పంచదార వెనుక ప్రపంచ రాజకీయాలు

by Ravi |   ( Updated:2023-11-15 08:04:07.0  )
పంచదార వెనుక ప్రపంచ రాజకీయాలు
X

క్కెర అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా చాలా ఇష్టం. చిరుధాన్యాల వంటకాలలో చక్కెర కలిపితే వచ్చే రుచి బాల్యం నుంచే అలవాటయింది నాకు. పెద్దయ్యాక లావై ఎన్ని వ్యాయామాలు చేసినా స్వీట్స్ తినడం తగ్గించలేదు. చాలామందికి దుఃఖం, డిప్రెషన్, స్ట్రెస్ వస్తే ఏమీ తినకుండా చిక్కిశల్యమౌతారు. నేను అప్పుడు కూడా స్వీట్లు తిని లావు అవుతాను. అసలు ఒక స్వీట్‌ను చూడగానే భగ్నం అయిపోయిన డైటింగ్ ప్లాన్స్ వందల్లో ఉన్నాయి నా జీవితంలో. స్వీట్లు చూడగానే వెగటు వచ్చే స్నేహితులు చుట్టూ ఉన్న నాకు -ఇదేం జబ్బో తెలియదు. మత్తు పదార్థాలు, తాగుడు, సిగరెట్లు ఎడిక్షన్ అనీ, వాటివల్ల తీవ్ర నష్టం జరుగుతుందనీ అంటారు. స్వీట్స్ మాత్రం తక్కువ ఎడిక్షణా! జరిగే నష్టం తక్కువా! వాటి వలన రేపే ప్రాణం పోతుందన్నా -తినకుండా ఉండలేనంత ఎడిక్షన్ అది. ఇది అర్థం అయ్యాక తాగుబోతులను అసహ్యించుకోవడం మానేశాను. నాకా అర్హత లేదని అర్థం అయింది.

ఆవరించిన చక్కెర మహమ్మారి

అయితే ఇదంతా రాయడానికి కారణం - తాగుడు మనుషులకు అలవాటు అవటానికి ఎలాగైతే అంతర్జాతీయ రాజకీయ కారణాలు ఉన్నాయో, పంచదార మనకు అలవాటు అవటానికి అలాంటి అంతర్జాతీయ కారణాలు ఉన్నాయనే సంగతిని ఈ రోజు చదివాను. టైమ్ పత్రిక ఈ రోజు ప్రచురించిన కథనం ప్రకారం పంచదారను కావాలనే పెట్టుబడిదారీ ప్రపంచం మనకు అలవాటు చేసింది. పారిశ్రామీకరణ ప్రారంభం అయ్యాక కార్మికులకు తొందరగా శక్తి అందించటానికి పంచదారను ఎన్నుకొన్నది పెట్టుబడిదారీ వర్గం. పంచదార వలన వచ్చే నష్టాలు తెలిసినా అది ఈ పని చేసింది. మానవ చరిత్రలో స్పటిక పంచదార ఉనికి లేని కాలమే ఎక్కువ. భారతదేశంలోనే 2000 సంవత్సరాల క్రితం బెంగాలీ కార్మికులు చెరుకు నుండి బెల్లం తీశారు. అయినా పంచదారకు ఇక్కడి ప్రజలు అలవాటు పడలేదు. రెండు వందల సంవత్సరాల క్రితం కూడా మహారాజులు, జమీందారులు మాత్రమే పంచదార కొద్దిగా తినేవాళ్లు. కానీ ఇప్పుడూ -ఏడాదికి కనీసం 30 కేజీల చక్కెరను మధ్య తరగతి కుటుంబాలు తింటున్నాయి. అమెరికాలో అయితే 45 కేజీల దాకా ఈ వినియోగం ఉంది.

కార్మికులకు శక్తికారకంగా

టైమ్ పత్రికలో దీనిపై రాసిన వ్యాస రచయిత ఉల్బే బొస్మా చెప్పిన దాని ప్రకారం ఈ మార్పుకు కారణం సామ్రాజ్యవాదమే. తాను సృష్టించిన ఆధునిక పారిశ్రామిక సమాజాలకు ఆ సామ్రాజ్యవాదమే పంచదారను చవకగా అందించింది. నగర శ్రామికులకు చవకగా శక్తిని ఇవ్వటానికి ఈ పని చేసింది. పెద్ద ఎత్తున శుద్ధి చేసిన పంచదారను తయారు చేసే ఫ్యాక్టరీలను ముందుకు తెచ్చింది. అంతే కాదు, ఈ పంచదార పరిశ్రమకు పట్టుకొమ్ము బానిస వ్యవస్థ. 1500లలో అమెరికాలో పొలాల్లో పని చేయడానికి ఆఫ్రికా నుండి 12.5 లక్షల మంది ప్రజలను దొంగిలించి తీసుకొని వచ్చారు. వాళ్లల్లో 23 వంతు మంది చెరుకు పొలాల్లో పని చేశారు. చెరుకు పొలాల్లో పని చేయడం అంటే అప్పట్లో ప్రాణాంతకమే. ఇక్కడ పని చేసిన బానిసలు అనేక తిరుగుబాట్లు చేశారు. యూరపులోని మేధావి వర్గం పంచదారకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. పంచదార బానిసల రక్తంతో తడిచిందని చెప్తూ రాసిన కరపత్రం ప్రసిద్ధి చెందింది. 1807లో ఈ పంచదార తిరుగుబాట్ల ఫలితంగానే బ్రిటిష్ తన పాలిత భూభాగాల్లో బానిస వ్యవస్థను రద్దు చేసింది.

బానిసలతో చక్కెర ఉత్పత్తి

ఇదిలా జరుగుతుండగానే పంచదార ఉత్పత్తి, వినియోగం పెరిగిపోయాయి. కార్ల్ ఫ్రాంజ్ ఆచర్డ్ అనే ఆయన బీట్ రూట్ నుండి పంచదార తీసే పరిశ్రమలను అభివృద్ధి చేశాడు. భారతదేశంలో అయితే చవకగా పంచదారను పండించవచ్చుననే యురేపియన్ల ఆలోచనలు బయలుదేరాయి. ఇక్కడ శ్రామికులు చవక కదా. ఈ బీట్ రూట్ పంచదార కానీ, భారతదేశ పంచదార కానీ బానిస వ్యవస్థను రద్దు చేయలేకపోయాయి. 1860 నాటికి పారిశ్రామిక కార్మికులు తినే పంచదారలో సగం భాగం బానిస ప్రజలే తయారు చేశారు. అంటే పంచదారతో -బానిస వ్యవస్థ దోపిడితో, పెట్టుబడిదారీ వ్యవస్థ శ్రామిక దోపిడీతో ముడిపడి వుంది. ప్రభుత్వాలు సబ్సిడీ రేట్లతో కార్మికులకు పంచదార సరఫరా చేయటం మొదలైయ్యింది. అమెరికా క్యూబాను, హవాయ్‌నూ, పోర్టోరికానూ, ఫిలిప్పైన్స్‌నూ ఆక్రమించాక పంచదార ఉత్పత్తి ఇంకా పెరిగింది. పంచదార అధిక ఉత్పత్తికి పగ్గాలు వేయటానికి అమెరికన్ పెట్టుబడిదారులు వాళ్ల ప్రయోజనాల కోసం ఎన్నో అంతర్జాతీయ ఒప్పందాలు చేయించుకున్నారు. కానీ అవేమీ నిలబడలేదు.

వారానికి కేజీ చక్కెర

1800లలో వారానికి ఒక స్పూన్ పంచదార తినేవాళ్లు, ఇప్పుడు వారానికో కేజీ తింటున్నారు. 19వ శతాబ్దంలో నగర కార్మికులు పోషకాహార లోపంతో వుండేవాళ్ళు. వాళ్లకు సరిపడిన కాలరీల పిండి పదార్థాలు అందాలి. చవకైన పిండిపదార్థం పంచదారే. పంచదార ఎలా చవక అయింది అంటే దాన్ని తయారు చేసిన బానిస కార్మికుల శ్రమను దోపిడీ చేస్తే అయింది. అదే పంచదార అలాంటి కార్మికులకే చవకగా అందిన ప్రమాదకర పోషకం అయింది. ఆ పంచదార నుండే తరువాత చాకో‌బార్‌లూ, కోకాకోలాలు ఉత్పత్తి అయి కార్మికుల ఆరోగ్యం పణంగా ఇంకా లాభాలను తెచ్చిపెట్టాయి. నాజీల పాలన నుండి విముక్తి అయిన ఐరోపా పెట్టుబడిదారీ వ్యవస్థ పంచదార పరిశ్రమతో నిలదొక్కుకొన్నది.

ఆరోగ్య సంక్షోభానికి మూలం చక్కెర

అయితే 19వ శతాబ్దం నాటికే చెక్కరకూ, మధుమేహ వ్యాధికీ ఉన్న సంబంధం గురించి నిపుణులు హెచ్చరించారు. పంచదార ఊబకాయులను తయారు చేస్తుందనీ, మనుషులను ఆరోగ్యరహితంగా చేస్తుందని చెప్పారు. అప్పటినుంచి కొత్త ప్రచారాలను పంచదార పరిశ్రమ, కూల్ డ్రింక్స్ పరిశ్రమలు తయారు చేసి పెట్టుకున్నాయి. కొవ్వు పదార్థాలు గుండెకు ప్రమాదకరం కానీ, పంచదార కాదంటూ పంచదార కార్పొరేషన్లు చేయించిన పరిశోధనలు బయటకు వచ్చాయి. కూల్ డ్రింకులు ఆటగాళ్ల ప్రతిభకు కారణం అనే అడ్వర్టైజ్‌మెంట్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఎన్ని వచ్చినా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సంక్షోభానికి దారి చూపించే సూచిక పంచదార చరిత్రే. మనం తింటున్న పంచదారలో ఏది సహజమైనది లేదు. రాజకీయ, సామాజిక, ఆర్థిక ఆధిపత్య శక్తుల గెలుపే పంచదార చరిత్ర.

ఆహార పరిశ్రమే ప్రమాదకరం

ఈ రోజు నేను ఎక్కువగా తింటున్న స్వీట్లు నాకు ఇష్టమై మాత్రమే తింటున్నానని చెప్పటానికి లేదు. అలాగే మా అవ్వలు అలవాటు చేశారని కూడా చెప్పకూడదు. వాళ్లిద్దరూ యాక్టివ్‌గా బతికిన సంవత్సరాలలోనే భారతదేశ వాడకంలో చక్కెర ప్రవేశిస్తూ ఉండింది. గత కొన్ని శతాబ్దాలుగా మన ఆహారం ఎలా పారిశ్రామిక ఉత్పత్తిగా ఉంటూ వచ్చిందో ఈ వ్యాసం నాకు అర్థం చేయించింది. అందులోనూ పంచదార వహించిన కీలకమైన పాత్ర అర్థం అయింది. బీఫ్ పరిశ్రమ వలన పర్యావరణానికి వస్తున్న నష్టాలను గ్రహించి పారిశ్రామిక గొడ్డు మాంసాన్ని తినటం మానేసిన వాళ్లు నాకు తెలుసు. నేను తింటున్న స్వీట్లు ఆహార పరిశ్రమల కుట్ర ఫలితంగా నా జీవితంలోకి వచ్చాయని అర్థం అయిన తరువాత తినటం మానేయకపోవటం, కనీసం తగ్గించటం చేయకపోవటం క్షమార్హం కాదు.

రమాసుందరి

మాతృక సంపాదక వర్గ సభ్యులు

94405 68912

Advertisement

Next Story