లైంగికతపై కొత్త కాంతి : 'కాథల్ – ది కోర్'

by Vinod kumar |
లైంగికతపై కొత్త కాంతి : కాథల్ – ది కోర్
X

'కాథల్ - ది కోర్' సినిమా మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మమ్ముట్టి తాజాగా నటించిన చిత్రం. జియో బేబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కథానాయకగా జ్యోతిక నటించడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాల్లో తరచుగా తప్పుగా చిత్రీకరించే సెక్సువాలిటీ అంశాన్ని అత్యంత సున్నితంగా మలిచిన 'కాథల్ – ది కోర్' నటనపరంగా, దర్శకత్వ పరంగా పూర్తి మార్కులను పొందింది.

స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేసినప్పటికీ భారతీయ సమాజం హోమో సెక్సువాలిటీని నేటికీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రధాన స్రవంతి చిత్ర పరిశ్రమ తరచుగా దీనిని నిషిద్ధంగా పరిగణించింది లేదా తనదైన వ్యంగ్య చిత్రణతో అపహాస్యం చేసింది. ఈ నేపథ్యంలో 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' దర్శకుడు తన ప్రతిష్టను ఫణంగా పెట్టి మరీ 'కాథల్ - ది కోర్' సినిమా తీశాడు. ఇది 2023 నవంబర్ 23న విడుదలై మంచి కలెక్షన్లను అందుకుంది. ఎల్జీబీటీల హక్కులను సున్నితంగా చిత్రించడం ఒకెత్తయితే, ముమ్ముట్టి ఈ చిత్రంలో హీరోగా వార్తలకెక్కడం సంచలనం కలిగించింది. హీరో, దర్శకుల సాహస ప్రయత్నం ఈ సినిమాను 2023లో వచ్చిన అత్యుత్తమ సినిమాగా నిలిపింది.

డేరింగ్ పాత్రలో ముమ్ముట్టి..

ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచింది. టీజర్ రిలీజ్ చేసినప్పుడే 'గే' పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు అన్న విషయం మీద చాలావిమర్శలు వచ్చాయి. నిజానికి మమ్ముట్టిని 'గే' పాత్రలో చూసిన తర్వాత మాథ్యూగా ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టం. కెరీర్ చరమాంకంలో ఉన్న మెగాస్టార్ ముమ్ముట్టి 72 ఏళ్ల వయస్సులో కూడా వినూత్నమైన కథలతో తన్ను తాను కొత్తగా ఆవిష్కరించుకున్న తీరును గమనిస్తే, సినిమా పట్ల ఆయన అనురక్తి స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు. స్వలింగ సంపర్కం గురించి చెప్పే కథను ఒక నటుడిగా, నిర్మాతగా ఏడు దశాబ్దాల ప్రాయంలో తన భుజాలపై పెట్టుకుని మోశాడు. సినిమాలో ప్లెజెంట్ సర్ ప్రైజ్ ఏమిటంటే సపోర్ట్ కాస్ట్. నిజానికి, ఇతర నటీనటులను 'సపోర్టు కాస్ట్' అని పిలవడం ఈ చిత్రం వరకు నిజంగా అవమానకరం. ఉదాహరణకు, తంగన్‌గా సుధీ అందరి మనసులను కదిలిస్తుంది. కాగా ఈ చిత్రంలో ముమ్ముట్టి సరసన తొలిసారిగా నటించడానికి ఒప్పుకున్న జ్యోతిక అందరికంటే ఎక్కువ స్టార్ వాల్యూ తెచ్చుకుంది.

కథేమిటంటే..

మాథ్యూ దేవస్సీ (మమ్ముట్టి) ఒక సాధారణ వ్యక్తి - సహకార బ్యాంకులో పని చేస్తాడు, పార్టీ కార్యకర్త, ఉద్యోగం చేస్తున్న భార్య ఓమన (జ్యోతిక), యుక్తవయస్సులో ఉన్న కుమార్తె, వృద్ధుడైన తండ్రి ఉంటారు. ఒక రోజు చర్చిలో ప్రార్థన ముగించుకున్నాక, కేరళలో వార్డ్ ఎలెక్షన్లలో పాల్గొనాలని మాథ్యూ నిర్ణయించుకుంటాడు. రెండురోజుల తర్వాత నామినేషన్ దాఖలు చేస్తాడు. అదే సమయంలో మాథ్యూ నుంచి విడాకులు కావాలంటూ భార్య ఓమన, కోర్టులో కేసు వేస్తుంది. తన భర్త ఒక హోమో సెక్సువల్ అని, డ్రైవర్ థంకన్‌తో సంబంధం నడుపుతున్నాడని భార్య ఆరోపిస్తుంది. తనపై ఆరోపణను మాథ్యూ తిరస్కరిస్తాడా, మాథ్యూ రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికే ఓమన తన భర్తపై కేసు పెడుతుందా, కోర్టు ఓమనకు విడాకులు మంజూరు చేస్తుందా. ఈ ప్రశ్నలన్నింటికీ రెండు గంటల నిడివిలో సమాధానాలు దొరుకుతాయి. 'ఈ సినిమా ఇప్పుడున్న మనుషులకు ఒక స్ఫూర్తి కలిగించే మూవీగా అనిపించాలి. అదే పరిస్థితుల్లో ఎవరు ఉన్నా వాళ్ళకి ఈ మూవీ ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. అందుకే అలాంటి వాళ్ల కోసమని ఈ సినిమా తీశాము. నేను ఈ కథ చెప్పిన వెంటనే మమ్ముట్టికి ఈ సినిమా స్టోరీ అర్థమయ్యి ఈ కథకు వెంటనే ఒప్పుకున్నారు' అని చిత్ర దర్శకుడు జియో బేబీ చెప్పారు.

కోర్ట్ డ్రామాకు పరాకాష్ట..

దాదాపు 20 ఏళ్లపాటు పొరపొచ్చాలు లేకుండా గడిపిన తర్వాత ఓమన తన భర్తనుంచి విడాకులు మాత్రమే కోరటం, ఎలాంటి పరిహారాలను ఆశించకపోవడంతో సాగిన ఈ చిత్రం ద్వితీయార్థం మొత్తంగా కోర్ట్ డ్రామాగా నడుస్తుంది. ప్రతి ఒక్కరి మనస్సులో రేగుతున్న ఘర్షణలను అర్థం చేసుకుంటూ ఆయాపాత్రలు సాగిన తీరు వీక్షకులను విలపింప జేస్తుంది. సినిమా కథను మూలమలుపు తిప్పిన విప్లవాత్మక చిత్రంగా నిలిచిన 'కాథల్ - ది కోర్' అంతిమంగా హోమోసెక్సువాలిటీని సరైన కోణంలో చిత్రీకరించి సమాజ ఆమోదం పొందుతుంది. సమాజం తమను చూస్తున్న తీరుకు స్వలింగ సంపర్కులు సిగ్గుపడకూడదని ఈ చిత్రం బోధిస్తుంది. మేటి నటుడైన ముమ్ముట్టి, కళ్లతోనే మాట్లాడే జ్యోతిక మధ్య క్లైమాక్సుకు ముందు సాగే సంభాషణలు కంటతడి పెట్టిస్తాయి. నటుల ప్రదర్శనకు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ వంటి సాంకేతిక నిపుణతలు మేలిమెరుగు దిద్దాయి. ముఖ్యంగా మాథ్యూ పులిక్కన్ సంగీతం తోడు కానట్లయితే ఈ సినిమా ఈ స్థాయిలో ఉండేది కాదనే చెప్పాలి. విడాకుల తర్వాత కూడా కొత్త జీవితం ఒకటుంటుందనే గొప్ప అంశాన్ని క్లైమాక్స్‌ బలంగా చెబుతుంది. హోమో సెక్సువల్స్ అందరికీ ఈ సినిమాను అంకితం చేస్తూ చివరి షాట్ తీయడం విశేషం.

ఈ వయసులో ముమ్ముట్టికి అవసరమా..?

ఈ వయసులో కూడా ఇలాంటి పాత్రలు అవసరమా, దీంతో సమాజానికి చెబుతున్నది ఏంటి, ఇంత జెంటిల్మన్ తన మర్యాదను కోల్పోయేటట్టు ఇలాంటి పాత్రలు చేయడం ఏంటి అని బోలెడు విమర్శలు ముమ్ముట్టిపై వచ్చాయి. ఎన్నో ఏళ్ల నుంచి తన కెరీర్‌ని పై స్థాయిలో ఉంచుతూ మూడు జాతీయస్థాయి అవార్డులను కూడా గెలుచుకున్న మమ్ముట్టి ఈసారి కొత్తగా ఒక 'గే' పాత్రలో కనిపించారు. సంసార బాధ్యతలతో ఉన్న ఒక 'గే', సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది ఈ చిత్రం కాన్సెప్ట్. ఈ సినిమాలో ముమ్ముట్టి పాత్రని చూస్తే జీవం పోశాడు అనే మాట కూడా చిన్నదవుతుంది. దర్శకుడు జియో బేబీ, హీరో మమ్ముట్టి ఇద్దరూ మన దేశ సంస్కృతీ నిర్మాణంలో భాగమైన ఒక గాజు పైకప్పును భళ్లున పగలగొట్టారు, దీని విస్ఫోటన శబ్దం సమాజంలో చాలా కాలం పాటు బిగ్గరగా ప్రతిధ్వనిస్తుందని ఆశిద్దాం.

సినిమా : కాథల్ - ది కోర్

భాష : మలయాళం

దర్శకుడు : జియో బేబీ

నటీనటులు : మమ్ముట్టి, జ్యోతిక, సుధి

విడుదల : ధియేటర్లలోనే చూడవచ్చు

కె. రాజశేఖర రాజు,

73496 94557


Advertisement

Next Story

Most Viewed