- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆధ్యాత్మిక కేంద్రం.. వ్యాపార సంస్థ కాదు
ప్రపంచంలో ఒక్కొక్క మతానికి ఒక్కో ప్రాంతం విశిష్టతను సంతరించుకున్నాయి. ముస్లింలకు మక్కా, క్రిస్టియన్లకు వాటికన్ సిటీ, హిందువులకు తిరుపతి ప్రసిద్ధి గాంచాయి. గత నాలుగేళ్ల పాలనలో తిరుమల తిరుపతి పవిత్రతను జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. టీటీడీ కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమైనది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రాంతం. టీటీడీ బోర్డును రాజకీయ వ్యాపార కేంద్రంగా మార్చారు.
చట్టప్రకారం టీటీడీ ఛైర్మన్‌తో సహా 29 మంది సభ్యులు మాత్రమే ఉండాలి. కానీ మొత్తం 81 మందితో బోర్డును నింపారు. ఇది చట్టవిరుద్ధమని భావించిన భక్తులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆహ్వానితులుగా ఉన్న 50 మందిని రద్దు చేశారు. తాజాగా లిక్కర్ కేసులో అరెస్టై అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి, వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి అనుచరుడు వెంకటసుబ్బారెడ్డి, బెంగళూరులో ముఖ్యమంత్రి ఇంద్రభవనానికి కాపలా ఉన్న ఆ ప్రాంత ఎమ్మెల్యేతో పాటు గంజాయి స్మగ్లర్లకు, భూబకాసురులకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించారు. జగన్ రెడ్డిపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులు, వివేకానంద రెడ్డి హత్య కేసుల నుంచి బయటపడటానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను, సీబీఐ డైరెక్టర్‌ను ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత పవిత్రమైన టీటీడీ బోర్డును స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేశారు.
చేతికర్రపై సీఎం ఫోటోనా?
తిరుమలకు వచ్చే భక్తులకు సరైన భద్రత కల్పించడంలో టీటీడీ బోర్డు పూర్తిగా విఫలమైంది. క్రూరమృగాల నుంచి రక్షణ కోసం ప్రతి భక్తుడికి ఒక చేతికర్రను ఇచ్చే పథకాన్ని రూపొందించారు. అయితే ఆ కర్రపై జగన్ రెడ్డి ఫోటో పెట్టడమే విచిత్రంగా ఉంది. ఇది శ్రీవారిని అవమానించడం కాదా ఫోటోలు, రంగుల పిచ్చికి ఇది పరాకాష్ట. అయిన దానికి, కాని దానికి ప్రతిదాని నుంచి ప్రచారాన్ని ఆశించడం మన దౌర్భాగ్యం. జగనన్న చేతికర్ర పథకం ప్రజల్లో నవ్వులపాలైంది. చేతికర్ర క్రూరమృగాల నుంచి ఏ మేరకు కాపాడుతుంది భక్తుల రక్షణకు ఇంతకంటే ఉన్నతమైన ఆలోచనలు టీటీడీ బోర్డుకు, ముఖ్యమంత్రికి రాకపోవడం దురదృష్టకరం. అలిపిరి నుంచి కాలినడకన వెళ్తున్న భక్తులపై చిరుత దాడిచేయడం వంటివి జరిగినప్పుడు హడావుడి చేయడం, అరకొర చర్యలు మినహా భక్తుల భద్రతకు పటిష్ట చర్యలు లేవు. అలిపిరి మార్గంలో రోజూ 20వేల మంది భక్తులు వస్తున్నారు. వన్యప్రాణుల సంచారం ఉందని తెలిసినా చర్యలు శూన్యం. తిరుమల తిరుపతి దేవస్థానానికి వేలకోట్ల ఆదాయం వస్తున్నా.. భక్తులకు సరైన రక్షణ ఏర్పాట్లు కల్పించేందుకు మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారు?
శ్రీవాణి ట్రస్ట్ లెక్కలు చెప్పరా?
అనేక వివాదాస్పదమైన నిర్ణయాలతో టీటీడీ ప్రతిష్టను రోజురోజుకూ దిగజారుస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు పలు సేవలు ఉచితంగా అందించేవారు. ఇప్పుడు నిధులు దుబారా చేస్తూ ఆయా పనులను ఏజెన్సీలకు అప్పగించి కోట్లాది రూపాయలు దోచిపెడుతున్నారు. ప్రముఖులను ప్రసన్నం చేసుకోవడానికి వెంకన్న ప్రసాదాన్ని, శేష వస్త్రాలను విచ్చలవిడిగా పంచుతున్నారు. శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చట్టవిరుద్ధం. శ్రీవారి దర్శనానికి ఇప్పటికే వివిధ రకాల టికెట్లు అందుబాటులో ఉండగా.. ట్రస్ట్ పేరుతో దర్శనానికి రూ.10వేలతో ప్రత్యేకంగా ఎందుకు టికెట్ పెట్టాల్సి వచ్చింది? శ్రీవాణి ట్రస్ట్‌పై ఇప్పటివరకు ఎందుకు ఆడిట్ జరగలేదు? ట్రస్ట్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతమంది టికెట్లు కొనుగోలు చేశారో, ఎంత డబ్బు వసూలైందో కూడా లెక్కలు లేవు. కనీసం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు తొలుత రశీదులు కూడా ఇవ్వలేదు. దీనిపై ప్రతిరోజూ ఆరోపణలు వస్తున్నా దేవదాయ శాఖ మంత్రి నుంచి గాని, టీటీడీ చైర్మన్ నుంచి గాని సరైన స్పందన లేదు. దీంతో శ్రీవాణి ట్రస్ట్ నిధులు దారిమళ్లుతున్నాయనే అనుమానం భక్తుల్లో ఉంది. ప్రశ్నించిన వారిపై కేసులు పెడతామని బెదిరిస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. టీటీడీ నిధులను రాజకీయంగా వాడుకుంటూ ఎమ్మెల్యేలకు కోటాగా ఇస్తున్నారు. టీటీడీ భూములు విక్రయించేందుకు కుట్ర పన్నారు. శ్రీవారి ఆలయ అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన నిధులను జగన్ రెడ్డి అవినీతి కోసం దారి మళ్లిస్తున్నారు.
దోపిడీకి మారుపేరుగా తిరుమల
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమైన తిరుమలను భక్తులకు దూరం చేసే చర్యలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. కొండపై అద్దెలు పెంచడం, ఆర్జిత సేవల రుసుము, టోల్, లడ్డు, వాటర్ బాటిల్ ధరలు పెంచి నిలువు దోపిడీ చేస్తున్నారు. లాభాపేక్ష లేకుండా భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాల్సింది పోయి తిరుమల కొండను ఆదాయ వనరుగా మార్చారు. ఆర్టీసీ ఛార్జీలను సైతం పదేపదే పెంచి భక్తులు తిరుమలకు రావాంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. నాలుగేళ్లుగా శ్రీవారి కానుకలకు సరైన లెక్కలు లేవు. పింక్ డైమండ్‌పై దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ పింక్ డైమండ్ ఎవరి జేబులో ఉందో తేల్చాలి కదా! పింక్ డైమండ్ విషయంలో కోర్టులో వేసిన దావాను సైతం ఉపసంహరించుకునే ప్రయత్నం చేశారు. తిరుమలలో అన్యమతస్థుల నియామకం, బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం, తిరుమల కొండపై అన్యమత గుర్తులు, టీటీడీ వెబ్ సైట్‌లో అశ్లీల లింక్‌లు వంటి అనేక ఘటనలు తిరుమల పవిత్రతను దెబ్బతీశాయి. విచ్చలవిడిగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు తిరుమల కొండపై లభ్యమవుతున్నాయి. మంత్రులు, శాసన, పార్లమెంట్ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా వందల మంది అనుచరులను వెంటబెట్టుకుని వచ్చి వారందరికీ ప్రముఖలతో సమానమైన వీఐపీ దర్శనాలు యథేచ్ఛగా చేపిస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు గంటలకొద్దీ క్యూలైన్లలో పడిగాపులు కాస్తూ తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు. మరికొంత మంది వైసీపీ ప్రజాప్రతినిధులు ఏకంగా దర్శనం టికెట్లను అక్రమ మార్గంలో అమ్మకానికి పెడుతున్నారు.
ఇష్టానుసారంగా ఛైర్మన్‌లను నియమిస్తూ..
కోట్లాది మంది పూజించే దేవస్థానంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇప్పటివరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సతీసమేతంగా వెళ్లలేదు. కానీ పట్టువస్త్రాలు సమర్పించినప్పుడు సతీసమేతంగా వెళ్లడం ఆచారం. అన్యమతస్థులు శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం గౌరవించడం లేదు. ఆచారాలను మంటగలుపుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. జగన్ రెడ్డి తన సొంత సామాజికవర్గానికే టీటీడీ ఛైర్మన్ పదవి అప్పజెప్పారు. మొన్నటివరకు స్వయానా బాబాయి ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన కరుణాకర్ రెడ్డికి కట్టబెట్టారు. అయితే కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అని, ఆయన ఇంట్లో జరిగిన వివాహ వేడుకలు క్రిస్టియన్ పద్ధతిలో జరిపించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన రాడికల్ ఉద్యమాల్లో పనిచేశారు. దేవుడి పట్ల, హిందూ మతం పట్ల నమ్మకం లేని వ్యక్తి చైర్మన్ కావడంపై భక్తులు విస్మయానికి గురవుతున్నారు. గత ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి కూడా బైబిల్ చేతపట్టుకుని క్రిస్టియన్ మత ప్రచారానికి, బోధనలకు తరచూ హాజరయ్యేవారు. జగన్ రెడ్డి అన్ని సంప్రదాయాలను తుంగలో తొక్కి తన ఇష్టానుసారంగా ఛైర్మన్ లను నియమిస్తున్నారు. అలాగే టీటీడీ బోర్డు కార్వనిర్వహణ అధికారిగా సీనియర్ ఐఏఎస్‌ను నియమించాల్సి ఉండగా.. ధర్మారెడ్డికి ఎలా బాధ్యతలు అప్పగిస్తారు? ఈవో ధర్మారెడ్డి ఢిల్లీ, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ప్రముఖులను ప్రసన్నం చేసుకోవడానికి, రాజకీయ పైరవీలు చేయడానికి జగన్ రెడ్డి తరపున ఏజెంట్‌గా పనిచేస్తున్నారనేే విమర్శలు వస్తున్నాయి.
దేవస్థానం పవిత్రత కాపాడాలి!
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏ మతాన్ని ఆచరించినా, ఏ దేవుడిని పూజించినా హిందూ మత సంప్రదాయాలను కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అర్హత ఉన్న వ్యక్తులను టీటీడీ ఈవోగా, చైర్మన్‌గా నియమించాలి. సినిమా టికెట్ల ధరల పెంపు విషయంలో పేదవారికి అందుబాటులో ఉండాలని చెప్పిన ముఖ్యమంత్రి... మరి కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుమలలో ధరల భారం లేకుండా చూడాలి కదా? లాభాపేక్ష లేకుండా భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలి. టీటీడీ వ్యాపార సంస్థ కాదు.. అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. అందుకు తగినట్లుగా దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. శ్రీవాణి నిధులు, భక్తులు ఇస్తున్న కానుకలను పారదర్శకంగా ప్రజల ముందు ఉంచాలి. సరైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి భక్తుల్లో ఉన్న భయాన్ని తొలగించాలి. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ వీఐపీలను నియంత్రించాలి. వెంకన్నపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి.
మన్నవ సుబ్బారావు
గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్
99497 77727