ఆడపిల్లే సమాజానికి వెలుగు

by Ravi |   ( Updated:2022-10-10 18:45:51.0  )
ఆడపిల్లే సమాజానికి వెలుగు
X

కాశంలో సగం, అవకాశాలలో సగం ' అన్నమాట చాలా కాలంగా వింటున్న అది కేవలం నినాదంగానే మిగిలిపోయింది తప్ప, ఆచరణ రూపం దాల్చలేదు. పాతరోజులలో ఆడపిల్ల పుడితే ఇంటికి వెలుగొచ్చిందని సంతోషించేవారు. కానీ నేడు వారి పుట్టుకను భారంగా భావిస్తున్నారు. కడుపులోనే చిదిమేస్తున్నారు. ఒకవేళ పుట్టినా ఏదో ఒక రకంగా వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క మహిళను మహాశక్తి అని ఆకాశానికెత్తుతూ, మరోపక్క దారుణంగా ప్రవర్తిస్తున్న దుర్మార్గం కళ్లకు కడుతూ ఉంది.ఇది అంతమైనప్పుడే సమాజానికి నిజమైన వెలుగు, నాగరికతకు సరైన అర్థం చేకూరుతుంది.

శాస్త్ర సాంకేతిక రంగాలలో శరవేగంతో దూసుకుపోతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న మనం వారి భద్రత, హక్కుల పరిరక్షణలో ఎక్కడ ఉన్నామో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇంటి నుంచి బడికో, బయటికో వెళ్ళిన బాలిక క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం లేదు. మార్గమధ్యంలో ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. నిర్భయ, అభయ, దిశ లాంటి చట్టాలు వచ్చిన తర్వాత కూడా అత్యాచార ఘటనలు లేకుండా ఒక్క రోజైనా గడిచింది లేదు. దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలపై అనునిత్యం జరుగుతున్న దారుణాలే దీనికి నిదర్శనం.

పెరుగుతున్న నేరాలు

ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం, 18 ఏళ్లు పైబడిన మహిళలపై అత్యాచార కేసులు 28,644 కేసులు, మైనర్లపై 36,069 అత్యాచార కేసులు, 2019 లో పిల్లలపై 1,48,185 ఘటనలు, 2020లో తెలంగాణలోనే బాలికలపై 2,074 పోక్సో కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. దేశంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితి 2019 కంటే 2020 లో మరికాస్తా పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 77 అత్యాచార కేసులు, 80 హత్యలు నమోదవుతున్నాయని వెల్లడించింది.

ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో మనమింకా పిల్లలు హక్కులు, రక్షణ గురించి, హత్యలు, అత్యాచారాల లెక్కల గురించి మాట్లాడుకునే స్థితిలోనే ఉన్నాం. ' బేటీ పఢావో.. బేటీ బచావో ' దగ్గరే చక్కర్లు కొడుతున్నాం. నేటికీ ఆడపిల్లలంటే చులకన భావం, వివక్ష కొనసాగుతోంది. మహిళను మనిషిగా కూడా చూడని కుసంస్కారం ఉంది. హక్కుల నిరాకరణ, లైంగిక వేధింపులున్నాయి. గృహహింస ఉంది. అమ్మాయిలు, అబ్బాయిలు సమానమేనన్న ఇంగితం లేదు. అన్ని రంగాల్లో అమ్మాయిల పట్ల వివక్ష కొనసాగుతోంది.

అనేక సవాళ్లు

బాలికల హక్కులు, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేయడంతో పాటు బాలికలకు సమాజ పోకడల పట్ల, అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 11 న అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని(national girl day) జరుపుకోవాలని డిసెంబర్ 19 - 2011న ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. ప్రతి సంవత్సరం ఒక నినాదంతో కార్యక్రమాల నిర్వహణ జరుగుతోంది. ఈ సంవత్సరం నినాదం (national girl day theme) 'Our time is now - our rights, our future' 'మన హక్కులు, మన భవిష్యత్తు - ఇదే సమయం'.

బాలికలు తమ భవిష్యత్తును, హక్కుల్ని సాధించుకోడానికి, కౌమర దశలో ఆడపిల్లలు, యువతులు ఎదుర్కొనే సమస్యలు, హింసలను అంతం చేసి,వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తించేలా, సాధికారత ప్రాముఖ్యతను తెలుసుకొని వారి హక్కులని దక్కించుకునేలా దీని ప్రధాన ఉద్దేశ్యం. కిశోర బాలిక మహిళగా రూపాంతరం చెందే కీలక దశ కౌమార దశ. వర్తమానంలోనే కాదు భవిష్యత్తులోనూ సాధికారత దిశలో నడవడానికి తనకు అవగాహన, చైతన్యం అవసరం. దీనికి సరైన ఆయుధం విద్యే.. విద్యాభివృద్ధి ద్వారానే అన్ని రకాల దుర్మార్గాలను అంతం చేయవచ్చు. బాలికలను స్వీయ శక్తివంతులుగా తీర్చిదిద్దడానికి, వారిపై జరిగే హింసను అంతం చేయడానికి, సాధికారత వైపు నడిపించడానికి అందరూ పూనిక వహిస్తే ఇదేమంత కష్టం కాదు. ప్రభుత్వం, పౌరసమాజం, స్వచ్ఛంద సంస్థలు ఏకమై కలిసి కట్టుగా ప్రణాళికాబద్ధంగా, నిబద్దతతో, అన్నిటికీ మించి చిత్తశుద్ధితో కృషి చేయాలి. కిశోర బాలికలకు సాంకేతిక, వృత్తి విద్యా అవకాశాలు కల్పించాలి.

also read: మహిళా బిల్లుకు మోక్షమెపుడు?40 ఏళ్ళుగా పెండింగ్ లో ఉండటానికి కారణమెవరు?

తగిన రక్షణ కావాలి

స్వీయ రక్షణకు తగిన శిక్షణ ఇవ్వాలి. తమ జీవితాన్ని తాము తీర్చిదిద్దుకుని నడుచుకునేందుకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య అంశాలపై చైతన్యం తీసుకురావాలి. నేటి ఆడపిల్లలకు తప్పనిసరిగా అవసరమైన భద్రత, సాంకేతిక విజ్ఞానాన్ని అందుబాటులో ఉంచాలి. సామాజిక, రాజకీయ పరిస్థితులపై అవగాహన కల్పించాలి. అన్నిటికీ మించి పురుష దృక్పథంలో మార్పు రావాలి.

అత్యధిక కుటుంబాలలో వేళ్లూనుకు పోయి ఉన్న పురుషాధిక్య భావన అంతరించాలి. ఏ విధంగానూ, ఏ రూపంలోనూ'ఆడపిల్ల' అన్న చులకన భావన అంకురించని విధంగా పిల్లల పెంపకం ఉండాలి. కుటుంబాలలో, సమాజంలో నైతిక, మానవీయ, ఆధ్యాత్మిక విలువలు వెల్లివిరియాలంటే సంవత్సరానికి ఒకరోజు హడావుడి చేసి, ప్రచార ఆర్భాటాలు ప్రదర్శిస్తే సరిపోదు. చట్టాలు కూడా సర్వరోగ నివారిణికావు. దైవభీతి, నైతిక పరివర్తన చాలా ముఖ్యం. ఈ భావనే బాలికలు, మహిళల సమస్యలతో పాటు, జీవన రంగాల్లోని సమస్త సమస్యలకూ పరిష్కారం .

also read: ఆపదలో ఆడపడుచులు

(నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం)


ఎండీ ఉస్మాన్ ఖాన్

సీనియర్ జర్నలిస్టు

99125 80645

Advertisement

Next Story

Most Viewed