చితికిన వృద్ధ వీఆర్ఏల బతుకులు..

by Ravi |   ( Updated:2024-09-10 01:00:49.0  )
చితికిన వృద్ధ వీఆర్ఏల బతుకులు..
X

నిజాం ప్రభుత్వం నుండి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు గ్రామాల్లో నీరటి, సుంకరి, మస్కురి, గ్రామ సేవకుడు, వీఆర్ఏ వంటి పేర్లతో పిలువబడుతూ గ్రామాల్లో రెవెన్యూ శాఖ కింది స్థాయి సిబ్బందిగా గ్రామంలో ఉంటూ రైతుల నుండి భూమి శిస్తు వసూలు చేస్తూ, శాంతి భద్రతలను కాపాడుతూ వస్తున్నారు. వీరు ప్రభుత్వంలో ఉన్న అన్నిశాఖల అధికారులకు గ్రామానికి సంబంధించిన సమాచారం అందిస్తూ, మూడు రూపాయల జీతం నుండి నేడు 10,500 వందల చాలీచాలని జీతంతో పూట గడుపుకుంటూ తాత, ముత్తాతల నుండి వారసత్వ ఉద్యోగం చేస్తూ వస్తున్నారు. వీరిని గత ప్రభుత్వం వీఆర్ఏల సర్దుబాటు పేరిట G.O 81, 85, 98 తెచ్చింది.

ఆ జీవోల ద్వారా 61 సంవత్సరాల వయసు పైబడిన వారు, 61 ఏళ్ల వయసులోపు ఉన్నవారు అనే రెండు వర్గాలను సృష్టించింది. 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు వారి విద్యార్హత బట్టి ఓఎస్‌డీ, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగాలు ఇవ్వాలని, 61 సం.రాలు లోపు ఉన్న వీఆర్ఏలందరిని ఇతర శాఖలో వారి విద్యార్హతను బట్టి ఓఎస్డీ, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఇట్టి G.O 81 వల్ల 55 సం.రాల వయసు పైబడి 61లోపు ఉన్న 2500 మంది వీఆర్ఏ‌లకు నష్టం జరుగుతోందనీ, 2500 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనీ రోడ్డు ఎక్కి నిరసన తెలిపినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా బలవంతంగా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది.

గత సీఎం ఇచ్చిన మాట తప్పారు..

వీఆర్వో వ్యవస్థ రద్దు సమయంలో, కొత్త రెవెన్యూ చట్టం అమలు చేసే సమయంలో అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని, 55 సంవత్సరాల వయసు పైబడిన వీఆర్ఏల స్థానంలో వారి వారసులకు ఉద్యోగం కల్పిస్తామని గత ముఖ్యమంత్రి చెప్పారు. కొన్ని తరాలుగా వారు గ్రామంలో చేస్తున్న సేవకు గుర్తుగా వృద్ధులుగా ఉన్న వారి స్థానంలో వారసులకు అవకాశం ఇస్తామని హామీ సైతం ఇచ్చారు. అర్హత ఉన్న వారికి ప్రమోషన్, మూడున్నర సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు డిమాం డ్లతో మూడు నెలల సమ్మె చేస్తే G.O 81 ద్వారా 18 వేల మందికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది కానీ, 2500 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

హైకోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలే..

ఈ జీవోపై 55 సంవత్సరాలు పైబడి 61లోపు ఉన్న వీఆర్ఏలు కొందరు హైకోర్టులో కేసు వేస్తే, ప్రభుత్వం ఈ జీవో తయారు చేసేటప్పుడు సరైన ఆలోచన చేయలేదని మరోసారి ఆలోచించి 55 నుంచి 61 ఏళ్ల వయసున్న వీఆర్ఏలకు న్యాయం చేయాలని హైకోర్టు అభిప్రాయపడి స్టేటస్ కో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు చెప్పినా గత ప్రభుత్వం పట్టించుకోకపోగా, బలవంతంగా ఇతర శాఖలలో వీరిని సర్దుబాటు చేసింది. గత ప్రభుత్వం చేసిన పొరపాటును కొత్త ప్రభుత్వం సరిచేయాలి. ఇప్పటికే దాదాపు 500 పైబడి వీఆర్ఏలు ఒక్క నెల జీతం తీసుకోకుండా, ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేకుండా పదవీ విరమణ పొంది రోడ్డున పడ్డారు. మరికొద్ది మంది అతి త్వరలో పదవీ విరమణ పొందటానికి సిద్ధంగా ఉన్నారు. పదవీ విరమణ పొందిన వారు ఉన్న జీవనాధారం కోల్పోయి రోడ్డున పడ్డారు. పదవీ విరమణ పొందిన ప్రతి ఒక్కరికి వీఆర్ఏగా దాదాపు 20 నుండి 30 సం.రాలు పని చేసిన అనుభవం ఉండి కొత్తగా ప్రమోషన్ వచ్చిన నెలకే పదవీ విరమణ పొందడం వలన వీఆర్ఏగా పని చేసినప్పటి గ్రాట్యుటీ లాంటి ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందకుండానే పదవీ విరమణ పొందుతున్నారు.

బతుకులు రోడ్డున పడ్డాయి

ప్రభుత్వ రూల్స్ ప్రకారం 5 సం.రాలు సర్వీస్ పూర్తి చేయకపోతే రిటైర్మెంట్ అయినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇతర ఆర్థిక ప్రయోజనాలు రావు. 55 సం.లు వయస్సు పైబడి 61 లోపు ఉన్న పూర్వ వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకువచ్చి వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించినట్టే, 61 సం.రాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగ అవకాశం ఇచ్చే విధంగా అవకాశం ఇవ్వాలి. లేదా ప్రస్తుతం ఉన్న శాఖలోనే వారి వారసుడికి అవకాశం కల్పించాలి. అన్నం దొరికే సమయానికి మా బతుకులు రోడ్డున పడ్డాయి. G.O 81 సవరణ చేసి లేదా కొత్త G.O ద్వారా ఐన మా వారసులకు మా స్థానంలో ఉద్యోగం కలిపించాలి. కొత్తగా కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం మా కుటుంబాలకు న్యాయం చేయాలి. గత ప్రభుత్వం వృద్ధ వీఆర్ఏలకు అన్యాయం చేసి ఇచ్చిన మాట తప్పినా, కొత్త ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో ఉన్నాం.

- రొండి తిరుపతి

95739 01621

Advertisement

Next Story

Most Viewed