ప్రతి స్త్రీ మూర్తికి ప్రణమిల్లి చెబుతున్నాం

by Ravi |   ( Updated:2023-03-07 18:30:24.0  )
ప్రతి స్త్రీ మూర్తికి ప్రణమిల్లి చెబుతున్నాం
X

వును స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు నడయాడుతారు అంటారు. స్త్రీ ఔన్నత్యానికి సమాజంలో వారికి ఉన్న ప్రాధాన్యతకు మన భారతీయ సంస్కృతి ఇచ్చిన గొప్ప గౌరవం అది. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏమిటి? మహిళలు అంటే అడుగడుగునా అవమానాలు, అత్యాచారాలు, హత్యలు. అందుకే ప్రతి స్త్రీ మూర్తికి ప్రణమిల్లి చెబుతున్నాం... మీ రక్షణ కోసం, సమాజంలో మీకు సమున్నత గౌరవం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది.

ఇంతటి విశృంఖలతకు కారణం ఎవరు...

రాష్ట్రంలో ప్రతి రోజు ఏదో ఒక మూల మహిళలపై దౌర్జన్యాలు, అత్యాచారాలు, వేధింపులు జరుగుతున్నాయి. పాఠశాల మొదలు పని ప్రదేశాల వరకు ఎక్కడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఆకాశంలోకి రాకెట్లను తీసుకెళ్ళగలిగిన స్థాయికి మహిళలు అభివృద్ధి అయినా వారి పట్ల వివక్ష కొనసాగడం, లైంగిక వేధింపులు పెరిగిపోవడం ఆందోళనకరం. అణగారిన వర్గాలు ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలపై ఇటువంటి ఘటనలు అధికంగా జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. పాలకుల చేతగానితనమే మహిళలపై లైంగిక దాడులు పెరగటానికి కారణమనడంలో సందేహంలేదు.

తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది...

నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మహిళలకు కనీస రక్షణ లేకపోవడం విచారకరం. నాటి దిశ ఘటన నుండి నేటి డాక్టర్‌ ప్రీతి హత్య వరకు మహిళల పట్ల కెసిఆర్‌ ధోరణి అర్ధమౌతుంది.హైదరాబాద్‌ లోని సింగరేణి కాలని, వరంగల్‌ నగరంలో చిన్నారులపై జరిగిన లైంగిక దాడులు సభ్యసమాజం తలదించుకునేలా చేశాయి. పటిష్ఠమైన చట్టాలు ఉన్నా వాటిని కఠినంగా అమలు చేయడంలో కెసిఆర్‌ వైఫల్యాల ఫలితమే ఇటువంటి వరుస ఘటనలకు కారణం.

క్షీణించిన శాంతి భద్రతలకు సంకేతం

నమ్మిన స్నేహితుడే ఇంటిదగ్గర దిగబెడతానని కారులో ఎక్కించుకుని తన స్నేహితులతో కలిసి నగరం అంతా తిరుగుతూ ఒక విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడటం గురించి వింటున్నప్పుడు మన నిఘావ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతుంది. ఈ ఘటనలో సాక్షాత్తు అధికార పార్టీ నేతల కుమారుల ప్రమేయం ఉన్నదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వరంగల్‌‌లో డా. ప్రీతి ఘటన లోనూ నిందితుడు డా.సైఫ్‌‌ను రక్షించేందుకు, కేసు నీరుగార్చేందుకు అధికార పార్టీ పెద్దలు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, పోలీస్‌ వ్యవస్ధ చేష్టలుడిగి ఉంటే ఇక శాంతిభద్రతలను కాపాడేదెవరు?

మద్యం, డ్రగ్స్‌ కేంద్రంగా తెలంగాణ...

గల్లీకో బెల్టుషాప్‌ పెట్టి మద్యం విక్రయాలతో ఖజానా నింపుకోవడమే కేసీఆర్‌కు ప్రాధాన్యతగా కనిపిస్తుంది. ప్రతి రోజూ ఏదో ఒక చోట గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్ధాలు పట్టుబడటం చూస్తుంటే కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం మద్యం, డ్రగ్స్‌‌కు అడ్డాగా మారిందనడంలో సందేహం లేదు. ఆదాయం కోసం విద్యార్ధుల, యువత ఆరోగ్యాన్ని, భవిష్యత్‌ను ఫణంగా పెట్టడం క్షమించరాని నేరం. మద్యం, డ్రగ్స్‌ మత్తులో విచక్షణ కోల్పోతున్న యువత పెడమార్గం పట్టడానికి, ఆదాయం కోసం ఎంతటి అడ్డమైన దారులైనా తొక్కవచ్చుననే కేసీఆర్‌ ఆలోచనే దీనికి ప్రధాన కారణం. లిక్కర్‌ మాఫియాకు కల్వకుంట్ల కుటుంబానికి ఉన్న బలీయమైన బంధం కూడా మద్యం, డ్రగ్స్‌ పట్ల ప్రభుత్వం చూసీ చూడనట్లుగా వ్యవహరించడానికి మరో కారణం.

మహిళల రక్షణకు నిధులేవి...

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. ఏదైనా పద్దులో అరకొర కేటాయింపులు చూపినా వాటిని ఖర్చు చేసిన పాపాన పోలేదు. కేసీఆర్ సర్కార్‌ ప్రత్యేకంగా నిధులు కేటాయించపోగా మహిళ రక్షణ కోసం కేంద్రం ఇస్తున్న నిర్భయ నిధులను వినియోగించుకోవడంలోను విఫలమైంది. 2016-17 సంవత్సరం నుండి 2020-2021 వరకు కేంద్రం రూ.238.06 కోట్లు కేటాయించగా వాటిలో 16% నిధులు వినియోగించుకోవడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాలేదు. సర్వ శిక్ష అభియాన్‌ పధకం కింద పాఠశాలల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుంది. వాటిని సక్రమంగా వినియోగించకపోవడంతో పాఠశాలల్లో కనీసం టాయిలెట్లు కూడా లేని దుస్థితి. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని పాఠశాలల్లో కల్పిస్తున్న వివరాలు కోరిందంటే ప్రభుత్వం పనితీరు స్పష్టం అవుతుంది.

మహిళలపై నానాటికీ పెరుగుతున్న దాడులు...

రాష్ట్రంలో మహిళలపై దౌర్జన్యాలు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 2020-2021 మధ్య ఈ కేసుల సంఖ్య 17% పెరిగినట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ లెక్కలు చెబుతున్నాయి. 2020-21లో 20,865 కేసులు, 2020-20లో 17,791 కేసులు 2019లో 18,394 కేసులు నమోదయ్యాయి. సమాజంలో పరువు పోతుందని,హేళనగా చూస్తారనే దు:ఖంతో పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కని ఉదంతాలు కూడా లెక్కకు మించి ఉంటాయి. ఏదో సినిమాలో అన్నట్లు‘‘మహిళలకు కనీస భద్రత కల్పించలేని సీఎం ఉంటే ఎంత ...ఊడితే ఎంత? కేసిఆర్‌‌కు మహిళలు అంటే మొదటి నుండి చిన్నచూపే. 2019 వరకు రాష్ట్ర క్యాబినెట్‌లో ఒక్క మహిళకు కూడా స్ధానం కల్పించలేదు. ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకునేంతవరకు కనీసం మహిళ కమిషన్‌ ఏర్పాటు చేయాలనే సోయే కేసీఆర్‌కు లేదు. ఆవు దొడ్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా ఉంది కేసీఆర్‌, ఆయన పరివారం పరిస్థితి. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న ఒక మహిళా గవర్నర్‌ పట్ల కేసీఆర్‌, ఆయన మంత్రివర్గ సహచరులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు, వారి కుసంస్కారానికి నిదర్శనం. వై.ఎస్‌ షర్మిళ పాదయాత్రపై అధికార పార్టీ నేతల వెకిలి మాటలు, సోషల్‌ మీడియాలో వారు పెడుతున్న పోస్టులు, కామెంట్లు చూస్తే మహిళకు ఇవ్వాల్సిన జ్ఞానం వారికి లేదని అర్ధమౌతుంది

జీవన విధానంలో మార్పుతేవాలి...

మహిళలకు అత్యంత గౌరవం ఇవ్వాలన్న భావన మానవ జీవన విధానంలోనే అంతర్భాగం కావాలి. పాఠశాల విద్య నుండి మహిళకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఒక పాఠ్యాంశంగా బోధించాలి. అన్ని రంగాల్లో మహిళల అభ్యున్నతికి చేయూతనివ్వాలి. పరిపాలన చేసేవారి ఆలోచనల్లో మార్పురాకుండా ఇది సాధ్యం కాదు. నియంతృత్వ విధానాలకు నిలువెత్తు నిదర్శనం అయిన కేసీఆర్‌లో ఆ మార్పును ఊహించలేం. పాతబస్తీలో పసిమొగ్గల బ్రతుకులను పెళ్ళిళ్ల పేరుతో చిదిమేస్తున్న అరబ్‌ షేక్‌ల ఆగడాలను కళ్ళుండీ చూడలేని కబోది కేసీఆర్‌. పాతబస్తీలో నెలకొన్న పేదరికమే అక్కడ ఉన్న పేదలను ఆ రకమైన దయనీయమైన స్థితిలోకి నెడుతున్నది. ఏళ్ళ తరబడి పాతబస్తీని ఏలుతున్న ఎంఐఎం,వారితో దోస్తీ చేస్తున్న కేసీఆర్‌కు ఈ పాపంలో భాగం లేదని అనగలమా?

అందుకే ..మరోసారి చెబుతున్నాం తెలంగాణలో ఉన్న మహిళా లోకమంతటికి ప్రణమిల్లి ప్రమాణం చేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాం. రానున్న రోజుల్లో మహిళా సాధికారత కోసం బిజెపి చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. మహిళల గౌరవానికి భంగం వాటిల్లకుండా బిజెపి రక్షణ కవచంలా నిలుస్తుంది. మహిళపై లైంగిక వేధింపులు, దౌర్జన్యాలు జరగకుండా పట్టిష్ఠమైన చర్యలు చేపడతాం. మహిళ పట్ల ఏ రకమైన వేధింపులకు పాల్పడినా సత్వర విచారణ జరిపి దోషులకు శిక్షలు పడేలా నిష్పక్షపాతంగా పనిచేస్తాం. రాష్ట్రంలో రాన్నుది బీజేపీ ప్రభుత్వమే. మహిళా అభ్యున్నతికి బీజేపీ పెద్దపీట వేస్తుందని మరోసారి హామీ ఇస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు, సమస్త మహిళా సమాజానికి బీజేపీ రాష్ట్ర శాఖ తరపున శుభాకాంక్షలు.

బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు

Advertisement

Next Story