- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనంత విశ్వంలో మన విక్రమ్ ప్రకాశం
మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్గ నిర్దేశం, చంద్రయాన్-3 స్ఫూర్తితో 2040 కల్లా చంద్రుడిపై కాలుమోపడమే మన లక్ష్యమని గత వారం ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఇస్రో చైర్మన్ డాక్టర్ యస్.సోమనాథ్ మనందరి ఆత్మవిశ్వాసాన్ని అంతర్జాతీయ మీడియా వేదికగా ప్రకటించారు. మరి స్వాతంత్ర్య భారతపు అంతరిక్ష ప్రయాణం కొన్ని దశాబ్దాలుగా యావత్ ప్రపంచం చూస్తుండగానే ఎన్నో అవాంతరాలను, అవమానాలను, అనుమానాలను, రాజకీయ నాటకీయ పరిణామాలను దాటుకుంటూ రాట్నాల నుంచి రాకెట్లుగా మారి.. గత సంవత్సరం ఆగస్టు 23న చంద్రయాన్ -3 ప్రయోగంలో భాగంగా మన "విక్రమ్" ల్యాండర్ మన త్రివర్ణ పతాకపు గౌరవాన్ని చంద్రుని ఉపరితలంపై సగర్వంగా నిలబెట్టింది.యావత్ భారతీయుల గుండెలన్నీ జనగణమన గీతంతో దద్దరిల్లిన క్షణాలు అవి.ఇంతకీ ఇస్రో ల్యాండర్ కు ఆ పేరు ఎందుకు పెట్టిందో తెలుసా..?
"స్వతంత్ర భారతం అభివృద్ధి భారతంగా ఎదిగి ఈ దేశంలో పేదరికం, అసమానతలు కనుమరుగవ్వాలంటే ఖచ్చితంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం మన ప్రతిభను చాటాలి.అంతరిక్షంలో మనం సృష్టించుకున్న ఉపగ్రహాలతో మనం అద్భుతాలు చేయాలని జవహర్ లాల్ నెహ్రూ తో ఒప్పించి తన యావత్ జీవితాన్ని ఈ దేశం అభివృద్ధి కోసం, గ్రామీణ ప్రజలకు సాంకేతికత అందించాలనే ఉద్దేశంతో బ్రతికిన అసాధారణ వ్యక్తి, విఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త,భారత అంతరిక్ష రంగం పితామహుడు పద్మవిభూషణ్ విక్రమ్ సారాభాయ్."ఆయన జ్ఞాపకార్థం,గౌరవార్థం ల్యాండర్ కు విక్రమ్ పేరు పెట్టి ఆయన కీర్తిని అవని నుంచి అనంత విశ్వం దాకా చూపించారు మన ఇస్రో శాస్త్రవేత్తలు.
1919 ఆగస్టు 12 నా అహ్మదాబాద్ లోని ఓ సంపన్న పారిశ్రామికవేత్త ల కుటుంబంలో విక్రమ్ సారాభాయ్ ఉదయించారు.ఆయన కుటుంబం అంతా గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్, మోతీలాల్ నెహ్రూ వంటి వారితో సత్సంబంధాలు కలిగి మన దేశపు స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. భౌతిక శాస్త్రం లో మన తొలి ఆసియా నోబెల్ విజేత, విశ్వ విఖ్యాత భారతరత్న సి.వి.రామన్ పర్యవేక్షణలో బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో కాస్మిక్ కిరణాల పై పరిశోధనలు చేసిన విక్రమ్,రెండవ ప్రపంచ యుద్ధానంతరం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్ డి పట్టా పొంది 1947 లో తిరిగి మన దేశానికి వచ్చారు.ఇక అప్పటినుండి పారిశ్రామికవేత్తగా రాణిస్తూనే మన దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధికి, విఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త హోమీ జె.బాబా తో కలిసి అవిశ్రాంతంగా,అకుంఠిత దీక్షతో,అనంత విశ్వమే హద్దుగా, మన దేశం చేసే అంతరిక్ష,అణ్వస్త్ర ప్రయోగాల్లో ముఖ్యమైన వ్యక్తిగా నిలిచారు.భారతరత్న అబ్దుల్ కలాం వంటి వారిని మనందరికీ తన వారసత్వపు సంపదగా ఇచ్చి వెళ్లారు.
ఆయన స్ఫూర్తి కొన్ని తరాలకు అందించాలని మన నవ యువతరంలో కొంతమంది ని గొప్ప శాస్త్ర వేత్తలుగా మార్చాలని ఆయన గౌరవార్థం కేరళ లోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (VSSC)ను నెలకొల్పారు.ఇది ఇస్రో కు సంబంధించిన ప్రధాన కేంద్రం.ఈయన జీవిత చరిత్ర కు సంబంధించి అమృతా షా రచించిన విక్రమ్ సారాభాయ్ -ఎ లైఫ్ పుస్తకం ఆయన జీవితంలోని ఎన్నో ప్రముఖ సంఘటనలను వివరించింది.హోమీ జె.బాబా మరియు విక్రమ్ జీవితాల ఆధారంగా సోని లైవ్ ఓటిటి ప్లాట్ ఫాం వేదికగా రాకెట్ బాయ్స్ పేరుతో రెండు భాగాలుగా హిందీలో విడుదలైన వెబ్ సిరీస్ మిలియన్ల వ్యూస్ తో యువతరాన్ని ఆకట్టుకోవడమే కాక దేశానికి ప్రేరణ ఇచ్చింది.వారి దేశభక్తిని ఆవిష్కరించింది.
ఒకప్పుడు రాకెట్ భాగాలను సైకిల్ పై మోసుకెళ్ళే స్థాయి నుంచి మనం ఒకేసారి వంద ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళుతూ అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష వ్యాపారం చేస్తూ రాకెట్లతో ఆర్థికంగా సంపాదించే స్థాయికి ఎదిగాం.అభివృద్ధి చెందిన దేశాలకు సైతం టెక్నాలజీ అందిస్తూ,శాస్త్రీయ సవాళ్లు విసురుతున్నామంటే ఇదంతా విక్రమ్ సారాభాయ్ దార్శనికత,ఆయన కృషి వల్లే అని గట్టిగా చెప్పవచ్చు."శబ్దాల మధ్య కూడా సంగీతాన్ని వినగల్గిన వాడే అద్భుత విజయాలు సాధించగలడు"అంటూ జీవితాన్ని ఎంతో తాత్వికంగా చెప్పిన విక్రమ్ మార్గంలో మన ప్రయాణం కొనసాగి శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అగ్రగామిగా నిలవాలి.కేంద్ర ప్రభుత్వం విక్రమ్ సారాభాయ్ కి భారతరత్న ప్రకటించి ఆయన స్ఫూర్తిని ఇంకా కొన్ని కాంతి సంవత్సరాల దూరం ప్రసరించేలా చూడాలి.
ఫిజిక్స్ అరుణ్ కుమార్
నాగర్ కర్నూల్
9394749536