ట్రెండ్ సెట్టర్ 'మోసగాళ్లకు మోసగాడు' రీ రిలీజ్ ఎప్పుడంటే?

by Ravi |   ( Updated:2023-09-09 12:52:16.0  )
ట్రెండ్ సెట్టర్ మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ ఎప్పుడంటే?
X

సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. చలనచిత్ర రంగంలో ఆయనది ఓ ప్రత్యేకమైన శైలి. సాహసాలు ఆయన నైజం. తనకు కావలసిన రీతిలో ఖర్చుకు వెనుకాడకుండా అద్భుతమైన చిత్రాలను ‘పద్మాలయా’ సంస్థ ద్వారా అందించారు. తెలుగు హిందీ పరిశ్రమలలో ఆ సంస్థకున్న కీర్తి గొప్పది. 1970లో పద్మాలయా సంస్థను ఏర్పాటు చేసారు. ఇందుకు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు కుడి, ఎడమలుగా నిలిచారు. సోదరులంతా కలిసి ఒక్కటిగా ఆలోచించేవారు, ఆచరించేవారు.

ఈ సినిమా కోసం..

పద్మాలయా సంస్థ తన తొలి చిత్రంగా కృష్ణ కథానాయకుడిగా ‘అగ్నిపరీక్ష’ను నిర్మించారు. ఈ చిత్రం ఆశించినంత విజయం కాలేదు. తదుపరి చిత్రంగా ఎటువంటి కథలలో ముందుకు వెళ్లాలనే ఆలోచనలతో సోదరులంతా ఉన్నారు. ఆ సమయంలో మద్రాస్‌లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న మెకన్నాస్ గోల్డ్, ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్, గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ వంటి ఆంగ్ల సినిమాలు వారి దృష్టిలో పడ్డాయి. కృష్ణ సినీ రచయిత ఆరుద్రను పిలిపించి ఆ సినిమాల నేపథ్యం నుంచి కథను అల్లమన్నారు. ఆ చిత్రాలన్ని ‘కౌబాయ్’ కథలు. తెలుగులోనే కాదు దక్షిణాదిలో అటువంటి కథాంశాలు అంతవరకు రాలేదనే చెప్పాలి. ఆ ప్రయోగానికి కృష్ణ సోదరులు నాంది పలికారు. ఆరుద్ర గారు బౌండ్ స్క్రిప్ట్‌ను రెడీ చేసి కృష్ణకు ఇచ్చారు. అది అందరికీ నచ్చేసింది. ఆరుద్ర గారినే దర్శకత్వం వహించమన్నారు. ఆ చిత్రానికి ఆయనే మాటలు, పాటల రచయితగా కూడా నిర్ణయించేశారు. ఆరుద్ర ఆలోచించారు. తన పరిమితులు, పరిధి ఆయనకు తెలుసు. దర్శకత్వం చేయలేనని సున్నితంగా చెప్పేశారు. కృష్ణకు మరో మంచి హితుడు, సన్నిహితుడు దర్శకుడు కెఎస్ఆర్ దాస్. అప్పటికి విజయలలితతో రౌడీ రాణి అనే చిత్రం తీసి విజయవంతం చేశారు. కనుక తన చిత్రానికి ఆయననే దర్శకుడుగా నిర్ణయించి దాసుకు తెలియజేశారు. అలా పద్మాలయా సంస్థ తొలిసారిగా కౌబాయ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తమ సినిమాకు అదృష్ట రేఖ అని పేరును నిర్ణయించుకున్నారు. కానీ చివరకు మోసగాళ్లకు మోసగాడు అని స్థిరపరిచారు. తరువాత జరిగిందంతా చరిత్రే.

ఆంగ్ల చిత్రాలలో కౌబాయ్ జోనర్లో అనేక సినిమాలు వచ్చాయి. ఈ తరహా పాత్రలలో విలన్, హీరో, కమెడియన్స్ కూడా ఆయా చిత్రాలలో కనిపిస్తాయి. తెలుగుకు పూర్తిగా ఇది కొత్త. ఇంగ్లీష్ సినిమాల కథల ప్రేరణతో తయారైన 'మోసగాళ్లకు మోసగాడు' సినిమాలో తెలుగు నేపథ్యం పూర్తిగా కనిపించే ప్రయత్నం చేశారు రచయిత ఆరుద్ర. ప్రతి నాయకులకు బెజవాడ మంగయ్య, ఏలూరు లింగయ్య, నెల్లూరు రంగయ్య, చిత్తూరు చంగయ్య, చెన్నపట్నం చిన్నయ్య అంటూ పేర్లను పెట్టారు. ఆరుద్ర తనదైన మార్కుతో మాటలు, పాటలు రాశారు.

ఈ చిత్రం షూటింగ్ మొత్తం..

ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎఎస్ఆర్. స్వామి గురించి. 1970ల కాలంలో కలర్ చిత్రాలే ఒకటి అర వచ్చాయి. కొత్త సాంకేతికత అయిన స్కోప్ లెన్సెస్ మన దగ్గర లేవు. ముంబై, లండన్ల నుంచి తెచ్చుకోవాలి. వాటిలో కెమెరాలను హ్యాండిల్ చేయడం కష్టం. ఇందుకోసం స్వామిని శిక్షణ కోసం పంపారు పద్మాలయా సోదరులు. చిత్రీకరణ మొత్తం రాజస్థాన్ ఎడారులు, బికనీరుకోట, పంజాబ్లోని సట్లెజ్ నదీతీరం, హిమాచల్‌ప్రదేశ్ లోని సిమ్లా పరిసరాలు, మంచు కొండలు, టిబెట్ పీఠభూమి, పాకిస్తాన్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో చేశారు. యూనిట్ మొత్తాన్ని రాజస్థాన్‌కు తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా రైలు వేశారు. కృష్ణను చిత్రంలో కౌబాయ్‌గా చూపించేందుకు మేకప్, కాస్ట్యూమ్స్ విభాగాలకు చెందిన వెంకట్రావు, మాధవరావుల కృషి మెచ్చుకోదగ్గది. కథకు తగిన పాత్రల కోసం కృష్ణ, నాగభూషణం, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, విజయనిర్మల, జ్యోతిలక్ష్మి, త్యాగరాజు, ధూళిపాల, బొడ్డపాటి తదితరులను ఎంపిక చేసుకున్నారు. నాగభూషణం ధరించిన పాత్ర ఆంగ్ల చిత్రం ‘గుడ్ బాడ్ అండ్ అగ్లీ’ లోని అగ్లీ పాత్ర ఆధారంగా తయారు చేశారు.

ఈ చిత్రం సాంకేతికంగా గొప్పగా ఉంటుంది. ఐదు దశాబ్దాల క్రితం (1971లో వచ్చిన చిత్రం) ఇప్పుడున్నంత సాంకేతికత అభివృద్ధి లేదు. ప్రతి చిన్న విషయాన్ని తెరపై గొప్పగా చూపించాలంటే సాంకేతిక నిపుణులు అత్యంత శ్రద్ధ వహించవలసి వచ్చేది. కోటగిరి స్వామి, మాధవరావు, వెంకట్రావు, దర్శకుడు దాసు మొదలగు వారు ఎంతో నిపుణతతో తమ పరిధిలో ఉన్న తక్కువ వనరులతో అద్భుతమైన ఫలితాలను రాబట్టగలిగారు. ఎడారిలో చిక్కుకున్న కథానాయకుని ముఖం మీద ఏర్పడిన బొబ్బర్లు వంటివి ఇందుకు ఉదాహరణ. రాజస్థాన్, పంజాబ్, పాకిస్తాన్, టిబెట్ వంటి ప్రాంతాలు విభిన్నమైన భౌగోళిక స్థితి కలిగినవే. ఆయా స్థలాలలో చిత్రీకరణ అంటే ‘కత్తి మీద సాము’ అయినా విజయవంతంగా పూర్తి చేసిన ఘనత, పూర్తి చేయించుకున్న కీర్తి పద్మాలయా సోదరులదే. అయితే కొన్ని దశాబ్దాల తర్వాత మహేష్ బాబుతో టక్కరిగా చేసిన ప్రయత్నం విఫలం అయింది.

నాటి టెక్నాలజీ చూడండి..

ప్రస్తుతం ఈ కథలన్నీ సోషల్ మీడియా అందరికీ తెలిసినవే. ఇప్పుడు ఎందుకు మళ్ళీ చెప్పుకోవాలి అనే ప్రశ్నకు నేటి ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా మోసగాళ్లకు మోసగాడు చిత్రానికి హంగులద్ది నేటితరం యువతకు ఆనాటి సాంకేతిక నిపుణులు సాంకేతిక నైపుణ్యాల విశ్వరూపం చూపించాలనే ప్రతిపాదన చేసిన వారి వ్యాఖ్యానం అవసరమే... ఈ సినిమాలో కొత్తగా చూపించవలసిన టెక్నాలజీని ఆనాడే మేమంతా సాధ్యమైనంత వరకు పూర్తి చేసేసాం. మరి 2k, 4kలలో వాటి విలువ రెట్టింపు అవుతుందనేది వేచి చూడాల్సిన అంశం అని ఆదిశేషగిరిరావు ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

మోసగాళ్లకు మోసగాడు తెలుగు చిత్ర పరిశ్రమకు కౌబాయ్‌ని పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. భారీ ఖర్చుతో చిత్రించిన ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ ‘బ్రదర్ సినిమా చాలా బాగా చేశారు. కానీ మహిళల ఆదరణ చిత్రానికి లభించకపోవచ్చు.. కానీ విజయవంతం అవుతుందని” ఆశీర్వదించారట. ఇది నిజమని నిరూపించింది ఆ చిత్ర ఘనవిజయం. ఎడిటింగ్, రికార్డింగ్, రీ-రికార్డింగ్, డబ్బింగ్ వంటి సాంకేతిక అంశాల పట్ల ఆదినారాయణరావు, గోపాలరావు, వీఎఆర్. స్వామీల పనితనం నేటి టెక్నాలజీ విశ్వరూపాన్ని ఆనాడే వెండితెర మీద ఆవిష్కరింపజేశారు. పద్మాలయా సంస్థ స్థాయిని పెంచిన మొదటి చిత్రం ఇదే. ఆ తరువాత కాలంలో అల్లూరి సీతారామరాజు, ఈనాడు, పాడిపంటలు, దేవుడు చేసిన మనుషులు వంటి వాటి గురించి చరిత్ర మాట్లాడుతూనే ఉంది.

(కృష్ణ జయంతి సందర్భంగా మే 31న 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రం 4కే వెర్షన్‌లో విడుదల)

భమిడిపాటి గౌరీశంకర్

94928 58395

Advertisement

Next Story

Most Viewed