- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
వరల్డ్ వాక్:సంక్షోభంలో సౌత్ ఆసియా
మన పక్కనున్న దేశాలలో సమస్యల పరిష్కారానికి వివిధ దేశాల సహకారం తీసుకోవాలి. లేకపోతే మనకు భవిష్యత్తులో అనేక సమస్యలు ఈ దేశాల వలన సంభవిస్తాయి. ఆ దేశాలలో ముఖ్యంగా రాజకీయ స్థిరత్వం ఏర్పాటు చేయాలి. విపరీతమైన ఉచిత పథకాలకు స్వస్తి పలకాలి. విదేశీ అప్పులు ఆచితూచి చేయాలి. మత సామరస్యానికి పెద్దపీట వేయాలి. విద్య, వైద్యం ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. స్థానిక ఉత్పత్తులు ప్రోత్సహించాలి. 'లోకల్ టు గ్లోబల్' అనే సిద్ధాంతం అమలు చేయాలి. పొరుగు దేశాలతో సత్ససంబంధాలు పెంపొందించుకోవాలి. ఈ విధంగా దక్షిణ ఆసియా దేశాలు సంక్షోభాల నుంచి బయటపడాలి. ఇదే శాశ్వత పరిష్కారం.
చాలా ప్రశాంతంగా ఉండే దక్షిణాసియా దేశాలు ఇటీవలి కాలంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలతో సతమతమవుతున్నాయి. ప్రశాంతత లేకుండా, చివరికి ఆహారం దొరకని కడు దయనీయ స్థితికి చేరుకుంటున్నాయి. ఇతరుల సహాయం కోసం ఎదురుచూడటం సర్వ సాధారణంగా మారింది. ఈ పరిణామాలు ఆయా దేశాలకే కాకుండా, పొరుగు దేశాలకు తలపోటు అవుతున్నాయి. ముఖ్యంగా గత ఆగస్టు నెలలో అఫ్ఘానిస్తాన్‌లో తిరిగి తాలిబన్ పరిపాలన రావడంతో ఆ దేశంలో మానవ హక్కులు మంటగలిసాయి.
సుమారు ఐదు మిలియన్ల మంది ప్రజలు దేశాన్ని విడిచి సమీప దేశాలకు వెళ్లిపోయారు. మరో పొరుగు దేశం పాకిస్తాన్‌లో ఎప్పుడు ఎవరి పాలన ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ఇటీవలనే ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను పదవి నుంచి తొలగించారు. అక్కడ సైన్యం చెప్పినట్టు ప్రభుత్వాలు పాలన చేయాలి. దశాబ్దాలుగా పాకిస్తాన్‌లో నడుస్తున్న చరిత్ర ఇది. ఒకపక్క బెలూచీ జాతీయవాదులు, మరోపక్క తాలిబన్ తీవ్రవాదులు, ఇతర గ్రూపులు సమస్యలతో ఆర్థికంగా బాగా దిగజారుతూ కాలం గడుపుతున్న దేశం అది. రాజకీయ అస్థిరత్వం, ఉగ్రవాదులకు అడ్డాగా పాకిస్తాన్ ఉండంతో మనలాంటి దేశాలకు సైనిక భారం ఎక్కువ అవుతూ ఇబ్బంది పడుతున్నాం. తరచూ వందల సంఖ్యలో సైనికులను కోల్పోతున్నాం. పుల్వామా దాడి అందుకు ఉదాహరణ.
ఎడతెగని ఆర్థిక సంక్షోభంతో
శ్రీలంక పరిస్థితి మరి అధ్వానంగా తయారైంది. ఆర్థిక సంక్షోభం నుంచి ఆ దేశం తేరుకోలేకపోతోంది. ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామా చేశారు. ఘర్షణలు సమసిపోవడం లేదు. ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. విపక్ష నేత సజిత్ ప్రేమదాస మీద దాడి జరిగింది. 2019లో ఐసిస్ ఉగ్రవాదుల దాడిలో సుమారు 269 అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రపంచం నివ్వెరపోయింది. శ్రీలంక ప్రధాన ఆదాయం పర్యాటకమే. ఈ ఉగ్రదాడి, కరోనా కారణంగా వారి ఆదాయానికి గండి పడింది. దీంతో పాటు అక్కడ జరిగిన ఎన్నికలలో ఆదాయానికి మించిన హామీలు ఇవ్వడం, ఇతర దేశాల నుంచి అప్పు తీసుకోవడం వలన ప్రపంచ పటంలో లంక నిజంగా కన్నీరు బొట్టు వలె కనపడుతున్నది.
నిరుద్యోగం ఎక్కువైంది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒక కోడిగుడ్డు 40 రూపాయలు, లీటర్ పెట్రోల్ 350 రూపాయలకు చేరుకుంది. చివరికి విద్యార్థులకు పరీక్షలు రాయడానికి తెల్ల కాగితాలు కొనలేని స్థితికి ప్రభుత్వం దిగజారింది. సుమారు 51 బిలియన్ల అమెరికన్ డాలర్ల విదేశీ అప్పులు చెల్లించాల్సి ఉంది. కట్టలేమని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. సామాన్య ప్రజలు రోడ్ల మీదకు చేరి అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అధ్యక్షుడు రాజపక్సె రాజీనామా చేశారు. నేపాల్ కూడా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. విదేశీ మారక ద్రవ్యం తరిగిపోయింది. మయన్మార్ సైనిక పాలనలో దశాబ్దాలుగా కునారిల్లుతోంది. అంతర్గత కలహాలతో అట్టుడుకుతోంది. ఇలా పలు దక్షిణాసియా దేశాలు, మన భారతదేశ పొరుగు దేశాలు రాజకీయ, ఆర్థిక , సామాజిక సమస్యలతో తల్లడిల్లుతున్నాయి. మనకు కూడా భారంగా మారుతున్నాయి.
వారితో మనకే ముప్పు
'పక్క దేశాలలో ఇబ్బంది పడుతున్న ప్రజలు 'శరణార్థులుగా మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు. అశాంతికి దారులు వేస్తున్నారు. సామాజిక, ఆర్థిక రాజకీయ సమస్యలకు వారే కారణం అవుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఇండియా జాగ్రత్తగా ఉండాలి. మన పక్కనున్న దేశాలలో సుస్థిర పాలనకు ప్రయత్నాలు చేయాలి. అప్పుడే మన దేశంపై భారం తగ్గుతుంది. లేకపోతే ఈ ప్రాంతం అంతా భవిష్యత్తులో వివిధ రకాల అశాంతికి, సమస్యలకు నిలయంగా మారుతుంది' అని అంతర్జాతీయ వ్యవహారాలు పరిశీలన చేసే ప్రొఫెసర్ ధనుంజయ త్రిపాఠి అన్నారు. ఇప్పటికే మన దేశం మానవతా దృక్పథంతో అఫ్ఘానిస్తాన్, శ్రీలంకకు ఆహార ధాన్యాలు పంపింది. పెట్రోల్, డీజిల్ పంపింది.
ఉక్రెయిన్ ప్రజలకు వివిధ రకాల మందులు, వస్తువులు అందించింది. మానవతా దృక్పథంతో సహాయం చేయాలని చూసినా, మనకు ఆర్థిక భారమే కదా! కావున మన పక్కనున్న దేశాలలో సమస్యల పరిష్కారానికి వివిధ దేశాల సహకారం తీసుకోవాలి. లేకపోతే మనకు భవిష్యత్తులో అనేక సమస్యలు ఈ దేశాల వలన సంభవిస్తాయి. ఆ దేశాలలో ముఖ్యంగా రాజకీయ స్థిరత్వం ఏర్పాటు చేయాలి. విపరీతమైన ఉచిత పథకాలకు స్వస్తి పలకాలి. విదేశీ అప్పులు ఆచితూచి చేయాలి. మత సామరస్యానికి పెద్దపీట వేయాలి. విద్య, వైద్యం ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. స్థానిక ఉత్పత్తులు ప్రోత్సహించాలి. 'లోకల్ టు గ్లోబల్' అనే సిద్ధాంతం అమలు చేయాలి. పొరుగు దేశాలతో సత్ససంబంధాలు పెంపొందించుకోవాలి. ఈ విధంగా దక్షిణ ఆసియా దేశాలు సంక్షోభాల నుంచి బయటపడాలి. ఇదే శాశ్వత పరిష్కారం.
ఐ.ప్రసాదరావు
9948272919