The Kerala Story : కేరళ స్టోరీ... బ్రెయిన్ వాష్ చేశారా?

by Ravi |   ( Updated:2023-05-16 06:08:47.0  )
The Kerala Story : కేరళ స్టోరీ... బ్రెయిన్ వాష్ చేశారా?
X

మధ్యే 'కేరళ స్టోరీ' చూసాను. నేను ఈ సినిమా చూసిన మల్టీప్లెక్స్‌లో రాత్రి ఆట హౌస్ ఫుల్! ఒక బీచ్ చూపించి, కథాకళి కళాకారున్ని చూపించి 'ఇదే కేరళ' అంటే, ఏవో ఒకటీరొండు షాట్స్ చూపించి 'ఇదే కాసర్ గోడ్' అంటే, సంభాషణల మధ్యలో 'ఎంద మోలె' అని పలికించి 'ఇదే మలయాళ భాష' అంటే నమ్మే వాట్సప్ విశ్వవిద్యాలయ ప్రేక్షకులకు, మరీ ముఖ్యంగా ఉత్తరాది వాట్సప్ విశ్వ విద్యాలయ ప్రేక్షకులకు ఈ 'కేరళ స్టోరీ' వాస్తవాన్ని కళ్ళకు కట్టిన గొప్ప సినిమానే!

కేరళ అనే కాదు దేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచంలోని అనేక దేశాలలో తీవ్రవాద దళాలు (అది ఏ భావజాలానికి సంబంధించినదైనా) తమ స్లీపర్ సెల్స్ సాయంతో అనేకమంది యువతీ యువకులను తమ బృందాల వైపు ఆకర్షించి తీసుకువెళుతున్నాయి. సిరియా కేంద్రంగా పనిచేస్తున్న ఐసిస్ కేరళ యువతులను ఇస్లామిక్ తీవ్రవాదంలోకి ఆకర్షించి తీసుకువెళుతున్నారన్న సమస్య పట్ల ఈ సినిమా తీసిన వాళ్లకు నిజంగా కన్సర్న్ వుండి వుంటే ఈ సినిమా రచన, తెరపైన ప్రదర్శించే పద్ధతి వేరుగా వుండేవి. కానీ, ఈ సినిమా తీసిన మేకర్స్ కు అటువంటి కన్సర్న్ ఇసుమంతైనా లేకపోగా, ఈ సమస్యను సినిమాగా తీయడమనే మిషతో ఒక మతాన్ని, ఆ మతాన్ని అవలంబించే వారినీ సైతానుగా చిత్రించడమే ఎజెండాగా పెట్టుకున్నారు అనిపిస్తుంది.

కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలు ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, నేషనల్ నర్సింగ్ కాలేజీలో చేరుతారు. ఈ ముగ్గురిలో ఒకమ్మాయి షాలినీ ఉన్నికృష్ణన్ దేవుడిని దేవుళ్లను విశ్వసించే హిందూ కుటుంబం నుండి వస్తే, మరొక అమ్మాయి గీతాంజలి కమ్యూనిస్టు సిద్ధాంతాలను అవలంబించే హిందూ కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. ఇంకొక అమ్మాయి క్యాథలిక్. వీరికి తోడుగా కాలేజీ హాస్టల్ గదిలో చేరిన ముస్లిం అమ్మాయి, ఈ ముగ్గురినీ ఇస్లాం మతంలోకి లాగి, సిరియాలోని ఐసిస్ కు పంపించి హ్యూమన్ బాంబ్ గా తయారు చేసే ఎజెండాతో పనిచేస్తూ ఉంటుంది. ఆ ముస్లిం అమ్మాయి ప్రయత్నాలు ఫలించి, ఆ ముగ్గురు అమ్మాయిలూ సిరియా చేరుకున్నారా? వాళ్ళ ఎజెండా అమలయిందా అన్నదే ఈ సినిమా కథ.

అపరిపక్వ సంభాషణలు…

సినిమా నడక అంతా, షాలినీ ఉన్నికృష్ణన్ తాను, తన స్నేహితులు ఎట్లా తీవ్రవాదుల బృందం ట్రాప్‌లో పడిందీ, తాను సిరియా ఎట్లా చేరుకున్నదీ, సిరియా ఐసిస్ స్థావరాలలో తాను పడిన కష్టాలు, అక్కడి నుండి పారిపోవడానికి చేసిన ప్రయత్నాలు, వగైరా అన్నీ ఇరాన్, అఫ్ఘాన్ సరిహద్దు పోలీసులతో చెప్పిన మాటలుగా సాగుతుంది. సినిమా అంతా ఈ అమ్మాయి ఆ సరిహద్దు పోలీసు వాళ్ళతో చెబుతూ వుంటుంది. 'వాళ్ళు మమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసారు' అని. ఆ సంగతేమో గానీ, బలహీన మానసిక ఉద్వేగాలు వున్న ప్రేక్షకులకు బ్రెయిన్ వాష్ చేయడం కోసమే మేకర్స్ ఈ సినిమాను తీసారని అర్థమవుతుంది. హాస్టల్ రూములో చేరిన తరువాత, మిగతా ముగ్గురు స్నేహితులతో ముస్లిం అమ్మాయి దేవుడు, స్వర్గం, నరకం వంటి అంశాల మీద జరిపిన సంభాషణలు వింటే, ఈ రోజుల్లో పాఠశాల పిల్లలు సైతం కాస్త మానసిక పరిపక్వతతో మాట్లాడుకుంటున్నారు కదా అనిపిస్తుంది. అసలు ఈ అమ్మాయిలు 'నేషనల్ నర్సింగ్ కాలేజీ' ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి వచ్చిన వాళ్లేనా? అన్న అనుమానం కూడా వస్తుంది.

ఇక ఇందులో వున్న కమ్యూనిస్టు కుటుంబం అమ్మాయి పాత్ర చిత్రణలో కమ్యూనిస్టుల మీద ఈ సినిమా మేకర్స్ కు వున్న కోపమంతా చూపించారు. వాళ్ళ ఖరీదైన ఇంటి దగ్గర ఎర్రజెండా ఎగురుతూ వుంటుంది. హాలులో మార్క్స్, ఎంగెల్స్, మావో వున్న పెద్ద మ్యూరల్స్ పెయింటింగ్ వుంటుంది. ముస్లిం అమ్మాయి ఈ హిందూ అమ్మాయిలను మతం మార్చే ప్రయత్నం చేస్తున్నపుడు 'మా ఫాదర్ కమ్యూనిస్టు. మతం మత్తుమందు అని మార్క్స్ చెప్పాడు తెలుసా. అని స్పష్టతతో మాట్లాడిన పిల్ల, మోసానికి గురయిన తరువాత తండ్రి దగ్గరకొచ్చి నువ్వు కమ్యూనిజం వంటి విదేశీ సంస్కృతి గురించి కాకుండా మన సంస్కృతి గొప్పదనం గురించి చిన్నప్పటి నుండే చెప్పి వుంటే నేను మోసపోయేదానిని కాదు నాన్నా అంటుంది. ఈ అమ్మాయి పాత్ర చిత్రణలో పీక్ ఏమిటంటే, ఆ కమ్యూనిస్టు తండ్రికి సినిమాలో బిత్తర చూపులు చూడడం తప్ప ఒక్కటంటే ఒక్క డైలాగు లేదు. సరే! ఈ కమ్యూనిస్టు ఫ్యామిలీ అమ్మాయికంటే దేవుడు దేవత వంటి నమ్మకాలు లేవు కాబట్టి ఆ ముస్లిం పిల్ల ట్రాప్ లో పడింది అనుకుందాము. మరి, నిత్యం దేవుడి స్త్రోత్రం చేసే షాలినీ ఉన్నికృష్ణన్ ఇతర మతం ట్రాప్ లో ఎట్లా పడుతుంది. అని మనం ఈ సినిమా మేకర్స్ ని ప్రశ్నించకూడదు.

‘ఈ ముగ్గురు అమ్మాయిలూ మాటలు చెబితే పూర్తిగా ట్రాప్ లో పడడం లేదు' అని ఆ ఐసిస్ బ్యాచ్ అమ్మాయి అనుకున్నాక, వీళ్ళని ట్రాప్ చేయడం కోసం ఒక ఎత్తు వేస్తుంది. అది ఏమిటో చెప్పను గానీ, అది చూడగానే 80 - 90 ల నాటి తెలుగు సినిమా హీరో ట్రిక్ గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. అప్పటి సినిమాలలో హీరోయిన్‌ని ట్రాప్ లో పడెయ్యడానికి హీరో ఒక నకిలీ గూండాల బ్యాచుని ఆమెని ఇబ్బంది పెట్టడానికి పంపించి, ఆ వెనకాలే వెళ్లి వాళ్ళని చితకబాది ఆమెను రక్షిస్తాడు. ఆ పిల్ల విలన్ కూతురు అయి ఉంటుంది కాబట్టి, ఆమెని ట్రాప్ చేస్తే తప్ప, తన కుటుంబానికి చేసిన అన్యాయానికి విలన్ మీద హీరో ప్రతీకారం తీసుకోవడం సాధ్యం కాదు.

ట్రాప్ చేయడం ఇలాగే..

ఇంకా విచిత్రం ఏమిటంటే, నర్సింగ్ విద్య అభ్యసించే ఈ ముగ్గురు అమ్మాయిలూ ఆ ఐసిస్ అమ్మాయి టెన్షన్ తగ్గడానికి ఏవో పిచ్చి గోళీలు ఇస్తే మింగేస్తూ వుంటారు. పైగా, బాయ్ ఫ్రెండ్ తో కలిసి శృంగారంలో పాల్గొంటే, దాని పర్యవసానాలు ఎట్లా వుంటాయో కూడా తెలియని అమాయకత్వంతో వుంటారు. 'మోసం చేస్తున్నారు' అన్న సంఘటనలు ఒకదాని వెనుక ఒకటి జరుగుతూ వున్నా 'మా దేవుడు రక్షిస్తాడు' అని చెబితే మినిమమ్ బ్రెయిన్ వాడకుండా షాలినీ ఉన్నికృష్ణన్ సిరియా దాకా వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి మాటిమాటికీ 'బ్రెయిన్ వాష్ చేశారు' అంటుంది గానీ, సినిమాలో దర్శకుడు ఈమెకి బ్రెయిన్ ఎక్కడ పెట్టాడు' అని ప్రేక్షకులకు అనుమానం వొస్తే ఆ తప్పు ప్రేక్షకులది కాదు.

ఇక సిరియాలో అంటూ చూపించిన సన్నివేశాలు మూడే! అయితే, శిక్షల పేరు మీద మనుషుల కాళ్ళు చేతులు తలలూ నరికేయడం, లేదంటే 'అల్లాహు అక్బర్' అంటూ తుపాకులు పేలుస్తూ జీపుల్లో వెళ్లిపోవడం, కాదంటే స్త్రీలను పశువులలా లాక్కొచ్చి చెరిచివేయడం ఇంతే ! అక్కడి సమాజం, రాజకీయాలు ఇవేవీ మచ్చుకైనా ప్రస్తావనకు రావు. ఇండియాలో వున్న ఐసిస్ ప్రతినిధులు ఇక్కడి ముస్లిం యువకులకు 'ఔరంగజేబు పూర్తి చేయలేకపోయిన పనిని మనం పూర్తి చేయాలి ఇక్కడ' అని నూరిపోస్తూ వుంటారు. ఈ సినిమా మేకర్స్ నిజాయితీని పూర్తిగా శంకించే సన్నివేశాలు కూడా వున్నాయి. 'ఐసిస్ బృందాలు స్త్రీలను సెక్స్ బొమ్మలుగా చూస్తారు' అని చెప్పడమే మేకర్స్ ఉద్దేశ్యమైతే, రేప్ సన్నివేశాలను సింబాలిక్ గా చూపించి వుండొచ్చు. అట్లా కాకుండా, ఈ సినిమాలోని రేప్ సన్నివేశాలు చూస్తే, మేకర్స్ సెన్సార్ వాళ్ళను కూడా బ్రెయిన్ వాష్ చేసినట్టు అనిపిస్తుంది.

ఇక సినిమా పతాక సన్నివేశాలలో ఆ మూడో అమ్మాయి (క్యాథలిక్) ఇండియన్ పోలీసు ముందు నిలబడి, అదేదో కేరళలో నివసించే ప్రతీ యువతిని ఐసిస్ వాళ్ళు ట్రాప్ చేస్తున్నట్టు 'గాడ్స్ ఓన్ కంట్రీ నాశనం కాబోతోంది సార్' అని ఏడుస్తుంది. 32000 మంది అధికారికంగా, 50000 మంది అనధికారికంగా అని లెక్కలు చెబుతుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు (అప్పటి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాంది) ఏడాదికి కొన్ని వేలమంది ఇస్లామ్ మతంలోకి మారిపోతున్నారనీ, త్వరలో కేరళ రాష్ట్రం మొత్తం ఇస్లామ్ స్టేట్‌గా మారబోతున్నదని అధికారికంగా చెప్పారనీ అంటుంది. నిజమా!

కన్సర్న్ లేదు కానీ..

అంతా విని ఆ పోలీసు అధికారి 'చట్టానికి సాక్ష్యాలు కావాలి గదా!' అన్నపుడు ఆ క్యాథలిక్ అమ్మాయి ఇచ్చే సమాధానం సినిమా మొత్తానికే హైలైట్ ! ‘ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు. అక్కడ వాళ్ళు తప్పు చేసిన వాళ్లకు సింపుల్‌గా పంచాయితీ పెట్టి కఠిన శిక్షలు వేస్తూ వుంటే ఇక్కడ మీరు చట్టం, సాక్ష్యం అంటున్నారు. ఇట్లా అయితే మాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది.' ఇక్కడ చట్టాల అమలులో లోపాలు, రాజకీయాలు వున్న మాట నిజమే గానీ, సినిమా మేకర్స్ కు కావలసింది ఆ సమస్య పట్ల కన్సర్న్ చూపించడం కన్నా ఆ అమ్మాయి ఉదహరించిన తరహా శిక్షల అమలు వ్యవస్థలు ఇక్కడ కూడా రావాలి. నిజంగా అటువంటి వ్యవస్థలే వస్తే, ఈ క్యాథలిక్ అమ్మాయి తన మత విశ్వాసాన్ని కొనసాగించగలదా? అన్న సందేహం మాత్రం ప్రేక్షకులకు రాగూడదు.

సగటు సినిమా ప్రేక్షకునిగా నాకు అనిపించింది ఏమిటంటే, ఇటు కేరళ సమాజం చరిత్రనూ, పౌర రాజకీయాలనూ, సాంస్కృతిక రంగాలనూ, అటు ఇస్లాం తీవ్రవాదం పుట్టుక పెరుగుదల చరిత్రనూ, రాజకీయాలనూ ఏ మాత్రం అధ్యయనం చేయకుండా ఒకే ఒక లక్ష్యంతో తీసిన సినిమా ఈ కేరళ స్టోరీ. ముందే చెప్పినట్టు, యువతను తీవ్రవాదం వైపు ట్రాప్ చేసి, లాగే బృందాలు ప్రపంచంలో పనిచేయడం లేదని కాదు. ఆ సమస్య పైనే సినిమా తీయాలని భావిస్తే, దానికి చాలా అధ్యయనం, బాలన్స్, మేకర్స్ నిష్పక్షపాత దృష్టి అవసరం. అవి అక్కరలేదు మన లక్ష్యం వేరు అనుకుంటే విడుదలయేది 'కేరళ స్టోరీ'. సినిమా చివరిలో, ఇరాన్ అఫ్ఘాన్ సరిహద్దు పోలీసుల ఇంటరాగేషన్ పూర్తి అయిన తరువాత షాలిని మరొక పోలీసు దగ్గర తన ఐడెంటిటీ చెబుతుంది 'ఐ యాం షాలినీ ఉన్నికృష్ణన్ కేరళ ఇండియా హిందూ' అని. బాగుంది ! ఇక్కడైతే, కాస్త అతిశయంతో 'బ్రాహ్మిణ్ ' అని కూడా కలిపి వుండేదేమో!

విజయ్ కుమార్ కోడూరి

కవి, సమీక్షకులు

Also Read...

లిటిల్ ఫింగర్...ఇది దేశం సమస్య

Advertisement

Next Story