- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్స్‌పై దాపరికాలు ఇంకానా...?
సెక్స్.. భూమ్మీది ప్రాణికి ఉన్న రెండు ప్రధాన అవసరాల్లో ఒకటి. అదో సహజమైన శారీరక వాంఛ. అయితే మానవ పరిణామ నాగరికతా క్రమంలో ఎన్నో సామాజిక నిబంధనలు, నీతి నియమాలు నిర్మితమై దీనిని ఒక నిషిద్ధ అంశంగా మార్చివేశాయి. అయితే ఈ కట్టుబాట్ల వల్ల లైంగిక విజ్ఞానం, వ్యక్తిగత లైంగిక స్వేచ్ఛ, యువప్రాయంలో శారీరక మార్పులు తదితర జీవనావసర అంశాలపై చర్చకు తలుపులు మూసినట్లయింది. దీనివల్ల సెక్స్ సంబంధిత ప్రాథమిక విషయాలపై కనీస అవగాహన కూడా తెలియకుండా పోయింది. తప్పులు, అపోహలు పెరిగి మరింత గందరగోళం ఏర్పడింది. అయితే ఇలా బహిరంగంగా చర్చించడానికి మొహమాటపడే, సిగ్గుపడే విషయాలతో కథలు అల్లిన సినిమాలు ఈ మధ్య రావడం ఓ మేలిమలుపుగా భావించాలి. ఈ విషయంలో ఆయా సినిమాల నిర్మాతలను, అడ్డు చెప్పని సెన్సార్ బోర్డును, ప్రదర్శకులను అభినందించాలి. ఒక పెద్ద నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టిన ఘనత వారందరికీ చెందుతుంది. పైగా ఈ సినిమాలు వ్యాపారపరంగా విజయవంతం చెందడం మరో శుభ పరిణామం.
తొలి లైంగిక విజ్ఞాన సినిమా 'గుప్త్ జ్ఞాన్'
నిజానికి 1974లోనే లైంగిక విజ్ఞాన సమాచారంతో 'గుప్త్ జ్ఞాన్' అనే సినిమా వచ్చి ఈ చాటుమాటు ముచ్చట్లపై తెరలేపింది. హిందీలో సెక్స్ పై పూర్తి స్థాయిలో వచ్చిన తొలి సినిమాగా ఇది నిలుస్తుంది. సినిమాలో ముప్పావు భాగం సెక్స్ ప్రధానంగా సాగే క్లాస్ రూమ్ పాఠాల సరళిలోనే ఉంటుంది. విద్యార్థుల్లో ఆడ మగ కలిసి పాఠాలు వింటారు. పురుషాంగం, యోని, సంభోగం, గర్భధారణ, కుటుంబ నియంత్రణ లాంటి వాటిని చిత్రాల రూపంలో చూయిస్తూ వాటి పరిచయం, పనితీరు, ఉపయోగాన్ని అధ్యాపకులే సినిమాలో బోధించడం విశేషం. సుఖరోగాలపై ప్రత్యేక వివరణాత్మక పరిచయం ఉంది. దానిలో భాగంగా సెక్స్ స్పెషలిస్ట్ అంటూ మోసాలు చేసేవారి బండారం కూడా బయటపెట్టారు. అప్పటి వరకు జీవితంలో సెక్స్ ప్రాధాన్యతని బహిరంగంగా చర్చించేందుకు వెనుకాడిన జనం ఈ సినిమా రాకతో సెక్స్ విజ్ఞానం కోసం ఎగబడి చూశారు. బి కె ఆదర్శ్ రచన, దర్శకత్వం, నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా అనూహ్య విజయాన్ని సాధించడమే కాకుండా దాదాపు దేశంలోని అన్ని ప్రధాన భాషల్లోకి డబ్బింగ్ కూడా అయింది. దాని కోవలోనే మరిన్ని అలాంటి సినిమాలు వచ్చినా సమాచారంలో కొత్తదనం లేకపోవడంతో అవి ఆడలేదు.
'ఉప్పెన' కలిగించిన షాక్
గుప్త్ జ్ఞాన్ అంత పూర్తి నిడివి లైంగిక విజ్ఞాన సినిమాలు కాకున్నా ఈ మధ్యకాలంలో సెక్స్ చుట్టూ తిరిగే కథలతో సినిమాలు వచ్చాయి. కథాపరంగా అవి సమాజ విధానాలకు ఎదురీదేవే అనుకోవాలి. సెక్స్ అనేది గోప్యంగా ఉంచవలసినదేమీ కాదు, ఒక హద్దు మేరకు సినిమాల్లో ప్రస్తావించుకోవచ్చు, దాని చుట్టే కథలు అల్లుకోవచ్చు అనే స్వేచ్ఛను ఈ సినిమాలు తీసుకున్నాయి. 2021 లో వచ్చిన 'ఉప్పెన' సినిమా క్లైమాక్స్ విచిత్రంగా ఉంటుంది. ఆ ముగింపు లేకపోతే సినిమానే లేదు. తన కుమార్తెతో హీరో ప్రేమను ఒప్పుకోని హీరోయిన్ తండ్రి అతడి పురుషాంగాన్ని కత్తిరించడమే సినిమాలో కీలకాంశం. నలుగురిలో మాట్లాడలేని విషయాన్ని ధైర్యంగా సినిమాలో వాడుకోవడం ఒక సాహసమే. సానా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డు వచ్చింది.
'ఏక్ మినీ కథ', 'ఓఎంజి 2'
అదే సంవత్సరం వచ్చిన మరో తెలుగు సినిమా 'ఏక్ మినీ కథ'. పైకి ప్రేమ కథే అయినా హీరోకి తన పురుషాంగం చిన్నగా ఉందని, అది సెక్స్‌కి పనికి రాదేమోనని అపోహ చుట్టూ కథ నడుస్తుంది. సినిమా పేరులో చిన్న హింట్ ఉన్నా సినిమా చూసే దాకా ఇదా విషయం అనిపించదు. సాధారణంగా యువతలో ఉండే అనుమానం, భయంతో మూల కథ అల్లుకొని వాటిని నివృత్తి చేసే క్రమంలో కామెడీ ట్రాక్‌పై సినిమా నడవడం బాగుంది. ఓసారి నోటికి చేయి అడ్డం పెట్టుకొని నవ్వుకున్నారు తప్ప దీనిని ఎవరూ తప్పు పట్టలేదు. 2023లో హిందీలో వచ్చిన 'ఓఎంజి 2' ఓ సంచలనాత్మక సినిమా అనే చెప్పుకోవాలి. యువకులు స్వయంతృప్తి కోసం చేసుకొనే హస్తప్రయోగంపై ఈ సినిమా మొత్తం నడుస్తుంది. హస్త ప్రయోగం వల్ల అంగం సైజు పెరుగుతుందని ఫ్రెండ్ చెప్పడంతో అలా చేస్తూ వీడియోలో చిక్కిన విద్యార్థి వ్యథ ఈ సినిమా కథ. దానివల్ల కుటుంబం ఇరుగుపొరుగు దృష్టిలో ఈసడింపునకు గురైనా, చివరకు హస్తప్రయోగం తప్పు కాదని అది చేసుకోని పురుషుడే ఉండడనే రుజువుతో సినిమా ముగుస్తుంది.
'కాదల్ - ది కోర్', 'డాక్టర్ జి'
ఇదే తరహాలో మరో సెక్స్ అంశంపై వచ్చిన మలయాళీ సినిమా 'కాదల్ - ది కోర్'. హావభావాలతోనే కథ నడిచిన ఈ సినిమాలో మమ్ముట్టి హీరో. జియో బేబీ దర్శకుడు. హోమో సెక్సువాలిటీ ఈ సినిమా కథాంశం. భార్య పిల్లలతో సంసారం చేస్తున్న ఎందరో మగవాళ్ళలో స్వజాతి సంపర్క కాంక్ష ఉంటుందని, అది వారి శరీర లక్షణమని, దాని కారణంగా జీవితాలను చెడగొట్టుకోవద్దనే సందేశం ఈ సినిమాలో ఉంది. గైనకాలజీ చదివిన మగ డాక్టర్‌కు ఎదురయ్యే అనుభవాలతో తీసిన హిందీ సినిమా 'డాక్టర్ జి' కూడా స్త్రీ వైద్య విద్యకు ఆడ మగ తేడా అవసరం లేదని చెబుతుంది. సెక్స్‌పై బహిరంగంగా మాట్లాడుకోవాలని, దాన్ని దాయడం వల్లే సమస్యలన్నీ వస్తున్నాయని, ఒక్కసారి మాట్లాడామంటే ఇక దాయవలసిన ఆగత్యం లేకుండా తేలిపోతుందని ఈ సినిమాలు చెబుతున్నాయి.
-బి.నర్సన్
94401 28169