స్త్రీకి అస్తిత్వాన్నిచ్చేదే నిజమైన జీవితం

by Ravi |   ( Updated:2024-03-08 01:00:53.0  )
స్త్రీకి అస్తిత్వాన్నిచ్చేదే నిజమైన జీవితం
X

స్త్రీల సమస్యల పట్ల, స్త్రీ పురుష సంబంధాల పట్ల గురజాడ అప్పారావు ఆలోచన, విశ్లేషణ, విమర్శ తన కాలం కంటే వందేళ్లు, ఇంకా ఎక్కువ ముందువేనని సాహితీ వేత్తలు, మేధావులు అందరూ అంగీకరించిన విషయమే. అయితే, గురజాడ ఆంగ్లంలో రాయదలిచి మొదలుపెట్టిన సౌదామిని నవలలో స్త్రీల అభ్యుదయం పట్ల, వారి జీవన విధానంలో రావలసిన మార్పుల పట్ల తన ఆలోచనలు చూస్తే ఆశ్చర్య చకితులం కాక మానం.

‘ఆధునిక మహిళలు మానవ చరిత్రను తిరిగి రచిస్తారు' అన్నారు గురజాడ. అదిప్పుడు జరుగుతోంది. 'వివాహ బంధం తెంచుకోరాదనే నియమం స్త్రీల కన్నీటి గాధలకు కారణం' అన్నారు ఆయన. తనకు భరించ శక్యం కాని జీవన సంకెళ్ళ నుంచి స్త్రీ బయట పడి, నేడు తాననుకున్న విధంగా కొంత వరకూ జీవించగలుగుతోంది. సమస్యలు రూపం మార్చుకుంటున్నాయి. అయితే స్త్రీల పట్ల వివక్ష పలు తావుల్లో కొనసాగుతోంది. గురజాడ పలు సందర్భాల్లో వ్యక్తం చేసిన భావాలు నేడు ఇంకా మారవలసిన సమాజానికి ఎంతో అవసరం. గురజాడ రచనలను అధ్యయనం చేయటం అవసరం.

ప్రతి స్త్రీకి ఆయుధం ఉండాలి

స్త్రీ లేచి తిరగబడాలి. ఆమెను అందరూ అబల అంటారు. అయితే ఇది అర్థం లేని మాట. మన దేశంలో రైతు కుటుంబంలోని స్త్రీ, పొలంలో కునుకుపాట్లు పడే పురుషుడి కంటే బలమైనది. గట్టిది. నాట్లు వేసేది ఎవరు, పత్తి ఏరేది ఎవరు, చింతపండులోని పిక్కలు తీసేది ఎవరు, వడ్లు దంచేది ఎవరు? ఇంకా స్త్రీ నీళ్లు తోడుతుంది. వంట వార్పు చేస్తుంది అంటారు ఇందులో. ఇన్ని పనులు సమర్థంగా చేస్తున్నా ఆమె శారీరకంగా బలహీనురాలు, కానీ ఆమె మనోబలం ఆత్మశక్తి గొప్పది. పాశవిక శక్తిని ఎదిరించే దేహబలం ఆమెకు లేదు. అందుకని పాశవిక శక్తిని పనికిరానిదిగా చేసే పరికరం ఆమె చేతుల్లో పెడదాం. ఖడ్గ విద్య స్త్రీ మాత్రమే నేర్చుకోవాలి. బయటకు వెళ్లే సమయంలో ప్రతి స్త్రీ కి ఆయుధం ఉండాలి. అప్పుడే క్రూర పురుషుల బారి నుంచి తప్పించుకుంటుంది అంటారు. భవిష్యత్ దర్శనాన్ని ఎంత బాగా చేసారు గురజాడ! ఇప్పుడు కొందరు స్త్రీలు అలా చేస్తున్నారు కదా! కానీ, ఆ కాలానికి ఊహించగలరా ఇలాంటివి ఎవరైనా!

వంటను నిషేధించాలన్న క్రాంతదర్శి

ఇలాంటి గొప్ప భావాలు ‘సౌదామిని’ నవలలో ఇంకా కనిపిస్తాయి. నాటి స్త్రీ జీవితం వంటింటికే పరిమితం. స్త్రీల శ్రమను గుర్తించిన గురజాడ వంట చేయటాన్ని నిషేధించి పారేయాలి. దుకాణం నుంచి ఆహారం తెచ్చుకోవాలి. దాన్ని వెచ్చబెట్టుకోవటానికి అవసరమైన సామగ్రి ఉంచుకోవాలి. ప్రతి వీధికి ఒక దుకాణం ఉండాలి. కుటుంబం అక్కడికి వెళ్లి భోజనం చేస్తుంది. ఇక వంట వార్పు చింతే ఉండదు. అంటారు. ఇది ఎంత గొప్ప ఆలోచన! ఇప్పటికీ, ఒక్కరోజైనా తప్పించుకోవటానికి సాధ్యం కాని వంట ఇంటి బంధం తో ఎన్నో చేయాలని ఉన్నా చేయలేక అసంతృప్త జీవితాన్ని గడిపే మహిళలు వున్నారని మనకు తెలుసు. అయితే, ఆనాడు గురజాడ ఆశించినవి ఇప్పుడు జరుగుతున్నాయి. అందరికీ సాధ్యం కాకపోయినా అవకాశమున్న వాళ్లు బైటకి వెళ్లి తింటున్నారు. కొందరు ఇంటికే తెప్పించుకుంటున్నారు.

యుద్ధం చేస్తున్న ఆధునిక మహిళ

ఇప్పుడు స్త్రీ సమస్యల రూపం వేరు. ఈ పురుషాధిపత్య సమాజంలో ఒక స్త్రీ, రచనా రంగం కానీ, క్రీడలు, కళల్లో, బోధన లో గానీ, ఏ రంగంలోనైనా విజేతగా నిలిచిందంటే అది సామాన్యమైన విషయం కాదు. దానికోసం ఆమె ఎంత యుద్ధం చేసిందో, ఎంత సంఘర్షణ పడిందో, ఎంత ఒత్తిడిని అనుభవించిందో అర్థం చేసుకోగలిగితే, సమాజం ఇంకా ఎంతో మారవలసిన అవసరాన్ని గుర్తిస్తాం. తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబం నుంచి బయటకు వచ్చేసి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న స్త్రీ సమాజం నుంచి అనేక ఇబ్బందులను, సవాళ్ళను ఎదుర్కుంటోంది. మహిళలు ఆత్మస్థైర్యంతో, సర్వ స్వతంత్రంగా జీవించే విధంగా సమాజంలో అనుకూల వాతావరణం ఉండాలి. పనిచేసే చోటా స్త్రీ పురుష వివక్ష కొనసాగుతోంది.

మహిళా చైతన్య కాంతిరేఖ

సౌదామిని అన్న నవల పూర్తయి ఉంటే గనక గురజాడ అందులో స్త్రీ పురుష సంబంధాలలోని అసమానతలను, రావలసిన మార్పులను ఇంకా ఎంత బాగా చర్చించేవారో! ‘స్త్రీకి అస్తిత్వాన్నిచ్చేదే నిజమైన జీవితం అని నూరు సంవత్సరాల క్రితమే విశ్వసించి, ఆ భావాలను తన రచనల్లో సూటిగా ప్రకటించిన గురజాడ ఆధునిక మహిళా ఉద్యమాలకు పితామహుడని నిస్సందేహంగా చెప్పవచ్చు' అన్న సరోజినీ ప్రేమ్ చంద్ గారి ‘గురజాడ కధానికల్లో స్త్రీ పాత్రలు’ వ్యాసంలో వాక్యాలు అక్షర సత్యాలు.

- డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి

63027 38678

Advertisement

Next Story

Most Viewed