వడ్ల సంక్షోభ కారకులు పాలకులే

by Viswanth |   ( Updated:2022-09-03 18:22:51.0  )
వడ్ల సంక్షోభ కారకులు పాలకులే
X

'తిలా పాపం తలా పిడికెడు' తరహాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను సంక్షోభంలోకి నెట్టాయి. పరస్పర ఆరోపణలతో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. కరోనా సమయంలో ఆదుకున్నది ఈ రంగమేనని కీర్తిస్తూనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రైతుల ఆదాయాన్ని ఐదేళ్లలో రెట్టింపు చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక హామీకే పరిమితం చేసింది. కాలు మీద కాలేసుకుని కూర్చునే సంపన్న రైతులుగా తీర్చిదిద్దుతానన్న ముఖ్యమంత్రీ దీన్ని మాటలతోనే సరిపెట్టారు. సమస్యలను పరిష్కరించాల్సిన పాలకులు సరికొత్త సంక్షోభానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పరం పొలిటికల్ మైలేజీ కోసం పాకులాడుతున్నాయి. రైతుల బాధలను రాజకీయం కోసం వాడుకుంటున్నాయి.'

తెలంగాణ రైతులకు కొత్త తిప్పలు వచ్చి పడ్డాయి. యాసంగి సీజన్ వడ్లను ఎవరికి అమ్మాలో తేల్చుకోలేకపోతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పెట్టలేదు. ప్రైవేటు వ్యాపారులు కనీస మద్దతు ధరకు కొంటారనే గ్యారంటీ లేదు. కొనాల్సింది కేంద్రమేనని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. బియ్యం చేసి ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని కేంద్రం అంటున్నది. హైదరాబాద్, ఢిల్లీ మధ్య పరస్పరం ఆరోపణల యుద్ధం జరుగుతున్నది. సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలే సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను బలిపశువులను చేస్తున్నాయి. రెండు ప్రభుత్వాలూ పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయి.

ఏ రాష్ట్రంలోనూ రైతులకు ఎదురుకాని ఇబ్బందులు తెలంగాణలోనే చోటుచేసుకుంటున్నాయి. ధాన్య సేకరణ పై కేంద్ర ప్రభుత్వానికి జాతీయ విధానమంటూ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడేళ్లుగా కనిపించని వెలితి ఇప్పుడు తెరపైకి వచ్చింది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికీ స్పష్టత కరువైంది. గతేడాది నవంబరులోనే యాసంగి వడ్ల సేకరణకు సంక్షోభం రాబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గ్రహించింది. కేంద్రాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేసింది. ఐదు నెలలైనా దారి దొరకలేదు. కేంద్రంపై ఆధారపడడమే తప్ప ప్రత్యామ్నాయం గురించి ఆలోచించలేకపోయింది. ఇప్పుడు రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. కేంద్రాన్ని ఆరోపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వమూ అంతే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నది.

ఆత్మస్తుతి,. పరనింద

లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు, సాగు విస్తీర్ణం పెరగడం, భూగర్భ జలాలు మెరుగుపడడం, దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారం, దేశంలోనే సెకండ్ ప్లేస్, ఇలా ఎన్నో రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం తన గొప్పలుగా చెప్పుకున్నది. ఒక్క గింజ కూడా వదలకుండా కొంటున్నట్లు క్లెయిమ్ చేసుకున్నది. కోటి ఎకరాలలో వరి పండించినా కొంటామంటూ స్వయంగా ముఖ్యమంత్రే గర్వంగా ప్రకటించారు. ధాన్యాన్ని కొంటున్నది రాష్ట్ర ప్రభుత్వమే అనే అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. చివరకు కేంద్రం కొనడానికి ససేమిరా అనడంతో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రైతులకు, తెలంగాణ సమాజానికి సరికొత్త వాస్తవం బోధపడింది. ధాన్యాన్ని కొంటున్నది రాష్ట్రం కాదని, కేంద్రమేననే క్లారిటీ ఏర్పడింది.

కేంద్రం కొనకపోవడంతో నిందలకు పాల్పడుతున్నది. అవసరానికి మించి బియ్యం నిల్వలు పేరుకుపోయినట్లు కేంద్ర మంత్రి చెబుతున్నారు. అందుకే యాసంగి సీజన్‌లో బాయిల్డ్ రైస్ కొనలేమంటూ ముందుగానే హెచ్చరించారు. ఇకపైన బాయిల్డ్ రైస్ సరఫరా చేయబోమంటూ రాష్ట్ర ప్రభుత్వమూ రాతపూర్వకంగానే సమ్మతి తెలియజేసింది. ప్రత్యామ్నాయాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. మొత్తం దేశానికి ఆహార అవసరాలకు తగిన విధానాల రూపకల్పనలో కేంద్రమూ విఫలమైంది. రాష్ట్రాలలోని దిగుబడిని దృష్టిలో పెట్టుకుని తదనుగుణమైన ఏర్పాట్లు చేసుకోవడంలో ఫెయిల్ అయింది. అవసరానికి మించి నిల్వలు ఉన్నప్పుడు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ విధానాలపై ముందుచూపు కొరవడింది. ఇటు రాష్ట్రమూ, అటు కేంద్రమూ ప్లానింగ్‌లో వెనకబడ్డాయి. కష్టపడి పండించిన రైతులు బాధితులుగా మిగిలిపోయారు.

రైతులను గైడ్ చేయడంలో ఫెయిల్

సాగునీటి సౌకర్యాలు మెరుగుపడడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. కానీ, పెరిగే దిగుబడికి అనుగుణంగా మార్కెటింగ్ వ్యవస్థ గురించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. నిజానికి రాష్ట్రంలో ఆహార అవసరాలపై గతంలో ఎన్నడూ చేయనంతటి విశ్లేషణ తెలంగాణ సర్కారు చేసింది. ఎవరు ఎంత తింటున్నారు? ఏం తింటున్నారు? ఎంత ఉత్పత్తి అవుతున్నది? ఇతర రాష్ట్రాల నుంచి ఏమేం దిగుమతి చేసుకుంటున్నాం? స్వయం సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి అనేక అంశాలపై ముఖ్యమంత్రి లోతైన అధ్యయనం జరిపారు. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యాల్యూ ఎడిషన్ గురించి రూట్ మ్యాప్ ఇచ్చారు. ధారవిలో మహిళలు తయారుచేసే లిజ్జత్ పాపడ్ లాంటి అనేక ఉదాహరణలను ప్రస్తావించారు.

మహిళలను ప్రోత్సహించి ప్యాకేజ్డ్ ఫుడ్ పరిశ్రమలను నెలకొల్పుతామన్నారు. కానీ, అవేవీ గాడిన పడలేదు. మరోవైపు పంటల విధానంలో రావాల్సిన మార్పుల గురించీ ప్రస్తావించారు. క్రాప్ కాలనీలను ఏర్పాటు చేయాలన్నారు. క్లస్టర్లి వారీగా క్రాప్ పాటర్న్ రూపొందించాలన్నారు. దేశమంతా ఇది రూపుదిద్దుకోవాలన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలపై రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల దిశగా రైతుల్ని నడిపించాలన్నారు. రైతుబంధు సమన్వయ సమితులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. రైతు వేదికలు, కళ్ళాల ఏర్పాటు, గోడౌన్ల నిర్మాణం.. వీటన్నింటికీ శ్రీకారం చుట్టారు. కానీ దురదృష్టవశాత్తు ఇవన్నీ మాటలకే పరిమితమయ్యాయి. మౌలిక సౌకర్యాలు రైతులకు అక్కరకు లేకుండా పోయాయి.

కార్యరూపం దాల్చని ప్రణాళికలు

యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర వాతావరణ పరిస్థితులలో బాయిల్డ్ రైస్ తప్ప ముడి బియ్యం రావని రాష్ట్రం వాదిస్తున్నది. వరి వేయవద్దని రైతులకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పించలేకపోయింది సర్కారు. వరి తప్ప మరో పంట పండని నేలలలో ఏ పంటను సాగుచేయాలో కూడా సూచించలేకపోయింది. అందువల్లనే ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. యాసంగి పంటల ప్రణాళికనూ తయారు చేయలేదు.

గోడౌన్లు ఉన్నా రైతుల అవసరాలకు ఉపయోగపడలేదు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అనే ప్రకటనకు పరిమితమైంది. ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రైతుబంధు సమన్వయ సమితులు ఎందుకూ కొరగానివిగా మిగిలిపోయాయి. రైతుబంధు, రైతుబీమా పంపిణీకే వాటి కార్యాచరణ పరిమితమైంది. వ్యవసాయ శాఖ, వ్యవసాయ వర్సిటీ, విస్తరణాధికారులు లాంటి భారీ వ్యవస్థ ఉన్నా క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా పనిచేయలేకపోయాయి. కేంద్ర ప్రభుత్వానికి జాతీయ విధానమంటూ లేదని కేసీఆర్ నిందించారు. 75 ఏళ్ళలో ఆశించినంత అభివృద్ధి జరగలేదన్నారు. అసమర్థ ప్రభుత్వాలు, చేతకాని పార్టీలు అని తూర్పారపట్టారు. కానీ అదే సమయంలో క్రాప్ కాలనీలు, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యాల్యూ ఎడిషన్ అంటూ ఎన్నో ప్రకటనలు చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. కేంద్ర వైఫల్యాల మాటున రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుతున్నారు.

అంతా రాజకీయమే

'తిలా పాపం తలా పిడికెడు' తరహాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను సంక్షోభంలోకి నెట్టాయి. పరస్పర ఆరోపణలతో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. కరోనా సమయంలో ఆదుకున్నది ఈ రంగమేనని కీర్తిస్తూనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రైతుల ఆదాయాన్ని ఐదేళ్లలో రెట్టింపు చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక హామీకే పరిమితం చేసింది. కాలు మీద కాలేసుకుని కూర్చునే సంపన్న రైతులుగా తీర్చిదిద్దుతానన్న ముఖ్యమంత్రీ దీన్ని మాటలతోనే సరిపెట్టారు. సమస్యలను పరిష్కరించాల్సిన పాలకులు సరికొత్త సంక్షోభానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పరస్పరం పొలిటికల్ మైలేజీ కోసం పాకులాడుతున్నాయి. రైతుల బాధలను రాజకీయం కోసం వాడుకుంటున్నాయి.

ఎన్. విశ్వనాథ్

99714 82403

Advertisement

Next Story