మన్య విప్లవ మహావీరుడు అల్లూరి సీతారామరాజు

by GSrikanth |   ( Updated:2023-05-07 06:43:12.0  )
మన్య విప్లవ మహావీరుడు అల్లూరి సీతారామరాజు
X

భారత స్వాత్యంత్ర పోరాటంలో చిరస్మరణీయుడు అల్లూరి సీతారామరాజు. ఆయన అసలు పేరు శ్రీరామరాజు. వారి తండ్రి వెంకటపతి రాజు, తల్లి సూర్యనారాయణమ్మ. వారి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు. 4-7- 1897వ తేదీన విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో పాండ్రంగి లో జన్మించారు. బ్రిటిష్ నిరంకుశ పాలనలో గిరిజనులు అనుభవిస్తున్న దయనీయ పరిస్థితిని తొలగించి, గిరిజనుల జీవితాలలో వికాస అభ్యుదయాలు కలిగించడానికి రామరాజు మన్యవిప్లవం సాగించారు. సీతారామరాజుకు మొదట ఆశ్రయం కల్పించింది కృష్ణదేవపేటలోని చిటికెల భాస్కరుడు. అక్కడే ఆయన శ్రీరామ విజయనగరం అనే తన తొలి స్థావరాన్ని ఏర్పరచుకొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం రామరాజును అక్కడి నుండి తరలించి పైడిపుట్టలో యాబై ఎకరాల భూమిని, ఎడ్లను ఇచ్చింది. అక్కడ వ్యవసాయం చేస్తూనే తిరుగుబాటు చేయడానికి సరైన సమయం కోసం, బలమైన సందర్భం కోసం రామరాజు ఎదురుచుసాడు. ఆయన హృదయంలో అగ్నిజ్వాలలు, అయన మనస్సులో బడగాగ్నులు, రగులుతోన్న మన్యం.. విప్లవానికి ఎదురుచూసింది. చివరికి 20.08.1922 న పైడిపుట్టలోని భూమిని, ఎడ్లను వదిలిపెట్టి, రామరాజు విప్లవం వైపు సాగిపోయాడు.

మే నెల 7 తేదీ భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. ఒక గొప్ప దేశభక్తుడు దేశ స్వాతంత్రం కోసం జీవితాన్ని ధారపోసిన రోజు. దుర్మార్గ బ్రిటిష్ పాలనను ఎదిరించి పోరాడిన ఒక వీర యువకుడ్ని బ్రిటిష్ పాశవిక శక్తి పొట్టన పెట్టుకున్న రోజు. అమాయకులైన గిరిజనుల కోసం, వారి కనీస హక్కుల కోసం, వారు స్వేచ్ఛ కోసం పోరాడి, బ్రిటిష్ తుపాకులకు ఎదురొడ్డి నిలచిన అల్లూరి సీతారామరాజును కాల్చి చంపిన రోజుది. సరిగ్గా 99 ఏళ్ల క్రిందట, రాజేంద్రపాలెం (కొయ్యూరు) వద్ద చింత చెట్టుకు కట్టివేసి ఆ వీర యువకుడ్ని కాల్చివేశాడు మేజర్ గుడాల్. కేవలం 27 ఏళ్ల వయసులోనే దేశం కోసం దేశ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం జీవితాన్ని గర్వంగా అర్పించిన మహావీరుడే అల్లూరి సీతారామరాజు. ఆ వీరుడ్ని, మహాత్యాగాన్ని బలిదానాన్ని స్మరించడం మనందరి కర్తవ్యం మనందరి బాధ్యత.

అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో నడిచిన మన్యవిప్లవం చాలా గొప్పది. ఈ విప్లవం భారత స్వాతంత్ర పోరాటంలో మన్యవిప్లవ పాత్ర చాలా ప్రత్యేకమైనది. ఇది సాయుధ పోరాటమే అయినా, గిరిజన వీరుల సౌజన్యం ఈ పోరాటంలో అడుగడుగునా కనిపించింది. ఈ పోరాటం కేవలం దుర్మార్గ విదేశ శక్తులపైనే సాగింది. ఏ పరిస్థితిలో కూడా సోదర భారతీయుల పైన తుపాకీ ఎక్కుపెట్టని పోరాటం... మన్య పోరాటం. శ్రీ అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో నడిచిన మన్యవిప్లవం దాదాపుగా రెండున్నర సంవత్సరాల పాటు సాగిన పోరాటం ఇది. భారత స్వాతంత్ర పోరాటంలో సుదీర్ఘకాలం సాగిన సాయుధ పోరాటం మన్యవిప్లవం అనడంలో ఎటువంటి సందేహం లేదు. 1922 జనవరి నుండి 1924 ఆగస్టు దాకా సాగిన పోరాటం ఇది. దీనికే మరొక పేరు మంప పితూరీ. ఈ పోరాటం లండన్ లోని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా గజగజలాడించింది. దాదాపుగా ఐదువందల మంది (500) గిరిజన వీరులు ఈ మన్య పోరాటంలో పాల్గొన్నారు. వీరందరిని గొప్ప యోధులుగా తీర్చిదిద్దడంలో సీతారామరాజు చూపిన శ్రద్ధ చాలా గొప్పది.

మన్య విప్లవం 22-8-1922న చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి చేయడంతో ఆరంభమైంది. పోలీస్ స్టేషన్ ఆక్రమించి తుపాకులు, తూటాలు తీసుకున్నాడు రామరాజు. 23-8-1922 న కృష్ణదేవపేట పోలీస్ స్టేషన్, ఆ మరుసటి రోజు రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లను ఆక్రమించి, తుపాకులు, మందు గుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నాడు రామరాజు. మన్య పోరాటంలో మరొక గొప్ప సంఘటన.. కర్కశులైన బ్రిటిష్ మిలటరీ అధికారులు స్కాట్ కవర్డ్ , హైటర్ లను అంతం చేయడం. బ్రిటిష్ సామ్రాజ్యంలోని అనేక దేశాలలో స్వాతంత్ర్య ఉద్యమాలను అణిచివేయడంలో పేరుందిన స్కాట్ కవర్డ్, హైటర్ లు మన్య విప్లవం అణచడానికి విశాఖ జిల్లా వచ్చినప్పుడు 24-9-1922 న రామరాజు నాయకత్వంలో మన్య వీరులు వారిని అంతం చేశారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బ.15-10-1922 న అడ్డతీగల పోలీస్ స్టేషన్ 19-10- 1922న చోడవరం పోలీస్ స్టేషన్లను ముందుగానే మొట్టడిస్తానని మిరపకాయ టపా పంపి, వశపరుచుకున్నాడు రామరాజు. అయినా బ్రిటిష్ ప్రభుత్వం రామరాజును ఏమీ చేయలేకపోయింది. 6-11-1922న పెద్దగడ్డపాలెం లో బ్రిటీష్ అధికారి జాన్ తో జరిగిన పోరాటంలో నలుగురు విప్లవ వీరులు మరణించారు 7-11-1922న స్వీనీ, కీనీ అనే బ్రిటిష్ మిలటరీ అధికారులతో విప్లవ వీరులకు సాగిన పోరాటంలో ఎనిమిది మంది విప్లవ వీరులు మరణించారు.ఈ లోగా ప్రధాన విప్లవ వీరుడైన గాం మల్లుదొర నడింపాలంలో బ్రిటిష్ అధికారులకు దొరికిపోయాడు. ఇది విప్లవానికి పెద్ద దెబ్బ.

విప్లవాన్ని అణచడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎంతో దుర్మార్గం చేసింది గ్రామాల్ని తగలబెట్టింది. గిరిజన పురుషుల్ని, బిడ్డల్ని చిత్రహింసలుకు గురిచేసింది. గిరిజన స్త్రీలను ఎన్నో రకాలుగా అవమానించింది. ఒక్క మాటలో చెప్పాలంటే... ప్రజా జీవితాన్ని నరకం చేసింది. తనకోసం మన్య ప్రజలు పడుతున్న వేదన చూసిన రామరాజు ఎంతో బాధపడ్డాడు. బ్రిటిష్ అధికారులు చేతుల్లో మన్య ప్రజలు అనుభవిస్తున్న చిత్రహింసలకు రాజు హృదయం కరిగిపోయింది. చివరకు తనంతట తానుగానే బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగిపోవాలని నిశ్చయించుకొని, మంప గ్రామంలో మహా పర్వతం మీద వేదనాభరిత హృదయంతో రాత్రి తెల్లవార్లు గడిపాడు. తెల్లవారుఝామునే పర్వతాలు దిగివచ్చి మడుగులో స్నానం చేయబోతున్న రామరాజు గురించిన సమాచారాన్ని పోలీస్ అధికారులకు చేర వేశాడు ఒక ద్రోహి. అంతే.. నిరాయుధుడైన సీతారామరాజును పట్టి బంధించారు ఇన్ స్పెక్టర్ ఆళ్వారు నాయుడు, జమేదార్ కుంజమేనన్. నిరాయుధుడైన సీతారామరాజు చేతులు విరిచి, చింత చెట్టుకు కట్టి కిరాతకంగా కాల్చివేశాడు మేజర్ గుడాల్.

1924వ సంవత్సరం మే 7 వ తేదీ, భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు. జాతి కోసం, నేల కోసం, స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం ఒక మహావీరుడు తన జీవితాన్ని బలిదానం చేసిన గొప్ప క్షణం అది.రామరాజు మృతదేహాన్ని నులకమంచానికి కట్టి, కృష్ణదేవపేట చేర్చి, ఫోటో తీసి, పంచనామా చేసి, తెల్లవారుతుండగానే దహనం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. తాండవ నది ఒడ్డున అల్లూరి సీతారామరాజు భౌతిక దేహం అగ్నికి ఆహుతైపాయింది. జన్మభూమి స్వేచ్చ కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు జయ గీతం కొండల్లో, కోనల్లో, అరణ్యాల్లో, గిరిజన జీవితాలలో, జన జ్ఞాపకాలలో నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది.

మన్య విప్లవ మహావీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు పాటు మన్య విప్లవంలో పాల్గొని బ్రిటీ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి పోరాడి జీవితాలను దేశం కోసం అర్పించిన గిరిజన వీరులు ఎందరో, జైల్లో చిత్రహింసలు అనుభవించిన దేశభక్తులు మరెందరో, వారందరి జీవిత చరిత్రలు ఎక్కడ ఎవరూ వ్రాయలేదు, సరికదా వారి వివరాలు దొరకడం కూడా దాదాపుగా అసాధ్యంగా మారిపోయింది. ఆ మహనీయుల్లో కొందరు పేర్లు మాత్రమే ఈనాడు మనకు లభిస్తున్నాయి. పెదవలస గ్రామవాసి కంకిపాటి ఎండు పడాల్ , లక్కవరపుకోటకు చెందిన కంకిపాటి కొత్త పడాల్ , పెదవలస నివాసి కంకిపాటి ఎండుపడాల్, లక్కవరపు కోటకు చెందిన కంకిపాటి కొత్తపడాల్, పెదవలస నివాసి కంకిపాటి శరభన్న పడాల్, పోతుని మల్లయ్య, సింగన్నపల్లి నివాసి సంకోజిముక్కడు, గనగర్లపలెంకు చెందిన గొప్ప విలుకాడు గోకిరి ఎర్రేసు, చింతలపూడి వాసి బొంకుల మాదిగాడు, కొయ్యూరులో ఉన్న ముట్టాడు బుడ్డయ్య దొర, గనగర్లపలెంకు చెందిన సుంకర కొండయ్య, శరభన్నపాలెం నుండి బోనంగి పోతరాజు, గూడెం చింతపల్లిలో జన్మించిన మొట్టడం వీరయ్యదొర, గూడెం కొత్త వీధి జర్తా గంటయ్య, పూజారిపాకల నివాసి పూజారి బంగారయ్య వంటి వీరులంలెందరో ఈ పోరాటంలో పాల్గొని ప్రాణాలు అర్పించారు. మరికొందరు జైళ్ళల్లో చిత్రహింసలకు గురయ్యారు.

(మే 7న అల్లూరి సీతారామరాజు 99వ వర్థంతి సందర్భంగా)


ఎన్.సీతారామయ్య,ఎం.ఎ,బి.ఎడ్

కార్యవర్గ సభ్యులు

జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం.

ఫోన్ నెం.9440972048

Advertisement

Next Story