సత్యాన్ని సమాధి చేయలేరు

by Ravi |   ( Updated:2023-09-27 11:29:59.0  )
సత్యాన్ని సమాధి చేయలేరు
X

నిజాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి మాత్రమే ఉంది. అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేసి న్యాయాన్ని తాత్కాలికంగా శిక్షించినా అంతిమంగా గెలిచేది ధర్మమే. సత్యాన్ని సమాధి చేయలేరు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు, తప్పిదాలకు ఆయా శాఖల మంత్రులు, ముఖ్యమంత్రే బాధ్యత వహించాలా, లేక అఖిల భారత సర్వీసు అధికారులు బాధ్యత వహించాలా? రాష్ట్ర సీఐడీ భావిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాధ్యుడైతే.. గత నాలుగున్నర సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలకు ఎవరు బాధ్యులు?

ఇప్పటివరకు 427 కేసులలో సుమారు వందమంది అధికారులను కోర్టు బోనుల్లో దోషులుగా ఎందుకు నిలబెట్టారు? ఆయా శాఖల్లో జరిగిన నిర్ణయాలకు ఒక్క మంత్రిని కూడా ఎందుకు బాధ్యులుగా చేయలేదు? అలా జరిగితే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి మంత్రి, ముఖ్యమంత్రి కోర్టు ముందు దోషులుగా నిలబడాలి. జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న తుగ్లక్ నిర్ణయాల వల్ల వేలకోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు మాత్రమే కోర్టుకు హాజరవుతున్నారు. వారినే శిక్షిస్తున్నారు. చట్టాలు చేయడానికి ఇచ్చే సలహాల నుంచి వాటి అమలు వరకు అధికారులకు విస్తృత అధికారాలు ఉంటాయి.

ఈ తప్పులకి బాధ్యులు ఎవరు?

వైసీపీ ప్రభుత్వ హయాంలో 8 మంది సీనియర్ ఐఏఎస్‌లకు హైకోర్టు రెండు వారాలు జైలుశిక్ష విధించడం మనం చూశాం. పాఠశాల ప్రాంగణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం జరగకుండా చూడాలని ఆదేశించినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వ భవనాలకు రంగులు వేసిన అధికారులను మాత్రమే శిక్షించారు. మంత్రిని ఎందుకు వదిలేశారు? కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. సంబంధిత శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఎందుకు బాధ్యులుగా చేయలేదు? కర్నూలు జిల్లాలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా తనను ఎంపిక చేయకపోవాన్ని సవాల్ చేస్తూ సుందర్ గౌడ్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో అందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టు ఆదేశించిన పాటించని కారణంగా ముగ్గురు ఐఏఎస్ లు వీరపాండియన్, అరుణ్ కుమార్, పూనం మాలకొండయ్యలకు నెల రోజులు జైలు శిక్ష విధించారు. కానీ సంబంధిత శాఖ మంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు?

వెబ్ ల్యాండ్‌లో అక్రమాలపై 11 మంది తహశీల్దార్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు 38 మంది రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకున్నారు. కానీ రెవెన్యూ శాఖ మంత్రిపై ఎలాంటి చర్యలు లేవు. వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌లపై 70 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. సరైన స్ఫూర్తితో కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడం వల్ల వారు కోర్టు ముందు హాజరుకావాల్సిన పరిస్థితి. వీరితో పాటు కమిషనర్ గిరిజా శంకర్, సీఎస్ గా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్, నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, సమీర్ శర్మ, బి.రాజశేఖర్, వాడ్రేవు చినవీరభద్రుడు, జె.శ్యామలరావు, వై.శ్రీలక్ష్మి, జి.విజయ్ కుమార్, ఎంఎం నాయక్, ప్రవీణ్ ప్రకాశ్, సంతోషరావు, రేవు ముత్యాలరాజు వంటి ఉన్నతాధికారులు కోర్టు ముందు నిలబడ్డారు. కానీ సంబంధిత మంత్రులు ఒక్కరిని కూడా బాధ్యులుగా చేయలేదు.

కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ చీఫ్ ప్రాజెక్ట్ అధికారి ఎం.సుదర్శన్ రెడ్డికి హైకోర్టు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. మైనింగ్ అవసరాల కోసం కడప జిల్లా మంగంపేట ప్రాంతంలోని కొన్ని నిర్మాణాలను అధికారులు కూల్చివేయడమే కారణం. కనీస వేతనాలు చెల్లించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ చిత్తూరు జిల్లాకు చెందిన షిఫ్ట్ ఆపరేటర్లు, జూనియర్ లైన్‌మెన్ లు, జూనియర్ ఇంజనీర్లు హైకోర్టును ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఏపీఎస్ పీడీసీఎల్ సీఎండీ సంతోషి రావు, ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ పూర్వ సీఎండీ బి.శ్రీధర్ కు నెలరోజుల జైలు శిక్ష విధించారు. సంబంధిత శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు బాధ్యులుగా చేయలేదు?

జగన్‌కి అన్నీ కలిసొస్తున్నాయి..

ఎన్ని ప్రయత్నాలు చేసినా.. న్యాయం కనుచూపు మేరలో కనిపించనప్పుడు కత్తి పట్టుకుని పోరాటం చేయడమే మంచిదని గురుగోవింద్ సింగ్ అన్నారు. ఈ సూక్తిని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చెప్పడం ప్రజలను ఆలోచింపజేసేలా ఉంది. జగన్ రెడ్డి వికృత క్రీడలు ఆడుతున్నారు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చని ముఖ్యమంత్రికి ఉన్న ప్రగాఢ నమ్మకం. అందుకు తగ్గట్లే ఆయనకు అన్నీ కలిసివస్తున్నాయి. కొన్ని వ్యవస్థలను డబ్బు ద్వారా, మరికొన్నింటిని కులం, ఇంకొన్నింటిని ఇతర ప్రలోభాలతో లొంగదీసుకుంటున్నారు. చివరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సైతం వదిలిపెట్టడం లేదు. స్వామివారి తీర్థప్రాసాదాలను, బోర్డు సభ్యుల పదవులు ఆశ చూపిస్తూ ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకపాత్ర పోషించిన అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం ఖాయమని భావించిన తరుణంలో తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అందుకు సీబీఐ కూడా సహకరించిందనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలు జీవితం గడిపారు. పదేళ్ల నుంచి బెయిల్ పై ఉన్నారు. గత ఐదేళ్ల నుంచి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇంతపెద్ద ఆర్థిక నేరగాడు న్యాయదేవత కళ్లుగప్పి ఎలా తప్పించుకు తిరుగుతున్నారు?

విధాన నిర్ణయాలు తీసుకునేంత వరకే ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. వాటిని అమలు చేయాల్సింది అధికారులే. వారు తప్పు చేస్తే మాజీ ముఖ్యమంత్రిని ఎలా అరెస్ట్ చేస్తారు? గవర్నర్ అనుమతి తప్పనిసరి అంటూ యడ్యూరప్ప తరపున సుప్రీంకోర్టులో ముకుల్ రోహత్గీ వాదించారు. చంద్రబాబు కేసులో గవర్నర్ అనుమతి అవసరం లేదంటూ అదే ముకుల్ రోహత్గీ ఏపీ హైకోర్టులో ప్రభుత్వం తరపున భిన్నంగా వాదించారు. కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి ఇంత మార్పుంటే మీ న్యాయస్థానాల్లో న్యాయం ఉన్నట్టా అని ఓ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ లు ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి.

రాజకీయ నాయకులుగా అధికారులు..

స్కిల్ డెవలప్‌‌మెంట్ సెంటర్ల ఏర్పాటులో, నిధుల వినియోగంలో ప్రధాన పాత్ర ఎండీ, కార్యదర్శిదే. కానీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో వారి పేరు ఎక్కడా కనిపించడం లేదు. అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లం బడ్జెట్‌ను ఆమోదించారు. ఆ శాఖలో అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్న సంస్థ కార్యదర్శి ప్రేమ చంద్రారెడ్డి పేర్లు ఈ కేసులో ఎందుకు లేవు? అధికారుల తప్పులను నాయకులకు ఎలా ఆపాదిస్తారు? నిధుల విడుదలకు సంబంధించి ఆర్థిక శాఖలోని ఈ-ఫైల్స్ ఎలా మాయమయ్యాయి? వాటిని పరిశీలిస్తే నిధుల వినియోగం వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. జగన్ రెడ్డికి అత్యంత ఆప్తులైన నీలం సహాని జీవో నెం.47ను విడుదల చేసి ఏపీఎస్ఎస్ డీసీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కానీ సీఐడీకి వీళ్లెవరూ కనిపించలేదు. సీఐడీ అధికారులు రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతపై బురద జల్లుతూ ప్రెస్‌మీట్లు పెడుతున్నారు.

ముఖ్యమంత్రి అసంబద్ధమైన నిర్ణయాలకు అధికారులను బాధ్యులను చేస్తూ శిక్షిస్తున్నారు. కానీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అధికారులను వదిలివేసి మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడంలో ఆంతర్యం ఏమిటి? కేవలం చంద్రబాబుపై కక్ష సాధింపు కోసమే దురుద్దేశంతో ఇరికించారు. నేరచరితులు వ్యవస్థలను శాసించడమేమిటని ప్రజలు భావిస్తున్నారు. భారత న్యాయవ్యవస్థపై ప్రజల్లో ప్రగాఢమైన నమ్మకం ఉంది. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని న్యాయస్థానాలే పరిరక్షిస్తున్నాయి. ఆ విశ్వాసం చెక్కుచెదరకూడదు. జగన్ రెడ్డి లాంటి మ్యానిపులేటర్ల వల్ల పవిత్రమైన వ్యవస్థల ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఉంది. అన్ని రాజ్యాంగ వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలి. నిజాయితీగా పనిచేసే వారిని శిక్షిస్తే.. భవిష్యత్తులో ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ సక్రమంగా పనిచేసే అవకాశం ఉండదు. ఈ వాస్తవాలను ప్రజలు గుర్తించారు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. నిరంకుశ పాలనకు చరమగీతం పాడతారు.

మన్నవ సుబ్బారావు

99497 77727

Read More Latest updates of Andhra Pradesh News

Advertisement

Next Story

Most Viewed