స్త్రీమూర్తి కి పాదాభివందనం!

by Ravi |   ( Updated:2023-03-07 19:00:34.0  )
స్త్రీమూర్తి కి పాదాభివందనం!
X

సంవత్సర కాలంలో మహిళలు సాధించిన విజయాలను స్మరించుకుంటూ ముందు తరాలకు స్ఫూర్తి నిచ్చే విధంగా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 8వ తేదీని ‘అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని’ జరుపుకుంటున్నాము. ఈ రోజును మహిళలు ఆర్థికంగా సాంఘికంగా సాంస్కృతికంగా సాధించిన విజయాలు జరుపుకునే రోజుగా చెప్పవచ్చు. స్త్రీలకు న్యాయం, హోదా, సమానత్వం, ప్రశంస, గౌరవం, సానుభూతి వంటి వాటి కల్పన మహిళా దినోత్సవం లక్ష్యాలుగా పేర్కొంటున్నాము.

ప్రాచీన కాలంలో ఇంటి, వంట పనులకే పరిమితమైన స్త్రీలు ఆ ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని నేడు అన్ని రంగాలలో ముందుకు పోతున్నారనండంలో ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు మగవాళ్లు చేయదగ్గ పనులు ఈనాడు ఆడవాళ్లు కూడా చేస్తున్నారు. నేడు మహిళలు విద్య, వైద్య, సామాజిక, సాహిత్య, సాంకేతిక, పారిశ్రామిక, పాత్రికేయ, క్రీడలు, రాజకీయ రంగాలలో సమర్థవంతంగా తమ విధులను నిర్వహిస్తున్నారు. సానియా మీర్జా, మిథాలీ రాజ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ క్రీడా రంగంలో అద్భుత విజయాలు సాధించారు, సాధిస్తున్నారు. కడు పేదరికం నుండి వచ్చిన గిరిజన బాలిక మాలవత్ పూర్ణ పాఠశాల వయసులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది.

ప్రభుత్వాలు మహిళల కోసం నిర్భయ చట్టం -2013, గృహహింస చట్టం-2005, మనుషుల అనైతిక రవాణా నిషేధిత చట్టం-1956, ప్రసూతి ప్రయోజన చట్టం-1956, వరకట్న నిషేధ చట్టం-1961, ముస్లిం మహిళ చట్టం 1986 మొదలగు ఎన్నో చట్టాలు రక్షణ చర్యలు చేపట్టినది. కానీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో సఫలీకృతం కావడం లేదు. ముఖ్యంగా 73,74 రాజ్యాంగ సవరణ చేసి దానిద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లను కేటాయించాలని ‘మహిళల రిజర్వేషన్ బిల్లు’ చేసినది ఇప్పటికీ అది చట్ట సభల్లో ఆమోదం పొందలేదు. భారత 17వ లోక్ సభలో మొత్తం 542 సభ్యులు ఉన్నారు ఇందులో కేవలం 78 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఇది 14 శాతం మాత్రమే. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మొత్తం 119 శాసనసభ్యులు ఉన్నారు ఇందులో కేవలం 6 మహిళలు మాత్రమే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనికి కారణం మహిళలలో రాజకీయ చైతన్యం లేకపోవడమే. సమ సమాజ నిర్మాణానికి ఆడవాళ్ళు రాజకీయాలలో రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2021 రిపోర్ట్ ప్రకారం ‘ప్రపంచ లింగ అంతర సూచిక’ (గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్) లో 156 దేశాలలో భారతదేశం 140 వ ర్యాంక్ సాధించి 28వ స్థానంలో ఉంది. ఆర్థిక వ్యవహారాలు, అవకాశాలు విద్య ఆరోగ్యం, రాజకీయ సాధికారత విషయాలలో లింగ అంతరం ఎక్కువగా ఉందని తెలిపింది. 2011 గణాంక లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుషుల అక్షరాస్యత లో కూడా తేడా ఉంది. మొత్తం 74.04 శాతం అక్షరాస్యత లో 82.14 శాతం పురుషుల అక్షరాస్యత నమోదు కాగా, కేవలం 65.46 శాతం మాత్రమే స్త్రీల అక్షరాస్యత ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాలలో మరీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చదివించడం లేదు. ఇది విద్య అసమానత్వానికి దారి తీస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో మట్టిలో ‘మహిళ మాణిక్యాలు’ఎందరో ఉన్నారు. సరైన దారి చూపితే ప్రతి ఇంటిలో ఒక మహిళా ప్రొఫెసర్, ఒక డాక్టర్ ఒక ఇంజనీర్, ఒక రాజకీయ నాయకురాలు తయారవుతారు దీనికి సమాజంలో ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు బాధ్యత వహించాలి.

మహిళల స్థితిగతులు బాగుపడనిదే.. సమాజం అభివృద్ధి చెందదు. ఈ పక్షి అయినా ఒక్క రెక్కతో ఎగరలేదు అన్న స్వామి వివేకానందుని మాటలు మరోసారి మనం స్మరించుకోవాలి. అన్ని మారుతున్నాయి కానీ మహిళల పట్ల కొందరి ఆలోచన ధోరణి మాత్రం ఇంకా మారడం లేదు. మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయి. అత్యాచారాలు, గృహ హింస, లైంగిక వేధింపులు, వరకట్న హత్యలు నిత్యం జరుగుతున్నాయి. సమాజంలోని కొంత మంది మృగాల విజృంభణతో మహిళల మీద కిరాతకాలు పెచ్చరిల్లి సభ్య సమాజం తలెత్తుకొని దుస్థితి ఇంకా తాండవిస్తుంది. "కొడుకే" వంశోద్ధారకుడు అనే మూఢ నమ్మకాలని నమ్మి ఇంకా ఆడపిల్లలను గర్భంలోనే చంపేస్తున్నారు. ఇది యావత్ సమాజానికి అవమానకరం. కనులు తెరిచిన క్షణం నుంచి.. బంధం కోసం, బాధ్యత కోసం, అందరిని కనుపాపలా తలచి, ఆత్మీయత పంచి తనవారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే స్త్రీ మూర్తి కి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ పాదాభివందనం చేయవలసిందే.

డాక్టర్ కోడూరి శ్రీవాణి

అసిస్టెంట్ ప్రొఫెసర్

Advertisement

Next Story