బాడీ షేమింగ్.. అమానవీయం!

by Ravi |   ( Updated:2023-08-10 00:15:22.0  )
బాడీ షేమింగ్.. అమానవీయం!
X

క వ్యక్తి శారీరక ఆకృతి లేదా లక్షణాలను బట్టి అమానవీయ, అవమానకర, అసహ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని ‘బాడీ షేమింగ్‌’ అంటాం. ఇటీవలే భార్య అందంగా లేదని ఓ భర్త పెట్టిన వేధింపులతో అమాయక అబల ఆత్మహత్య చేసుకుంది. తన భార్య బాగా అందంగా ఉందని, వివాహేతర సంబంధం కలిగి ఉండవచ్చనే అనుమానంతో భార్యనే హత్య చేశాడో అనాగరిక మానవ మృగం. బాడీ షేమింగ్‌ దురాచారం పురుషులకు తక్కువగా, మహిళలకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకరి శారీరక అవలక్షణం మరొకరి సంతోషానికి కారణం కారాదు. ఇలాంటి శారీరక వికారం కలిగిన వారిని జోకర్లుగా చూపించడం నేటి సినిమాలు, టీవీ షోల్లో సాధారణం కావడం విచారకరం.

శారీరక మార్పులని తెలుసుకొండి!

లావుగా ఉన్నోడిని ‘బండోడని, దున్నపోతని, పందిలా ఉన్నావని’, సన్నగా ఉన్నోడిని ‘బక్కోడని పుల్లారావ్’‌ అని, కంటి రంగును బట్టి ‘పిల్లి కండ్లోడ’ని, దేహకండరాల్ని బట్టి ‘లావు తొడలోడని’ నేటి అసభ్య సమాజం తరుచుగా ఎగతాళి మాటల తూటాలు విసురుతూనే ఉంటున్నది. అమ్మాయి స్లిమ్‌గా ఉంటే ‘కత్తి’లా ఉందని, చర్మం నలుపుగా ఉంటే ‘కర్రోడ’ని, తెల్లగా ఉంటే ‘ఎర్రోడని’, దంత అమరికలో ‘ఎత్తు పళ్లోడని’, కురుచగా ఉన్నోళ్లను ‘పొట్టోడని’, ఆరడుగులు ఉన్నోళ్లని ‘పొడుగోడని’ అనేక అవమానకర దుర్భాషలను విసిరే ప్రబుద్ధులు మన మధ్యనే ఉన్నారు. అయితే ఆకారంపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అమానవీయమని సమాజం గుర్తించాలి. ఇవన్నీ సహజంగా వచ్చిన శారీరక మార్పులు మాత్రమే. శరీర ఆకారాన్ని బట్టి కూడా పుట్టుకతోనే నలుపు చర్మం రావడం, పొట్టిగా ఉండడం, అంగవైకల్యం, బట్టతల లాంటివి వస్తాయని తెలుసుకోవాలి. ప్రత్యేక వస్త్రధారణపైన పోకిరి సమాజం మాటల ముళ్లతో గుండెల్లో గునపాలు దించుతూనే ఉంటుంది.

అలాగే మనుషుల శారీరక ఆకృతి పట్ల, ప్రత్యే వస్త్రధారణపై అసహ్యకరంగా ‘ట్రోలింగ్‌’ చేయడం అనేది దురాచారం. ఇది నేటి ఆధునిక సామాజిక మాద్యమాల్లో సర్వసాధారణమైంది. ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు సదరు వ్యక్తుల మానసిక స్థితిపై దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. నేడు జబర్ధస్తుగా అంద వికారమే ఆధారంగా నవ్వుల షోల ఎపిసోడ్లు మనకు తాత్కాలిక ఆనందాన్ని కలిగించి ఉండవచ్చు. బూతుకు, కామెడీకి వ్యత్యాసం చెరిగిపోవచ్చు. మన సమాజం సన్నగా, తెల్లగా, అందంగా ఉన్న వారినే ఆరాధిస్తున్నది. ఇలాంటి వారే సమాజంలో ప్రముఖులుగా, సినిమాల్లో హీరోలు, హీరోయిన్లుగా పూజించబడి అసంఖ్యాక అభిమానులను కలిగి ఉంటున్నారు. శారీరక కొలతలను సిక్స్ ప్యాక్‌, జీరో సైజ్‌లంటూ సమాజం ప్రమాణీకరించింది కూడా. శారీరక ఆకృతిలో తేడాలున్న వారిని ‘అంద వికారులంటూ’ ముద్ర వేస్తూ, నేటి సమాజంలో అమానవీయ, ఆక్షేపణీయ మాటల తూటాలు విసిరే దురాచారం వేగంగా విస్తరిస్తున్నట్లు కనబడుతున్నది.

బాడీ షేమింగ్‌ దుష్ప్రభావాలు

బాడీ షేమింగ్‌కి గురైన ఆయా వ్యక్తులు మానసికంగా గాయపడడం, కుంగిపోవడం, ఏకాగ్రత కోల్పోవడం, ఆందోళన చెందడం, నిరాశకు గురి కావడం, ఇబ్బంది పడటం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, తన మీద తనకు కోపం రావడం, పది మందిలో నిలువక ఒంటరిగా ఉండి పోవడం, బెదిరింపులను లోను కావడం, ఆవేశంగా ప్రవర్తించడం, ఈటింగ్‌ డిసార్డర్స్‌, సెల్ఫ్- ఇంజురీకి పాల్పడడం, వ్యక్తిత్వం తిరోగమన దిశలో మారడం, నిరుత్సాహపడడం, మానసిక రుగ్మతలకు లోను కావడం, సమాజంలోకి వెళ్లడానికి భయపడడం, భావోద్వేగ ఒత్తిడికి లోను కావడం జరుగుతుంది. ఇలా షేమింగ్ చేసేవారు నాగరికంగా కనిపించే మేక వన్నె గుంట నక్కలు. శరీర ఆకృతితో పాటు ధరించే దుస్తులను బట్టి కూడా నెగెటివ్‌ కామెంట్స్‌ వింటుంటాం. బాడీ షేమింగ్‌లో వ్యక్తిలోని శరీర అమరికను ఇతరులతో పోల్చి హేళన చేయడం, వ్యక్తి ముందే నెగెటివ్‌ కామెంట్స్‌ చేయడంతో శారీరక ఆకారం సరిగా లేని యువతులు, వాటిని వదులుకోవడానికి పలు ఖరీదైన ప్రమాదకరమైన కాస్మటిక్స్‌, బ్యూటీ పార్లర్లు, సర్జరీలు, చికిత్సలు చేయించుకోవడానికి కూడా వెనుకబడడం లేదు. అధిక బరువు ఉన్నవారు ఈ షేమింగ్‌కి భయపడి 65 శాతం మంది బరువు తగ్గించుకోవడానికి అతిగా ఖర్చులు చేస్తున్నారు. బాలికల్లో 33 శాతం, బాలల్లో 25 శాతం మంది బరువు ఆధారిత అవహేళనాలకు గురి అవుతున్నారు. లావుగా ఉన్న వారిని 84 శాతం మంది సహ విద్యార్థులు హేళన చేయడం జరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల ప్రజలు బాడీ షేమింగ్‌ ఫలితంగా ఈటింగ్‌ డిసార్డర్‌ వలలో చిక్కుతున్నారు. ఈ బాడీ షేమింగ్‌ అసహ్యకర వ్యాఖ్యలు వ్యక్తి మనసును ఛిద్రం చేస్తాయి.

శరీర ఆకృతి దైవప్రసాదం

శారీరక ఆకృతి మన చేతిలో ఉండదు. ఇది పుట్టుకతోనే దేవుడు ప్రసాదించినదని నమ్ముతాం. చర్మ రంగు, ఎత్తు, జట్టు, కళ్లు, లావు లాంటివి జన్మతహ సంక్రమించవచ్చు. సాధారణ జీవనశైలి కలిగిన వారు కూడా సహజంగా లావుగా కనిపిస్తారు. ఇలాంటి వ్యక్తులు బాడీ షేమింగ్‌ను తీవ్రంగా తీసుకోకుండా మానసికంగా ధృఢంగా ఉండే ప్రయత్నం చేయాలి. మనం పట్టించుకొని భయపడినంత కాలం పోకిరీలు హేళన చేస్తూనే ఉంటారు. మనం ప్రతిస్పందించని వేళ, ఎదురు తిరిగి చెప్పు చేత పట్టిన వేళ, అల్లరి మూకలు తోక ముడుస్తారు. మానసిక సౌందర్యంతోనే శారీరక వికారాన్ని జయించాలి. నల్లగా, లావుగా, పొట్టిగా ఉన్న వారెందరో ప్రపంచ ఖ్యాతిని పొందడం మనం చూశాం.

మన శరీరాన్ని మనమే ప్రేమించుకోవడం ప్రారంభించాలి. బాడీ షేమింగ్‌ను పట్టించుకోకుండా తమ తమ వృత్తుల పట్ల దృష్టి కేంద్రీకరించాలి. మన మనసును మన నియంత్రణలో ఉంచుకుంటూ, ఆశావహ జీవనశైలిని అలవర్చుకుంటూ, ఆనందంగా ఉండేందుకు కృషి చేయాలి. ఇలా షేమింగ్ చేస్తే మనిషి కుంగిపోయి ఆత్మహత్యల వరకు దారితీయడం దారుణం. ఇలాంటి అభ్యంతరకరమైన దురాచారానికి సమాజం దూరంగా ఉండాలి. మనిషిని మనిషిగా చూడగలగాలి. శరీర ఆకృతిని బట్టి ఎగతాళి చేయడం, అసహ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని నేరంగా భావించాలి. స్పష్టమైన శిక్షలు ఉండేలా చట్టంలో మార్పులు తేవాలి. మనిషిలో మానవత్వపు పరిమళాలు గుబాళించాలి. ఇకనైన అభ్యంతరకర వ్యాఖ్యలకు తిలోదకాలిచ్చి, మానవీతను ప్రదర్శిద్దాం. మనుషులంతా ఒక్కటే అని నినదిద్దాం. బాహ్య సౌందర్యానికి బదులు అంతర్‌ సౌందర్యానికి పట్టం కడదాం.

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

99497 00037

Advertisement

Next Story