నిరుద్యోగం కోరల్లో యువత బలి!

by Ravi |   ( Updated:2024-10-02 00:30:31.0  )
నిరుద్యోగం కోరల్లో యువత బలి!
X

ఈ దేశానికి నిజమైన సంపద యువత. యువశక్తిని కాపాడుకుంటూ.. వారిలో శక్తి నైపుణ్యాలు నింపితే దేశం, సమాజం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోయే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఈ దేశ జనాభాలో అత్యధికంగా సుమారు 40 కోట్లకు పైగా యువతను యువశక్తిగా మలచడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఫలితంగా ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది రోజు రోజుకు అతి భయంకరంగా మారుతోంది.

యువతలో రోజురోజుకు అభద్రత భావం పెరగడం.. నిరుద్యోగ సమస్య ప్రధానంగా కారణమవుతుంది. కారణం ఏదైనా ఈ దేశానికి సంపదోలే ఉండాల్సిన భారత యువ త ఇప్పుడు అభద్రతలో కూరుకుపోయి...ఒత్తిళ్లను తట్టుకోలేక ఎంతో భవిష్యత్తు ఉన్నా జీవితాన్ని బలవంతంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల సమయంలో తప్పా ఈ దేశ రాజకీయాలలో యువత కోసం ఆలోచించే విధానపరమైన నిర్ణయాలు ఎప్పుడూ జరగవు. ఓ రకంగా రాజకీయ నాయకుల అసమర్థత కూడా యువకుల ఆత్మహత్యలకు కారణమనే చెప్పవచ్చు.

రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, కార్పొరేట్ కంపెనీల వల్ల ఎప్పుడు తమ ఉద్యోగాలు ఊడుతాయో తెలియని మానసిక స్థితిలో యువత కొట్టుమిట్టాడుతుంది. యువతలో ఆత్మస్థైర్యం నింపి యువ తను శక్తిగా తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వాలు అంత ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా మానసిక ఒత్తిడి, ఇతర కారణాల వల్ల తనవు చాలిస్తున్నారు. ఈ దేశంలో ప్రతీ సంవత్సరం దాదాపు 7 లక్షల మంది యువత ఆత్మహత్యలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారంటే ఈ దేశంలో రాజకీయ నాయకుల అసమర్థతకు అద్దం పట్టినట్లు స్పష్టం అవుతుంది.

యువత ఆత్మహత్యల దేశంగా భారత్!

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ లెక్కల ప్రకారం ఆత్మహత్యల కేసుల్లో 40 శాతం యువకులే ఉన్నట్లు తేల్చింది. అందులో అధికంగా 30 ఏళ్ల లోపు వారుండడం దురదృష్టకరం. భారతదేశంలో రోజుకు సుమారు 160 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2022 లో దాదాపు కోటి 71 లక్షల మంది యువత దేశవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే ఈ దేశ పాలకులు యువశక్తిని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ప్రమాద స్థితిలో యువత ఉన్నా పాలకులు యువతపై దృష్టి సారిం చడం లేదు. ఈ దేశానికి అసలైన సంపదగా కృషి చేసే విధంగా యువతను శక్తిగా మలిచి భారత్‌ను శక్తివంతంగా తీర్చిదిద్దడంలో ప్రజాప్రతినిధుల అంతులేని నిర్లక్ష్యానికి ఈ మరణాలు సాక్ష్యం. ప్రపంచంతో పోటీ పడుతున్నామని .. అన్ని రంగాల్లో ముందుంటున్నామని చెప్పుకుంటున్న దేశంలో యువ తను కాపాడుకోవడంలో పాలకులు విఫలం అవుతున్నారు.

హరించుకుపోతున్న ఉపాధి!

యువత ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఉపాధి అవకాశాలు లేకపోవడం రోజురోజుకూ నిరుద్యోగం పెరిగిపోవడం కారణం అవుతుంది. ఆధునిక టెక్నాలజీ పేరుతో వస్తు న్న అభివృద్ధిలో కార్పొరేట్ కంపెనీలూ యంత్రాలనే వాడుకోవడం లాంటి సాంకేతికత రావడంతో ప్రైవేటు, కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు దక్కకపోగా ఇటీవల అనేక కార్పొరేట్ కంపెనీలు అక్కడక్కడ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ఇటువంటి అనేక కారణాలతో మానసిక వేదనతో యువత ఆత్మహత్యల వైపు ప్రేరేపితం అవుతున్నారు.

యువత నిర్వీర్యమైపోతే...

బడ్జెట్‌లో ఉన్న అంకెల సంఖ్యలో కొంతైనా యువత కోసం కేటాయించాలి. నిరుద్యోగ యువత కోసం నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఉపాధి చూపే చర్యలు చేపట్టాలి. స్వయం ఉపాధితో బతకడానికి నిరుద్యోగ యువత కోసం షరతులు లేకుండా బ్యాంకులు వడ్డీ లేని రుణాలు ఇచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ యువతకు భృతి పేరిట తాత్కాలిక చర్యలతో యువత జీవితాలు బాగుపడవు. అందుకు ప్రభుత్వాలు యువత కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆదుకోవాలి. ఎన్ని చట్టాలు తెచ్చినా.. మరెన్ని సంస్కరణలు తెచ్చిన యువతను శక్తిగా మలచలేకపోతున్నారు. భారతదేశంలో పరిస్థితులు ఇలానే ఉంటే భవిష్యత్తులో యువశక్తి మరింత నిర్వీ ర్యం అయ్యే పరిస్థితే ఉంటుంది. ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి వారికి భరోసా ఇవ్వాలి. రాజకీయ అవసరాల కోసం కాకుండా... యువతను భావితరాల కోసం ఓ శక్తిగా తీర్చిదిద్దాలి. రాజకీయ రంగంలోనూ యువతకు ప్రాధాన్యం కల్పించాలి.

గడ్డం సంపత్

78933 03516

Advertisement

Next Story

Most Viewed