ఆదివాసీల అస్తిత్వం కాపాడాలి!

by Ravi |   ( Updated:2023-08-09 00:30:43.0  )
ఆదివాసీల అస్తిత్వం కాపాడాలి!
X

దేశ మూలవాసులైన అడవి బిడ్డలు కొండ కోనల్లో అడవుల మధ్య బతుకుతూ ప్రకృతితో సహజీవనం చేస్తున్న కల్మషం లేని అమాయకపు జీవులు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎందరో పాలకులు మారిన ఆదివాసుల బ్రతుకులు మారడం లేదు. కష్టమైన, నష్టమైన అడవి తల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వీరు తరతరాలుగా మోసపోతూనే ఉన్నారు. వీరు వలస పాలనకు ముందు అడవిపై పూర్తి హక్కులు అనుభవించారు. కానీ తర్వాత వీరి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని పాలితులు వారిని అడవి నుండి దూరం చేయడానికి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వారికి ప్రత్యేక హక్కులు కల్పించడం కోసం చట్టాలు చేస్తున్నామని నమ్మబలికి వారి అస్తిత్వానికి ఎసరు పెట్టే చర్యలు అమలుచేస్తున్నారు. అదివాసీల పల్లెలు అభివృద్ధికి నోచుకోక కనీస అవసరాలు కూడా సమకూర్చకపోవడంతో అర్ధాకలితో, అక్షర రూపం తెలియకుండా అరకొర వసతులతో అడవి తల్లిని నమ్ముకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

ఆదివాసుల ప్రగతికి కీలకమైన విద్యను సక్రమంగా అందడం లేదు. ఇప్పటికీ ఆదివాసి గ్రామాలలో రవాణా సౌకర్యం, వైద్య సౌకర్యాలు లేక అనారోగ్యం పాలైతే వాగులు వంకలు దాటి కావడి ద్వారా మోసుకుంటూ వెళ్లడం విచారకరం. వీరు బ్రతుకు పోరాటంలో ఎన్నో ఎత్తు పల్లాలను ఎదుర్కొంటున్నారు. వీరు నివసించే ప్రాంతాలలో దొరికే సహజ వనరులపై ఉన్న శ్రబ్ద పాలకులకు ఆదివాసులపై లేదు. చాలా దేశాలలో ఆదివాసులకు తగిన గుర్తింపు, రక్షణ, హక్కుల చట్టాలు లేవు. ఉన్నా అవి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆదివాసుల జీవనం పట్ల వారి హక్కుల పట్ల రక్షణ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని ప్రపంచ ఆదివాసి దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి 1994 నుండి దీనిని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా మన దేశంలో ఆదివాసుల జీవన పరిస్థితి హక్కుల రక్షణ భద్రత గురించి చర్చించుకుందాం.

హక్కుల కోసం తిరుగుబాటు..

భారతదేశాన్ని రెండు శతాబ్దాలు పాలించిన బ్రిటిష్ వారు అటవి సంపదను దోచుకోవడానికి ఎన్నో చట్టాలు చేశారు. కానీ ఆ చట్టాలలో అడవులలో నివసించే గిరిజనుల జీవనం, హక్కుల గురించి ప్రస్తావించలేదు. అటవి ఉప ఉత్పత్తులపై హక్కులను గుర్తించలేదు. కానీ అడవి సంపద ప్రభుత్వ ఆధీనంలోకి చేర్చబడ్డాయి. ఇక్కడి నుంచి దోచుకువెళ్లిన కలపతోనే ఇంగ్లాండులో ఓడల నిర్మాణం, రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగింది.1880 జనాభా లెక్కల ప్రకారం ఏడు కోట్ల గిరిజనుల జనాభా ఉందని అంచనా వేయబడింది. బ్రిటిష్ ప్రభుత్వం అటవీ ప్రాంతాలలో ప్రభుత్వ అధికారులను నియమించి అడవులపై ఆధారపడిన ఆదివాసీ తెగలపై వారి జీవనం పైన విపరీతమైన కఠిన ఆంక్షలు విధించింది. చివరికి వంట చెరుకు, అనారోగ్యం పాలయితే వనమూలికలు తెచ్చుకొని మందులు తయారుచేసుకునేందుకు ఆంక్షలు విధించారు, ఆకలి తీర్చుకోవడానికి అడవిలో లభించే పండ్లు, ఫలాలు, కందమూలాలు, చింతపండు లాంటి ఉప ఉత్పత్తుల వినియోగంపై ఆంక్షలు విధించారు. ఇలా అడవుల్లో బ్రిటిష్ పాలకులు ఆదివాసీ జీవన విధానానికి, వారికి లభించవలసిన న్యాయపరమైన హక్కులకు ప్రమాదం కల్పించిన రోజుల్లో ఉభయగోదావరి లోయ ప్రాంతాడవుల్లో అల్లూరి సీతారామరాజు, ఆదిలాబాద్ అడవుల్లో కొమరం భీములు వలస పాలకులకు వ్యతిరేకంగా జల్, జంగిల్, జమీన్ హమారా అంటూ పోరాటాలు, వందలాది తిరుగుబాట్లు ,ఉద్యమాలు లేవదీశారు. ఈ ఉద్యమాలు స్వాతంత్ర ఉద్యమానికి కూడా ఉపయోగపడ్డాయి. ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ సమయంలో ఆదివాసులు స్వయం సమృద్ధికి తమ హక్కుల రక్షణకు ఆదివాసీ ప్రాంతాలతో కూడిన ప్రత్యేక దేశం కావాలని డిమాండ్‌ను బలంగా వినిపించారు. కానీ దేశ విభజన వల్ల ఐక్యతకు భంగం కలుగుతుందని ఆదివాసుల హక్కులకు అడవిపై ప్రత్యేక హక్కులు కల్పిస్తామని ఆనాటి జాతీయ నాయకులు తీన్ మూర్తి భవన్‌లో చర్చలు జరిపి నచ్చజెప్పి ప్రత్యేక రక్షణ చర్యల కోసం 5వ ఆరవ షెడ్యూల్ రాజ్యాంగంలో పొందుపరిచారు. అదేవిధంగా కేవలం విద్యా, ఉపాధి అంశాల్లో రిజర్వేషన్లు ప్రకటించడమే కాకుండా అటవీ ప్రాంతాలలో ఆదివాసుల స్వాధీనంలో ఉన్న భూములను అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ చట్టాలలో కూడా రక్షణ కల్పించారు. ఆదివాసులకు న్యాయం జరగాలంటే ఆదివాసీల ప్రాంతాలలో పరిపాలన వారికే ఉండాలని రిజర్వేషన్లు కల్పించి చట్టసభలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే భూ బదలాయింపు నిషేధ చట్టం, వడ్డీ నియంత్రణ చట్టం, పిసా చట్టం, వంద శాతం ఉద్యోగాలను వారికే కేటాయించేలా జీఓ నెంబర్-3, అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 లాంటి చట్టాలను చేశారు.

వివాదాస్పదంగా నూతన చట్టం

అయితే మనదేశంలో చట్టాలు చేసినంత హడావుడి వాటి అమలులో ఉండదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వీటిని నిర్వీర్య పరుస్తున్నారు. ప్రస్తుతం జీఓ-3ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దానిని పునరుద్ధరించి, దాని అవసరాన్ని గుర్తింపజేయటానికి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడంపై ప్రభుత్వాల చర్యలు శూన్యం. ఇక తరతరాలుగా పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసుల పోడు భూములు లాక్కోవడం, పంట పొలాలను పాడు చేయడం, అక్రమంగా జైల్లో వేయడం నిత్యకృత్యమయ్యాయి. ఆ భూములకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న పాలకులు నామమాత్రమైన చర్యలతో అసంపూర్తిగా పోడు పట్టాల పంపిణీ జరిగింది. ఇటీవల అటవీ సంరక్షణ చట్టం 1980 సవరణ బిల్లును మార్చి నెలలో లోక్‌సభలో ప్రవేశపెట్టడంతో వివాదాస్పదంగా మారింది. ఈ ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని పార్లమెంటు స్థాయి సంఘానికి అప్పగించాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ నాయకత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగించింది. ఈ బిల్లుపై పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్ర అభ్యంతరాలను విజ్ఞాపనలకు వేలాదిగా పంపినా కమిటీ వాటిని పరిశీలనలోకి తీసుకోలేదు. అయితే కేంద్రం ప్రతిపాదించిన సవరణలన్నీ ఈ చట్టాన్ని కార్పొరేటీకరణ మాయం చేసేదిగా కుట్రపూరిత వ్యూహాలతో కూడినదిగా కనిపిస్తుంది. కార్పొరేట్లకు ప్రైవేటు కంపెనీలకు అడవి తల్లిని అప్పగించేందుకు వీలు లేకుండా అడ్డుపడుతున్న గత చట్టాల నిబంధనలను నీరుగార్చి సవరణలు తీసుకువచ్చినట్లు అనిపిస్తుంది.

ఈ బిల్లులో అటవీప్రాంతాలను ఇతర ప్రయోజనాలకు వాడుకునేందుకు 100 హెక్టార్ల భూమి నిబంధనను 1000 హెక్టార్లుగా మార్చారు. గత నిబంధనల ప్రకారం అటవీ భూసేకరణకు గ్రామసభ అనుమతి తప్పనిసరి. ఇప్పుడు దానిని తొలగించారు. అటవీ భూముల బదలాయింపు జరగాల్సి వచ్చినప్పుడు ముందుగానే అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం అడవి బిడ్డలకు దక్కవలసిన ప్రయోజనాలను స్థానిక కలెక్టర్లు సమకూర్చాలి. నూతనంగా తెచ్చిన ఈ సవరణ చట్టంలో ఈ నిబంధనలను తొలగించారు. గ్రామసభలకు ఉన్న హక్కులను తుంగలో తొక్కారు. పైగా సంస్కరణలన్నీ సైనికులకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి చేస్తున్నామని చెప్పడం విడ్డూరం. ఈ సవరణలు అమలు చేస్తే ఆదివాసుల ప్రత్యేక హక్కుల కోసం రాజ్యాంగం ఇచ్చిన రక్షణ వ్యవస్థను తొలగించడమే.

అడవి నుంచి తరిమేసే చర్యలు..

స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినప్పటికీ ఇంకను పలు ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇటీవల ములుగు జిల్లాలో 23 గ్రామాలను షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించాలని సుప్రీం తీర్పు వెలువడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 753 గ్రామాలను షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించాలని నివేదించి దశాబ్దాలు కావస్తున్నా ఆ ప్రతిపాదనలను పట్టించుకున్న వారే లేరు. ఇప్పటికే 10 కోట్ల మంది అమాయక ఆదివాసులను టైగర్ జోన్, రిజర్వు ఫారెస్ట్‌ల పేరిట, మైనింగ్ లీజుల పేరిట, సౌర విద్యుత్ జోన్ల పేరిట అడవి నుండి తరిమివేసే చర్యలు మొదలయ్యాయి. ఆదివాసుల జీవితాలతో ఆది నుంచి ఆటలాడుకుంటున్న పాలకులు చట్టాల సవరణ పేరుతో సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా నూతన చట్టాలు తయారు చేయడం ఆదివాసుల మనుగడకే ప్రమాదం. ఇప్పటికే అడవిని నరికి వేయడం వల్ల వాతావరణ మార్పులపై తీవ్ర ప్రభావం చూపి గతంలో ఎన్నడు లేనంతగా అకాల వర్షాలు, వరదలు విపరీతమైన వేడి వంటి వాటితో ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో విధ్వంసకర అభివృద్ధి కొనసాగిస్తూ భూతల్లి బిడ్డలను చిదిమేస్తూ వారి జీవన మనుగడకు ఆటంకం కలిగించే ప్రయత్నాలకు స్వస్తి చెప్పాలి. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జాతుల మధ్య తెగల మధ్య వైరాన్ని పెంచి అలజడి సృష్టించడమే కాకుండా, మణిపూర్ మంటల సాక్షిగా ప్రతిపక్షాలు అవిశ్వాసం ప్రకటించిన కాలంలోనే అటవీ సంరక్షణ సవరణ బిల్లును ఆమోదింప చేసుకోవడం అభ్యంతరకరం. ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఆదివాసీ బిడ్డను దేశ అత్యున్నత పదవి అలంకరించేలా చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆదివాసి బిడ్డల భద్రతకు వారి ఆచార వ్యవహారాలకు సంప్రదాయాలకు ముఖ్యంగా వారి అస్తిత్వానికి భరోసా కల్పించే విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదివాసి బిడ్డలను కాపాడడానికి వారి భద్రతకు, అభివృద్ధికి, వికాసానికి సాటి మానవులుగా చేయూతను ఇవ్వాల్సిన అవసరం పౌర సమాజానికి, ప్రజాస్వామిక వాదులకు మేధావులకు ఉంది.

(నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం)

తండ సదానందం

టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్

99895 84665

Advertisement

Next Story