ట్రంపే, ఆమెకు ప్లస్ పాయింట్!

by Ravi |   ( Updated:2024-08-25 00:45:29.0  )
ట్రంపే, ఆమెకు ప్లస్ పాయింట్!
X

నల్ల జాతి కలువగా అమెరికన్లను ఆకట్టుకున్న కమలా హారిస్ అందరూ ఊహించినట్లుగానే గురువారం డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వానికి అధికారికంగా నామినేషన్ స్వీకరించారు. దీంతో ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌తో నవంబర్ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తలపడబోతున్నారు.

ఇకపై హోరాహోరీ ..

కమల హారిస్ తన ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై దూకుడు పెంచారు. ట్రంప్ అధికారంలోకి వస్తే అమెరికాకు జరిగే నష్టాలను ఒక్కొక్కటిగా వివరి స్తూ అమెరికన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ అధికారంలోకి వస్తే దేశం లో సంపన్నులకు, కుబేరులకే మేలు జరుగుతుందని వివరిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే 21వ శతాబ్ది విజేతగా అమెరికాను తీర్చే దిద్దుతానని, చైనాకు ఎంత మాత్రం ఆ అవకాశం ఇవ్వనని ఆమె అమెరికన్లకు గట్టి హామీ ఇచ్చారు. వలస విధానాన్ని సంస్కరిస్తానని, ఉక్రెయిన్‌తో సహా నాటో దేశాలకు అండగా ఉంటానని భరోసానిచ్చిన ఆమె ఆయా దేశాల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బైడెన్ పథకాలను కొనసాగిస్తూ, శ్రామిక కుటుంబాలకు కోసం పనిచేస్తానని, కనీస వేతనాలు పెంచడమే తన ముందున్న కర్తవ్యమని ఆమె స్పష్టంగా వివరించారు. అదే సమయంలో ట్రంప్, కమల హారిస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే అమెరికా సర్వనాశనం అవుతుందని ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఆమె రాడికల్ లెఫ్ట్ భావాలున్న కాండిడేట్ అంటూ దుయ్యబడుతున్నారు. కమ ల చేపట్టే ఆర్థిక ప్రణాళికలు కమ్యూనిజానికి దారి తీసే ప్రణాళికలంటూ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. దేశ ప్రజలు ఒకవేళ కమల హారిస్‌ను పొరపాటున గెలిపిస్తే, తాను దేశాన్ని విడిచి వెనిజులాలో స్థిరపడతానని ఆయన హాట్ హాట్ కామెంట్లు చేస్తున్నారు.

ఈ పోరులో శ్వేతసౌధం ఎవరిది ?

మొదట్లో జో బైడెన్ అధ్యక్ష బరిలో ఉన్న సమయంలో ఆయన బలహీనతలను అస్త్రాలుగా మలుచుకొని అధ్యక్ష ఎన్నికల్లో అలవోకగా వి యం సాధించాలని కలలు కన్న డోనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా బైడెన్ నిష్క్రమించి ఆయన స్థానంలో కమల ఎంట్రీ ఇవ్వడంతో ట్రంప్‌‌లో ఓటమి దిగులు స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. అందుకే ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, పరుష పదజాలంతో ఆయన అమెరికన్లకు దూరమవుతున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఆయనకున్న నోటి దూలే కమలకు మరింత ప్లస్ పాయింట్‌గా మారుతుందన్న వారు లేకపోలేదు. విమర్శలు ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. డోనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య జరుగుతున్న ఎన్నికల పోరు అమెరికన్ చరిత్రలోనే అత్యంత కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా శ్వేత సౌధం ఎవరి సొంతమో, తేలాలంటే నవంబర్ రెండవ వారం వరకు వేచి చూడాల్సిందే!

సట్ల మురళీకృష్ణ

94411 74565

Advertisement

Next Story

Most Viewed