- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూర్వవైభవం వైపుగా విశ్వవిద్యాలయాలు..
తెలంగాణ రాష్ట్ర సాధనతో విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని భావించి ఆకాంక్షల సాధన కోసం ఎందరో విద్యార్థులు, నిరుద్యోగులు నెలల తరబడి ఉద్యమంలో తమ వంతు బాధ్యతగా చదువులను బహిష్కరించి ,విధులు పక్కనపెట్టి ప్రతిరోజూ రోడ్లపై నిరసనలు, ధర్నాలు తదితర కార్యక్రమాలు పాలుపంచుకున్నారు. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
రాష్ట్ర సాకారం అనంతరం గత కేసీఆర్ ప్రభుత్వం ‘బంగారు తెలంగాణ ఏర్పాటు’ పేరుతో నిరుద్యోగ విద్యార్థులను మాటలతో మభ్యపెట్టి, మోసం చేసి రాష్ట్ర విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయకుండా నిర్వీర్యం చేసి, అదే సమయంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ‘బంగారు తివాచీ’ని పరచి, కోటి ఆశలతో నమ్మినవారిని నయవంచన చేసి పదేళ్లపాటు పబ్బం గడుపుకుంది. ఫలితంగా ఉచితంగా లభించే ఉన్నత విద్య అంగట్లో సరుకులా తయారై చదువుకునే పట్టాలు ‘కొనుక్కునే’ పరిస్థితి దాపురించింది. విద్యారంగం పదేళ్ల విధ్వంసం అనంతరం దీనికి విరుద్ధంగా ఉన్నత విద్యకు ఈ వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో ప్రస్తుత ప్రభుత్వ ‘ప్రోత్సాహకాలు’ ఆశాజనకంగానే ఉన్నాయి.. ‘ఇప్పటికిప్పుడే’ పూర్తిస్థాయిలో నిర్ణీత ఫలితాలను అందించలేకపోయినా.. అవి రాష్ట్ర విశ్వవిద్యాలయాల నిర్వీర్యానికి బదులుగా పూర్వవైభవానికి బాటలు వేస్తాయనడంలో సందేహం లేదు.
రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో విధ్వంసం..
తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో ఒక కొత్త రాష్ట్రంగా అవతరించినప్పటి నుండి, ఉన్నత విద్యారంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయని అందరూ ఆశించారు. గడిచిన గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం జరిపిన విద్యారంగ విధ్వంసం వల్ల రాష్ట్ర విశ్వవిద్యాలయాలు కోలుకోలేక కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. వాస్తవానికైతే ఇవి ప్రభుత్వ ఆధ్వ ర్యంలో నడిచే ఉన్నత విద్యాసంస్థలు. విద్యారంగానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి పేద విద్యార్థులకు ఉచిత విద్యను సులభతరంగా అందించే విధంగా ఏర్పాటు చేయబడి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటాయి, తక్కువ ఫీజులతో ఉన్నత విద్యను అందిస్తాయి. కానీ, దీనికి విరుద్ధంగా గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల వీటికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు కరువై, నిధుల కేటాయింపు లేక, నిర్వహణ భారమై, అందునా బోధన, బోధనేతర ఉద్యోగాల ఖాళీల భర్తీ చేపట్టని క్రమంలో తక్కువ నిధులతో నడపబడుతూ.. విద్యా ప్రమాణాలు తగ్గిపోవడం అనేది ఓ పెద్ద సమస్యగా మారింది. దీనికి తోడుగా వైస్ చాన్సలర్లు, ఇతర సిబ్బంది పాల్పడిన అవినీతిపై ఆరోపణలతో, విచారణలతో అప్రదిష్టను సంతరింపజేసుకుని మసకబారిపోయి నిర్వీర్యమైపోయాయనేది నిర్వివాదాంశం. కరోనా విపత్తు ఆవహించిన విషమ కాలంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు కోసం గత ప్రభుత్వం ఇచ్చిన ఆమోదం వల్ల ఇప్పటివరకు వాటి సంఖ్య 5 నుండి 10 వరకు క్రమేణా పెరుగుతూ పోయింది, ఈ దుష్పరిణామ క్రమాన్ని గమనిస్తే ప్రత్యక్షంగా గత ప్రభుత్వమే రాష్ట్ర విశ్వవిద్యాలయం ప్రాముఖ్యతను తగ్గించే విధంగా వ్యవహరించిందనేది ప్రస్ఫుటంగా గోచరిస్తూనే ఉంది.
ప్రయోజనాలున్నా..పేదలకు ఒరిగేది శూన్యమే!
ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి. విద్యార్ధులకు అధునాతన సౌకర్యాలు, పరిశోధన అవకాశాలు, గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణమైన విద్య అందించగలవు. కానీ, ప్రైవేటు విశ్వ విద్యాలయాలు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తాయి. ఇవి సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందే ఉన్నత విద్యను దూరం చేస్తాయి. ఈ విధంగా, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ప్రాముఖ్యత తగ్గుముఖం పట్టడం వల్ల విద్యారంగంలో అసమానతలు మరింత పెరగడానికి దారి తీస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని పరిష్కరించడానికి తగిన నిధులు, సౌకర్యాలు, పరిశోధన అవకాశాలు అందజే యడం వలన వాటి ప్రాముఖ్యతను పెంచాలి. అలాగే, అదే సమయంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల నియంత్రణకు కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. మొత్తానికి, నూతన తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు అనేది ఒక ప్రగతిశీల ఆలోచనలో భాగమే అయినప్పటికీ, అదే క్రమంలో రాష్ట్ర విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేయకుండా వాటి ప్రాముఖ్యతను కాపాడడం చాలా ముఖ్యమనేది గమనార్హమైన విషయం.
40 వేల మంది విద్యార్థుల దుస్థితి..
2022 సంవత్సరంలో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల వీటిలో (అనుమతి లభించని అయిదు విశ్వవిద్యాలయాల్లో) ప్రవేశాలు పొందిన దాదాపు 40వేల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మార్చింది. గుర్తింపు లేకుండా విద్యార్థులను చేర్చుకున్న యాజమాన్యాలపై చర్యలకు ఉపక్రమించకుండా వదిలేసి..అధికారులు పరీక్షల నిర్వహణకై ఇబ్బందుల్లో చిక్కుకున్న విద్యార్థులకు తాత్కాలిక సర్దుబాటుతో వేరే సంస్థల తరఫున హాజరయ్యే వెసులుబాటు కల్పించా రు. వాటికి సంబంధించిన ఫైల్‌పై అనుమతి పొందిన విశ్వవిద్యాలయాల్లోనూ నిబంధనలకు పాతరేశారు. మూతబడ్డ ఇంజనీరింగ్ కళాశాలల్లో, సరైన భవనాలు లేకపోయినా, కేవలం లీజు భూముల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో వీటిని ప్రారంభించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి పర్యవేక్షణ లేకుండా ప్రత్యేక నిబంధనలు రూపొందించారు. విద్యార్థులు, సంఘాలు, తల్లిదండ్రుల డిమాండ్‌ను పెడచెవిన పెట్టి 5 ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసి ‘ఏళ్లు’ గడుస్తున్నా.. వాటిలో ‘ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు’ అమలు ప్రక్రియ అటకెక్కడం విడ్డూరం.
నూతన ఒరవడి.. ఫలితం ఇవ్వాలి!
విద్యారంగ పదేళ్ల విధ్వంసం అనంతరం దీనికి విరుద్ధంగా ఉన్నత విద్యకు ఈ వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో ప్రస్తుత ప్రభుత్వ ‘ప్రోత్సాహకాలు’ కొంతమేరకు ఆశాజనకమే. అయినా..’ ఇప్పటికిప్పుడే’ పూర్తిస్థాయిలో నిర్ణీత ఫలితాలు అందించలేకపోయినా.. అవి రాష్ట్ర విశ్వవిద్యాలయాల నిర్వీర్యానికి బదులుగా పూర్వవైభవానికి బాటలు వేస్తాయనడంలో సందేహం లేదు. అదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో విద్యార్థుల్లో ఉపాధి కోసం నైపుణ్యాల అభివృద్ధికి ‘స్కిల్డ్ యూనివర్సిటీ’ ఏర్పాటుకై ఆఘమేఘాల మీద బడ్జెట్ కేటాయింపు, స్థలపరిశీలన, శంకుస్థాపన చేయడంతో పాటు.. అదనంగా డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటుకై కూడా ప్రకటన చేయడం ముదావహం. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలలో నూతన రాష్ట్ర యూనివర్సిటీల ఏర్పాటుకు, ప్రణాళికల తయారీకి ఆదేశాలివ్వడం లాంటి అంశాలు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యలో 'కొత్తకోణం'లో ఉత్తమ ఫలితాలను ఇవ్వడానికి దోహదపడతాయి.
నంగె శ్రీనివాస్
ప్రిన్సిపాల్ & ఎడ్యుకేషనల్ ఎనలిస్ట్
9441 909191