- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బతుకమ్మ పండుగ విశిష్టత! పురాణ కథలు
వాసనలేని పూలను దేవుని పూజకు వాడరు. బతుకమ్మకు ప్రకృతిలో దొరికే ప్రతి పువ్వును వాడతారు. గునుగు, టేకు, తంగేడు, గుమ్మడి, కట్ల, కాకర, గన్నేరు, పొట్ల, పొగడ, రుద్రాక్ష, గోరింట, మల్లె, బంతి, చామంతి, శంకు, ఇలా అనేక రకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికే సమర్పించుకోవడం బతుకమ్మను నిమజ్జనం చేయడంలో ఆంతర్యం. ఇవి చెరువులు కుంటలలో ఉన్న నీటిని శుభ్రపరచడానికి ఒక ఔషధంగా పనిచేస్తాయి. తెలంగాణలో సాధారణంగా భాద్రపద బహుళ పంచమి వరకు మెట్ట పంటలన్నీ ఇళ్లకు చేరుకుంటాయి. రోజుకో ధాన్యంతో పిండి వంటలు చేసి దైవానికి అర్పిస్తారు.
తెలంగాణలో అన్నింటి కంటే పెద్ద పండుగ 'బతుకమ్మ' ఇక్కడి ప్రజల ఆశకు, యాసకు, భాషకు, మాండలికానికి బతుకమ్మ పాట వేదిక. భారతీయులంతా దేవతలను పూలతో పూజిస్తారు. తెలంగాణ ప్రజలు మాత్రం పూలలోనే దేవతలను దర్శిస్తారు. దేవతా రూపం పొందిన పూల జాతర బతుకమ్మ. మహాలయ అమావాస్యతో మొదలై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మహర్నవమి వరకు జరుగుతుంది. ప్రకృతితో మనిషికి ఉండే సంబంధాన్ని స్పష్టంగా చెప్పిన పండుగ ఇది. తెలంగాణ మహిళల హృదయమే బతుకమ్మ. పుట్టింటి నుండి మెట్టినింటికి వెళ్లినా చిన్ననాటి జ్ఞాపకాలను కలకాలం పదిలంగా దాచిపెట్టే పండుగ.
పురాణ కథలు
ఈ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. చోళరాజు ధర్మాంగదుడు, సత్యవతి దంపతులకు వంద మంది కొడుకులు. వారంతా యుద్ధంలో చనిపోతే దుఃఖంలో ఉండి సంతానం కావాలని లక్ష్మీదేవిని వేడుకుంటారు. ఆమెను తమ బిడ్డగా పుట్టమని కోరుకుంటారు. లక్ష్మీదేవి వారి బిడ్డగా పుడుతుంది. అత్రి, వశిష్ట, కశ్యప, అంగీరస మహామునులు ఆ బిడ్డను 'బతుకమ్మ' అని ఆశీర్వదిస్తారు. ఆమె పెరిగి పెద్దదై చక్రాంగుడనే పేరుతో మారువేషంలో వచ్చిన విష్ణుమూర్తిని పెళ్లాడుతుంది. కోరిన వారందరికీ సంతానం సిరిసంపదలను ప్రసాదిస్తూ బతుకమ్మగా పూజలు అందుకుంటోందని ఒక కథ ప్రచారంలో ఉంది. మరో కథనం ప్రకారం, మహిషాసురుడిని యుద్ధంలో వధించిన పార్వతి అలసిపోయి స్పృహ తప్పి పడిపోతుంది. దీంతో మహిళలంతా ఆమె చుట్టూ చేరి 'బతుకమ్మ బతుకమ్మ' అని ప్రార్థిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు దేవి స్పృహలోకి వస్తుంది. అప్పటి నుంచి పార్వతీ దేవిని బతుకమ్మగా తొమ్మిది రోజులు పూజించి పండుగ జరుపుకుంటారని కూడా చెబుతారు.
ఇంకో కథ ఏమిటంటే, ఒక రైతుకు ఆరుగురు బిడ్డలు పుట్టి చనిపోతారు. ఏడో బిడ్డను 'నీవైనా 'బతుకమ్మా బతుకు' అని పెద్దలందరూ ఆశీర్వదిస్తారు. ఆమె పెరిగి పెద్దదై ఒకరోజు తన వదిన, ఆడపడుచులతో చెరువులో స్నానానికి వెళ్తుంది. అక్కడి వారి బట్టలు తారుమారవుతాయి. దీంతో గొడవ జరిగి వదిన బతుకమ్మను ఆమెను చంపి చెరువు గట్టున పాతి పెడుతుంది. బతుకమ్మ తండ్రికి కలలో కనిపించి, విషయమంతా వివరించి, తాను చెరువు గట్టున తంగేడు చెట్టుగా వెలిసానని చెబుతుంది. తండ్రి దుఃఖాన్ని తీర్చడానికి తన పూలతో ఆడపడుచులు బతుకమ్మను పేర్చుకుని ఆడుకోవాలని చెబుతుంది. ఆమె కోరిక ప్రకారమే బతుకమ్మ వెలిసిందని కూడా అంటారు. యోధులు అయిన ఏడుగురు అన్నదమ్ములు ఒక్కగానొక్క చెల్లెలిని ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటారు. వదినలకు ఆమె అంటే కోపం. అన్నలు వేటకు వెళ్లాక ఆమెను చిత్రహింసలు పెడతారు. అవి తాళలేక ఆమె బావిలో పడి చనిపోయి తామర పువ్వుగా ఉద్భవిస్తుంది. అన్నలు చెల్లి కోసం వెతుకుతూ బావిలోకి చూడగా తామర పువ్వు కనిపిస్తుంది. అదే సమయంలో అటుగా వచ్చిన రాజు దాహం తీర్చుకోవడానికి బావిలోకి దిగుతాడు. తామరను తెచ్చి తన కొలనులో వేస్తాడు. కొంతకాలానికి విష్ణుమూర్తి ఆ పువ్వును మనిషిగా మార్చి వివాహమాడతాడు. ఆమే గౌరమ్మ. జానపదులు ఈ కథను యాది చేసుకుంటూ బతుకమ్మను జరుపుకుంటారు.
పూలనే వాడటానికి కారణం
మహిళలంతా బతుకమ్మలతో చెరువు గట్టు మీద చేరి జీవితానుభవాలను, అనుభూతులను, పౌరాణిక గాథలను, సంఘటనలను లయబద్ధంగా పాడుతారు. బతుకమ్మలో ప్రతి పువ్వుకు విశిష్టత ఉంది. తంగేడు పువ్వుకు ఎక్కువ విశిష్టత ఉంది. దానికి కారణం అది గుత్తులు గుత్తులుగా విరబూస్తుంది. తమ సంసారం కూడా అట్లా పచ్చగా పుష్టిగా ఉండాలని మహిళలు కోరుకుంటారు. వాసనలేని పూలను దేవుని పూజకు వాడరు. బతుకమ్మకు ప్రకృతిలో దొరికే ప్రతి పువ్వును వాడతారు. గునుగు, టేకు, తంగేడు, గుమ్మడి, కట్ల, కాకర, గన్నేరు, పొట్ల, పొగడ, రుద్రాక్ష, గోరింట, మల్లె, బంతి, చామంతి, శంకు, ఇలా అనేక రకాల పూలతో బతుకమ్మను పేరుస్తారు. ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికే సమర్పించుకోవడం బతుకమ్మను నిమజ్జనం చేయడంలో ఆంతర్యం.
ఇవి చెరువులు కుంటలలో ఉన్న నీటిని శుభ్రపరచడానికి ఒక ఔషధంగా పనిచేస్తాయి. తెలంగాణలో సాధారణంగా భాద్రపద బహుళ పంచమి వరకు మెట్ట పంటలన్నీ ఇళ్లకు చేరుకుంటాయి. రోజుకో ధాన్యంతో పిండి వంటలు చేసి దైవానికి అర్పిస్తారు. వీటిని సద్దులు అంటారు. బతుకమ్మకు వీటిని సమర్పిస్తారు. కాబట్టి అది సద్దుల బతుకమ్మ అయింది. ఎంత పేదవారైనా బతుకమ్మ పండుగకు తమ కూతుళ్లను అత్తారింటి నుంచి తమ ఇంటికి తీసుకు వస్తారు. వారికి చీర సారెలు పెట్టి కుటుంబమంతా పండుగ సంబరంలో మునిగిపోతారు. అందుకే తెలంగాణ కొండగుర్తు బతుకమ్మ పండుగ.
కొమ్మాల సంధ్య
తెలుగు లెక్చరర్
తాడ్వాయి, ములుగు
91540 68272