24 ఫ్రేమ్స్:ఎఫ్‌డీసీ ముందున్న కర్తవ్యం

by Ravi |   ( Updated:2022-09-03 14:43:51.0  )
24 ఫ్రేమ్స్:ఎఫ్‌డీసీ ముందున్న కర్తవ్యం
X

బాలల సినినిమాలకు టాక్స్ మినహాయించాలి. తెలంగాణలో నిర్మించే బాలల సినిమాలకు ఆర్థిక సహకారంతోపాటు యేటా అవార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పిల్లల సినిమాల కోసం రాష్ట్రంలోని థియేటర్లలో ప్రత్యేక సమయం కేటాయించాలి. జిల్లాస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి పల్లెటూరి పిల్లలకు కూడా ప్రపంచ స్థాయి పిల్లల సినిమాలను ప్రదర్శించాలి. వీలైతే రాష్ట్రస్థాయిలో చిల్డ్రన్స్ ఫిలిమ్ సొసైటీని ఏర్పాటు చేసుకోవాలి. సృజనాత్మక కలిగిన పిల్లలను గుర్తించి వారికి కళా, సాంస్కృతిక రంగాలలో తగిన తర్ఫీదు ఇవ్వాలి. అప్పుడే బాలల మనో వికాసానికి దోహదపడినవారమవుతాం.

తెలంగాణ చలనచిత్ర, టీవీ, థియేటర్ అభివృద్ధి సంస్థ (TSFDC)కు నూతన అధ్యక్షుడి నియామకంతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సినిమా ఉనికికి సంబంధించి కొత్త అడుగు వేసింది. అడుగు వేసిన చోటే నిలిచిపోకుండా స్థిరంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనిల్ కూర్మాచలంగారిని మనసారా అభినందిస్తున్నా. అర్థవంతమైన సినిమా అభిమానిని. సినిమా గురించి, అందునా తెలంగాణ సినిమా గురించి అనేక ఆలోచనలు ఉన్నవాడిని. మన సినిమా గొప్పగా ఎదగాలనీ, మనవాళ్లు గొప్ప సినిమాలు తీసి ప్రపంచ పటంలో నిలబడాలనీ కోరుకుంటున్నవాడిని. ఇవన్నీ తీరాలంటే తెలంగాణ చలనచిత్ర, టీవీ, థియేటర్ అభివృద్ధి సంస్థ, దాని అధ్యక్షుడి ముందు చాలా పనులున్నాయి. అవేవీ చాలా పెద్దవేమీ కాదు. కొంచెం పట్టుదల, దీక్ష వుంటే తెలంగాణ సినిమాకు సంబంధించి అనేక విజయాలు సాధించవచ్చు.

ఇవ్వాళ పెరిగిన సాంకేతికత, పాన్ ఇండియా భావనతో తెలుగు సినిమా వ్యాపారాత్మకంగా పెద్ద విజయాలనే సాధించింది. హైదరాబాద్‌లో నిలదొక్కుకున్న తెలుగు సినిమాతోపాటు, తెలంగాణ సినిమా కూడా తన ఉనికి చాటుకుంటూ నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంస్థాపరంగా తెలంగాణ చలనచిత్ర, టీవీ, థియేటర్ అభివృద్ధి సంస్థ చొరవ, కృషి అవసరం. తెలంగాణ యువత ఇవ్వాళ దృశ్య మాధ్యమం పట్ల ఎంతో అభిలాషను, అభినివేశాన్నీ చూపిస్తున్నది. కథలకు కొదువలేదు. కథనాశక్తికీ తక్కువ లేదు. కావలసింది సాంకేతిక పరిణితి. దాని కోసం ప్రభుత్వపరంగా ఫిలిం ఇన్‌స్టిట్యూట్ పెట్టవచ్చు లేదా పలు విశ్వవిద్యాలయాలలో ఫిలిం అండ్ డిజిటల్ మీడియా కోర్సులు పెట్టవచ్చు.

డాక్యుమెంటరీలు తీయండి

తెలంగాణ చరిత్ర, తెలంగాణ ప్రతిభామూర్తుల డాక్యుమెంటరీలు రూపొందించి నిక్షిప్తం చేయవచ్చు. సామాజిక మాధ్యమాల విస్తృతి నేపథ్యంలో సమాచార, చారిత్రక, విజ్ఞాన డాక్యుమెంటరీల అవసరం ఉంది. అంతేకాదు, నిర్మాతలకు ఆర్థికంగా ప్రోత్సాహకాలు అందిస్తూనే, అవార్డులతో ప్రోత్సహిస్తూనే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చలన చిత్రోత్సవాలు నిర్వహించి తెలంగాణా ప్రేక్షకులకు, చలనచిత్రకారులకు జాతీయ అంతర్జాతీయ సినిమా ధోరణులను పరిచయం చేసి వారి దృష్టికోణాన్ని విస్తృతం చేయాల్సి ఉంది. ఫలితంగా తెలంగాణ నుంచి రొడ్డ కొట్టుడు సినిమాల కన్నా భిన్నమైన సినిమాలు వచ్చే అవకాశం మెరుగుపడుతుంది.

అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల నిర్వహణ నగరానికి, రాష్ట్రానికి, విశేష ప్రతిష్టని తీసుకు వస్తుంది. కేన్స్, బెర్లిన్, కార్లోవివారి చిత్రోత్సవాలు ఆ నగరాలకు, దేశాలకు ఎంతటి పేరు తెచ్చాయో మనకు తెలుసు. మన హైదరాబాద్ కూడా అలాంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు వేదికగా విశ్వవ్యాప్త గుర్తింపు సాధించాలని సినిమా ప్రేమికులు ఆశిస్తున్నారు. ఆ క్రమంలో ఎఫ్‌డీ‌సీ పని చేయాల్సి ఉంది. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం ద్వారా హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికీ విశేష ప్రాచుర్యం లభించే అవకాశం వుంది. బాలల మనో వికాసానికి బాలల ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎంతగానో దోహదపడతాయి. విద్యా సంవత్సరం మొదలవుతున్న నేపథ్యంలో బాలల కోసం అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నిర్వహిస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. నవంబర్‌లో పిల్లల కోసం ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలు కాకుండా, నిరంతర బాలల మనోవికాసానికి చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తే పిల్లలకు ఉత్తమ వినోదాన్ని అందించినట్టు కూడా అవుతుంది.

రెండూ భిన్నమైనవే

అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు, బాలల ఉత్సవాలు రెండూ కొంత భిన్నమైనవి. బాలల చిత్రోత్సవాలు పిల్లల కోసం ప్రత్యేకించబడినవి. ఈ ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న చిల్డ్రన్ ఫిలిమ్ సొసైటీ ఆఫ్ ఇండియా రెండేండ్లకోసారి నిర్వహిస్తుంది. బాలల కోసం సినిమాలు నిర్మించడం, నిర్మాతలకు ఆర్థికంగా సహాయం చేయడం, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను నిర్వహించడం 1955లో ఏర్పాటైన ఈ సంస్థ ప్రధాన కర్తవ్యాలు. అందులో భాగంగానే దేశంలోని వివిధ నగరాలలో 1979 నుంచి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నది. 1995లో మొదటి సారిగా మన హైదరాబాద్‌లో నిర్వహించారు. 1999లో మరోసారి నిర్వహించారు. అనంతరం బాలల చిత్రోత్సవాలకు శాశ్వత వేదికగా హైదరాబాద్‌ను ప్రతిపాదించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇతోధిక సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. రాష్ట్రంలో నిర్మించే బాలల చిత్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని భరోసా ఇచ్చింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తే నగదు బహుమతులు ఇస్తామని ప్రకటించింది. పిల్లల మనో వికాసానికి, సమగ్ర ఎదుగుదలకి కళా సాంస్కృతిక విషయాలు ఎంతో దోహదపడతాయి. సాటి మనిషిని ప్రేమించే తత్వాన్ని ఇస్తాయి.

దృశ్య మాధ్యమాలు పిల్లల పైన అనితర సాధ్యమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే, పిల్లల కోసం ప్రత్యేకంగా సినిమాలు నిర్మించాలి. ఇరాన్ పిల్లల చిత్రాలను ప్రేరణగా తీసుకోవాలి. బాలల చిత్రోత్సవాలు మహా నగరాలకు, పట్టణాలకు పరిమితం చేయకుండా పల్లెలలో ఉండే బాలలకూ ప్రదర్శించగలిగితే గొప్పగా వుంటుంది. జిల్లాస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి, క్రమం తప్పకుండా ఉత్తమ బాలల చిత్రాలను ప్రదర్శించాలి. ఇరాన్, రష్యా పిల్లల సినిమాలు అద్భుతంగా, భావస్పోరకంగా ఉంటాయి. ఇరాన్ సినిమాలకున్న నేపథ్యం మన తెలంగాణకూ ఉన్నది. కావలసిందల్లా ఇరాన్‌‌లాగా ప్రభుత్వం తోడ్పాటు. మన దర్శకులు కూడా రొడ్డకొట్టుడు నీతి బోధల సినిమాలు కాకుండా, భిన్నంగా బాలల మనసులను గెలుచుకునే సినిమాలు నిర్మించగలిగితే తెలంగాణ గొప్ప బాలల చిత్రాలకు వేదికయ్యే అవకాశం ఉన్నది. విలక్షణ కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం ఈ దిశలో అడుగులు వేస్తుందనే ఆశ ఉన్నది.

తక్షణం చేపట్టాల్సిన చర్యలు

బాలల సినినిమాలకు టాక్స్ మినహాయించాలి. తెలంగాణలో నిర్మించే బాలల సినిమాలకు ఆర్థిక సహకారంతోపాటు యేటా అవార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పిల్లల సినిమాల కోసం రాష్ట్రంలోని థియేటర్లలో ప్రత్యేక సమయం కేటాయించాలి. జిల్లాస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి పల్లెటూరి పిల్లలకు కూడా ప్రపంచస్థాయి పిల్లల సినిమాలను ప్రదర్శించాలి. వీలైతే రాష్ట్రస్థాయిలో చిల్డ్రన్స్ ఫిలిమ్ సొసైటీని ఏర్పాటు చేసుకోవాలి. సృజనాత్మక కలిగిన పిల్లలను గుర్తించి వారికి కళా, సాంస్కృతిక రంగాలలో తగిన తర్ఫీదు ఇవ్వాలి. అప్పుడే బాలల మనో వికాసానికి దోహదపడినవారమవుతాం.

-వారాల ఆనంద్

94405 01281

Advertisement

Next Story