తెలంగాణలో మూడు రాజధానులు.. దేశ రెండో రాజధానిగా భాగ్యనగరం..

by Sumithra |   ( Updated:2023-04-15 19:00:14.0  )
తెలంగాణలో మూడు రాజధానులు.. దేశ రెండో రాజధానిగా భాగ్యనగరం..
X

ఒక రాష్ట్రం – మూడు రాజధానులు. ఒక దేశం రెండు రాజధానులు, ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క నగరం రాజధానిగా ఉండాలన్న అలోచనలు నేడు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఒక రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రస్తావన ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశంలోని మరి కొన్ని రాష్ట్రాల్లో కూడ ఉంది, ముఖ్యంగా దశాబ్దాలుగా ఉత్తరాఖండ్‌లో మూడు ముక్కలాటగా రాజధానుల సమస్య దోబూచులాడుతున్నది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్‌‌పై కేంద్రం ప్రత్యేక శ్రద్ధను పెట్టినట్లు, దేశ రెండో రాజధాని చేయడం కోసం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబోతున్నారన్న వార్తలు అప్పుడప్పుడు గుప్పుమంటున్నాయి, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ఏర్పాటు చేస్తూ....అభివృద్ధి వికేంద్రీకరణ వైపుగా రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు అనివ్యారమని ఉద్యమకారులతో పాటు మేధావి వర్గం ఆలోచనలు చేస్తున్నది.

రెండో రాజధాని కాబోతుందా ?

నేడు కాకపోయినా భవిష్యత్తులోనైనా సరే... హైదరాబాద్ మహా నగరం దేశ రెండో రాజధాని లేదా కేంద్రపాలిత ప్రాంతం కావడం ఖాయమని విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ప్రాంతాలను కలుపుకొని రెండో రాజధానిగా చేసినట్లయితే, అది దేశానికీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందనీ, ఇందుకు ఎంఐఎం, సెటిలర్స్‌తో పాటు, నార్త్ నుంచి వచ్చి స్థిరపడిన ప్రజల నుండి భారీ మద్దతు ఉంటున్నదని భావిస్తున్నారు. హైదరాబాద్, దాని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల నుంచే 60 శాతానికి పైగా రాష్ట్ర ఖజానాకు అదాయం వస్తున్న నేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి, రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తిరుపతి లోకసభ మాజీ ఎంపీ గతంలో అన్నమాటలు కొట్టిపారేయలేం. కొత్త ఆర్ఆర్ఆర్ రహదారి అనుమతుల వెనుక మతలబు ఇదేనని ఇంకొందరి అనుమానం. ఇలా కేంద్రపాలిత ప్రాంతం చేస్తే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ త్రీవ్రంగా దెబ్బతినే పరిస్థితులు వస్తాయనీ, అందుకనే కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండా, దేశ రెండో రాజధానిగా కొనసాగిస్తే, ఎవ్వరికీ ఇబ్బంది ఉండకుండా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు,

లెజిస్లేటివ్ రాజధానిగా.. వరంగల్ మహానగరం..

తెలంగాణలో వరంగల్ జిల్లాలోని వరంగల్ - హన్మకొండ - కాజీపేట పట్టణాల సమాహారమే వరంగల్ మహానగరం.. తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరంగా ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ఉత్తర దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది. 1163లో స్థాపితమైన కాకతీయ సామ్రాజ్యానికి వరంగల్ (ఓరుగల్లు) రాజధానిగా ఉండేది. కాకతీయులు నిర్మించిన స్మారక కట్టడాల్లో కోటలు, సరస్సులు, దేవాలయాలు, రాతి ద్వారాలు ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా విరాజిల్లుతున్నాయి. తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా కూడా వరంగల్‌కు స్థానం కల్పించారు.. దీనివల్ల పక్కనున్న వెనుకబడిన జిల్లాలు, గిరిజన ప్రాంతాలు చాలవరకు అభివృద్ధి పొందే అవకాశం ఎక్కువ.


ఎగ్జిక్యూటివ్ రాజధానిగా... హైదరాబాద్..

నాలుగు వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సుసంపన్న నగరం.. దేశంలో టాప్ ఐదు నగరాల్లో భాగ్యనగరి ఒకటి. ఐటీ, ఫార్మాస్యూటికల్, పారిశ్రామిక రంగాల్లో దూసుకెళుతున్న మహానగరమిది. తెలంగాణకు మణిహారం. స్వాతంత్ర్యం రాక పూర్వమే సకల సౌకర్యాలను తనలో చేర్చుకున్న భాగ్య నగరం. అసెంబ్లీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు, ఎయిర్‌పోర్టు, కంటోన్మెంటు, అతిథి గృహాలు, డ్రైనేజి వ్యవస్థ, ఉచిత మంచినీటి సరఫరా వ్యవస్థ, డబుల్ డెక్కర్ బస్సులు, డీజిల్ రైలు, రవాణా వ్యవస్థ, రేడియో స్టేషన్, ప్రత్యేక కరెన్సీ వ్యవస్థ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, అధిక రెవెన్యూ రాబడి, అత్యధిక శాతం జీడీపీ .. ఇలా సంపన్నంగా విలసిల్లితున్న మహా నగరానికి దేశ రాజధాని కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఆనాడే బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పడం అందరికీ తెలిసిన విషయమే కదా!


జ్యుడీషియల్ రాజధానిగా... అదిలాబాద్

మూడవది అదిలాబాద్ జ్యుడీషియల్ క్యాపిటల్‌గా.... నిజం చెప్పాలంటే అదిలాబాద్ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో న్యాయశాఖ కార్యాలయాలు ఉండటంవల్ల ఆ ప్రాంత పరిసరాల్లో కొంతవరకైనా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణా రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా, నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆదిలాబాద్, హైదరాబాద్‌కు 304 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. కనీసం జుడిషియల్ రాజధానిగా... అదిలాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తే... చుట్టుపక్కల జిల్లాలు, వెనకబడ్డ ప్రాంతాలు కూడా అభివృద్ధికీ నోచుకునే భాగ్యం కలుగుతుంది.


ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయా?

ఆర్థిక శాస్త్రం ప్రకారం కొనుగోలు శక్తి పెరగాలంటే ఆర్థికాభివృద్ధి ఖచ్చితంగా పెరగాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరుగకుండా అసలైన ఆర్థికాభివృద్ధి జరుగదు, అన్నిప్రాంతాలు సమాన స్థాయిలో ఆర్థికాభివృద్ధి జరుగుతున్నప్పుడే, అన్ని వర్గాల ప్రజల కొనుగోలుశక్తి బాగా పెరుగుతుంది. ఫలితంగా వాణిజ్యం పెరిగి, ఆదాయం కూడ పెరిగే అవకాశాలు కచ్ఛితంగా ఉంటాయి. తక్కువ ప్రయత్నం తో ఎక్కువ ప్రయోజనం పొందటం ఆర్థికశాస్త్ర అతి ముఖ్య సిద్ధాంతం. స్వల్ప కాలంలోనే ఆర్థికాభివృద్ధి సాధించాల్సిన అవసరముందని, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికల రచన అంత ప్రయోజనం కాదని కీన్స్‌ అనే ఆర్థిక శాస్త్రవేత్త ఎన్నడో చెప్పారు. సాంస్కృతిక పరంగా, చారిత్రక పరంగా, వాణిజ్య పరంగా, ఆర్థిక పరంగా అనుకూలం ఉంటేనే భవిష్యత్తులో సమాన అభివృద్ధి సాధించి, అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి బాటలోకి వస్తాయి. ఫలితంగా జీడీపీ కూడా త్వరగా పెరిగి రుణభారం నుండి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందనీ కొందరి ఆర్థిక విశ్లేషకుల భావన!

ఉపాధి - అసమానతలకు చెక్ !

మూడు రాజధాని నగరాలు ఏర్పడితే అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందే అవకాశాలు కచ్ఛితంగా పెరుగుతాయి. వివిధ నగరాల్లో పని పంపిణీ స్థాయి పెరగటం, స్థానికులకు మరింత ఉపాధితో పాటు, అధిక ఉత్పాదకతను అందించడంలో సహాయపడుతుంది. పట్టణీకరణ దృక్కోణం నుండి, భారీ జనాభా కలిగిన మహా నగరాల కంటే మంచి ఆర్థిక వ్యవస్థలు కలిగిన మధ్య స్థాయి నగరాలు- పట్టణాలను అభివృద్ధి చేయడం భవిష్యత్తులో ఏనాటికైనా ఉత్తమమైన పద్దతి. అన్ని ప్రాంతాలలో అభివృద్ధితో పాటు ఆ ప్రాంత మత, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విలువలు గౌరవించబడతాయి. దేశంలో ఇప్పటికే విభిన్న ప్రాంతాల మధ్య తీవ్రమైన అసమానతలు తారతమ్యాలు, అభివృద్ధిలో తేడాలు ప్రజలను విభేదాల వైపు నడిపిస్తున్నాయి, కొన్ని ప్రాంతాలే అభివృద్ధిలో ఇతర ప్రాంతాలకు అందనంత దూరంలో ఎదగడం, మరికొన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేక ఆమడ దూరంలో ఉండటం చాల దురదృష్టకరం, సమాన నిష్పత్తిలో అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రాంతాల వికేంద్రీకరణ, ఆర్థిక వికేంద్రీకరణ, ఉద్యోగాల కల్పన స్థాయి వికేంద్రీకరణల తోనే తెలంగాణలో సైతం మూడు రాజధానుల ఏర్పాటే సముచిత పరిష్కారం కావొచ్చనీ మెజారిటీ ప్రజల అభిప్రాయం సుమా!


డాక్టర్. బి. కేశవులు నేత. ఎండీ.

చైర్మన్ తెలంగాణ మేధావుల సంఘం.

85010 61659

Advertisement

Next Story

Most Viewed