- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సమస్యలు తీరితేనే చక్కని చదువు
నిజానికి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు లేవనెత్తిన అంశాలు తెలంగాణలో ఉన్న ఏ యూనివర్సిటీకీ మినహాయింపు కాదు. ప్రతి వర్సిటీలోనూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ ఉద్యమం తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు చేరితే అప్పుడు పాలకులు అధికారం కోల్పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కావున ప్రభుత్వం బాసర విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు సత్వరమే అన్ని సమస్యలను పరిష్కరించాలి. మిగతా వర్సిటీల మీద కూడా దృష్టి సారించాలి. ఉచితంగా కేజీ టు పీజీ నాణ్యమైన విద్య అందించే దిశగా అడుగులు వేయాలి.
సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ నేపథ్యంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో పెను మార్పులు వచ్చాయి. దీంతో గ్రామీణ విద్యార్థులకు ప్రపంచస్థాయి ప్రమాణాలు, లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై ఎగ్జాంపుల్, ప్రాబ్లం బేస్డ్ లెర్నింగ్, సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ వంటి పద్ధతులను అందుబాటులోకి తేవలసిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం సంప్రదాయ కోర్సులకు భిన్నంగా అత్యాధునిక కోర్సులను ప్రవేశపెట్టి నాణ్యమైన విద్యను అందించాలని యూజీసీ భావించింది. దీనికి అనుగుణంగా 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాసర, నూజివీడు, ఇడుపులపాయలోలో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ) అనే పేరుతో మూడు క్యాంపస్‌లను ఏర్పాటు చేసింది.
గ్రామీణ ప్రాంతాలలో చదివిన పదో తరగతి విద్యార్థుల మార్కుల ఆధారంగా ఇందులో ప్రవేశం కల్పిస్తారు. మొదట కేవలం ఇంజనీరింగ్ కోర్సులనే ప్రవేశపెట్టారు. ఆ తరువాత హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, ఏంఏ, ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ కోర్సులకు కూడా అనుమతి ఇచ్చారు. తెలంగాణలోని గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఆహ్లాదకర వాతవరణంలో అత్యాధునిక కోర్సులు, అనుభవజ్ఞులైన ఫ్రొఫెసర్లు, ల్యాబులు, వసతితో క్యాంపస్ ఏర్పడింది. దీంతో సహజంగానే ఇక్కడ చేరితే నైపుణ్యాలు పెంచుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సులభంగా పొందవచ్చని అనుకుంటారు. కానీ, అదంతా గతం. నేడు పరిస్థితులు మారాయి. నాణ్యమైన విద్య కోసం, మేలు రకం భోజనం కోసం, మంచి వసతి కోసం వేలాది మంది విద్యార్థులు వారం రోజులపాటు ఉద్యమం చేయాల్సి వచ్చింది.
రాజకీయ జెండా లేకుండా
బాసర ట్రిపుల్ ఐటీలో తొమ్మిది వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తమకు కనీస మౌలిక సదుపాయాలు కావాలని, తగిన బోధనా సిబ్బందిని, రెగ్యూలర్ వీసీని నియమించాలని, నాణ్యమైన వసతి కల్పించాలని, ప్రతి విద్యార్థికి ల్యాప్‌టాప్, యూనిఫామ్ సమకూర్చాలని, మెస్ మెయింటెనెన్స్ మెరుగ్గా ఉండేలా చూడాలని ఎనిమిది రోజులు శాంతియుతంగా వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ నిరసన తెలిపారు విద్యార్థులు. విద్యాశాఖ మంత్రి వారి డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని అనడంతో ఆగ్రహానికి గురయ్యారు. సీఎం కేసీఆర్ క్యాంపస్‌ను సందర్శించాలని డిమాండ్ చేశారు. ఇందులో ఏమాత్రం రాజకీయ జెండా ఎజెండా లేదని వారి ఐక్య పోరాటం చూసినవారికి అర్థమవుతుంది.
నిజానికి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు, ప్రజా సంస్థలు, మేధావులు, ప్రొఫెసర్లు అధికార పక్షానికి ప్రజల మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలను తీసుకువస్తారు. రాజకీయ కోణంలో చూడకుండా వాటిని పరిష్కరించాలి. అంతేకానీ, వారి పోరాటాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించకూడదు. ఒక సమస్య ఒక వ్యక్తి నుంచి సమూహానికి చేరి నిర్దిష్ట లక్ష్యంతో ఐక్యత నినాదాన్ని ఎంచుకుంటే పాలకపక్ష బీటలు పారుతాయనే విషయం ఇప్పుడు అధికారంలో ఉన్నవారికి తెలియనిది కాదు. దానికి తెలంగాణ ఉద్యమమే ఉదాహరణ.
అన్ని యూనివర్సిటీలలో సమస్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన రెండు సంవత్సరాల తర్వాత విద్యారంగ పరిస్థితులను సమీక్షించారు. 'గందరగోళంగా ఉన్న విద్యా వ్యవస్థను చక్కదిద్దాలన్నదే మా ఉద్దేశ్యం. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన విద్యను అందించడానికి తగు చర్యలు తీసుకుంటాం' అని మీడియా ముందు ప్రకటించారు. మరి ఆ లక్ష్యం నెరవేరిందా? పాలకపక్షం మననం చేసుకోవాలి. నిజానికి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు లేవనెత్తిన అంశాలు తెలంగాణలో ఉన్న ఏ యూనివర్సిటీకీ మినహాయింపు కాదు.
ప్రతి వర్సిటీలోనూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ ఉద్యమం తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు చేరితే అప్పుడు పాలకులు అధికారం కోల్పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కావున ప్రభుత్వం బాసర విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు సత్వరమే అన్ని సమస్యలను పరిష్కరించాలి. మిగతా వర్సిటీల మీద కూడా దృష్టి సారించాలి. ఉచితంగా కేజీ టు పీజీ నాణ్యమైన విద్య అందించే దిశగా అడుగులు వేయాలి.
సత్య నెల్లి
ఓయూ, హైదరాబాద్
95503 95232