ఇంకెన్నాళ్ళు ఈ లీకేజీలు!

by Ravi |   ( Updated:2023-04-21 00:00:36.0  )
ఇంకెన్నాళ్ళు ఈ లీకేజీలు!
X

ఉమ్మడి రాష్ట్రంలో అంధకారమైన మా బ్రతుకుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొత్త ఆశలను చిగురింపజేసింది. స్వరాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ మా జీవితాల్లో కొత్త ఆశ దివ్వెలను వెలిగించింది. ఈ నోటిఫికేషన్లు కష్టాల్లో ఉన్న మా నిరుద్యోగులకు కొత్తదారిని చూపుతాయని కల కన్నాను. ఈ నోటిఫికేషన్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగినయి నా ఆశయాల్ని సాకారం చేసుకొందామనుకున్నాను. అందుకే నా తల్లిదండ్రులు కోచింగ్ ఇప్పించే స్థోమత లేకున్నా అప్పులు తెచ్చి మరీ నన్ను కోచింగ్ సెంటర్‌లో చేరిపించారు. అందుకే వారి ఆశలను అడియాశలు చేయకూడదని నిశ్చయించుకొని బాగా చదివి వాళ్ళకు కష్టాలు దూరం చేద్దామనుకున్నాను. అందుకే ప్రణాళిక ప్రకారం గంపెడు ఆశలతో ప్రిపేర్ అవుతున్న నాకు గాలివాన లాంటి పేపర్ లీకేజీతో నా ఆశ దివ్వెలు ఆరిపోయాయి. ఆశయాలు కుప్పకూలిపోయాయి.

‘ధనం మూలం ఇదం జగత్’ అనే మాట నిజమే! డబ్బు మనిషిని ఎంత దారుణానికైనా ఒడిగట్టిస్తుంది. పైసల కోసం కొన్ని లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను అమ్ముకున్నాడు ఒక డబ్బు పిశాచి. చావో, ఉద్యోగమో అనుకున్న నాలాంటి ఎంతో మంది ఆశల మీద నిప్పులు కురిపించాడు ఆ పిశాచి. డబ్బులకు లోబడి నిరుద్యోగులను నిండా ముంచాడా నీచుడు. చేసే ఉద్యోగం మీద గౌరవం లేకుండా మాపై దయ చూపకుండా ఎంతటి దారుణానికి ఒడికట్టావు దుర్మార్గుడా! డబ్బు కోసం మళ్ళీ మా బతుకులను చీకటిలోకి తీసుకెళ్ళావు కదరా! ఇలాంటి పేపర్ లీకేజీలు ఇంకెన్నాళ్ళు? నిరుద్యోగుల జీవితాలు మారేది ఇంకెప్పుడు? ప్రభుత్వాలెన్ని మారినా, సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా, ఇంకా పేపర్ లీకేజీ వంటి సమస్యలకు నిరుద్యోగులు బలవుతున్నారు. లీకేజీ కారకులను అడ్డుకునేది ఇంకెప్పుడు?

పేపర్ లీకైనందుకు రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు మాటలతో తిట్టుకోవడం కాదు, నిరుద్యోగుల జీవితాల గురించి ఆలోచించి ఆ సమస్యను పరిష్కరించే పరిష్కార మార్గాలు సూచించండి. ఉద్యోగం వస్తే మేము ఒక్కరమే బాగుపడం. మా కుటుంబాలు బాగుపడతాయి. ఇది కోపం కాదు మా ఆవేదన. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసే మా తల్లిదండ్రుల కష్టం, మా కష్టం బూడిదలో పోసిన పన్నీరు చేశారు. అందుకే నా బాధ హద్దులు దాటుతోంది. ఈ పేపర్ లీకేజీకి కారణమైన వారిని శిక్షించి, నాలాంటి నిరుద్యోగులకు మేలు చేయండి. ఇలా మా ఆశయాలకు, గమ్యాలకు అడ్డంకులు రాకుండా మళ్ళీ మా జీవితాల్లోకి పేపర్ లీకేజీ వంటివి వెలుగు చూడకుండా చూడాలని కన్నీటితో ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాను.

మట్ట అర్చన

నిరుద్యోగి

Advertisement

Next Story

Most Viewed