సత్యజిత్ రే 14 సినిమాలలో నటించిన హీరో గురించి తెలుసా?

by Ravi |   ( Updated:2022-10-28 18:45:34.0  )
సత్యజిత్ రే 14 సినిమాలలో నటించిన హీరో గురించి తెలుసా?
X

రు దశాబ్దాల సినీ కెరీర్. మూడు వందలకు పైగా సినిమాలు. ఆయనే సౌమిత్ర ఛటర్జీ. సత్యజిత్ రే ప్రపంచానికి అందించిన గొప్ప నటుడు. మంచి కవి, ఆయన పని లేకుండా ప్రశాంతంగా ఉండేవాడు కాదు. ఫిలిం యాక్టింగ్ లేదా రచనలు లేదా కనీసం డైరీ రాయడంలోనైనా కాలం గడిపేవాడు. సృజకారులందరికీ ఆయన జీవన శైలి ఒక మోడల్. ఆయన కవిత్వాన్ని ఇంగ్లిష్‌లోకి 'WALKING THROUGH THE MIST' పేర అమితావ్ నాగ్ అనువదించారు. మంచి కవిత్వానికి మంచి అనువాదమది. అందులోంచి ఒక చిన్న కవిత తెలుగు అనువాదం.

కొన్ని రోజులు

ఈ దేహంలో నది మేల్కొంటుంది

క్షేమంగా వున్న తీరాలను బద్దలు కొడుతుంది

ఉప్పెనలా ముంచెత్తుతుంది

కొన్ని రోజులు

మనస్సులో ప్రేమ తుఫాన్ను సృష్టిస్తుంది

మార్కెట్లు, ఆఫీసులు, దుకాణాలూ

ఆ సునామీలో కొట్టుకుపోతాయి

కొన్ని రోజులు

వసంత గీతాలు అందం కోసం

ఆకాశంలో గాలిలో నిండిపోతాయి

కొన్ని రోజులు

నది నిన్ను నిద్ర మేల్కొల్పడానికి డప్పు వాయిస్తాయి

వసంత గీతాలు నీకు హామీనిస్తాయి

కొన్ని రోజులు

జ్ఞాపకాలు వాస్తవాలవుతాయి

జ్ఞాపకాలు సత్యాలవుతాయి

'మనమంతా బతకడానికి డబ్బు సంపాదిస్తాం. కానీ, శ్వాసకూ, జీవితానికీ అవతలి వైపు కూడా ఆలోచించాలి. లేకుంటే మన ఉనికి ఆత్మ లేనిది అవుతుంది' అన్న మాటలపై విశ్వాసం వున్న గొప్ప నటుడు సౌమిత్ర ఛటర్జీ. భారతీయ కళాత్మక సినిమాలకు మహా వృక్షం లాంటి సత్యజిత్ రే నుంచి ఎదిగిన ఒక శాఖ. 1959లో రే 'అపూర్ సంసార్' సినిమాతో ఆరంభమైన సౌమిత్ర ఛటర్జీ ప్రయాణం సత్యజిత్ రేతో 14 ఫీచర్ సినిమాలు, ఒక షార్ట్ ఫిలింల దాకా సాగింది. అందుకే సౌమిత్ర ఛటర్జీ అనగానే మరుక్షణం సత్యజిత్ రే గుర్తుకొస్తాడు. అపూర్ సంసార్, చారులత సినిమాలు మన ముందు కదలాడతాయి. పాత్ర ఎంత సులభమైనదైనా ఎంత సంక్లిష్టమైనదైనా ఆ పాత్రలోకి రూపాంతరం చెందడం సౌమిత్ర ఛటర్జీ మౌలిక లక్షణం.

సత్యజిత్ రే 'వన్ మాన్ స్టాక్ కంపెనీ' సౌమిత్ర అని రచయిత పాలిం కేల్ ఒక చోట అంటాడు. పాత్ర పోషణలో సరైన టైమింగ్‌ని, పాత్రల మనోభావాలను పలికించడంలోనూ సౌమిత్రది విలక్షణ సరళి. రచయిత రూపొందించిన పాత్రకు దర్శకుడు ఆశించిన రీతిలో వ్యక్తీకరణలను ప్రకటించడం, అందుకు తగ్గ స్వర మాడ్యులేషన్ పలికించడంలో ఆయన ప్రతిభ సహజంగా ఉంటుంది. ఎలాంటి మెలోడి డ్రామా ఉండదు. సౌమిత్ర అంగ సౌష్టవం యవ్వనంలో ఉన్నప్పటి రవీంద్రనాథ్ ఠాగూర్‌ని పోలి వుండడంతో సత్యజిత్ రే తన అన్ని సినిమాలలో తీసుకున్నాడని సుప్రసిద్ధ సినీ విమర్శకుడు చిదానంద దాస్ గుప్తా తన 'టాకింగ్ అబౌట్ ఫిలిం' పుస్తకంలో రాసాడు. ఛటర్జీ అమాయక ముఖంతో పాటు పెద్దరికాన్ని గాంభీర్యాన్ని ఏకబిగిన పలికించగలిగిన కళ్లు, పాత్రకు తగ్గట్టుగా సులభంగా మలుచుకోగలిగిన శరీర లక్షణం నటుడిగా ఆయన గొప్ప విజయం సాధించడానికి దోహదపడ్డాయి.

Also read: 24 ఫ్రేమ్స్: సినిమాలు ఖరీదుగా ఎందుకు మారాయి?

వివిధ రంగాలలోనూ

నాటక రంగం, కవిత్వం, ఆర్ట్, ప్రచురణ రంగాలలోనూ సౌమిత్ర ఛటర్జీ జీవితం కొనసాగింది. రే 'జల్సాగర్' చిత్ర షూటింగులో ఉండగా 20 యేండ్ల సౌమిత్ర సెట్స్‌కి వెళ్లాడు. అప్పుడే తన తర్వాతి సినిమాలో ఇతనే నా ప్రధాన పాత్రధారి అని ప్రకటించడంతో సౌమిత్ర సహా అంతా ఆశ్చర్యపోయారు. బాల్యం కృష్ణానగర్‌లో గడిచింది. సుప్రసిద్ధ నట ప్రయోక్త ద్విజేంద్రలాల్ రే సొంత వూరు కావడంతో అక్కడ నాటక రంగ వాతావరణం వుండేది. సౌమిత్ర తండ్రి హైకోర్టు న్యాయవాది కావడంతో కలకత్తా చేరుకున్న సౌమిత్ర బెంగాలీ సాహిత్యంలో పీజీ కోర్సులో చేరాడు. అక్కడే నాటక రంగ ప్రముఖుడు అహింద్ర చౌధురి వద్ద నట మెళకువలను నేర్చుకున్నాడు.

తన కెరీర్ తొలి రోజులలోనే అపు, అమూల్య (సమాప్తి), నర్సింగ్ (అభిజాన్) పాత్రలను తనలో అంతర్లీనం చేసుకున్న తీరు అబ్బురపరుస్తుంది. ఇక రే క్లాసిక్ 'చారులత' సినిమాతో ఆయన బెంగాలీ చేతి రాతనే మార్చేశాడు. 27 ఏళ్ల వయసులో ఆరు నెలలు కష్టపడి ఠాగూర్‌కు ముందు కాలం నాటి బెంగాలీ అక్షరాల తీరుని అభ్యసించి నటించాడీ చారులతలో. అందులో ఆయన చూపించిన చలాకీతనం, సోనార్ కెల్లా, జోయి బాబా ఫెలూనాత్ సినిమాలలో పోషించిన డిటెక్టివ్ పాత్రలు చిరస్థాయిగా మిగిలిపోతాయి. రే సినిమాలు హిరాక్ రాజర్ దేశాయ్, ఘరె భైరే, ఘనశత్రు, శాఖ ప్రశాఖలలో సౌమిత్ర నటన రే ఆలోచనలకు ప్రతిరూపంగా మిగిలిపోయాయి ఎందులోనూ పాత్రలే తప్ప సౌమిత్ర ఛటర్జీ కనిపించకపోవడం నటుడిగా ఆయన సాధించిన విజయం.

Also read: 24 ఫ్రేమ్స్: సినిమాలు ఖరీదుగా ఎందుకు మారాయి?

నటుడిగానే కాక

సౌమిత్ర మృణాల్‌సేన్‌తోనూ 'ఆకాష్ కుసుం', తపన్ సిన్హా తో 'జిందర్ బండి', లాంటి సినిమాలు చేశారు. రాజ మిత్ర లాంటి యువ దర్శకుడితో ' ఏక్ థీ జుబాన్' లో నటించాడు. గౌతం ఘోష్ రూపొందించిన 'దేఖా' సినిమాలో అంధుడైన ఓ మేధావి పాత్రను పోషించాడు. కాపురుష్, ఆకాష్ కుసుమ, అరణ్ యేర్ దిన్ రాత్రి, ఆశని సంకేత్, గణ దేవత, కొని, మహా పృథ్వీ లాంటి ఎన్నో గొప్ప చిత్రాలలోనూ నటించాడు. 80ల తర్వాత అపర్ణా‌సేన్, అంజన్‌దాస్, రితుపర్ణ ఘోష్ లాంటి యువ దర్శకులతో పని చేసారు. సత్యజిత్ రే- సౌమిత్ర ఛటర్జీ ద్వయం భారతీయ సినిమాను ప్రపంచ పటంలో నిలిపింది. సౌమిత్ర సినీ రంగంలో మాత్రమే కాదు నాటక రంగం మీద కూడా తన ముద్ర వేసాడు. ఎక్కోన్ అనే సాహిత్య పత్రికకు సహా సంపాదకుడిగా పని చేసాడు.

కవిగా పన్నెండు కవితా సంకలనాలు వెలువరించాడు అనేక పెయింటింగ్‌లు వేసాడు. ప్రగతిశీల భావాలతో సమాంతర రాజకీయాలపై ప్రతిస్పందించాడు. ప్రజా ఉద్యమాలకు సంఘీభావం తెలిపాడు. ఆయనకు పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులతో పాటు అనేక జాతీయ అవార్డులు లభించాయి. 16 జూన్ 1929న జన్మించిన సౌమిత్ర ఛటర్జీ 15 నవంబర్‌ 2020న కలకత్తాలో కన్నుమూశారు. ఆయన మరణం బెంగాలీ సినిమాకే కాదు భారతీయ సినిమాకే తీరని లోటు.


వారాల ఆనంద్

94405 01281

Advertisement

Next Story