ఈ సంఘర్షణ ఏ తీరానికి !?

by Ravi |   ( Updated:2022-09-03 17:03:30.0  )
ఈ సంఘర్షణ ఏ తీరానికి !?
X

దేశంలో సారవంత భూములు, కష్టపడే రైతులు, ప్రజా ప్రభుత్వాలు ఉండి కూడా అసంఖ్యాక రైతులు ఎందుకు అధోగతి పాలవుతున్నారు. రైతుల సమస్యలు క్షుణ్ణంగా తెలిసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకున్నారు. రాష్ట్రాన్ని స్వయం పోషకంగా నిలబెట్టాలన్న ఆలోచన చేశారు. తగిన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వ్యవసాయ రంగంపై జాతీయస్థాయి చర్చ జరిగేలా చేశారు. ప్రభుత్వానికి రూ.3500 కోట్ల నష్టం వచ్చినా రైతు పండించిన ప్రతి గింజ కొనేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దార్శనికత ప్రదర్శించారు.

సంఘర్షణ నిర్వహణ అనేది ఒక ఉద్దేశ్యపూర్వక ప్రక్రియ. దాని లక్ష్యం నాయకుల డైనమిక్స్, పార్టీ ఆబ్జెక్టివ్స్‌పై ఆధారపడి ఉంటుంది. రైతు సౌభాగ్యమే తమ ధ్యేయమంటూ ప్రతిపక్షాలు జోలపాటలతో రైతులను మభ్యపెడుతున్నాయి. ఎన్నికల ముందర కొత్త నాటకానికి తెరలేపుతున్నాయి. అధికారం వచ్చాక రైతులను బిచ్చగాళ్లుగా చేస్తున్నాయి. 2014లో రైతుల ఎజెండాగా ఢిల్లీ పీఠం ఎక్కిన బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తెచ్చి రైతుల నడ్డి విరిచింది. రైతుల పక్షాన నిలవాల్సిన కాంగ్రెస్ మొక్కుబడిగా వ్యతిరేకిస్తూ ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం అయ్యింది. ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టడంలో విఫలం అయ్యింది.

ఇప్పుడు వరంగల్ రైతు సంఘర్షణ వేదికగా కొత్త భాష్యాన్ని ఆవిష్కరించడం జాలి ఒలకబోయడంలాంటిదే. ప్రతిపక్ష పార్టీలు వారు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో రైతుల సంక్షేమం కోసం తగు చర్యలు చేపట్టడంలో కాఠిన్యం ప్రదర్శిస్తున్నాయి కదా? 75 సంవత్సరాల కాలంలో ఆ పార్టీ ప్రసంగాలు తప్ప ఏమీ చేయలేకపోయింది. స్వాతంత్ర్యం సిద్దించినప్పటి నుంచి సింహభాగం కేంద్రంలో అధికారంలో ఉండి ఆర్థికాభివృద్ధి ఎగసిపడుతున్నదని గొప్పలు చెప్పుకుని కూడా వ్యవసాయాభివృద్ధి కోసం చర్యలు చేపట్టలేదు. రైతును రాజుగా చేసిన కేసీఆర్‌పై నీళ్లు నమలడం ఎందుకు? వారు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో రెండు లక్షలు రుణ‌మాఫీ చేయకుండా, రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా, గిట్టుబాటు ధర కల్పించకుండా హామీలు ఇవ్వడం దేనికి సంకేతం?

పరిస్థితులను పరిశీలించాలి

రాష్ట్రంలోని రైతు సమాజంలో గిట్టుబాటు ధర లేకపోతేనో, రైతులను అప్పులపాలు జేస్తేనో కాంగ్రెస్ రైతు సంఘర్షణ కు అర్థం ఉండేది. రైతులలో అగాథం సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే రైతు సంఘర్షణకు పిలుపు నిచ్చింది కాంగ్రెస్. దానికి ఇప్పుడు జవసత్వాలు లేవు. పార్టీ అంతర్యుద్ధాల నుండి అధిగమించాలంటే రైతు సంఘర్షణలాంటి మార్గాలను ఎంచుకోక తప్పలేదు. వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్ శ్రేణులకు మాత్రం ఫుల్ జోష్ నింపింది. 'తెలంగాణ మేము ఇచ్చాం అని, మేము పోరాటం చేస్తే వచ్చిందని' మాటలు తిరిగి వినిపిస్తున్నాయి. భిన్నాభిప్రాయాలు గల పార్టీల మ‌ధ్య విమర్శల యుద్ధం మొదలైంది. చాలా వైరుధ్యాలు సమస్యాత్మక ప్రాంతాలలో అననుకూల సంబంధాల నుంచి ఉత్పన్నమవుతాయి. వారి నాయకత్వ బలాన్ని ఉపయోగించడానికి మార్గదర్శనం చేస్తాయి. రైతు సంఘర్షణ వేదికగా రాష్ట్రంలో లబ్ధి పొందాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తామని డిక్లరేషన్ ఇచ్చినంత మాత్రాన నమ్మడానికి ఇది అమేథీ కాదు. జన్ పథ్ అసలే కాదు. చైతన్యానికి నిలువెత్తు సాక్ష్యం తెలంగాణ జనపథం.

అక్కడ ఈ పథకాలెందుకు లేవు?

దేశంలో సారవంత భూములు, కష్టపడే రైతులు, ప్రజా ప్రభుత్వాలు ఉండి కూడా అసంఖ్యాక రైతులు ఎందుకు అధోగతి పాలవుతున్నారు. రైతుల సమస్యలు క్షుణ్ణంగా తెలిసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షోభంలో కూరుకుపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకున్నారు. రాష్ట్రాన్ని స్వయం పోషకంగా నిలబెట్టాలన్న ఆలోచన చేశారు. తగిన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వ్యవసాయ రంగంపై జాతీయస్థాయి చర్చ జరిగేలా చేశారు. ప్రభుత్వానికి రూ.3500 కోట్ల నష్టం వచ్చినా రైతు పండించిన ప్రతి గింజ కొనేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దార్శనికత ప్రదర్శించారు. అన్నదాతకు అండగా నిలిచారు.

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు వారు పాలిస్తున్న రాష్ట్రంలో ఎందుకు లేవు? 60 ఏండ్లు పాలించినపుడు లేని రైతు సమస్యలు ఈ ఎనిమిది సంవత్సరాలలో కనిపించాయా ? కాంగ్రెస్ రైతు సంఘర్షణ దేనికి సంకేతం? సాగునీరు అందించక, బోరు బావులలో నీరు లేక, చాలీచాలని కరెంట్‌తో మోటార్లు కాలిపోయి రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోయే విధంగా చేసినందుకా? వ్యవసాయం గిట్టుబాటు కాక భూములను కౌలుకిచ్చి వలసలు పోయేందుకు కారకులెవరు? కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సహకాల ముందు ఈ సంఘర్షణ దిగదుడుపే

ఆ ప్రభావం ఉంటుందా?

టీఆర్‌ఎస్ నాలుగున్నర సంవత్సరాల పాలన రెఫరెండంగా 2018 ఎన్నికలకు వెళితే ప్రజలు 88 సీట్లతో బంపర్ మెజారిటీ ఇచ్చారు. ఖంగుతిన్న కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీకి 'రాంరాం' అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు స్పష్టంగా కనపడుతుంది. 'ఎవరికి వారే, యమునా తీరే' అన్నట్లు పార్టీ నాయకత్వం వ్యవహరిస్తుంది. నేతల మధ్య సమన్వయం కొరవడింది. తెలంగాణ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగడం కోసం రైతులపై కపట ప్రేమ చూపుతోంది. అధికార పక్షంపై ఈ సంఘర్షణ ప్రభావం ఏమాత్రం పని చేయ‌దు. కేసీఆర్ ప్రభుత్వం రైతును రాజుగా చేస్తున్న తరుణంలో సంఘర్షణ పేరుతో తెలంగాణ రైతాంగంపై మొసలి కన్నీరు కార్చితే పార్టీకి మేలు జరిగే అవకాశం లేదు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో రాహుల్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని తీవ్ర ప్రమాదంలో పడేసిందనడం సమంజసం కాదు.

డా. సంగని మల్లేశ్వర్

జర్నలిజం విభాగాధిపతి

కేయూ, వరంగల్

98662 55355

Advertisement

Next Story