వారి మధ్య పోలిక కరెక్టే!

by Ravi |   ( Updated:2024-08-09 17:51:02.0  )
వారి మధ్య పోలిక కరెక్టే!
X

ఎస్కోబార్‌కు, జగన్‌కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. సౌత్ అమెరికాలో కొలంబియా దేశం డ్రగ్స్‌కు చాలా ప్రసిద్ధి. అక్కడ పేద కుటుంబంలో జన్మించిన ఎస్కోబార్ తిరుగులేని మాఫియా డాన్‌గా ఎదిగాడు. మెడలిన్ అనే ప్రాంతంలో తన నేర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మాదకద్రవ్యాల ముఠాకు నాయకత్వం వహించాడు. ఆ రోజుల్లోనే కొన్ని లక్షల కోట్లు సంపాదించాడు. ఈ క్రమంలో పెద్ద నేరసామ్రాజ్యాన్నే స్థాపించాడు. ఈ క్రమంలో ఎవరైనా ఎదురు తిరిగితే చంపేసేవాడు. పోలీసు అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, మాటవినని వారిని భయబ్రాంతులకు గురిచేసేవాడు. కొలంబియాలో ఉన్న అన్ని వ్యవస్థలపై అతడు పెత్తనం చేశాడు. ఎస్కోబార్‌లో ఉన్న అన్ని లక్షణాలను జగన్ రెడ్డి పుణికి పుచ్చుకున్నారు. అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ రెడ్డిని ఫ్యాబ్లో ఎస్కోబార్‌తో సరిపోల్చడం సరి అయినదని చెప్పవచ్చు.

ఒకానొక దశలో కొకైన్ కింగ్ ఎస్కో బార్‌కు లెక్కపెట్టలేనంతంగా డబ్బు వచ్చిపడేది. వాటిని లెక్కించేందుకు పెద్దపెద్ద మెషిన్లు తెచ్చేవారు. డజన్ల కొద్దీ మనుషులను పెట్టేవాడు. వారికి జీతభత్యాలు కొన్ని లక్షలు చెల్లించేవాడు. 70, 80 దశకాల్లో సుమారు రెండు దశాబ్దాల పాటు అతడి హవా కొనసాగింది. ఈ విషయంలో కూడా జగన్ రెడ్డికి పోలిక ఉంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాదాపు 4 లక్షల కోట్లు అక్రమం గా సంపాదించారు. ఎస్కో‌బార్‌కు చిన్నతనంలో పేదరికం కారణంగా డబ్బుపై విపరీతమైన ఆశ పెరిగింది. 2004కు ముందు వైఎస్ కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి హైదరాబాద్‌ లో ఇల్లు అమ్మకానికి పెట్టారు. వైఎస్ కుటుంబం పేదరికంలో లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత డబ్బు అవసరమైంది. అది చూసిన జగన్ రెడ్డి.. బాగా డబ్బు సంపాదించాలనే ఆశ కలిగింది. తాత రాజారెడ్డి, తండ్రి రాజశేఖర్ రెడ్డి స్థాపించిన నేర సామ్రా జ్యాన్ని పదింతలు విస్తరించారు. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు చేతులతో ఎడాపెడా సంపాదించేశారు. ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడూ చేయని విధంగా అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు.

అవధులు మీరిన సంపాదన..

అధికారం చేపట్టిన 2019-24 మధ్య కూడా డబ్బు సంపాదన పైనే జగన్ రెడ్డి ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇసుక, మద్యం, ఖనిజ సంపద దోపిడీ ద్వారా వేల కోట్లు సంపాదించారు. అక్రమ వ్యాపారం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎస్కో బార్‌ను కట్టడి చేయాలని అక్కడి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసింది. తన నేరస్వభావంతో వాటిని ఎదుర్కొన్నాడు. తనను ఎవరు టార్గెట్ చేశారో వారిని వేధించేవాడు. దేశ అధ్యక్ష స్థానానికి పోటీ పడే అభ్యర్థులను సైతం హత్య చేయించాడు. న్యాయవ్యవస్థను పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకునే వాడు. తనకు వ్యతిరేకంగా తీర్పులు వస్తే జడ్జీలను, ప్రాసిక్యూటర్లను బెదిరించేవాడు. ఆ దేశ సుప్రీంకోర్టును ధ్వంసం చేయడానికి పథక రచన చేశాడు. అందుకోసం తీవ్రవాదులకు డబ్బులు, ఆయు ధాలు, హెలికాఫ్టర్లు ఇచ్చి మరీ కాల్పులు జరిపించాడు. భయోత్పాతం సృష్టించాడు.

న్యాయవ్యవస్థను భయపెట్టారు!

అదే పద్ధతిలో న్యాయవ్యవస్థను పరోక్షంగా ప్రభా వితం చేయడానికి, భయపెట్టడానికి జగన్ రెడ్డి కూడా కుట్ర పన్నారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారు. మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులను హైకోర్టు న్యాయమూర్తులపై ఉసిగొల్పారు. న్యాయమూర్తుల వ్యక్తిగత ప్రతిష్టలను హననం చేశారు. చివరకు సీబీఐ అధికారులను కూడా వదిలిపెట్టలేదు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారిస్తున్న రామ్ సింగ్‌పై సైతం కేసు పెట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను సైతం మానసిక క్షోభకు గురిచేసి బయటకు పంపారు. అమెరికా ఒత్తిడితో ఎస్కోబార్‌పై మిలటరీ ఆపరేషన్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా ప్రత్యేక జైలు నిర్మించుకుంటానని చెప్పడంతో కొలం బియా ప్రభుత్వం సైతం ఒప్పుకుంది. సొంత జైలులో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నా డు. అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడు. దీంతో కొలంబియా పోలీసులు పట్టుకుని 1993లో కాల్చి చంపేశారు. అక్రమాస్తుల వ్యవహారంలో జగన్‌రెడ్డిపై 11 సీబీఐ కేసులు, 6 ఈడీ కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో ఏ-1 గా ఉండి, 16 నెలలు జైలు జీవితం గడిపారు. జైలులో కూడా సర్వభోగాలు అనుభవిస్తూ తన ఆర్థిక, నేర సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు.

పోలీసులను ఉసిగొల్పి వేలాది కేసులు..

ఐదేళ్ల వైసీపీ పాలనలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. హత్యలు, అత్యాచారాలు, బెదిరింపులు, గంజాయి, డ్రగ్స్‌ సరఫరా నిత్యకృత్యమయ్యాయి. ప్రతిపక్షాలను అణగదొక్కారు. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రిపై 17 అక్రమ కేసులు నమోదు చేశారు. చివరకు జైలుకు కూడా పంపి పైశాచికానందం పొందా రు. జగన్‌ పాలనలో 300 మంది బీసీలను హత్య చేశారు. ఎస్సీలపై 10,377 నేరాలు, మహిళలపై 89,875 నేరాలు జరిగాయి. 700 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారు. పోలీసులను చెప్పుచేతల్లో పెట్టుకుని వేలాది తప్పుడు కేసులు పెట్టారు. ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు, న్యాయమూర్తులు, మీడియా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరినీ వేధించారు. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీస్ స్టేషన్‌లోనే చావబాదారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్‌ను వేధించి చనిపోయేలా చేశారు. సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య కుట్రకు పథక రచన చేశారు.

వ్యవస్థల నియంత్రణలో నంబర్ వన్!

అన్ని వ్యవస్థలను బెదిరించడం, భయపెట్టడం ద్వారా నియంత్రణలోకి తెచ్చుకోవడంలో పోలికలు ఉన్నాయి. ధనవంతుల వద్ద డబ్బు కొట్టేసి పేదవారికి పంచే రాబిన్ హుడ్ ఇమేజ్ ఎస్కోబార్‌కు ఉండేది. పేదల కోసం ఎస్కోబార్ డబ్బులు వెదజల్లేవాడు. జగన్ రెడ్డి కూడా పేదల కోసం ఉచితాలు అని కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. ప్రజల డబ్బును ఆయాచితంగా దోచిపెట్టారు. అభివృద్ధిని గాలికి వదిలేశారు. ఇసుక, మద్యం, వివిధ కాంట్రాక్ట్‌లు అన్ని, తాను తన చుట్టూ ఉన్నవారు మాత్రమే చేసుకుంటూ రెండు చేతులా యథేచ్ఛగా దోపిడీ చేశారు. ఎస్కోబార్ కూడా అంతే. పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నప్పుడు ఎస్కోబార్ చేస్తున్నటువంటి దాష్టీకాలు చూసి ఆ దేశ పార్లమెంట్ అతడిని అనర్హుడిగా ప్రకటించింది. జగన్ రెడ్డి అంతకంటే ఎక్కువ నేరాలు-ఘోరాలు చేశారు. కానీ అతడిని అనర్హుడిగా ప్రకటించలేదు. పైగా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఎస్కోబార్‌కు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు పెద్దపోరాటమే చేశారు. జగన్ రెడ్డిని కూడా తాజా ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. ఎస్కోబార్‌కు జగన్ రెడ్డికి పోలికలు ఉన్నా యని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మన్నవ సుబ్బారావు

99497 77727

Advertisement

Next Story