తెలుగు రాష్ట్రాల్లో ఎస్టీ రిజర్వేషన్లకు పాతర..

by Vinod kumar |   ( Updated:2023-04-10 23:45:55.0  )
తెలుగు రాష్ట్రాల్లో ఎస్టీ రిజర్వేషన్లకు పాతర..
X

ఆదివాసీలను అంతం చేయడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎస్టీ జాబితాలో గిరిజనేతర కులాలను కలపాలని అసెంబ్లీలలో తీర్మానం చేస్తే, రెండు రాష్ట్రాల ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఏ మాత్రం సిగ్గులేకుండా మద్దతిచ్చి ఆదివాసీల మనుగడను కూల్చింది చాలక ఈ కలుపుడు సరైనదేనని కితాబులిస్తున్నారు.. తెలంగాణలో అయితే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో.. ఏజెన్సీలో గొర్రెల్ని బలిస్తున్నారు. అమాయక ఆదివాసీ గొర్రెలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తాము, ఇంటింటికి పెన్షన్ ఇస్తాం.. అని మాయమాటలు చెప్పి ఆత్మీయ సమ్మేళనాలకు తీసుకెళ్ళేరు. ఈ దేశానికీ స్వతంత్రం వచ్చిందేమో కానీ, ఈ దేశంలోని ఆదివాసీలకు స్వతంత్రం రాలేదు. 76 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఆదివాసీల అభివృద్ధి శూన్యం. లంబాడాల అభివృద్ధి గణనీయం.

ఆదివాసీలకు అటూ ఇటూ ద్రోహం..

ఈ 76 ఏళ్లలో ఆదివాసీలకు జరిగిన అన్యాయం కంటే కేవలం 8 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అన్యాయం వెలకట్టలేనిది. తెలంగాణ రావడానికి 7 ఆదివాసీ మండలాలను ఆంద్రోళ్లకు అమ్ముకున్నాడు. సుమారు 2 లక్షల పైచిలుకు ఆదివాసీలను పోలవరం ప్రాజెక్టులో జలసమాధి చేశారు. మండలాలు, జిల్లాల పేరుతొ ఏజెన్సీ మండలాలను ముక్కలు చెక్కలు చేసి ఏజెన్సీ మండలాలను మైదాన ప్రాంత మండలాల్లో కలిపి ఏజెన్సీ ప్రాంతాన్ని విచ్చిన్నం చేసి, ఆదివాసీల ఐక్యతను బలహీన పర్చారు. 58 జీవో తెచ్చి ఏజెన్సీ ప్రాంతంలో తెల్ల కాగితాల పైన కొనుగోలు చేసిన గిరిజనుల భూములను 170 చట్ట విరుద్ధంగా గిరిజనేతరులకు పట్టాలు చేసి గిరిజనులకు అన్యాయం చేశారు.


భూ ప్రక్షాళన పేరుతొ ప్రభుత్వ భూములను కబ్జా చేసిన గిరిజనేతరులకు అక్రమంగా పట్టాలు చేసి ఇచ్చేశారు. నేడు 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేస్తే ఆదివాసీ ప్రజా ప్రతినిధులు ఒక్కరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు మెదపలేదు. కానీ తన కుమార్తె 100 కోట్ల కుంభకోణం చేస్తే ఎక్కడ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందేమో అనే భయంతో ప్రజల ఆలోచనను మార్చడానికి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టిండు కేసీఆర్.

పార్టీల ప్రతినిధులా, ఆదివాసీ ప్రతినిధులా..?

రిజర్వేషన్‌తో గెలిచిన ఆదివాసీ ప్రజా ప్రతినిధులు ఆదివాసీ విధ్వంసకారి అయిన పార్టీ మీటింగ్‌కు ఎలా వెళ్తారు. జాతి పైన బాధ్యత లేదా.. మీరు పార్టీలకు మాత్రమే ప్రజా ప్రతినిధులా.. ప్రజలకు ప్రతినిధులు కారా అని.. రేపు ఆదివాసీ సమాజం ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను గ్రామాల్లో ఖచ్చితంగా నిలదీయడం జరుగుతుంది. ఆదివాసీలను అంతం చేసే పార్టీల ఆత్మీయ సమ్మేళనాలకు వెళ్లడం అంటే ఆదివాసీ సమాజాన్ని మనకు మనం సమాధి చేయడమే అవుతుంది.

దీనిపైన యువత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. యువత జాతికి జరుగుతున్న అన్యాయం పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాల్సిన అవసరం ఉన్నది.. ఆదివాసీ జాతి భవిష్యత్తు ఆదివాసీ యువతపైన ఉన్నది..11 గిరిజనేతర కులాలను ఎస్టీ జాబితాలో కలిపితే విద్యా, ఉద్యోగాల్లో, రాజకీయ పదవులు సైతం 11 గిరిజనేతర కులాలు సొంతం చేసుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే మనం దీని ఫలితాలను అనుభవిస్తూ ఉన్నాము.

అసలుకే ప్రమాదం.. పోరాడదాం..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో లంబాడాలను ఎస్టీ జాబితాలో కలిపితే అసలైన ఆదివాసీలకు ఉద్యోగాలు, రాజకీయ పదవులు మొత్తం లంబాడాలకే పోతున్నాయి. ఇప్పుడు 11 గిరిజనేతర కులాలను ఎస్టీ జాబితాలో కలిపితే అసలైన ఆదివాసీలు తీవ్రంగా నష్టపోతారు. అందులో మన బిడ్డలు ఉన్నారు అనే సంగతి మనం మర్చిపోవద్దు. ప్రభుత్వం ఆదివాసీలకు ఎంత నష్టం, అన్యాయం చేస్తున్నా ఆదివాసీ ప్రజా ప్రతినిధులు మాట్లాడటం లేదు. దీనిపైన మనం అంత పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది.. ఆదివాసీ సంఘాలు అసలు సమస్యల్ని వదిలి కొసరు సమస్యల వెంట తిరుగుతున్నాయి..

ఆదివాసీల ఐక్యతను రాజకీయ పార్టీలు విచ్ఛిన్నం చేస్తుంటే.. సంఘాలు ఇదే అదనుగా.. నచ్చిన పార్టీలలో చేరి.. సంకలు గుద్దుకుంటున్నాయి. ఎడ్డీ మేధావుల మూలంగా.. ఇప్పటికే ఎంతో కోల్పోయాం.. వీళ్ళు సంఘాలలో మెడకు తలుగులు(గొలుసులు) కట్టుకోని మట్టుకు పడి సచ్చారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు పేరు వేరైనా ఎస్టీ చట్టాలు ఒక్కటే.. కాబట్టి కలిసి పోరాడాలి. కొత్తకులాలను కలపడం అయినా Go3, LTR, 159, 170, పేసా, అటవీ హక్కుల చట్టం.. అయినా.. ఏ రాష్ట్రంలో ఉల్లంఘన జరిగినా.. ఉభయ రాష్ట్రాల ఆదివాసీల ఉనికికే పెను ప్రమాదం. ఆలోచించండి, ఐక్యకార్యాచరణకు అడుగులేద్దాం. కలిసి రండి.

వూకె రామకృష్ణ దొర

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

98660 73866




Advertisement

Next Story