ఉద్యోగ పర్వం:సెలవులకు నిబంధనలు ఇలా

by Ravi |   ( Updated:2022-09-03 14:42:30.0  )
ఉద్యోగ పర్వం:సెలవులకు నిబంధనలు ఇలా
X

ఇతర దేశాలకు వెళ్లినవారికి సెలవు మంజూరు సందర్భంగా ప్రిఫిక్స్, సఫిక్స్ అనుమతించరాదనే ప్రభుత్వ ఉత్తర్వులే లేవు. కేవలం అజ్ఞానంతోనే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిలో పలువురు డీఈఓలు సైతం ఉండడం మరీ దారుణం. ఎంఈఓలు, హైస్కూల్ హెడ్మాస్టర్లకు అవసరమైన సందర్భాలలో రూల్స్‌పై సూచనలిస్తూ గైడ్ చేయాల్సిన డీఈఓలే తప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తే ఎలా? అయ్యా, ఆఫీసర్లూ! ఒక్కసారి టీఎస్ఎల్ఆర్-12 చదవండి. ఆ రూల్ తొమ్మిది లైన్లు మాత్రమే ఉంది.

ద్యోగులు, ఉపాధ్యాయులకు అర్ధ వేతన సెలవులను (హెచ్‌పీఎల్), ఆర్జిత సెలవులను (ఈఎల్), అసాధారణ జీత నష్టపు సెలవులను (ఈఓఎల్‌ఎల్‌పీ) ఆకస్మికేతర సెలవులను (ఓసీ‌ఎల్) రెండు కారణాలతో మంజూరు చేస్తారు. అందులో మొదటిది వ్యక్తిగత అవసరాల కోసం కాగా, రెండవది మెడికల్ అవసరాల కోసం. ఆకస్మికేతర సెలవులకు ప్రిఫిక్స్, సఫిక్స్ నిబంధన వర్తిస్తుంది. ఉపాధ్యాయులు పని చేసేది వెకేషన్ డిపార్టుమెంటు కాబట్టి, వేసవి సెలవులను కలుపుకొని 180 రోజులు మించకుండా లీవ్ పెట్టిన ఉపాధ్యాయులకు విధిగా లీవ్ మంజూరు చేయాలి. ఈ మేరకు తెలంగాణ స్టేట్ లీవ్ రూల్స్- 1933(టీఎస్ఎల్ఆర్)లోని రూల్-12 చాలా స్పష్టంగా ఉంది.

విద్యాశాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు ఈ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. టీచర్ల పిల్లలు చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ తదితర దేశాలకు యేటా పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. తమ పిల్లలను చూసి రావడానికి మెజారిటీ టీచర్లు వేసవి సెలవులను కలుపుకొని, సమ్మర్‌కి ముందో, తర్వాతో తరచుగా విదేశాలకు వెళ్తున్నారు. విద్యా శాఖ కమిషనర్ వద్ద ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే విదేశాలకు వెళ్లి, నిర్దేశించిన గడువులోగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇలా వేసవి సెలవులను కలుపుకొని విదేశాలకు వెళ్లి, తిరిగి వచ్చిన టీచర్లకు సెలవు మంజూరులో కొంతమంది విద్యాశాఖాధికారులు చుక్కలు చూపిస్తున్నారు.

ప్రిఫిక్స్, సఫిక్స్ అనుమతించాలి

వేసవి సెలవులు కలుపుకొని 180 రోజులకు మించకుండా సెలవు పెట్టిన టీచర్లకు టీఎస్ఎల్ఆర్-12 ప్రకారం వేసవి సెలవులను విధిగా ప్రిఫిక్స్, సఫిక్స్ అనుమతించి మిగతా పీరియడ్‌కి మాత్రమే సెలవు మంజూరు చేయాలి. ఈ వెసులుబాటు లభించాలంటే, సదరు టీచర్లు విద్యా సంవత్సరం ముగింపు రోజు కానీ, పాఠశాలలు పునఃప్రారంభం రోజు కానీ విధులకు హాజరైతే సరిపోతుంది. సమ్మర్ హాలిడేస్ లోనే విదేశాలకు వెళ్లి, హాలిడేస్ పూర్తి కాకముందే స్వదేశానికి తిరిగి వచ్చి, రీ ఓపెనింగ్ నాడు పాఠశాలకు హాజరయ్యే టీచర్లకు లీవ్ మంజూరే అవసరం లేదు. ఇలాంటి టీచర్లు విద్యాశాఖ కమిషనర్ నుంచి జస్ట్ పర్మిషన్ తీసుకుంటే చాలు. ఈ ఏడాది లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 కాగా, రీ ఓపెనింగ్ డే జూన్ 13. ఏప్రిల్ 23 లేదా జూన్ 13 నాడు స్కూలుకి హాజరైన టీచర్లు, వేసవి సెలవులలో ఇండియాలో ఉన్నారా? లేక విదేశాలకు వెళ్లారా? అనే విషయంతో సంబంధం లేకుండా ప్రిఫిక్స్, సఫిక్స్ పర్మిట్ చేయాలి. కానీ, కొందరు అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ టీచర్లను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు.

వేసవి సెలవులకు కూడా లీవ్ మంజూరు చేస్తామని అంటున్నారు. ఆ మేరకు దరఖాస్తు పెట్టుకోవాలని, లేదా వేతనంలో కోత విధిస్తామని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కారణమేంటని అడిగితే, 'సదరు టీచర్ వేసవి సెలవులలో ఇండియాలోనే లేరు. విదేశాలకు వెళ్లి వచ్చినవారికి వేసవి సెలవులను ప్రిఫిక్స్, సఫిక్స్ ఎలా అనుమతిస్తాం? శాలరీ ఎలా చెల్లిస్తాం' అని అడ్డగోలు వాదనకు దిగుతున్నారు. ఇతర దేశాలకు వెళ్లినవారికి సెలవు మంజూరు సందర్భంగా ప్రిఫిక్స్, సఫిక్స్ అనుమతించరాదనే ప్రభుత్వ ఉత్తర్వులే లేవు. కేవలం అజ్ఞానంతోనే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిలో పలువురు డీఈఓలు సైతం ఉండడం మరీ దారుణం. ఎంఈఓలు, హైస్కూల్ హెడ్మాస్టర్లకు అవసరమైన సందర్భాలలో రూల్స్‌పై సూచనలిస్తూ గైడ్ చేయాల్సిన డీఈఓలే తప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తే ఎలా? అయ్యా, ఆఫీసర్లూ! ఒక్కసారి టీఎస్ఎల్ఆర్-12 చదవండి. ఆ రూల్ తొమ్మిది లైన్లు మాత్రమే ఉంది.

క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి

నిబంధనల ప్రకారం వేసవి సెలవులను ప్రిఫిక్స్, సఫిక్స్ అనుమతించకుండా నిరాకరించే అధికారులపై ముందుగా రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులతో పాటు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సైతం బాధిత టీచర్లు ఫిర్యాదు చేయాలి. దీంతో పాటు ఆర్టీఐ ద్వారా సెలవు మంజూరు అధికారికి ఏ ఉత్తర్వుల ప్రాతిపదికగా వేసవి సెలవులను ప్రిఫిక్స్, సఫిక్స్ చేయడం లేదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని లెటర్ పెట్టి సమాచారాన్ని లిఖితపూర్వకంగా తీసుకోవాలి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతిని కూడా ఇవ్వాలని కోరాలి. బాధితులలో మహిళా టీచర్లు ఉన్న పక్షంలో రాష్ట్ర మహిళా కమిషన్‌లో కూడా ఫిర్యాదు చేయాలి.

ఈ ఫిర్యాదులు చేయడానికి ఒక్క పైసా ఖర్చు కాదు. అప్పటికీ న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్లడానికి సైతం వెనకాడొద్దు. ఎవరో ఒకరు తెగించి పూనుకోకపోతే, నిబంధనలు విస్మరించి, ఇష్టారాజ్యంగా వ్యవహరించే అధికారులు మారరు. సెలవుల మంజూరుకు అనుమతించకుండా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, టీచర్లకు అన్యాయం చేస్తున్న విద్యాశాఖ అధికారులపై వచ్చే ఫిర్యాదులపై రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం సత్వరం స్పందించాలి. లీవ్ రూల్స్ లో ప్రభుత్వం పొందుపర్చిన వెసులుబాటు ఇవ్వడానికి నిరాకరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

మానేటి ప్రతాపరెడ్డి

టీఆర్‌టీఎఫ్ గౌరవాధ్యక్షుడు

98484 81028

Advertisement

Next Story