అభివృద్ధికి మూలం అక్షరాస్యతే..

by Vinod kumar |   ( Updated:2023-09-07 23:30:34.0  )
అభివృద్ధికి మూలం అక్షరాస్యతే..
X

ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో యునెస్కో ఆధ్వర్యంలో 1965 సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచ దేశాల విద్యాశాఖామంత్రులు ఇరాన్ లోని టెహ్రాన్ లో సమావేశమై, ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం ' జరపాలని నిర్ణయించారు.‌ 1966 నుంచి సెప్టెంబర్ 8వ తేదీన అక్షరాస్యత దినోత్సవం జరుపుకుంటున్నారు. సమాజం అభివృద్ధి సాధించాలంటే, శిశు మరణాలు అరికట్టేందుకు, జనాభా నియంత్రణకు, లింగ వివక్షత నిర్మూలనకు, బాల్యవివాహాలు అరికట్టేందుకు అక్షరాస్యత ఎంతో అవసరం.‌ దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని దేశాలు, రాష్ట్రాలు విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి.‌ విద్యపై గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ ప్రకారం ప్రతీ 5గురు పురుషుల్లో ఒకరు నిరక్షరాస్యడుగా, మహిళల్లో మూడొంతుల్లో రెండు వంతులు నిరక్షరాస్యులుగా ఉన్నారు అని తెలిపింది. దక్షిణ మరియు పశ్చిమ ఆసియా దేశాల్లో 57.6% శాతం అతి తక్కువ అక్షరాస్యత కలిగి ఉండుట గమనార్హం. ఇక కొన్ని ఆఫ్రికా దేశాలు బుర్కినా ఫాలో, మాలి, నైజర్, ఖతార్ వంటి దేశాలు అక్షరాస్యతలో అట్టడుగున ఉన్నాయి. ఇక ప్రక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మహిళలు, బాలికలు చదువుపై ఉక్కు పాదం మోపుతూ ఎంతో అనాగరికంగా ప్రవర్తించే తీరు పట్ల ఐక్యరాజ్యసమితి తోపాటు ప్రపంచ దేశాలు అన్నీ విస్తుపోతున్నాయి.‌

ఇక మనదేశానికి స్వాతంత్ర్య వచ్చే సమయానికి కేవలం 12%శాతం అక్షరాస్యత కలిగి ఉంది. 76 సంవత్సరాల మన పాలనలో సగటు అక్షరాస్యత 74% శాతం వరకు చేరింది. తెలంగాణలో 72.8% శాతం, ఆంధ్రప్రదేశ్ లో 66.4% శాతం అక్షరాస్యత కలిగి ఉంది.‌ దేశంలోనే వంద శాతం అక్షరాస్యత (97.2 శాతం) సాధించిన రాష్ట్రం కేరళ.‌ బీహార్ అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఉంది.‌ దేశంలోనే విద్యకు ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు చేస్తున్న రాష్ట్రం ఢిల్లీ ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం విద్య కొరకు 1.12 లక్షలు కోట్లు కేటాయించారు. ఇవి మనదేశ జనాభాకు అనుగుణంగా లేని కేటాయింపులు. కొఠారి కమిషన్ నివేదిక ప్రకారం మనదేశ జి.డి.పిలో కనీసం 6% శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలి. కానీ నేటికీ 2.9% శాతం నిధులే కేటాయించడం బాధాకరం... అంతేకాకుండా విద్యా రంగంలో ప్రైవేటీకరణ, కాషాయూకరణ చేస్తోంది. దేశంలో గొప్పగా చెప్పుకునే విశ్వవిద్యాలయాల్లో, యన్.ఐ.టిలల్లో, ప్రతిష్టాత్మకమైన వివిధ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు. టీచింగ్ స్టాఫ్ అంతంత మాత్రమే. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌కు బడ్జెట్లో కోతలు విధిస్తున్నారు. ప్రజాస్వామ్యం, లౌకిక సామ్యవాద వంటి అంశాలను పాఠ్యాంశాలు తొలగిస్తున్నారు. మతపరమైన అంశాలను చొప్పిస్తూ భవిష్యత్తు తరాల వారికి సంకుచిత భావాలు నూరిపోస్తున్నారు..

ప్రపంచంలోనే అత్యధిక నిధులు విద్యారంగానికి కేటాయిస్తున్న దేశాలు నార్వే, చిలీ.. ఈ దేశాలు వారి జిడిపి లో సుమారు 6.6% శాతం విద్య కోసం వెచ్చిస్తున్నారు.‌ న్యూజిలాండ్ 6.2%, బ్రిటన్ 6.1%, అమెరికా 6% వారి వారి జిడిపి నుంచి కేటాయిస్తూ విద్యా రంగాన్ని బలోపేతం చేస్తున్నారు. అందుచేతనే మానవ అభివృద్ధి సూచిక లో మనకంటే అనేక రెట్లు మెరుగ్గా ఉన్నారు. యూ.పి.ఏ హయాంలో సాక్షర భారత్ పేరుతో వయోజన విద్యాభివృద్ధికి కృషి చేశారు.‌ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నవభారత సాక్షరత పేరుతో వయోజన విద్యాభివృద్ధికి కృషి చేస్తుంది. అయినప్పటికీ 1.1 కోట్ల మంది బాలికలు చదువుకు దూరంగా ఉన్నారు. పైగా సంతకాలు పెట్టే వయోజనులే అధిక సంఖ్యలో ఉన్నారు అని నివేదికలు చెబుతున్నాయి.. చాలా బాధాకరమైన విషయం.

ఇక మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజ్యాంగం ప్రకారం అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో రాధాకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేయగా ఉన్నత విద్యను ప్రమోట్ చేయాలి అని తెలిపారు. దీంతో అనేక కళాశాలలు, యూనివర్సిటీలు, ఐ.ఐ.టి వంటివి అందుబాటులోకి వచ్చాయి. తరువాత మొదలియార్ కమిటీ సాంకేతిక విద్యను ప్రోత్సహించాలి అని తెలిపింది. దీంతో ఐ.టి.ఐలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ వంటి చదువులు అందుబాటులోకి రావడంతో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ఇక ముఖ్యంగా 1966 సంవత్సరంలో ఏర్పాటు చేసిన కొఠారి కమిషన్ భారత్ దేశంలో విద్యాభివృద్ధికి చక్కని సూచనలు చేశారు. అయితే వాటిలో కొన్ని నేటికీ అమల్లోకి రాకపోవడంతో నిరక్షరాస్యత వెంటాడుతూనే ఉంది.‌ ఇక 1986లో రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ద్వారా ఆపరేషన్ బ్లాక్ బోర్డు పేరుతో పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇక తాజాగా 2020లో యన్.ఈ.పి మాతృభాషలో ప్రాథమిక విద్యను బోధించాలి వంటి కొన్ని విషయాలు మినహా, మొత్తం విద్యా రంగాన్నే తిరోగామ పథంలో నడిపేందుకు ప్రోత్సాహించటం ఆందోళన కలిగిస్తోంది. ఈ కమిటీలు అన్నీ దాదాపు నియత విద్య ముఖ్యంగా 5 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల యువతను అక్షరాస్యులుగా చేయడానికి ఉపయోగపడింది.

ఇక అనియత విద్య కోసం అనగా 15 సంవత్సరాలు వయస్సు దాటిన వారిని అక్షరాస్యులుగా చేయడానికి 1952లో సోషల్ ఎడ్యుకేషన్ అనే స్కీం, తదుపరి 1962లో ఫార్మర్స్ ఫంక్షనల్ లిటరసీ ప్రోగ్రాం అని, 1974లో నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ,1978లో నేషనల్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం, 1988లో నేషనల్ లిటరసీ మిషన్ వంటి ద్వారా 15-35 సంవత్సరాల మధ్య ఉన్న వారిని సుమారు 80 మిలియన్ల మందిని అక్షరాస్యులుగా చేసిరి.‌ ఇటువంటి పథకాలు ద్వారా సుమారు 150 మిలియన్ల మందిని అక్షరాస్యులుగా చేసినట్లు సమాచారం. మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్షరాస్యత పెంచడానికి తీసుకున్న వివిధ కార్యక్రమాలు ద్వారా 1951లో 18.33% శాతం ఉన్న అక్షరాస్యత శాతం 1961నాటికి 28.3%, తదుపరి 1971 నాటికి 34.45, 1981 నాటికి 43.57శాతం, 1991 నాటికి 52.21శాతం, 2001 నాటికి 64.83శాతం, 2018 నాటికి 74.4% శాతం పెరిగింది. ఇక తాజాగా 2022 నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా గణాంకాలు ప్రకారం ప్రస్తుతం దేశ అక్షరాస్యత 77.7% గా ఉన్నది. యునెస్కో తాజా అంచనాల ప్రకారం భారత్ 2060 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుంది అని తెలిపారు. 1950లో దేశంలో ప్రతీ 10 మందిలో కేవలం 2 ఇద్దరు మాత్రమే అక్షరాస్యులుగా ఉండగా, ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ద్వారా నేడు ప్రతీ 10 మందిలో కేవలం 2 మాత్రమే నిరక్షరాస్యులుగా ఉన్నారు అని తెలుపుట ఆహ్వానించదగ్గ పరిణామం... ఇన్ని కమిషన్లు, కమిటీలు, పథకాలు అమలు చేస్తున్నా నేటికీ ప్రపంచంలో 25% శాతం నిరక్షరాస్యులు మనదేశంలోనే ఉండటం బాధాకరం.. యునెస్కో లెక్కల ప్రకారం నేటికీ ప్రపంచంలో 771 మిలియన్ల మందికి కనీసం చదవటం రాయటం రాదు అని తెలిపింది.

దీనికి ముఖ్యకారణం, మనదేశంలో నేటికీ పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ ఉండుట వలన ఆడపిల్లల చదువుకు ప్రాధాన్యత ఇచ్చుట లేదు. అందుచేతనే లింగ వివక్షత, బాల్యవివాహాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అతి త్వరలో భారత్ దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందిస్తాం అని చెబుతున్న పాలకులు విద్యా రంగాన్ని విస్మరించడం శోచనీయం. సరికదా నూతన విద్యా విధానం (యన్ఈ పి-2020) ద్వారా అసంబద్ధాలు పెంచే విధానాలు ప్రవేశపెట్టారు.‌ తెలంగాణా రాష్ట్రంలో పాఠశాలలో మౌలిక సదుపాయాలు పెంచడానికి, ఖాళీ పోస్టుల భర్తీకి ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు.‌ ఇవి కూడా నాణ్యమైన చదువు అందించడానికి సరిపోవు. ఉపాధ్యాయలపై ఒత్తిడి పెంచరాదు. బోధనేతర పనులు తగ్గించాలి.‌ ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో గత నాలుగు సంవత్సరాలుగా నాడు - నేడు పేరుతో చాలా మట్టుకు మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. కానీ మెర్జింగ్ పేరుతో, 117 జీవో ద్వారా ప్రాధమిక విద్యను కూకటివేళ్లతో పెకలించారు.‌ దీనికి తోడు, తెలుగు మీడియం దాదాపు కనుమరుగు చేసారు.‌ ఇంగ్లీష్ మీడియం మోజు తగ్గించుకోవాలి. కనీసం ప్రాథమిక విద్య వరకు మాతృభాషలో బోధించే విధానం అమలు చేయాలి.‌ ఇటువంటి పరిస్థితుల్లో అందరికీ చదువు అందని ద్రాక్ష వలే ఉంటుంది... ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్య పట్ల సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల అనేక మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ పెరుగుతుంది.‌ విద్యను వ్యాపారం చేసే పనిలో పడ్డారు. ఇకనైనా ప్రభుత్వాలు విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.‌ బడ్జెట్లో నిధులు పెంచాలి.

చదువుకున్న యువతలో చాలామంది ఇక్కడ సరైన సదుపాయాలు, ఆదరణ లేక మేధోవలస రూపంలో ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు.‌ కనీసం ఉద్యోగ ఉపాధ్యాయులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేక పోతున్నారు. ఇటీవల జయప్రదంగా చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా మనం దేశం, మనం ఎంతో ఆనందంగా , గర్వంగా చెప్పుకునే సమయంలోనే, ఆనోటా ఈనోటా కొన్ని సంస్థల్లో కొంతమందికి జీతాలు సక్రమంగా అందుటలేదు అనే మాట వింటుంటే ఎంత బాధాకరం... ఇలా ఉంటే, భవిష్యత్తులో అనేక అద్భుతాలు ఎలా సాధించగలం..! ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగానికి అధిక నిధులు సమకూర్చాలి.‌ అదనపు తరగతి గదులు నిర్మించాలి. ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. బాలికలు, మహిళలకు భద్రత రక్షణ కల్పించాలి.‌ బడుగు బలహీన వర్గాల వారికి నాణ్యమైన చదువు అందించే ఏర్పాటు చేయాలి.‌ గిరిజనుల, మైనారిటీ వర్గాలకు మేలు చేయాలి.‌ నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేయాలి.‌

ముఖ్యంగా మనదేశంలో ఉన్న సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతల నిర్మూలనకు అక్షరాస్యతే ఆయుధం అని గ్రహించాలి. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి ఫూలే, అంబేద్కర్ వంటి మహనీయులు చదువుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినారో... అంతకంటే ఎక్కువగా నేటి పాలకులు విద్యా రంగం అభివృద్ధికి కృషి చేయాలి. అప్పుడు మాత్రమే నెల్సన్ మండేలా చెప్పినట్లు ప్రపంచంలో అనేక అద్భుతాలు సృష్టించడానికి, విద్యే ఒక పవర్ ఫుల్ ఆయుధం అవుతుంది అని గ్రహించాలి. కుటుంబ హోదా, దేశం యొక్క హోదా పెరగటానికి అక్షరాస్యతే కొలబద్ద అనే భావన మరువరాదు.. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే అక్షరాస్యత అనే పునాది మీదే ఆధారపడి ఉంటుంది అనే వాస్తవాన్ని గ్రహించాలి.

(నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం)

ఐ. ప్రసాదరావు

63056 82733

Advertisement

Next Story