ఆద్యంతం థ్రిల్లింగ్‌...శేషాచలం ట్రెక్కింగ్..!

by Ravi |   ( Updated:2023-02-17 19:15:41.0  )
ఆద్యంతం థ్రిల్లింగ్‌...శేషాచలం ట్రెక్కింగ్..!
X

అమెరికా, యూరప్‌ దేశాల్లోని వారికి వారాంతంలో ట్రెక్కింగ్‌ ఒక వ్యాపకం. మన దేశంలో ట్రెక్కింగ్‌ మతంతో ముడిపడిపోయింది. ఏడాది కొకసారి యాత్రలకు వెళ్ళడం, కొండల పైనున్న కోవెలలో దేవుణ్ణి దర్శించడం తరతరాలుగా వస్తున్న అలవాటు, ఆచారం. భక్తి రూపేణా అయినా కొండలెక్కడానికి వెనుకాడం. కొండలెక్కడాన్ని మతంనుంచి విడదీయండి. ఎంత మహాద్భుతంగా ఉంటుందో చూడండి! మతం వ్యక్తిగతం. అది గతానికి చెందినది. వర్తమానంలో జీవిద్దాం రండి... ప్రకృతి నిసర్గ సౌందర్యానందాన్ని ఆస్వాదించాలంటే అడవిలో తిరుగాడుదాం. కొండలెక్కుదాం, లోయల్లోకి దిగుదాం, నీటి గుండాల్లోకి దూకుదాం, ఈదులాడుదాం, అడవి తల్లి కనురెప్పల నీడల్లో సేదదీరుదాం రండి... అడవిలోకి వెళ్ళడమంటే జీవ వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం. వైవిధ్యాన్ని గౌరవించడం. వైవిధ్యమైన సమాజంలో బతకడానికి మనని మనం సిద్ధం చేసుకోవడం. బద్దకాన్ని వదిలించేయడం. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పొందడం. కొండల్లో నడక ఎంత కష్టమో... ఆ కష్టాల్ని ఇష్టంగా ఎదుర్కోవడం. ఆరోగ్యమైన ప్రాణవాయువును పీల్చుకోవడం. ఆనందంతో తాండవమాడటం... నగరాలకు, నాగరికతకు అలవాటు పడి మన మూలాలను మర్చిపోతున్నాం. మన మూలాలు అడవిలోనే ఉన్నాయి. కొండల్లోనే ఉన్నాయి. అప్పుడప్పుడూ వాటిని దర్శించడంలో ఒక అనిర్వచనీయ ఆనందాన్ని పొందుతాం.

ట్రెక్కింగ్‌ అంటే..! సన్నగా ప్రవహించే సెలయేటి సంగీతాన్ని ఆస్వాదించడం, ఎత్తైన కొండలపై నుంచి జాలువారే జలపాతపు హోరును వినడం, లోయల్లోకి దిగడం, లోతైన నీటి గుండాలలోకి దూకడం...

ట్రెక్కింగ్‌ అంటే..! చీలిన రాతి కొండల్లోని సౌందర్యాన్ని దర్శించడం, చెట్లు, పుట్టలు, పిట్టలను పలకరించడం, వెన్నెల్లో నిద్రించడం, అడవి మల్లెల గుబాళింపును, అడవి తల్లి సౌందర్యానందపు సుగంధాన్ని ఆస్వాదించడం...

ట్రెక్కింగ్‌ అంటే..! శరీర దారుఢ్యాన్ని, మానసిక ధైర్యాన్ని పెంచుకోవడం, సమూహంలో కలిసి ప్రయాణించడం, అనంతమైన ప్రకృతి ముందు మోకరిల్లడం, దానిలో సంగమించడం.

ట్రెక్కింగ్‌ అంటే..!

కేవలం హిమాలయాలకు వెళ్ళడమో, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమో, అమర్నాథ్ యాత్ర చేయడమోకాదు. ట్రెక్కింగ్‌ అంటే మన చుట్టూ ఉండే కొండ కోనలను తిరుగుతూ, వాటి ఆనుపానులను తెలుసుకోవడం. వాటి సౌందర్యానందంలో మునిగి తేలడం. చిన్నప్పుడు మన అమ్మమ్మ గారింటికో, నాన్నమ్మ గారింటికో వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా గడిపే వాళ్ళమో! ఎంత అల్లరి చేసేవాళ్ళమో! ఎంత మారాం చేసేవాళ్ళమో! ఇప్పుడా బాల్యాన్ని తలుచుకుంటే ఎలా ఉంటుంది! అడవికి వెళ్ళితే సరిగ్గా ఇప్పుడు కూడా అదే అనుభూతి పొందుతాం. నగరాలకు, నాగరికతకు అలవాటు పడి మన మూలాలను మర్చిపోతున్నాం. మన మూలాలు అడవిలోనే ఉన్నాయి. కొండల్లోనే ఉన్నాయి. అప్పుడప్పుడూ వాటిని దర్శించడంలో ఒక అనిర్వచనీయ ఆనందాన్ని పొందుతాం.

జీవితంలో ట్రెక్కింగ్‌ ఒక భాగమై పోవాలి. మనని మనం తాజాగా ఉంచుకోవడం కోసం అడవికి వెళుతూ ఉండాలి. ఊపిరితిత్తుల నిండా స్వచ్చమైన ప్రాణవాయువును పీల్చుకోవాలి. వారానికొక్క రోజైనా, నెలకొక్క రోజైనా అడవి తల్లి ఒడిలో సేద తీరాలి. అమెరికా, యూరప్‌ దేశాల్లోని వారికి వారాంతంలో ట్రెక్కింగ్‌ ఒక వ్యాపకం. మన దేశంలో ట్రెక్కింగ్‌ మతంతో ముడిపడిపోయింది. ఏడాది కొకసారి యాత్రలకు వెళ్ళడం, కొండల పైనున్న కోవెలలో దేవుణ్ణి దర్శించడం తరతరాలుగా వస్తున్న అలవాటు, ఆచారం. భక్తి రూపేణా అయినా కొండలెక్కడానికి వెనుకాడం. కొండ లెక్కడాన్ని మతం నుంచి విడదీయండి. ఎంత మహాద్భుతంగా ఉంటుందో చూడండి! మతం వ్యక్తిగతం. అది గతానికి చెందినది. వర్తమానంలో జీవిద్దాం రండి.

ఇరవై ఆరేళ్ళ క్రితం శేషాచలం కొండలలో ట్రైక్కింగ్‌ మొదలు పెట్టాను. నా వయసిప్పుడు 67 సంవత్సరాలు. ట్రెక్కింగ్‌కు వయసు అడ్డం కాదు. వయసు కేవలం అంకె మాత్రమే. గడిచిన నా బాల్యపు రోజుల్లో వనపర్తిలో కూడా అప్పుడప్పుడూ కొండలు ఎక్కిదిగేవాళ్ళం. ఆ అలవాటు పెద్దయ్యాక కూడా నన్ను వదలలేదు. తిరుమల అనగానే శ్రీవారి ఆలయం, స్వామి వారి దర్శనం, దాని కోసం ఘాట్‌ రోడ్డు ప్రయాణం గుర్తు కొస్తాయి. ఘాట్‌ రోడ్డులో ప్రయాణించేటప్పుడు కనిపించే అడవి, మెలికలు తిరిగే తారు రోడ్డు, ఆ కొండల రూపాలు, లోతైన లోయలు మనల్ని కట్టిపడేస్తాయి. రోజూ వేలాది మంది తిరుమలకు వస్తున్నారంటే ఆ ప్రకృతి అందాలు వారిని ఎంతగా ఆకర్షిస్తున్నాయో!

మళ్ళీ మళ్ళీ రారమ్మని పిలుస్తున్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు వంటి మెట్ల గురించి ఇక చెప్పనవసరం లేదు. భక్తులను అవి ఎంతగా ఆకట్టుకుంటోయో! తిరుమలలో నెలకొన్న శేషాచలం కొండలంటే ఇంతేనా! శేషాచలం కొండలలోపలికెళితే, ఎన్నెన్నో తీర్థాలు, మరెన్నో జలపాతాలు, ఇంకెన్నో లోతైన లోయలు, రాతి కొండల రూపాలు, ప్రకృతి విశ్వరూపాలు! శేషాచలం కొండలు ఒక అందాల అక్షయ పాత్ర. చూసినకొద్దీ చూడాల్సినవెన్నో, ఈ కొండలు తిరిగిన కొద్దీ తరగని గని. తూర్పు కనుమల్లో భాగంగా శేషాచలం కొండలు అలరారుతున్నాయి. ఈ శేషాచలం కొండలు పడమరన తలకోన నుంచి, తూర్పున ఏర్పేడు వరకు విహంగ వీక్షణంలో ఇరవై కిలో మీటర్లు విస్తరించాయి. దక్షిణాన తిరుపతి నుంచి, ఉత్తరాన కోడూరు వరకు పరుచుకున్నాయి.

ఈ శేషాచలం కొండల్లో అనేకానేక తీర్థాలు ఉన్నాయి. దేని రూపం దానిది, దేని అందం దానిది, దేని ప్రత్యేకత దానిది. ఒక దానికొకటి పోలికే లేదు. రాళ్ళలో సహజ శిలా సౌందర్యం ఉంది. ఆ మౌన శిలలు మనతో మాట్లాడుతున్నట్టే ఉంటాయి. ఆ మౌనానికి మనమే భాషను కనుక్కోవాలి, లిపినీ కనుక్కోవాలి. మనమే వాటితో మాట్లాడాలి. వాటి ఊసులను మనమే రాసుకోవాలి. నలుగురికీ వినిపించాలి. చెట్లు పలకరించినట్టుంటాయి. గాలి వీచినప్పుడు రెల్లు పొదలు ఆనందంతో తలలూపుతాయి. ఈదురు గాలులు వీస్తే మహావృక్షాలు తల విరబోసుకుని నవ్వినట్టుంటాయి.

రెండుచెట్లు పెనవేసుకుంటాయి. వాటికి జాతి వివక్షలేదు. మన లాగా వాటికి కులం లేదు, మతం లేదు, వర్ణ వివక్ష అసలే లేదు. అన్నీ సహజీవనం చేస్తుంటాయి. కొన్ని ఆకాశానికి ఎగబాకుతుంటాయి. కొన్ని నేలపైనే పాకుతుంటాయి. ఒక చెట్టును ఆసరా చేసుకుని మరొక చెట్టు పైకి పెరుగుతుంటుంది. ఆ అవకాశం ఇచ్చిన చెట్టుకు అభ్యంతరం ఉండదు. దేని శక్తి దానిది, దేని మనుగడ దానిది. దేని ఆయుష్షు దానిది. ఆయువు తీరగానే అడవి తల్లి ఒడిలోనే శాశ్వతంగా కనుమూస్తాయి. ఈ లోకంలోకి రావడం ఎంత సహజమో, నిష్క్రమించడమూ అంతే సహజం. ఈ ప్రకృతి సూత్రం చెట్లకు, పక్షులకు తెలిసినట్టుగా మనకు తెలియదు గాక తెలియదు.

ఆ అడవిలోనే జంతువులు తిరుగాడుతుంటాయి, దేని గుంపు దానిది. ప్రతి జంతువు భద్రత ఆ గుంపు సమిష్టి బాధ్యత. వాటిలో ఎంత సమిష్టి తత్వమో! సమిష్టిగా లేకపోతే మనుగడ సాగించలేవు. మనలా ఒంటరిగా బతకలేవు. సమూహంలో ఉండి ఒంటరిగా ఆలోచించలేవు. అవి సమూహంలోనే ఉండి సమూహంగానే ఆలోచిస్తాయి. చెట్లపైన పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి. వాటి ముక్కెంత! దాని బలమెంత! దాని నైపుణ్యమెంత! ఆ ముక్కుతోనే పుల్ల పుల్ల ఏరి గూళ్ళు కట్టుకుని, గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతాయి. ఆకాశంలో స్వేచ్చగా విహరిస్తాయి. ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి. ఆకాశం నుంచే అడవి అందాలను వీక్షిస్తాయి. సూర్య కిరణాల మేలుకొలుపులు, మేఘాల పలకరింపులు, వీస్తున్న చల్లని గాలుల తాకిడితో అడివంతా పులకరింపులు.

ఈ సౌందర్యానందాన్ని ఆస్వాదించాలంటే అడవిలో తిరుగాడుదాం. కొండలెక్కుదాం, లోయల్లోకి దిగుదాం, నీటి గుండాల్లోకి దూకుదాం, ఈదులాడుదాం, అడవి తల్లి కనురెప్పల నీడల్లో సేదదీరుదాం రండి. అడవిలోకి వెళ్ళడమంటే జీవ వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం. వైవిద్యాన్ని గౌరవించడం. వైవిధ్యమైన సమాజంలో బతకడానికి మనని మనం సిద్ధం చేసుకోవడం. బద్దకాన్ని వదిలించేయడం. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పొందడం. కొండల్లో నడక ఎంత కష్టమో, కష్టాల్ని ఇష్టంగా ఎదుర్కోవడం. ఆరోగ్యమైన ప్రాణవాయువును పీల్చుకోవడం. ఆనందంతో తాండవమాడడం.

రాఘవ శర్మ

తిరుమల దృశ్యకావ్యం రచయిత

94932 26180

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story