గిరిజన రిజర్వేషన్‌కు మోకాలడ్డు

by Ravi |   ( Updated:2023-01-04 02:37:28.0  )
గిరిజన రిజర్వేషన్‌కు మోకాలడ్డు
X

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ పెంచుతూ జారీ చేసిన జీఓ నెంబర్ 33ని, కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్టబద్ధత కల్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రోజుకొకరు పూటకో మాట మాట్లాడుతున్నారు. వారి మాటలతో గిరిజన ప్రజలు అభద్రతా భావంలోకి వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి ఇష్టపడటం లేదు. అందుకే దీనిపై నిర్ణయం తీసుకోవడానికి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఉన్న కేసును బూచిగా చూపెడుతుంది. కానీ సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు, గిరిజన రిజర్వేషన్ పెంపునకు, దాని చట్టబద్ధతకి ఎటువంటి సంబంధం లేదని గిరిజన నాయకులు, మేధావులు వాదిస్తున్నారు.

వారి తీరు శోచనీయం

నిజానికి గిరిజనులకు ఉన్న రాజ్యాంగపర హక్కును కోర్టులో ఉన్న కేసుకు ముడిపెట్టి బీజేపీ నాయకులు పదేపదే వివిధ రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ, ఈ పెంపునకు ఆ కేసుకు సంబంధం లేదని గిరిజన మేధావులు చెబుతున్నారు. తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు ఆశించి బీజేపీ ఈ రిజర్వేషన్‌ని ఆపుతుంది. ఆ పార్టీ దీని ద్వారా లబ్ధి పొందాలనుకోవడం సిగ్గుచేటు. అలాగే ఈ రిజర్వేషన్ అమలు కాకుండా ఉండేందుకు న్యాయపరమైన చిక్కులు సృష్టించేందుకు గిరిజన రిజర్వేషన్ వ్యతిరేక శక్తులను పరోక్షంగా ఆ పార్టీ రెచ్చగొడుతోంది. వారికి సహకరిస్తూ మోకాలడ్డు పెడుతోంది. గిరిజనులు మారుమూల గ్రామాలలో నివసిస్తూ ఉంటారు, వారి కుటుంబాలు వెనకబడి ఉంటాయి. అందుకే వారి అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. దీంతో గిరిజనులకు ఉపాధి మెరుగుపడింది. గిరిజన రిజర్వేషన్ తీసుకొచ్చి వారి కుటుంబాలలో ఇంకా సంతోషం నింపడం కోసం తెలంగాణ రాష్ట్రం వారి రిజర్వేషన్ ను 10 శాతానికి పెంచి ఆ బిల్లును కేంద్రానికి పంపింది. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.

పూర్తి బాధ్యత కేంద్రానిదే

గిరిజనుల రిజర్వేషన్ల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మాత్రం పెద్దపీట వేస్తున్నది. వారికి వేల కోట్ల రుణాలు మాఫీ చేసి పేదలను కొల్లగొట్టే చర్యలకు పాల్పడుతున్నది. ఎనిమిదేళ్లుగా కేంద్రం అవలంబిస్తున్న ఈ విధానాలతో గిరిజనులు ఎంతో నష్టపోతున్నారు. అదే సమయంలో, తెలంగాణ రాష్ట్రం అడవి బిడ్డల రిజర్వేషన్లు పెంచడం అభినందనీయం. గిరిజనుల రిజర్వేషన్లు పెరిగితే వారి అభివృద్ధి మరింతగా పెరుగుతుంది. అందుకే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం త్వరగా స్పందించి ఆమోదముద్ర వేయాలి. కేంద్ర ప్రభుత్వం గిరిజన యువతకు ఎంతో నష్టం కలిగిస్తోంది. ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా, అట్టడుగు నుండి ఎంతో కష్టపడి చదువుకున్న వారికి అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ సర్కారు గిరిజన బ్రతుకులు మార్చాలని రిజర్వేషన్లు పెంచి వారు ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేస్తోంది. కేంద్ర సర్కార్ గిరిజన రిజర్వేషన్‌కి ఆమోదముద్ర వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటాన్ని గిరిజన యువత గమనిస్తూనే ఉన్నారు. వారికి తగిన బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. గిరిజన రిజర్వేషన్ అమలులో ఏవైన అవాంతరాలు ఎదురైతే దానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి. గిరిజన సంఘాలు, మేధావులు, ఉద్యోగులు ఐక్య పోరాటాలు నిర్వహించేందుకు సమాయత్తం కావాలి. బీజేపీ నాయకులు ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.

లకావత్ చిరంజీవి నాయక్

కేయూ, వరంగల్

99630 40960

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

వరల్డ్ వాక్: ఆధిపత్య పీడనపై స్వేచ్ఛ పోరాటం


Advertisement

Next Story