పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకోవడానికి కారణమేంటో తెలుసా?

by Ravi |   ( Updated:2022-10-20 18:45:18.0  )
పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకోవడానికి కారణమేంటో తెలుసా?
X

శాంతిభద్రతల పరిరక్షణ, వివిధ రకాల బందోబస్తులు, పెరుగుతున్న జనాభాతో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఆస్తి కుటుంబ తగదాలు, హింసాత్మక ఘటనలు, లైంగిక దాడులు, సైబర్ నేరాలు, చోరీ కేసులు, రోడ్డు ప్రమాదాల కేసులు, మద్యం, డ్రగ్స్ నేరాలు, మత సంబంధ అల్లర్లు ఇలా రకరకాల సమస్యల మధ్యన విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు అమూల్యమైనవని మనం గుర్తించాలి. ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రజలు పోలీసులకు సహకారం అందించాలి. కాలుష్యం బారినపడి చనిపోతున్నారు. సమాచార వ్యవస్థను రూపొందించాలి. పోలీసులు కూడా సుఖవంతమైన, సౌకర్యవంతమైన జీవితం గడిపే విధంగా చూడడమే మన కర్తవ్యం. విధి నిర్వహణలో అమరులైన పోలీసులందరికీ ఘన నివాళి.

పోలీసులు తమ విధి నిర్వహణలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని విధులు నిర్వహిస్తుంటారు. ధర్మాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని కాపాడుతూ ధైర్యంగా శత్రువులను తిప్పి కొడతారు. తమ విధులలో భాగంగా రాత్రంతా మేల్కొని శాంతిభద్రతలను పరిరక్షిస్తారు. ఎండ, చలి, వాన, రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రజల కోసం నిరంతరం కాపలా ఉంటారు. ఈ క్రమంలో అనేక మంది పోలీసులు వీర మరణం పొందారు. 1959 అక్టోబర్ 21న పంజాబ్ రాష్ట్రానికి చెందిన డీఎస్‌పీ కరమ్‌సింగ్ ఆధ్వర్యంలో 21 మందితో కూడిన సీఆర్‌పీ‌ఎఫ్ దళం భారత్- చైనా సరిహద్దులలో గస్తీ తిరుగుతోంది.

ఇదే సమయంలో చైనా బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాయి. మన సీఆర్‌పీఎఫ్ దళం వారిని దీటుగా ఎదుర్కుంది, ఈ ఘర్షణలో పది మంది భారత జవానులు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాలను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 న 'పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం' జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.

ప్రాణాలను పణంగా పెట్టి

అమరులైన పోలీసుల జీవితాలను యువ పోలీసులు ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలి. వారి త్యాగాలకు గుర్తుగా పోలీసు అమరవీరుల వారోత్సవాలు జరుపుకొని దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు యేటా నివాళులర్పిస్తారు. నిరంతరం విధి నిర్వహణలో దేశానికి కాపాడేవారు సైనికులు అయితే, అంతర్గత శక్తుల నుంచి ప్రజలను కాపాడి వారి ధన, ప్రాణాలకు భద్రత కల్పించేది పోలీసులు. సామాజిక ఆస్తుల రక్షణ కూడా వారి బాధ్యతే. పోలీసుల విధులు భిన్నంగా ఉంటాయి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. పని గంటలలో తేడా ఉంటుంది. మానసిక ఆరోగ్యం మీద ఒత్తిడి ప్రభావం చూపుతుంది. అనారోగ్యం సమస్యలు ఎదురవుతాయి.

బందోబస్తు విధులో పాల్గొనేవారు విరామం లేకుండా విధులు నిర్వహిస్తారు. కొన్ని సందర్భాలలో సిబ్బంది కొరత కారణంగా పోలీసులకు సెలవు కూడా దొరకదు. అత్యవసర పరిస్థితులలోనూ విధి నిర్వహణలో ఉండాల్సి వస్తుంది. సీఆర్‌పీఎఫ్ , బీఎస్ఎఫ్, ఐటీబీఎఫ్, డీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, సివిల్, ట్రాఫిక్, క్రైం విభాగాలలో విధి నిర్వహణలో తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సమగ్రతను, శాంతిభద్రతలను కాపాడుతున్నారు. అందుకే భారత ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు ఆయా రాష్ట్రాలలో సంక్షేమ నిధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సంక్షేమ నిధి ద్వారా అమరు కుటుంబాల పిల్లలకు స్కాలర్‌షిప్, ఉచిత విద్యను అందించడం జరుగుతుంది. కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు.

వారి సేవలు అమూల్యం

'తెలంగాణ పోలీసులు-వారి సేవలు' అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాలలో రక్తదాన శిబిరాలు, లఘు చిత్రాలు, ఫోటోగ్రఫీ పోటీలు, ర్యాలీలు, స్మారక పరుగులు ఏర్పాటు చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో, వారి భాగస్వామ్యం ద్వారా నిర్వహించడం ద్వారా యువతలో దేశభక్తి, జాతీయ భావం, దేశ భద్రతపై అవగాహన కలుగుతుంది. శాంతిభద్రతల పరిరక్షణ, వివిధ రకాల బందోబస్తులు, పెరుగుతున్న జనాభాతో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఆస్తి కుటుంబ తగదాలు, హింసాత్మక ఘటనలు, లైంగిక దాడులు, సైబర్ నేరాలు, చోరీ కేసులు, రోడ్డు ప్రమాదాల కేసులు, మద్యం, డ్రగ్స్ నేరాలు, మత సంబంధ అల్లర్లు ఇలా రకరకాల సమస్యల మధ్యన విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు అమూల్యమైనవని మనం గుర్తించాలి. ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారు.

ప్రజలు పోలీసులకు సహకారం అందించాలి. కాలుష్యం బారినపడి చనిపోతున్నారు. సమాచార వ్యవస్థను రూపొందించాలి. పోలీసులు కూడా సుఖవంతమైన, సౌకర్యవంతమైన జీవితం గడిపే విధంగా చూడడమే మన కర్తవ్యం. విధి నిర్వహణలో అమరులైన పోలీసులందరికీ ఘన నివాళి.

(నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం)


లకావత్ చిరంజీవి నాయక్

కేయూ, వరంగల్

99630 40960

Advertisement

Next Story

Most Viewed