ఎన్నికల ప్రచారంలో ఎత్తులకు పై ఎత్తులు: ఉజ్జిని రత్నాకర్ రావు

by srinivas |   ( Updated:2024-04-25 23:00:48.0  )
ఎన్నికల ప్రచారంలో ఎత్తులకు పై ఎత్తులు: ఉజ్జిని రత్నాకర్ రావు
X

ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న ప్రధాన పార్టీలు లోక్‌సభకు నామినేషన్ పర్వం రాష్ట్రంలో ఏప్రిల్ 18 నుండి మొదలయ్యింది. రాష్ట్రంనుండి ఎన్నుకోవాల్సిన 17 స్థానాలకు మే 13న పోలింగు పూర్తవుతుంది. తెలంగాణాలో ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు- ప్రత్యారోపణలు చూస్తుంటే ఈ మూడు పార్టీలు రాజకీయ మైండ్ గేమ్ పాలిటిక్స్‌కి తెర తీసినట్లుగా కనిపిస్తోంది.

రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు తీవ్ర నడి వేసవి కాలంలో రావటం.. ఇక ఒక వైపు ఎండ వేడిమి వడగాడ్పులు.. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు చేస్తున్న విమర్శనాస్త్రాల దాడులు చిచ్చుబుడ్లుగా పేలుతున్నాయి.. బీజేపీ 10 సంవత్సరాలు కేంద్రం లోను, బీఆర్ఎస్ పదేళ్లు రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అవినీతి, అరాచక పాలన అందించారని, ఈ రెండింటికి గుణపాఠం చెబుతూ ఇండియా ఫ్రంట్ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్‌తో పాటు వామపక్ష పార్టీలు ఏకమవుతున్నాయి.

గెలుపొందే స్థానాలపై ఆశలు

దేశవ్యాప్తంగా వివిధ దశల్లో జరుగుతున్న 18వ లోకసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షలోని బీఆర్ఎస్, బీజేపీలు మొత్తం స్థానాలకు పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ -మోడీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు తోడు గత 10 సం. రాలుగా రాష్ట్ర విజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు పరచకపోవటం, రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న బిఆరెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ హామీలైన నీళ్లు, నిధులు, నియామకాలలో వైఫల్యాలు ప్రధానంగా ప్రచారాంశాలుగా మారాయి. రాష్ట్రంలో కనీసం 14 స్థానాలైనా సాధించాలని కాంగ్రెస్, గతంలో పొందిన 9 స్థానాలైనా గెలుపొందాలని బీఆర్ఎస్ బావిస్తుంటే, మోడీ చరిష్మాతో తెలంగాణాలో బలం పెంచుకోవాలని రాష్టంలో డబుల్ డిజిట్ స్థానాలు పొందుతామని బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఊదర గొడుతున్నారు. గత శాసనసభ ఎన్నికలలో 8 స్థానాలు పొందిన బీజేపీ ఈ లోక్‌సభ ఎన్నికలలో డబుల్ డిజిట్ 10 నుండి 12 లోకసభ స్థానాలు గెలుపొందుతున్నా మనే ప్రచారాన్ని చాప కింద నీరులా విస్తరింపజేస్తోంది.

ఎన్నికలకు తోడైన కరువు

లోకసభ ఎన్నికల వేళ రాష్ట్రంలో నెలకొన్న తాజా కరువు పార్టీలకు ప్రచార అస్త్రంగా మారింది. కరువు పైనే పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. సరిగ్గా మండే ఎండాకాలంలో ఎన్నికలు రావడం, అదే సమయములో రాష్ట్రంలో త్రాగునీటికి కటకట ఎదురు కావడం వివ్యక్షాలకు కలిసి వచ్చింది. దీంతో అన్ని పార్టీలు కరువు కారణం మీరంటే మీరేనని పరస్పర ఆరోపణల స్వరం పెంచాయి. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఒక వైపు బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే, ప్రతిగా గత ప్రభుత్వ పాలన విధానాలతో పాటు ప్రకృతి తెచ్చిన కరువు అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు తిప్పికొడుతుంది. ఈ కరువుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు రెండు కారణమని, కరువును అడ్డుకోవడం మానేసి రెండు పార్టీలు స్వార్ధ రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఇలా తెలంగాణలో కరువు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి.

కరువు పేరుతో రైతు దీక్షలు

సాగు త్రాగునీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని, ప్రాజెక్టుల గేట్లుఎత్తి రైతుల సమస్యల పరిష్కరించడానికి బదులుగా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గేట్లు ఎత్తి వలసనేతలను దృష్టి పెట్టిందని, ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో కరువుపై చీమకుట్టినట్లుగా లేదని మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌పై ఆరోపణ వేడి పెంచారు. ప్రభుత్వ అసమర్థత, చేతకానితనంతోనే రాష్ట్రంలో కరువు వచ్చిందని ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు అని, ప్రకృతి వనరులను కాపాడుకోపోవడంలో వైఫల్యం చెందారని కేసిఆర్ ఎండిపోయిన పంట పొలాలను సూర్యాపేట, నల్గొండ కరీంనగర్ జిల్లాలలో పరిశీలిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా దాడి మొదలు పెట్టాడు. కరువు రైతు సమస్యలు పరిష్కారం కోసం ఏప్రిల్ 24 నుండి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టారు.. 10 ఏండ్ల పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చి, తెలంగాణ భవిష్యత్తును అంధకారం చేసినది చాలక బస్సు యాత్ర అంటూ మరొకసారి ప్రజలు మోసం చేయడమే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించినట్లుగా రైతులకు ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని, రూ. రెండు లక్షల రైతు రుణమాఫీ చేయాలని విపక్షాలు విమర్శిస్తున్నాయి, దీనికి ప్రతిగా వచ్చే ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని, వానకాలం పంట నుంచి బోనస్ అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడమే కాకుండా, దీనిపై ఎవరు మాటతప్పిన, వెనుకకుపోయినా రాజీనామాకు సిద్ధం కావాలని ఛాలెంజి చేశారు. కాగా, రైతు సత్యాగ్రహ దీక్ష పేరుతో బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపణలతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఆరోపణలకు దీటుగా, అకాల వర్షాలకు జరిగిన పంట నష్టానికి ఎకరానికి రూ.10 వేల చొప్పున అందిస్తామని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచి యుద్ధ ప్రాతిపదిగా కొనుగోలు చేస్తున్నామని, ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలిస్తూ.. త్రాగునీటికి ఇబ్బంది రాకుండా జిల్లాకు 10 కోట్లు నిధులు విడుదల చేసి యుద్ధప్రాతిపదికపై సహాయక చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇలా సాగుతున్న రాజకీయ పార్టీల సంకుల సమరంలో గెలుపెవ్వరిదో తెలియటడానికి జూన్ ప్రారంభం వరకు వేచి చూడాల్సిందే.



ఉజ్జిని రత్నాకర్ రావు..

94909 42646

Advertisement

Next Story

Most Viewed