తెలుగువారి అయోధ్యాపురి భద్రగిరి

by Vinod kumar |   ( Updated:2023-03-30 00:00:52.0  )
తెలుగువారి అయోధ్యాపురి భద్రగిరి
X

ఆద్బుతంగా అందంగా ముత్యాల తలంబ్రాల వెలుగుల తో మెరిసే భద్రగిరి. దైవమా శ్రీ సీతారామచంద్ర మూర్తి. జలమా పవిత్ర గోదావరి. శిలగా మలచీ. శిరమును నీవే నిలచీ. భద్రగిరిగ నన్ను పిలిచే భాగ్యము నిమ్మని భద్రుడు కోరిన స్దలము ఆదిగో ఆదిగో భద్రగిరి ఆంధ్రజాతికి ఆయోధ్యాపురి. భద్రాచలక్షేత్రాన్ని జనసామాన్యానికి అందజేసిన మహనీయుడు, భక్త జన వంద్యుడు శ్రీరామదాసు. కనుకనే భద్రాచల క్షేత్రానికి సహజంగానే ప్రాముఖ్యత లభించింది.

భద్రాచల దేవాలయ నిర్మాణం

భద్రాచచలానికి సమీపంలోని భద్రిరెడ్డిపాలెంలో నివశిస్తున్న పోకల దమ్మక్క అనే భక్తురాలు భద్రుని కొండపై ఓ పుట్టలో దాగి ఉన్న శ్రీ సీతారామలక్ష్మణ మూర్తులను వెలికితీసి పందిరి నిర్మించి నిత్యం స్వామివారికి నివేదన చేస్తూ ఉండేది. కంచెర్ల గోపన్న ఈ శిలామూర్తులకు శాశ్వత దేవాలయ నిర్మాణాన్ని చేపట్టాడు. రామదాసు ఒకనాడు తన ఆరాధ్య దైవమైన శ్రీ సీతారామలక్ష్మణ మూర్తులు సరైన ఆచ్ఛాదన లేక పందిరి కింద ఉండటంతో చలించి నవాబులకు చెల్లించ వలసిన 6 లక్షల శిస్తు వసూళ్ళను ఖర్చుచేసి భద్రాచల రామునికి రాజ గోపురం, ప్రధానాలయం, ప్రాకారాలయాలు నిర్మించటమేకాక సీతమ్మకు చింతాకు పతకం, స్వామివారికి పచ్చలపతకం, బంగరు మొలత్రాడు, కలికితురాయి వంటి విలువైన ఆభరణాలు చేయించి అలంకరింప చేశాడు. నవాబుల ఖజానాకు చేరవలసిన సొమ్మును ఆలయ నిర్మాణానికి వెచ్చించినందుకు ఆగ్రహించిన నవాబు తానీషా రామదాసును గోల్కొండ ఖిల్లాలో 12 ఏళ్ల పాటు బంధించి చిత్రహింసలుపెట్టడం జరిగింది.

రామదాసుకు బంధ విముక్తి

నవాబులు పెట్టే చిత్రహింసలు భరించలేక ఆర్తితో, ఆవేదనతో నాడు రామదాసు పాడిన పాటలే భక్త రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. తన భక్తుడు రామదాసును చెరనుండి విడిపించేందుకు సాక్షాత్తు రామ, లక్ష్మణులే రామోజీ, లక్ష్మోజీలుగా నవాబుకు దర్శనమిచ్చి 6 లక్షల నాణాలకు బదులుగా, 6 లక్షల బంగారు రామ మాడలను చెల్లించినట్లుగా క్షేత్ర చరిత్ర చెపుతోంది. మూడు వందల ఏళ్ళనాటి చరిత్రకు సాక్ష్యాధారంగా నేటికీ శ్రీరామచంద్రునికి కళ్యాణ మహోత్సవం సందర్భంగా అప్పటి రామమాడలలో ఒకటైన రామమాడను ధరింపచేయటం ఆనవాయితీగా వస్తున్నది. అలాగే మంగళసూత్ర ధారణలో కూడా మూడు సూత్రాలను అలంకరింప చేస్తారు. ఒకటి అమ్మవారి తరఫునుంచి జనకమహారాజు, మరొకటి స్వామివారి తరఫునుంచి దశరధమహారాజు ధరింపచేసే సూత్రాలుకాక వేరొకటి భక్త రామదాసు సమర్పించినది కూడా ధరింప చేస్తారు. ఇది లౌకికమైతే ముగురమ్మలకు ప్రతీక ఐన శక్తి కి చిహ్నంగా మూడు మంగళ సూత్రాలను ధరింపజేస్తారు ఆర్చక స్వాములు.

రాముడు నడయాడిన నేల

రాముడు అయోధ్యలో జన్మించినా వనవాసంలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణం చేశాడంటారు. అందుకే దక్షిణభారతం పొడవునా రామాయణ ఘట్టాలకి సంబంధించిన క్షేత్రాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒంటిమిట్ట కూడా ఒకటి.దేశ వ్యాప్తంగా ఉన్న రామాయలయాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అయితే వీటన్నింటి కన్నా ఒంటిమిట్ట చాలా ప్రత్యేకం. సాధారణంగా దేశ వ్యాప్తంగా ఏ రామాలయంలో చూసినా సీతారాముల కళ్యాణం చైత్ర మాసం నవమి రోజు పగలు జరిగితే.. ఒంటిమిట్టలో మాత్రం చైత్ర పౌర్ణమి రోజు, వెన్నెల వెలుగుల్లో జరుగుతుంది. రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. ప్రకృతి వైపరీత్యాలు, దోపిడీలు, దొంగతనాలు, దాడులు, ఘాతుకాలకు తట్టుకుని నిలబడింది ఒంటిమిట్ట కోదండ రామాలయం. దీనికి ఏకశిలానగరం అనే పేరు కూడా ఉంది. సీత, రామ, లక్ష్మణుల ప్రతిరూపాలను ఒకే శిలలో విగ్రహాలుగా చెక్కారు అందుకే ఏకశిలా నగరం అనే పేరొచ్చింది. ఆ ఏకశిలకు దగ్గర్లోనే మృకండుడు అనే మహర్షి తపస్సు చేసుకునేవారట, రాములవారు అరణ్యవాసంలో భాగంగా అటు సంచరిస్తూ కొద్ది రోజులు మృకండునికి రక్షణగా ఇక్కడ ఉన్నారని స్థలపురాణం చెబుతోంది. రామనవమి రోజు జరిపించాల్సిన కళ్యాణం చైత్ర పౌర్ణమి రోజు జరిపించడం మరింత విశేషం. ఇతర రామాలయాలకు భిన్నంగా ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం పున్నమి కాంతుల్లో జరగడం ప్రత్యేకమే.

ఆరు బయట కల్యాణ క్రతువు

భారత దేశంలో రామాలయం ఉండని గ్రామం ఉందనుట అతిశయోక్తికాదు. అయితే దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి రోజున జరుగు శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రతిఏట స్వామివారి కల్యాణం ఆరుబయట భక్తులమధ్యనే నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరికి కల్యాణం తిలకించే భాగ్యం కలగాలని రామదాసు ఈ విధంగా శాసనం చేశాడు. శ్రీసీతారామ కల్యాణోత్సవాన్ని ఆరుబయటే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకుగాను మిధిలా స్టేడియం పేరుతో శిల్పకళా శోభితమైన ఓ కల్యాణ వేదికను నిర్మించారు. నిజంగా ఇదొక అద్భుత నిర్మాణం. ఈ కల్యాణవేదిక చుట్టూ చెక్కిన రామాయణ ఘట్టాలు, ఏక శిలలో రూపుదిద్దుకున్న శిలాతోరణాలు , వేదికకు ఇరువైపులా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నట్టు వుండే రాతి ఏనుగులు కొన్ని వందల ఏళ్లుగా నిరాటంకంగా, పాంచరాత్రగమశాస్త్ర బద్ధంగా సీతారామ కళ్యాణం ఇక్కడ జరుగుతోంది.

శ్రీరాముని జన్మనక్షత్రం పునర్వసు, జన్మతిధి చైత్రశుద్ద నవమి శుభ ఘడియల్లో అభిజిత్‌ లగ్నమందు మధ్యాహం 12గంటలకు అమ్మవారికి, స్వామివారికి శుభముహూర్తాన జీలకర్ర బెల్లం శిరస్సులపై ఉంచి కల్యాణ తంతు జరిపిస్తారు. అలాగే స్వామి, అమ్మవార్ల కల్యాణం సందర్భంగా నవాబుల కాలం నుంచి ఏనుగు అంబారీపై ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు కానుకగా సమర్పించే సాంప్రదాయం ఉన్నది. అదే సాంప్రదాయాన్ని నేటికీ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తూ రాష్ట్ర ముఖ్య మంత్రి స్వయంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించటం జరుగుతోంది. అలాగే తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి కూడా స్వామి అమ్మవార్లకు కానుకలు సమర్పించటం అనాదిగా వస్తోంది.

(నేడు శ్రీరామనవమి)

శ్రీధర్ వాడవల్లి -9989855445

Advertisement

Next Story

Most Viewed