ఓటమి గెలుపునకు నాంది

by Ravi |   ( Updated:2022-11-07 18:30:22.0  )
ఓటమి గెలుపునకు నాంది
X

ప్రతి ప్రాణికి కూడా దేని సమస్య దానికుంది. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎదుర్కోవాలంటే గుండెను బండరాయి చేసుకోవాలి. కొన్నింటిని వదిలేయాలి. కొన్ని త్యాగాలు చేయాలి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగానే కనిపిస్తుంది. మహామహులకే తప్పలేదు అవమానాలు, అవరోధాలు, ఆటంకాలు అలాంటి వారు ఎలా పైకెదిగారు అనేది ఆలోచించాలి. మన టార్గెట్ ఏదైతే అనుకొంటామో ఆ టార్గెట్ మీద మనసు పెడితే జీవితం హాయిగా, ప్రశాంతంగా ముందుకు సాగుతుంది.

నేటి సమకాలీన ప్రపంచంలో ఆత్మహత్యలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీనికి కారణాలేంటి? ఎందుకు ఇలా? ఆత్మహత్య చేసుకోవడానికి, ఆ దిశగా ఆకర్షితులు కావడానికి ఎవరైనా ప్రేరేపిస్తున్నారా? అనేది ఒకసారి మననం చేసుకోవాలి. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకుంటున్నవారిలో యువత శాతం ఎక్కువగా ఉంటున్నది. 'ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగిన యువతే దేశానికి ప్రధానం' అంటారు స్వామి వివేకానంద. కానీ, అలాంటి యువతే ఎక్కువగా ఆత్మహత్య చేసుకొంటున్నారు. మానసిక ఉద్రేకంతో ఎక్కువగా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

ఈ కాలంలో యువతలో ధైర్యం సడలి, సమస్యలను ఎదుర్కొలేక, తల్లిదండ్రులకు కొన్ని విషయాలను చెప్పుకోలేక, తమలో తాము మదనపడుతూ కుంగి, కృషించి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో జీవితాలను అంతం చేసుకొంటున్నారు. వీటిలో లవ్ ఎఫైర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ప్రేయసి మోసం చేసిందని, ప్రియుడు మోసం చేసాడని, మార్కులు తక్కువగా వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించారని, ఉపాధ్యాయులు మందలించారనే కారణాలతో ఇలాంటి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

జీవితాన్ని అభాసుపాలు చేసుకుంటూ

మానసిక కుంగుబాటుతో ఆత్మహత్య చేసుకొంటున్నవారిలో 25-35 యేళ్లలోపు వారు 33 శాతం, 15-25 యేళ్ళ వయసు వారు 23 శాతం, 35-45 యేళ్ల వయసువారు 21 శాతం ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఆత్మహత్యలకు పాల్పడే వారిలో 10-15 శాతం మంది క్షణికావేశంతో నిర్ణయం తీసుకుంటున్నారు. మరికొంత మంది వివాహాల తరువాత చాలీ చాలని జీతాలతో జీవితాలను చీకటిపాలు చేసుకొంటున్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకొనే ఆలోచన లేక, ఆధారం లేక, ఎవరి ఆసరా దొరకక అప్పుల ఊబిలో చిక్కుకొని చనిపోతున్నారు. మన దేశానికి వెన్నెముక 'రైతు' అంటారు.అలాంటి రైతు నడ్డి విరిగే పరిస్థితి వచ్చింది. పంట దిగుబడి రావాలంటే పైరుకు ఎరువులు, మందులను అప్పులు తెచ్చి కొడితే చివరకు మార్కెటుకు పంటను తీసుకెళ్తే గిట్టుబడి ధర రాక, చేసేది ఏమీ లేక దిగులు చెంది ఉరితాళ్లకు ఊగుతున్నారు.

ఇక వృద్ధుల విషయానికొస్తే 40 పై చిలుకు వయస్సున్న వారిలో అత్త కోడలు పోరు, అవ్వ బిడ్డల పోరు, అయ్యకొడుకుల తగాదాలు,అన్నదమ్ముల తగాదాలు ఇలా ఉన్నాయి. భూమి కొరకు తగాదాలు, ఆస్తి కొరకు అల్లరులు, నీడలేని నిరుద్యోగ యువకులు, అనాథల ఆర్తనాదాలు, ఆకలి కేకలు ఇవన్నీ కూడా ఆత్మహత్యకు కారణమే. ఇలాంటి ఆలోచన ఉన్నవారు నిద్రపోరు. తెల్లవారుజామున 3-4 గంటలకే లేచి కూర్చుంటారు. ఆహారం సక్రమంగా తీసుకోరు. క్రమేణ బరువు తగ్గుతుంటారు. ఏ పనిలోను ఉత్సాహం చూపరు. పనులు వాయిదా వేస్తుంటారు. ఒంటరిగా గడిపేందుకు ఇష్టపడతారు. 'నేను చేయలేను, ఇది నావల్ల కాదు, నాతోనే ఇంట్లో ఉన్నవారికి కష్టాలు, ఈ జీవితం దండుగ, చనిపోతే బాగుండు'అనే ఆలోచనతో తమ (విలువైన) అమూల్యమైన జీవితాన్ని అభాసుపాలు చేసుకుంటున్నారు. తాగుడుకు. చెడు వ్యసనాలకు బానిసలుగా మారి భార్యాపిల్లలను పోషించక, మీ మానాన మీరు బతకండి అన్నపుడు ఆ తల్లి, పిల్లలు కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. పురుగుల మందు తాగో, తినో కానరాని లోకాలకు వెళ్తున్నారు. కొంత మంది సూటి పోటి మాటలు వినడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు.

ప్రతి ప్రాణికి కూడా దేని సమస్య దానికుంది. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎదుర్కోవాలంటే గుండెను బండరాయి చేసుకోవాలి. కొన్నింటిని వదిలేయాలి. కొన్ని త్యాగాలు చేయాలి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదిగానే కనిపిస్తుంది. మహామహులకే తప్పలేదు అవమానాలు, అవరోధాలు, ఆటంకాలు అలాంటి వారు ఎలా పైకెదిగారు అనేది ఆలోచించాలి. మన టార్గెట్ ఏదైతే అనుకొంటామో ఆ టార్గెట్ మీద మనసు పెడితే జీవితం హాయిగా, ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. కలత చెంది కనుమరుగు కాకుడదు.


మోటె చిరంజీవి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్‌

99491 94327

Advertisement

Next Story