికీకరణ ప్రాజెక్టుకు నిధులు అందించాలని స్వయంగా సీఎం కోరినా బడ్జెట్‌లో పట్టించుకోలేదు.
ఇలా రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీల ప్రస్తావన ఒక్కటి కూడా లేకపోవడంతో రాష్ట్ర ప్రజలు నైరాశ్యంతో ఉన్నారు. మరోవైపు కేంద్ర పథకాల ద్వారా అన్ని రాష్ట్రాలకు జనాభా నిష్పత్తిలో నిధులను కేటాయించాల్సి ఉంటుంది. కానీ, తెలంగాణకు దాని ప్రకారం నిధులు రావడం లేదని ప్రభుత్వం చెబుతున్నది. 2023-24 బడ్జెట్‌లో అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎస్‌ఎస్) కింద రూ.4.60 లక్షల కోట్లను కేంద్రం విడుదల చేయగా, తెలంగాణకు 1.4% అంటే రూ.6577 కోట్లు మాత్రమే వచ్చాయని రాష్ట్ర ఆర్థిక శాఖ తెలిపింది. లెక్క ప్రకారం 3% అంటే దాదాపు రూ.14 వేల కోట్లు రావాలని చెప్పారు. ప్రతి ఆర్థిక సంవత్సరం నిధులు ఇవ్వడంలో ఇలాంటి అన్యాయమే జరుగుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా..
2014, 2019 పార్లమెంట్ ఎన్నికలకు భిన్నంగా తెలంగాణ ప్రజలు ఈ సారి జాతీయ పార్టీలను పూర్తిస్థాయిలో ఆదరించినా ఎలాంటి లాభం లేకుండా పోయింది. 2014లో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ 11 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ 2, బీజేపీ ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించాయి. అదే 2019లో బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలుపొందాయి. అయితే రెండు సార్లు కూడా కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజార్టీ ఉండడంతో ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం లేకుండా పోయింది. దీంతో రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిచినా... బీఆర్ఎస్ కేంద్రంపై అనుకున్నంత ఒత్తిడి తేలేకపోయింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం తెలంగాణ ప్రజలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లను సమానంగా ఆదరించారు. రెండు పార్టీలకు చెరో 8 స్థానాల్లో గెలిపించారు. ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్‌ను పట్టించుకోలేదు. ఇదే సమయంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. మిత్రపక్షాలు, ప్రాంతీయ పార్టీల మద్దతు అనివార్యమైంది. బీజేపీకి నుంచి ఎనిమిది మంది ఎంపీలు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. నిధులు తేవడంలో విఫలమయ్యారని స్పష్టంగా అర్థమవుతున్నది. తెలంగాణలో బీజేపీకి కాకుండా, గతంలో లాగా బీఆర్ఎస్‌కే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కి ఉంటే.. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా దాని మద్దతు అనివార్యంగా మారి.. డిమాండ్లను నెరవేర్చడంలో కొంతమేరకైనా సక్సెస్ అయ్యే అవకాశముండేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది.
-ఫిరోజ్ ఖాన్,
సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,
96404 66464