ప్రైవేటీకరణపై పోరాటమే శరణ్యం!

by Ravi |   ( Updated:2024-08-01 01:00:41.0  )
ప్రైవేటీకరణపై పోరాటమే శరణ్యం!
X

సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో ప్రయివేటీకరించబోమని ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెపుతూనే, మరోపక్క వేలం పాటలు పెట్టడం ఎందుకోసం? ఇది ప్రజలను, కార్మికులను పక్కదారి పట్టించి మోసగించడం కాదా? మోడీ ప్రభుత్వం గత పదేళ్లుగా ప్రయివే టీకరణ విధానాలను దూకుడుగా అమలు చేస్తోంది. అందులో భాగంగా సింగరేణి ప్రైవేటీకరణకు పూనుకుంది. వారికి కార్మికుల భద్రత, సంక్షేమం, పర్యావరణ సంరక్షణ మొదలైన సమస్యలు ముఖ్యం కాదు. వారికి కేవలం లాభాలు దండుకోవడమే లక్ష్యం.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం గత పదేళ్లుగా దూకుడుగా ప్రయివేటీకరణ విధానాలను అమలు చేస్తుంది. అందులో భాగంగా సింగరేణిలో 2021లో మరో దుర్మార్గ చట్టాన్ని తీసుకొచ్చింది. బొగ్గు వేలం పాటలో నెగ్గిన వారికి ఎలాంటి కండిషన్లు లేకుండా ఆ చట్టం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది.

ప్రభుత్వం తవ్వకాలు జరిపితే..

రాష్ట్రంలో సింగరేణి ప్రధానమైన ప్రభుత్వ రంగ సంస్థ. ఇది వేలాది మంది కార్మికులతో లాభాలు ఆర్జిస్తూ ముందుకు నడుస్తుంది. ఈ సింగరేణి సమస్య కేవలం ఆ ప్రాంత ప్రజల అభివృద్ధితో మాత్రమే ముడిపడి లేదు. దాంతో పాటు, కొనుగోలు శక్తి పెంచేందుకు ఇది ఉపయోగకరంగా ఉంది. విద్య, ఉపాధి, సంస్కృతి పరంగా పెనవేసుకొని అభివృద్ధికి దోహదపడే సంస్థ. ఇంత ప్రాముఖ్యత కలిగిన సంస్థను వేలంపాట నిర్వహించడం ద్వారా ప్రైవేటీకరించడం ఎంత మాత్రం తగదు. ప్రయివేటీకరణ వల్ల ఆ సంస్థతో పాటు కార్మిక కుటుంబాల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. వాస్త వంగా ప్రభుత్వమే పూనుకొని సింగరేణి ద్వారా బొగ్గు తవ్వకాలు జరిపితే ఉత్పత్తి కారు చౌకగా లభిస్తుంది. విద్యుత్ ఉత్పత్తి కూడా ధారా ళంగా, చౌవకగా లభిస్తుంది. కార్మికుల, ప్రజల ప్రాధాన్యతలను పక్కనపెట్టి బొగ్గుబ్లాకును వేలం వేయడం దుర్మార్గం, శోచనీయం.

సింగరేణికి నష్టం తెచ్చే చర్యలు..

పాలకుల విధానాల వల్ల కోల్ ఇండియా, సింగరేణికి ఎలాంటి హక్కులు లేకుండా మిగతా వాటి లాగానే వేలం పాటలో పాల్గొనాలి. యూపీఏ ప్రభుత్వ కాలంలో కోల్ ఇండియాలో 10 శాతం వాటాలు అమ్మితే, మోడీ ప్రభుత్వం మరో 29 శాతం వాటాలను అమ్మింది. తెలంగాణ వరప్రదాయని సింగరేణిని కార్పొరేట్ల చేతుల్లో పెట్టడం దాని లక్ష్యంగా ఉంది. ఆ విధానాలకు వ్యతిరేకంగా 2003లో సింగరేణి 15 రోజులు పాటు సమ్మె చేసింది. ఆ తర్వాత అనేక పోరాటాలు జరిగాయి. అయినా పాలకులు పెడచెవిన పెడుతున్నారు. మోడీ ప్రభుత్వం ప్రయివేటు వాళ్లకు విపరీత రాయితీలు ఇచ్చింది. బొగ్గు దిగుమతుల మీద సుంకం రద్దు చేసింది. వీటితో పాటు దేశంలో బొగ్గు వినియోగించే సంస్థలన్నీ 10 శాతం దిగుమతి చేసుకోవాలని నిబంధనలు కూడా విధించింది. దీంతో టన్ను బొగ్గు రూ.3,500, రూ.4000 కి ఇచ్చే సింగరేణి బొగ్గును కాదని అనివార్యంగా ఏపీ ప్రభుత్వం గతంలో టన్ను రూ.18 వేల రూపాయల చొప్పున 7 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి ఒప్పందం చేసుకుంది. విద్యుత్ ఉత్పత్తిలోనూ ప్రైవేట్ శక్తుల ప్రయోజనాలనే ప్రభుత్వం చూస్తుంది.

ఐక్యంగా అడ్డుకోవాలి!

గోదావరి నది పరివాహ ప్రాంతంలో సింగరేణి సంస్థ సొంత ఖర్చులతో అనేక ప్రాంతాల్లో సర్వే చేసి బొగ్గు బ్లాక్ లను గుర్తించింది. ఆపై బొగ్గు ఉత్పత్తిని కూడా చేపట్టింది.' శ్రావణపల్లి' లో కూడా ఆ రకంగానే బొగ్గు తవ్వకాలు చేపట్టాలి. కానీ వేలం పాట ద్వారా సింగరేణి దక్కించుకోవాలని బీజేపీ ప్రభుత్వం నిర్దేశిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే బాటలో నడిచి వేలం పాట ద్వారానే ప్రైవేటు వారికి ఇచ్చి వేశారు. దీనివల్ల క్రమంగా సింగరేణి నష్టాల్లోకి జారుకుంటుంది. బీజేపీ పాలకులకు అదే కావాలి. అందుకే వేలాన్ని రద్దు చేయాలని కార్మికులు, వారి కుటుంబాలు అశేష ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో బొగ్గు బ్లాకులన్నీ సింగరేణి హక్కుగా పరిగణించి తీరాలి. నేరుగా సింగరేణికే బొగ్గు బ్లాకులు ఇచ్చి తీరాలి. దొడ్డిదారిన సింగరేణిని వేలం ద్వారా ప్రయివేటీకరించేందుకు జరిగే కుట్రను కార్మిక వర్గం, ప్రజలు, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఐక్యంగా అడ్డుకోవాలి. వేలం పాటలను ప్రభుత్వ రద్దు చేసేదాక పట్టు విడవక పోరాడాలి.

డా. కోలాహలం రామ్ కిశోర్.

98493 28496

Advertisement

Next Story

Most Viewed